పుట:కాశీమజిలీకథలు-05.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

338

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నీయందే ప్రేమగలిగియున్నది. కావున వీని వైశంపాయనుఁడే యనుకొని యవినయకార్యముల బ్రవర్తింపనీయకుము. పరుఁడని యుపేక్షింపకుము. వీఁడు నీవాఁడే యనియే శాపావసానమున సైతము నీయొద్దకే పంపితిని.

అదియునుంగాక మదీయంబగు సాత్వికతేజం బిప్పు డింతకన్న నుత్తమలోకంబునకుం బోవనున్నది.

అని యిట్లు శ్వేతకేతుని సందేశము కపింజలుండు చెప్పగా విని శుకనాశుఁడు వినయావనమ్రుఁడై యున్న పుండరీకు నంసంబు బట్టుకొని కపింజలున కిట్లనియె.

కపింజల! సర్వజ్ఞుండైన శ్వేతకేతుఁ డిట్టివార్త బంప నేమిటికి? నేస్తంబున నిట్టిమాట వినినచో సంతోషము గలుగునా? అందరకు నమ్మహానుభావుని యాశ్రయమే కావలయునని యిట్లు పూర్వజన్మసంస్మరణానురూపములైన యాలాపముల చేత నా దివసము గడిపెను.

అమ్మరునాఁ డుదయంబున గంధర్వకులనాయకులగు చిత్రరథహంసులు సపత్నీకులై పెక్కండ్రు పరిచారకులు సేవింప నచ్చోటికి వచ్చి యల్లుండ్రు గూఁతుండ్రం జూచి యెంతేని సంతసము జెందుచుఁ దారాపీడ శుకనాశులచే మన్ననల వడసి తాత్కాలోచితసంభాషణములచేఁ గొంత కాలక్షేపము చేసిరి.

అప్పుడు చిత్రరథుండు తారాపీడునింజూచి యార్యా! మిగుల వైభవము గల భవనములు గలిగియుండ నీ యరణ్యములో వర్తింపనేల? హేమకూటమునకుఁ బోవుదము రండని పలుకగా విని తారాపీడుం డిట్లనియె.

గంధర్వరాజా! ఎచ్చట నిరతిశయమగు సుఖముగలుగునో అదియే భవనము. ఇట్టిసుఖము నే నేభవనమునందును బొందియుండలేదు. అదియునుంగాక మదీయంబులకు భవనసుఖంబు లన్నియు నీ యల్లునియందే సంక్రమించినవి. నాకిఁక యరణ్యమే శరణము. వధూయుతముగా నతనినే తీసికొని వెళ్ళుమని పలుకగా విని చిత్రరథుండు సమ్మతించి యప్పుడ తారాపీడుని యనుజ్ఞవడసి చంద్రాపీడాదులతో గూడ హేమకూటమునకుం బోయెను.

అందు శుభముహుర్తమున సకలగంధర్వరాజ్యముల జిత్రరథుండు కాదంబరిని జంద్రాపీడున కిచ్చి వివాహము చేసెను.

హంసుండు నట్లే మహాశ్వేతనుఁ బుండరీకుని కిచ్చి పెండ్లిచేసెను. అట్లు చంద్రాపీడ పుండరీకులు గంధర్వరాజ్యములతో గూడ నచ్చేడియల స్వీకరించి యమ్మించుబోడులతోఁ గ్రీడించుచు దమ్మాశ్రయించుకొనియున్న యించువిల్కాని కాప్యాయనము గావించిరి. మఱియొకనాఁడు కాదంబరి చంద్రాపీడునితో ముచ్చటింపుచున్న సమయంబున నామె యతని కిట్లనియె.