పుట:కాశీమజిలీకథలు-12.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రిపుంజయుని కథ

11

బ్రహ్మ - ఔరా 1 నారదా ? లోకవిశేషంబులం దెలుపుమన్న నీకలహ ప్రియత్వంబు దేటపరచెద వేమిటికి ?

నార - తండీ ! విశేషముల కేమున్నది. పుడమిఁ బొడమిన యవగ్రహంబు వలనఁ బాడిపంటలు పూర్తిగా నశించెను. మీఁదు మిక్కిలి విషూచి మశూచికాద్యనేక దారుణరోగంబు లుత్పన్నంబులై ప్రజలఁ గోటానుకోటులుగ యమసదనంబునకుఁ బంపుచున్నవి. దానంజేసి యమధర్మరాజునకు గడియయైనఁ దీరికలేక విసిగిపోవు చున్నాఁడు. వానికొలువునఁ గింకరుల సహస్రసంఖ్యాకుల నూతనముగఁ జేర్చికొన వలసివచ్చినదఁట. ఇట్లు కొంతకాల ముపేక్షించినఁ బుడమి నకాలప్రళయము తప్పక సంభవింపఁగలదు.

బ్రహ్మ -- జలాధిదేవతలు వరుణుఁడు నింద్రుండును గదా? వారేలఁ భూమిపై వర్షముల గురిపించి యీ యుపద్రవము నడిగింపకుండిరిఁ వారి ప్రీతికొరకుఁ గూడ పుడమినున్న జన్నిగట్టులు హావిర్భాగముల నొసంగుచుందురుగదా ?

నార --- కల్పపంచకంబుకు కామధేనువును సన్నిధింబడసినవారి కితర చింత యేమి యుండును ? ఇదియునుంగాక పైనుండు వారు క్రిందివారి విషయమై యాలోచించుట యరుదు. భూతనిర్మాత నగుటంజేసి నీకు తత్‌‌క్షేమ మరచికొనుట సహజ మగును. పెంచిన మొలకను ద్రుంపఁ జూచువాఁడుండఁడుగదా ? మఱియును మర్త్యు లకు జరుగుచున్న యన్యాయమును గట్టిగా నింద్రాదుల నడిగినవా రెవ్వరు ? మన మందరమును వారిపక్షమే యగుటచే వారి కృత్యముదప్పని యెఱింగియును నిర్బం ధించి యడుగఁజాలము. మర్త్యులపక్షమున నట్టివాఁ డొక్కఁడున్నయెడల మనమెల్ల రము దెల్ల వోవలసియుండును.

బ్రహ్మ --- కావుననే నిఖిలధరణీ చక్రరక్షణైక ధురంధురుండగు యొడయండుండుట యెల్లవిధములను సమంజసమని తోచుచున్నది. అట్టి వాఁడెవ్వఁ డైననున్నఁ బేర్కొనుము. వానికి భూచక్రంబెల్లఁబట్టము గట్టి ప్రజలక్షేమమునకై నియో గింతము.

నార --- లోకములన్నియును వట్టిపోయినవనుకొంటివా యేమి? మీకట్టి యభిప్రాయ మున్నయెడల మనువంశ సంభూతుండగు రిపుంజయు నిందులకుఁ బంప రాదా ? వాఁడన్నివిధములఁ బుడమి బాలింప సమర్థుఁడు.

బ్రహ్మ - ఔను. చక్కగా జ్ఞప్తికిఁదెచ్చితివి. ఆ రిపుంజయుల డౌదార్య శౌర్యధైర్యగాంభీర్యాది సద్గుణ గరిష్టుండగును‌. వానియౌదల సర్వవసుంధరా భార మిడినఁ తత్ప్రభావ బలవిక్రమంబుల లోకంబు స్వస్థతం బొందఁగలదు.

నార - చండశాసనుండగు వాని కేల్పడి యొసంగినఁ జివురకు మన యందరకుంగూడ బొమ్మగట్టునేమో యాలోచింపుఁడు.