పుట:కాశీమజిలీకథలు-12.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ముందు నీవేమగుదువో నీవ యాలోచించుకొనుము. ఇందులకు నీకొక్క గడియ యవ కాశ మొసంగితినని యూరకుండెను.

వానిని నిష్టురములాడిన లాభములేదని యెంచి యామించుబోణి కపటం బున వచించుటయే కర్తవ్యమని నిశ్చయించి కించిత్స్మితా స్వభాస్వరయై ప్రియంబుట్టి పడునట్లు వానితో నిట్లనియె. యక్షవంశ ప్రదీపకా? తావకీన రూపయౌవన విశేషంబులం జూచి యే చిగురుఁ బోణి పంచశరుని తాపంబు బొందకుండును ? అదృష్టవశమున నీయట్టి దివ్యపురుష సమాగమంబు లభింపఁ గాదనుటకు నేనెంత తెలియని దాననా యేమి? నీ నిశ్చయుంబెంతవరకుఁ గలదో యెరుంగుట కట్లు విరశోక్తులాడితిని గాని మఱొకటి గాదు అందులకు నీవు మనంబున గలఁతనొందఁ బనిలేదు. నేనెట్టులైన నీదాననైతిని. అయినను నాకొక్క విషయము గలదు. నేనేకభర్తృలాలస నగుటచేత నన్యపురుషునెవ్వనిని జూడనొల్లను. నేఁడు మనతో విమానము మీఁద నేతెంచిన భవ దన్యు డెవఁడు. వానికి నాయందభిలాష యున్నట్లు వాని చూపుల వలననే తెల్లమైనది. నా మనంబు నీయందే దృఢబద్దమైనది. వానినిఁక నెన్నఁడు నా యెదుటకు రానీయ వలదు. ఇందులకు నీవు బాసఁజేయవలయునని యూరకుండెను.

ఆ మాటలువిని యా యక్షకుమారుం డమందానంద కందళిత హృదయార విందుఁడై మన్మనోపహారిణీ ! నీ నియమంబు నాకెంతేని సంతసము గొల్పుచున్నది. వాఁడు నా పరిచారకుఁడు వానిలెక్క నీకేమియును లేదు. నిన్ను పోతుటీగయుం జొరని శుద్ధాంతమున బువ్వులలోఁబెట్టి కాపాడఁగలను. నీవితరశంకలన్నియును విడు వుము. అని పలుకుచుండగఁనే యవులనుండి జలంధరుండు తలుపుఁదట్టుచు మిత్రమా! మణిగ్రీవా? ఎంత సేపు నీవందుందువు. ఈపాటి కీవలకురమ్ము. నీవంతైనదిగదా. ఇఁక నా ముద్దుగుమ్మతోఁ గలిసి యానందించువంతు నాకిమ్ము సత్వరమురమ్మని పలుకుట యును మణిగ్రీవుం డదరిపడి వాని నలుక మెయి గద్దించుచు నిట్లనియె.

ఓరీ ! తుచ్చుఁడా ! నేను మంచితనమున మిత్రునివలె‌ నాదరించుచుండ నీ కెంతకండకావర మెక్కినది. నా ప్రాణేశ్వరితోఁ గలియుటకు నీకు నాతో వంతు కావలెనటరా ! మిత్రద్రోహీ ! ఇంకొకసారి యిట్టి యవాచ్యము లాడితివేని నీ నాలుక వేయి చీలికలుగాఁగలదు; జాగ్రత్త! పో, పొమ్మని యదలించిన విని జలంధరుండు నివ్వెరపడి యొకింతతడవేమియు మాటరాక యుండి వెండియు నిట్లనియె. మణిగ్రీవా! ఇప్పుడు వచించిన బెడిదంపు మాటలు నీనోట వెల్వడినవేనా! నీకాపూవుబోణి ప్రాణేశ్వరియా ? మనమిర్వురము భూలోకమున నామెంజూచి మోహించి బలిమిమై యిందుఁ దెచ్చుకొన్న సంగతిమరచితిరా యేమి? ఆమెయందు నీకెట్టి స్వతంత్రము గలదో నాకును నట్లేయుండునుగదా ! ముందుగా నీవామెతోఁ గలిసీకొనుటకు నేను సమ్మతించిన మాత్రమున నామెకు నీవే సర్వాధికారివగుదువా యేమి ! హేమావతి యెట్ల మనయిర్వుర కీమె సమానోపభోగ్యయగునుగాని యన్యము గాదు. పెక్కు