పుట:కాశీమజిలీకథలు-12.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగమోహిని కథ

57

చిత్ర --- (నవ్వుచు) వృధాశ్రమకాకేమున్నది. వానిపేరుచ్చరించిన నీ సరో జానన యేవగించుకొనును.

దివో --- అట్లయిన మఱెవ్వనిఁ గృతార్థుంజేయుట కీమె తలంచుచున్నది ?

గుణ -- (సిగ్గునఁ దలవంచుకొనును)

చిత్ర -- కొలఁది దినములలో వచ్చు పంచమీ శుక్రవారమునాఁడు స్వయం వరము జాటించిరిగదా ! అందుఁ దనయిచ్చ వచ్చిన పురుషుని వరింపఁగలదు.

గుణ - (కోపముతో) అధికప్రసంగము చేయకుము.

చిత్ర --- నీకంతకోపమెందుకమ్మా ! (అని రాజు మొగంబై) ఆ స్వయం వర మహోత్సవమున సకలబంధు సమక్షమందు నార్యపుత్రునే పతిగా వరింపవచ్చును గదా?

గుణ - (చిరునగవుతోఁ దలవాల్చి యూరకుండును)

ఒకతె - చెలీ ! అర్యపుత్రుఁడనఁగా నెవ్వరు?

చిత్ర -- ఎవ్వరా ! ఎవరితో మాటలాడుచుంటివో వారు. తెలిసినదా ?

దివో - (సంతోషముతో) దివిజభామిని మానవుని వరించుట యెట్లు ? ఇదియుంగాక యనంగమోహినికి నా హృదయ మిదివరకే యర్పింపబడినదికదా? సతులకు సవతి సన్నిధానము సహజముగ నీర్ష్యను గలిగించునని చెప్పుదురు.

గుణ --- (చిత్రలేఖతో) సాపత్ని గలదను శంక నా కెన్నఁడును లేదని యార్యపుత్రుని కెఱింగింపవమ్మా ! మఱియును స్వయంప్రభాదేవి వరముపొందె నాకు మనుజుఁడే భర్తయగునుకదా ?

దివో - (నవ్వుచు) ఇందుల కనంగమోహిని యభిప్రాయ మెట్లుండునో ?

అనం - ఆర్యపుత్రునకు దేవభామినీ సహవాసము గలుగుటకు నేను హృదయ పూర్వకముగ సమ్మతింపుచున్నాను.

(అందఱును హర్షమును సూచింతురు)

ఇట్లు యిష్టాగోష్టీ వినోదముల నయ్యంతఃపురాంగనలతో నద్దివసాంతము వరకు ముచ్చటించుచు ననంగమోహిని నందే యుంచి దివోదాసుండు చంద్రాయుధ సహాయుండై యెద్దియో కార్యభారమున నెచ్చటికో పోయెను.