పుట:కాశీమజిలీకథలు-05.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

261

అంతఁ గాలగ్రమంబున నామేన వసంతసమయంబునఁ బుష్పాంకురమువలె యౌవనము బొడసూపినది. సమారూఢయౌవననైయున్న నొక్కవసంతకాలమునఁ దల్లితోఁగూడ స్నానార్ధమై యీసరోవరమునకుఁ జనుదెంచి యందందు శిలాతలముల వ్రాయఁబడిన శంభుమూర్తులకు నమస్కరించుచుఁ గుసుమోపహార రమ్యములగు లతామంటపములను పుష్పించిన సహకారతరువులును వనదేవతాప్రేంఖనలశోభనములగు లతాడోలికలును కుసుమరజఃపటలమృగములగు కలహంసపదలేఖలచే మనోహరములగు తీరభూములునుం జూచినంత మనంబున నుత్సాహంబు దీపింప గొంతసేపు ప్రియవయస్యతో నేనందు విహరింపుచుంటిని.

అట్టిసమయమునఁ గాననకుసుమవాసనలం బరిభవింపుచు ననాఘ్రాతపూర్వమగు పరిమళ మొండు వనానిలానేతమై నాకు నాసాపర్వము గావించినది.

ఓహో! అమానుషలోకోచితమగు నీసౌరభము నా కెట్లు కొట్టినది? యని వెరగందుచు గన్నులు మూసికొని యాసుగంధ మాఘ్రాణించి యాఘ్రాణించి శిరఃకంపముచేయుచుఁ దదుత్పత్తిస్థానమరయు తలంపుతో లేచి నూపురరవఝంకారమునకు సరఃకలహంసల ననుసరించి రాఁగా గొన్నియడుగులు నడిచి నలుమూలలు పరికించి చూచితిని.

అప్పు డొకవంక నఖిలమండలాధిపత్యమును గైకొన ధృతవ్రతుండయిన శశాకుండోయనఁ ద్రిలోచనుని వశముఁజేసికొనఁ దపం బొనరించుచున్న కుసుమశరుని పగిది మనోహరాకారముతో నొప్పుచు మందారవల్కలములు దాల్చి హస్తంబున దండకమండలములు మెరయ ఫాలంబున విభూతిరేఖయు కటీతటి మౌంజీమాలికయు గరంబున స్ఫటికాక్షమాలికయుం ధరించి మూర్తీభవించిన బ్రహ్మచర్యముభాతి బుంజీభవించిన శ్రుతికలాపమట్ల దీపించుచు దేహకాంతులచేఁ బ్రాంతభూజముల బంగారుమయములుగాఁ జేయుచు నవయస్కుఁడగు మునికుమారుతోఁగూడ స్నానార్థమై యరుదెంచిన దాపసకుమారుం డొకండు నాకన్నులకుఁ బండువ గావించెను. అతని చెవియందుఁ గృత్తికానక్షత్రమునుం బోలిన యదృష్టపూర్వమగు పుష్పమంజరి యొండు అమృతబిందువుల స్రవించుచు విరాజిల్లుచున్నది. దానింజూచి నేను ఓహో! మదీయ ఘ్రాణమునుఁ దృప్తిపరచిన సౌరభ మీగుచ్చంబునఁ బుట్టినదే యని నిశ్చయించుచు వెండియు నత్తపోధనకుమారు నీక్షించి మనంబున నిట్లు వితర్కించితిని.

అయ్యారే! చతుర్ముఖుని రూపాతిశయవస్తునిర్మాణకౌశల మెంత చిత్రముగా నున్నది! మొదటఁ ద్రిభువనాద్భుతరూపసంభారుఁడగు మన్మథుని సృష్టించి వానికన్న నెక్కువరూపము గలవానిఁ జేయు సామర్ధ్యము కలదో లేదో యను తలంపుతో మునిమాయచేత రెండవ సుమకోదండునిగా నితనిఁ జేయఁబోలు. మున్ను మున్ను గజదానందకరుండగు చంద్రుని, లక్ష్మీలీలాభవనములగు పద్మములును సృజించుట బరమేష్టి కీతని మొగముజేయు పాటవము నేర్చుకొనుటకే యని తలం