పుట:కాశీమజిలీకథలు-12.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శబరబాలకుని కథ

65

మణి --- వీడు మనుజుడువలె గన్పించుచుండె నీలోకమునకెట్లు రాగలిగెనో గదా?

జలం --- ఏ రాక్షసాధముడో యిట్టి వేషమున యక్షుల భాగ్య మపహరింప నిందేతెంచి యుండును. వీనిని విడువరాదు.

మణి --- సోదరా ! వీని యాకారము జూడ నాకట్లు దోచుటలేదు.

జలం - మనుజుడుగానీ మనుజాశనుడుగానీ, ఈ లోకమున నుండదగిన వాడుగాడు. సత్వరమ వీనినిందుండి లేవగొట్టవలయును.

అని వారిరువురా శబరబాలకు నెత్తి యా పెట్టెలో బెట్టి మూతవైచిరి. జలంధరుడు విమానశాలకరిగి యొక దివ్యయానమును దెచ్చెను. ఆ పెట్టెను దానిలో బెట్టుకొని యా యక్షులిర్వురును భూలోకమున కేగి శీతశైలంబున నొక‌ మహారణ్య మధ్యంబున నా మందసమును బడవైచి నిజలోకంబున కేగిరి.

పిమ్మట గొంతసేపటికి శబరునకు స్మృతి వచ్చినది. తిరుగ దాను మందస ములో నుండుటకు భయపడుచు దాని మూతను వీపుతో బై కెత్తి యీవలకు వచ్చెను. అప్పుడొక మహారణ్యమధ్యమున దానుండుట గ్రహించి యేమి చేయుటకుం దోచక కొండకతడవు విభ్రాంతుడై యిటునటు బరికించుచుండెను. తన మేనంగల తైలమును జూచి అసహ్యించుకొనుచు నా పెట్టి నెత్తికొని యెచ్చటనైన జలాకరంబున నొడలు గడిగికొనుటకు గొంతదూరమరిగెను. అందొక పర్వతధారంగాంచి దేహమునంటి యున్న దైలంబుబోవునట్లు స్నానమొనరించి మందసమును గూడ నానీరంబులచే గడిగి యాపోవనీటింద్రావి యందున్న కందమూలాదుల నాకలి నడంచుకొని కొంతసేపట విశ్రమించెను.

ఆ యరణ్యమంతయును భయంకర దుష్టసత్వసమన్వితంబగుటచే మాటి మాటికి వానికి సింహ శార్దూలాది వన్యమృగముల భీకరారవములు వినంబడుచుండెను. ఇంతలో రెండు సింహములు చెలగాటము లాడుచు గ్రమముగా వాడున్న చోటికి వచ్చెను. వానింగాంచి యెటు పోవుటకును దోచక భయవిహ్వలుడై తటాలున దగ్గర నున్న పెట్టి మూత నెత్తి యందు దూరియుండెను. మనుజుని సవగ్రహించి యీ దుష్ట మృగములు దిన్నగా మందసము దాపునకు వచ్చి యందున్న వాని బొట్టబెట్టుకొన వలయునని ప్రయత్నించినవి. వాడు పెట్టిలో నిమిడి పైమూత యూడకుండ గట్టిగా నదిమిపట్టుకొని యుండుటచేత నా మృగములా పెట్టి నిటునటు గాళ్ళతో దొర్లించి నను వాని కేయపాయమును గలుగలేదు. ఆ పెట్టియును దృఢదారుఖండములలో లెస్సగా సమకూర్పబడియుండుటచే నెట్టి దెబ్బ తగిలినిను జెక్కుచెదరకుండెను. ఆ మృగములు చేయునది లేక కొంత సేపటికి వచ్చిన దారిని దుముకుచు బోయినవి.