పుట:కాశీమజిలీకథలు-05.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

265

త్నముతో నతని మొగమునుండి దృష్టి మరలించుకొనుచు స్నానము చేయుటకుఁ బోయితిని. పిమ్మట రెండవ మునికుమారుఁడు ఆ ప్రకారము ధైర్యస్ఖలితుఁడైన యప్పుండరీకుం జూచి యించుక యలుక మొగంబునఁ దోప నిట్లనియె.

మిత్రుడా! పుండరీక! క్షుద్రజనులచేఁ ద్రొక్కంబడిన యీ మార్గము నీకుఁ దగినదికాదు. సాధులు ధైర్యధనులుకదా! ప్రాకృతుండువోలె వివశంబగు చిత్తము నరికట్టవేమి? ఇప్పుడు నీకపూర్వమైన యింద్రియచాంచల్యము గలిగినదే? ధైర్యము, వశీత్వము, ప్రశాంతి బ్రహ్మచర్యనియమము, ఇంద్రియ పరాఙ్ముఖత, యౌవనశాసనత్వము మొదలగు నీసుగుణము లన్నియు నెందుబోయినవి? నీ చదువంతయు నీటఁగలిపితివే, నీవివేకమంతయు నిరర్ధకమైనదే. అయ్యయ్యో! కరతలము నుండి జారిపడిన జపమాలికను సైతము గురుతెరుంగకుంటివి? యేమి నీ మోహము? ఒకవేళ బ్రమాదముచే బుద్ధి చాంచల్యమందినను వివేకముతో మరల్చుకొనరాదా? యున్మత్తునిక్రియ వర్తించుచుంటివేయని పలికిన విని యించుక గుందుచు నతనితోఁ బుండరీకుం డిట్లనియె.

వయస్యా! కపింజల! నన్ను మరియొకలాగునఁ దలంపకుము. నే నట్టివాఁడను కాను. దుర్వినీతయగు నీనాతి నా జపమాలికను గ్రహించిన యపరాధమును నేను మరచిపోయితి ననుకొంటివా? చూడుమని యళీకకోపము దెచ్చుకొని యతిప్రయత్నముతో భ్రూభంగము గావింపుచుఁ జుంబనాభిలాషఁ బోలెఁ బెదవిగరచుచు నా కడకు వచ్చి యిట్లనియె.

చపలురాలా! నా జపమాలిక నాకియ్యక యిందుండి యెందు వోయెదవు? ఇచ్చి కదులుమని పలుకగా విన నేనును నా మెడనుండి యేకయష్టిగల ముత్తెపుపేరును దీసి, ఆర్యా! ఇదిగో! మీ మాలికను స్వీకరింపుఁడని పలుకుచు, మన్ముఖమునందు దృష్టినిడి శూన్యహృదయుఁడై చూచిన యతని చేతియం దమ్మాల నిడి స్వేదసలిలస్నాత నయినను వెండియు స్నానము చేయుటకుఁ దటాకమునకుఁ బోయితిని.

అందు గ్రుంకి తల్లితోఁ గూడ మెరకకుఁబోవు ప్రవాహమువలె నతిప్రయత్నముతో నింటికివెళ్ళి కన్యాంతఃపురము ప్రవేశించి యతని న్వరించుచు నది మొదలు విరహవిధురనై యిట్లు తలంచితిని.

అయ్యో! నేనచ్చటనే యుండక యింటి కేమిటికి వచ్చితిని? ఆ! రాలేదు. నే నచ్చటనే యుంటిని. కాదు యిది గృహమే ఇప్పుడు నేను నిద్రబోవుచున్నానేమో! స్వప్నములో నిట్లు కనంబడినది కాబోలు. అయ్యో! నాకన్నులు తెరవఁబడియే యున్నవి. స్వప్న మెట్లు వచ్చును? ఇది రాత్రియా పగలా? నా కీతాపము రోగమేమో? నే నిప్పు డెచ్చట నుంటిని? యెచ్చటికిఁ బోవుదును? ఎవ్వరితోఁ