పుట:కాశీమజిలీకథలు-12.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మణి --- సోదరి వని యెంత శాంతము వహించుచున్నను బెచ్చు పెరిగి యిచ్చకొలది మాటలాడుచుంటివి ! నీ సత్ప్రవర్తన మెరుఁగని వారియొద్దఁ జెప్పుము. యక్షకుల స్త్రీలు మనుష్యుని భర్తగాఁ బొందఁగోరుట కులధర్యమే గాఁబోలును ! ఆ దివోదాసుని రూపమున కాసించి వానిని దగుల్కొని వచ్చిన యొక్క పాపజాతి నాతి నింటఁ బెట్టుకొనియున్న నీవు నాకిందు ధర్మోపదేశ మొనర్పఁజూచుచుంటివా ! చాలు చాలు. తల్లిదండ్రులు యోగ్యుడని సమ్మతించిన యక్షకుమారుని భర్తగాఁ బడయ నెంచక తుచ్చమనుష్యజాతి వానిని భర్తగా గోరుచున్న నీవు నాకు నీతులు గరపు చుంటివా ! నీవును నేనును దక్కువ జాతియందే భార్యాభర్తల వరించుచుంటిమి. గావున నిందొకరి తప్పొక రెంచుకొన నగత్యము లేదు. నాతోనిఁక వివాదమునకుఁ బూనక యా నారీమణిని నాకిమ్ము. నీవు కోరిన దివోదాసునితో నిన్గూర్చుటకు నేను బ్రయత్నించెదను. లేదేని నేనీ మదగజగామినిని బలవంతముగా నీ సన్నిధినుండి కొని పోవుటయేగాక దివోదాసుఁడు నీకెప్పటికిని లభింపకుండఁ జేయుటకుఁ గూడ నేను సర్వ సిద్ధముగా నుంటినని నమ్ముము. అట్లు బెట్టిదముగా మాట్లాడుచున్న మణిగ్రీవునితో గుణవతి యేమియును సమాధానము జెప్పలేక‌పోయినది. తనగుట్టు వీఁడెట్లెరుంగఁ గలిగె నని యామె మనసునందుఁ బెక్కువిధముల నూహింపసాగెను. అనంగమోహిని యందలి మోహాతిరేకమున నామెఁ బడయనినాఁడు వీఁడు దనకోర్కె కెట్టి భంగము గలుగఁజేయునో యని యామె భయమందఁ దొడంగెను. తన సోదరుని వలన నామె కేమైనఁ గష్టము గలిగెనేని దివోదాసుఁ డదియెరింగి తన శీలమును సంశయించునేమా యని యాందోళనము బడఁజొచ్చెను. ఇట్లు భయాశ్చర్య విషాదంబులా వేదండయాన మన న నుత్తలపాటు గలుగఁజేయ నొకింతతడ వొడలెరుంగకుండెను.

ఆ యదనున మణిగ్రీవుండు లోనికిఁబోయి యనంగమోహని యున్న గది తలుపు దట్టెను. వారి సంభాషణమంతయును లోననుండి వినుచున్న యాయెలనాగ యంతకుముందె భయోద్రేకమున వివశయై పడియుండెను. మణిగ్రీవుండెంత పిలిచి నను దలుపు దీయఁబడలేదు. దానికతఁడు విసుగుఁజెందుచు నెట్లయిన నామెను బట్టు కొనవలయునను బూనికతోఁ గుడ్యోపరిభాగమునకెక్కి యా గదిలోనికి దుమికెను. తత్పతనవేగమున ననంగమోహినికిఁ దెలివివచ్చి మణిగ్రీవుని నందుఁ జూచి కాతర స్వరమున నమ్మోయని యొకబొబ్బపెట్టి తిరుగ గాడమగు మూర్ఛలో మునిఁగి పొయెను.

అప్పుడు మణిగ్రీ‌వుండు దలుపుతీసి యతిసాహసంబున నమ్మదవతి నెత్తు కొని యీవలకు వచ్చి తొందరగా ముందుఁ బోవుచుండెను. గుణవతి వానిపోకడఁ గని పెట్టి చెలికత్తెల సహాయముతోఁ దెంపున నడ్డు దగిలెను. మణిగ్రీవుండు దనకడ్డువచ్చిన మచ్చకంటుల హస్తప్రహారముల వివశులంజేసి నిముషములో జలంధరుని సమీపించి మిత్రమా ! చేతఁజిక్కి దాఁటిపొయిన చిలుక తిరుగఁ బట్టుపడినది. అవివేకులమై