పుట:కాశీమజిలీకథలు-12.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగమోహిని కథ

55

నామె చెలికత్తియలును వారి సన్నిధి కేతెంచిరి. వారింగాంచి యనంగమోహినియును దివోదాసుండును నివ్వెఱంబడుచు నొకరి నొకరు విడచి యించుక తొలగియుండిరి.

అప్పుడా గుణవతి పనికత్తియలచేత వారి కుచితాసనములం దెప్పించి వేయించినది అందరు సుఖాసీనులైన పిదప వారి వృత్తాంతము నామూలచూడముగాఁ దెలిసికొని గుణవతి యద్భుతమందుచు ననంగమోహిని సౌశీల్యముం బొగడుచు దివో దాసుని బలప్రభావముల కానందించుచుఁ గొంత ప్రొద్దుపుచ్చినది. చిత్రలేఖయు నింతలో నచ్చటికివచ్చి వారి వృత్తాంతమెరింగి యక్కజపడుచుండెను.

పిమ్మట దివోదాసుండా నారీమణుల గుర్తుపట్టి శబరబాలక శరీరమందున్నదో వారివలన నెరుంగఁగోరి యమ్ముద్దుగుమ్మలతో నల్లన నిట్లనియె. బాలికామణులారా! ఈ పుర బాహ్యోద్యానమందు విలాస విహారమొనరించు మిమ్మిదివఱకొకసారి చూచి నట్లు తలంచుచున్నాను అప్పుడు మీరొక నరబాలక ప్రేతమునుగూర్చి కొంత ముచ్చ టించుకొంటిరిగదా? ఆ వృత్తాంతము నేనెరుంగవచ్చునా యని యడిగెను.

అప్పుడు గుణవతి ప్రభృతులు ఆశ్చర్యము సూచించిరి.

చిత్ర -- అవును అప్పుడు మీరెచ్చటనుంటిరి.

దివో - అచ్చటి పూపొదరింటిచాటుననుండి మీ సంభాషణ మాలించు చుంటిని.

చిత్ర - [నవ్వుచు] పురుషప్రవరా ! ఆడువారము. కేళికోద్యానవనాభ్యంత రమున విలాసముగా విహరించుచుండ పురుషులు బొంచియుండవచ్చునా ? అంతియ కాకుండ సంభాషణము వినవచ్చునాఁ విచ్చలవిడి యాడువాండ్రు విహరించుచున్నప్పు డెన్నిప్రశంసలు వచ్చుచుండును. అనియన్నియును మగవారు వినఁదిరువుట సమంజస మేనా?

దివో - లోకాంతరమందుండి నూతనముగా వచ్చినవారి కెవరి ప్రసంగము లైన వినకున్న నందలి వృత్తాంతములెట్లు తెలియగలవు. ఇదియునుఁగాక యపురూపపు రూపయౌవనవిలాసయగు మీ‌ సఖీమణి లావణ్యతేజః పుంజమెదుటఁ బ్రకాశించుచుఁ గన్నులకుఁ మిరుమిట్లు గొలుపుచుండ ముందువెనుకలరయ శక్యమగునా ?

చిత్ర --- దేవా ? తమతప్పుగప్పిపుచ్చి యెదురనున్న వారియందు దాని నారోపించుట లోకస్వభావముగదా? ఇందు తప్పు మా నెచ్చెలియందున్నదో మీయందు న్నదో మీ యిరువురను సమముగా నిలఁబెట్టి విమర్శింవలసియున్నదని పలికెను.

అనంగమోహని - మందస్మితసుందర ముఖారవిందము బై కెత్తి యా రాజేంద్రునిపై శృంగారవిలోకనములఁ బరగించుచుఁ దప్పక యట్లు విమర్శింపవలసినదే యని యొత్తి పలికినది. తప్పెప్పుడు నాడువారిదేనగుఁగాని మగవారికి తప్పులేదూఱ కుండుమని చిత్రలేఖ మందమందాక్షయగుచు గుణవతి మందలించినది. ఇంటికివచ్చి