పుట:కాశీమజిలీకథలు-05.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

215

యడిగిన నాజడధారి యిట్లనియె. కేశవా ! నీ యాదేశమునఁ బోయి నేను జంద్ర శేఖరుం గాంచితి. అతండు నన్ను గౌరవించుచు నెందుండి వచ్చుచున్నావని యడిగెను. నేను దేవరసన్నిధానమునుండి వచ్చితినని చెప్పితి. అచ్చట జరిగిన కధయంతయు సిద్ధుల వలన నంతకుముందు వినియున్నవాఁడు కావున నన్నుజూచి, నారదా! దామోదరుండు నాపైఁజక్రమువైవ నుద్యుక్తుండయ్యెనటకాదా ? తానే యధికుండని విర్రవీగుచున్నావాఁడట తాను నన్ను గాపాడుచున్నానని నీ యొద్ద జెప్పెనట నిజమేనాయని యడిగిన నేను నివ్వెరపడి, స్వామీ ! అది మంచి సమయముకాదు. వాసుదేవుండు మీ కాప్తుండు కాదా ? కాల విశేషమున నాప్తులు తొందరపడినను శాంతస్వభావముగలవారు మన్నింతురని యెంతయో బోధించితిని. కాని నా మాటలు వినినకొలది యతని కాగ్రహమెక్కుడైనది. రుద్రరూపముదాల్చి యట్టహాసము జేయుచు ద్రిశూలము గిరగిరం ద్రిప్పదొడంగెను. తదీయరూపముజూచి నేను వెరచి పారిపోవ బ్రయత్నించునంతలో నాప్రాంతమందున్న పార్వతి మంచిమాటలు జెప్పి కోపము జల్లార్చినది. మీ తగువులు మేము తీర్పజాలుదుమా ! దేవతలను, మునులను, దిక్పాలురను, బ్రహ్మను వెంటబెట్టికొని తన యొద్దకు దీసికొనిర్మమని చెప్పెను. మరల సభజేసి యందులో వాదించునట. తాను రమ్మనిన దేవతలు, మునులును, దిక్పాలురు వత్తురుగాని తదాజ్ఞాబద్దులై మీరు వత్తురా ? మీరక్కడికి బోవనేల తానే మీ యొద్దకు రారాదా ? ఈ మాటలక్కడనే చెప్పవలయునని తలంచితిని కాని బ్రభువులతో బలుపలుకులు పలుకరాదు. మొదటనే విశ్వరూపము దాల్చియున్నవాడు గదాయని తలయూచి మీ యొద్దకు వచ్చితిని. పిమ్మట దేవరచిత్తమని పలికి యూరకొనియెను.

అప్పుడు చతుర్భుంజుండు మేలు మేలు మంచిసందేశము దీసికొని వచ్చితివి. పరోక్షమునందు ప్రగల్భములు కొట్టినట్లు సమక్షమందు సాగవు మునులును, సురులును, దిక్పాలురును మాప్రతాపము గన్నులార జూతురుగాక వేగబోయి వారిందీసికొనిరమ్ము పొమ్మని పలికిన నారదుండు, స్వామీ ? మీరు కైలాసమునకు వత్తురా ! యీ సభ యెక్కడ జరుగునని చెప్పవలయును. వైకుంఠమునందే యీ సభ జరిగించిన యుక్తముగా నుండునని నా యభిప్రాయము. అ కొండరుప్పలకన్న యీ పట్టణభూములు రమ్యములు కావాయని యడిగిన దానవాంతకుండించుక చింతించి అవును మన మతని యొద్దకుబోనేల అతనినే యిచ్చటికి రమ్మనుము. లేనిచో మువ్వురకు సంబంధములేని చోట సభనేరుపరుపవలయు. నీ మాట శివుని కెరింగించిరమ్మని చెప్ప- నారదుండు సంతసించుచు వాసుదేవుని యానతింగైకొని బ్రహ్మ యొద్దకుంబోయి హరిహర కలహ ప్రకారము సభావృత్తాంతమును జెప్పి యతనికి రోషమెక్కించి మూడు లోకములందుగాక వేరొకచోట సభజేసినచో వత్తునని యుత్తరం వాయించిపుచ్చుకొని యప్పుడె కైలాసమునకు బోయెను.

శంకరుండు నారదుంజూచి వాసుదేవ చతుర్ముఖులతో నాసందేశము దెలిపి