పుట:కాశీమజిలీకథలు-05.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సార — ఓహో ! మీరిరువురును ప్రమాదము నొందుచున్నారు. మీకు వాదమున గెలుపుగొను తలంపుగలిగియున్న సరస్వతిని ముఖ్య దేవతగాఁ జెప్పి వాదింపుఁడు. అతండు శారదారాధకుండగుట నామతము నిరాకరింపఁజాలఁడు.

లక్ష్మీ - సరస్వతి నెన్నఁడును జెప్పఁదగదు. జగత్కారణత్వ మామెకు లేదు.

సార - లక్ష్మికి మాత్ర మున్నదియా?

భవా - లక్ష్మీ సరస్వతుల కిరువురకును ప్రధానత్వము లేదు.

లక్ష్మి - భవానికి మును పేలేదు.

భవా - పోనిండు. మీ దారిని మీరు పొండు మాకర్మము మాది అని వారు సంభాషించుకొనుచుండు సమయంబున శంకర శిష్యుం డొకండువచ్చి వారి నందఱందోడ్కొనిపోయి వాదింప శంకరాచార్యు నెదుటంబెట్టెను. అప్పుడు వారికిట్లు సంవాదము జరిగినది.

శంకరయతి — మీరెవ్వరు ?

భవానీ — అయ్యా ! శాక్తమతస్థులము.

శంక - నాలుగు తెగలుగా నిలువంబడితిరేమి ?

భవా - మా మతము నాలుగుభేదములు గలదిగానున్నది. దానంజేసి యిట్లు నిలువంబడితిమి.

శంక — (నవ్వుచు) బేధమా ? భేదమా ?

భవా — తొందరచే నట్లువచ్చినది. భేధముగాదు భేదము.

శంక - కానిమ్ము. మీమతప్రవృత్తి యెట్టిదో ముందుగ వక్కాణింపుఁడు.

భవా — చిత్తము.

శ్లో॥ అద్యాశ క్తి రశేషకార్యజననీ శంబో ర్గుణేభ్యః పరా
     యన్మాయావశతో మహత్ప్రముఖరం సర్వం జగజ్జాయతే॥

శ్లో॥ తస్యా వాగాద్యగమ్యత్వా త్సేవాయోగ్యత్వ హేతుతః ।
     తదంశాయా భవాన్యాస్తు పాదసేవాపరా వయం॥

స్వామీ! ఆదిశ క్తియే భవాని. సర్వకార్యములకు జనని తన్మాయాప్రభావంబు వలన మహదాదికమైన జగత్తంతయు జనించినది. తత్ప్రభావమవాజ్మౌననగోచరమై యున్నది మేము తత్పాద సేవకులమై ముక్తినొందుచున్నారము. కాంచనవికారములైన తత్పాదచిహ్నము కంఠములయందును భుజములయందును ధరింతుము. ఇదియే మా మతము.

శంక — ఇదియా సరియే. మీ ప్రక్కన వారెవరు ?

లక్ష్మి — స్వామీ ! మేము లక్ష్మీ సేవకులము.