పుట:కాశీమజిలీకథలు-12.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

దేవ సభామధ్యంబున దన కవమానము గలుగుటకు మేము మూలమని తుంబురుడు మాపై నాగ్రహము సూపుచు బుత్రికల రీతి నాదరించి సంగీతవిద్య బూర్తిగ మీకు నేర్పినందులకు నాకు దగిన యుపకారమే చేసితిరి. ఇట్లు గురుడనగు నన్ను తిరస్కార మొనర్చుటయే గాకుండ మదీయ గాత్రవైరూప్యముం గూడ బ్రక టింప సాహసించిన మీ దోషమునకు నిష్కృతిలేదు. మీరు దేవభూమినుండ నర్హురాండ్రు గారు. భూలోకంబున బ్రహ్మరాక్షసులై వృక్షాగ్రములనుండి మహారణ్య మధ్యమందు దలయొక దిక్కు.నను సంగీతము బాడుకొనుచు గాలముబుచ్చుచుందురుగాక యని మమ్మతితీవ్రముగ శపించెను. అన్యాయము ! అక్రమము !! అతి దారుణము !!! అని యా దేవసభ యంతయు గగ్గోలు పెట్టదొడంగెను.

అప్పుడు మేము విచారభారంబున గొంతతడ వొడలెరుంగక పడియుండి పిదప మాకు శాపాంతము గూడ బ్రసాదింపుమని తుంబురు ననేకవిధముల బ్రార్దించి తిమి. అతడెట్టకేల కించుక శాంతించి యీ సంగీతము నితరు లెప్పుడు విందురో యప్పుడే బ్రహ్మ‌ రాక్షసత్వంబు దీరగలదు. కాని మీకెన్నడును దేవలోక ప్రవేశార్హత మాత్రము కలుగనేరదని పలుకుచు బటురయంబున నవ్వలకుంబోయెను.

అప్పుడు మేము చేయునది లేక వెక్కి వెక్కి యేడ్చుచు చేతులు మోడ్చు కొని యున్న మధుసూదను మ్రోల వ్రాలి యేలికా ! నిష్కారణమ మేమిందు గురు శాప సంతప్తులమై యథోగతిపాలు కావలసినదేనా ! మంచియో చెడ్దయో నిష్కపట ముగ‌ బలుకుట యిందు దోసమని యెఱుంగమైతిమి. మూడులోకములకును బ్రభుఁడ వగు నీవు మమ్ము బెద్దజేసి యిక్కార్యమునకు నియోగించుటచే గాదనజాలక‌ పూను కొనినందుల కింత ముప్పు సంభవించెను. దివ్యసుఖంబులెల్ల స్వప్నప్రాయమైపోవ రుగ్జరామరణ భయనిలయంబగు మనుజలోకంబున నివసింపజాలము. అబలలమగు మమ్ము బిశాచరూపములం బూని మహారణ్యమధ్యమందు దిరుగ బొమ్మనుట మీ కెల్లరకు నొప్పిదంబుగ నున్నదా? సర్వసమర్దులగు మీరెల్ల రిట్లుపేక్షించుచుండ మాకింక దిక్కెవ్వరు. రక్షింపుడు, రక్షింపుడని వేడుకొంటిమి.

మా యాలాపముల కా శచీకళత్రుండు గటకటంబడుచు, బిడ్డలారా ! మీ కబ్బిన యీ విపత్తున కంతకును నేనే నిక్కముగ గారణమైతిని. అమోఘమగు తుంబురుని శాపమును గాదను శక్తి నాకు లేకపోయినందులకు మి‌గుల వగచుచున్నాను. సామర్థ్యంబున కతనికి దీసిపోవనివాడును బ్రహ్మమానసపుత్రుండగుట నెక్కుడు ప్రభావము గలవాడునునగు నీ నారదమునిచంద్రుడే యిందులకు బ్రతీకార మూహించు గాక యని వానివైపు జూడ్కులు బరపుటయును నారదుండు ముందున కేతెంచి మించిన యుత్సాహముతో నా వృత్రారి కిట్లనియె.

త్రిలోకనాయకా ! నిండుసభలో మీరు నన్ను బెద్దగా శ్లాఘించి గౌరవించి నందుల కీ‌ర్ష్యగ్రహావేశహృదయుడై మంచిచెడ్డ లెఱుంగక తుంబురుడు నిష్కరుణుడై