పుట:కాశీమజిలీకథలు-05.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

283

ఆహా! నాకన్నులెట్టి పుణ్యము చేసికున్నవో? ఇట్టి లోకైకసుందరి ననివార్యముగాఁ జూడఁగలిగినవి. అయ్యారే! విరించి సర్వరమణీయవస్తువులనేరి యీనారీరత్నమును సృజించెనని తలంచెదను. ఓహోహో! అక్కమలగర్భుండు రూపాతిశయపరమాణువుల నిన్నిటి నెక్కడ సంపాదించెనో? తెలియదు.

నిక్క మీకాంచనగాత్రిం నిర్మించుచున్న విరించనుని కరతల పరామర్శక్లేశంబున నామె కన్నులనుండి జారిపడిన జలబిందువులనుండియే భూమియందుగల కుముదకమలసౌగంధికాది వస్తువు లుత్పన్నంబులైనవి. బాపురే! ఈపూఁబోడి మోమంతయుఁ గన్నులుగానే కనంబడుచున్నది? ఇది కొమ్మయా? బంగరుబొమ్మయా? అని వితర్కించుచున్న యన్నరనాథసూనుని దృష్టిప్రసారము కాదంబరీనయన యుగంబున వ్యాపించినది.

అమ్మదవతియు నదరుపాటుతో నతనింజూచి రూపాతిశయవిలోకనమువలనం గలిగిన విస్మయముచే రెప్పవాల్చకుండ సూటిగాఁ జూపులతనిపై వ్యాపింపఁ జేసినది. తల్లోచనప్రభావ్యాప్తిచేఁ దెల్లఁబడి కాదంబరీదర్శనవిహ్వలుండై యతండు కాదంబరీదర్శనవిహ్వలుండగు బలరామునివలెఁ బ్రకాశించెను.

కాదంబరి యట్లా రాజపుత్రు నబ్బురపాటుతోఁజూచి మేను గగుర్పొడువ భూషణరవ మేపార నట్టెలేచి మేనెల్లం జెమ్మటలుగ్రమ్మఁ గంపముతో నతికష్టంబునఁ గొన్ని యడుగు లెదురువోయి చిరకాల దర్శనమువలనఁ గలిగిన యుత్కంఠతో నాకలకంఠినిఁ గంఠాశ్లేషము గావించినది.

మహాశ్వేతయుఁ బ్రత్యాశ్లేషము గావించుచు సఖీ! ఈతండు రక్షితప్రజాపీడుండగు తారాపీడుండను భూలోకచక్రవర్తి కుమారుండు నిజభుజాస్తంభవిశ్రాంతవిశ్వంభరాపీడుండు చంద్రాపీడుండనువాఁడు. విజయయాత్రాప్రసంగమున నీభూమి కరుదెంచెను. చూచినది మొదలు నాకితండు నిష్కారణబంధుఁడై యొప్పెను. పరిత్యక్తసకలసంగనిష్ఠరమైనను నాచిత్తవృత్తిని స్వభావసరళములగు సుగుణములచే నితం డాకర్షించెను. దాక్షిణ్యపరవశుండు నకృత్రిమహృదయుండు విదగ్ధుండనగు నిర్నిమిత్తమిత్రుండు దొరకుట దుర్ఘటము గదా?

నేనువోలెనీవుగూడ నీసుకుమారునించూచి వాణీభవుని నిర్మాణకౌశలము పృథివికిఁ గల వాల్లభ్యసౌఖ్యము మర్త్యలోకము సురలోకమును మించుటయు మనుజస్త్రీలయొక్క నేత్రసాఫల్యము సర్వకళలు నొక్కచోటనుండు విధముం దెలిసికొనఁ గలవని బలవంతముగా నీతని నిచ్చటికిఁ దీసికొని వచ్చితిని. నిన్ను గుఱించి యాతనితోఁ జాల చెప్పియున్నదానఁ గావున నితండు క్రొత్తవాఁడని సిగ్గుపడక అవిజ్ఞాతశీలుఁడని శంకింపక నాయందెట్టి ప్రీతిగలిగి యుంటివో వీనియందుఁగూడ నట్లే వర్తింపవలయును.

ఈతఁడే మనకుఁ బరమమిత్రుఁడు. ఈతఁడే మనకు దగ్గిరచుట్టము.