పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కళాపూర్ణోదయము

క. చింత యొనర్పక యిది యొ
   క్కింత యుపేక్షించి యున్న నెట్లగునో గో
   రంతాలస్యంబునఁ గొం
   డంతప్రయోజనము దప్పు ననఁగా వినమే. 180

క. విను మిట్టిపనుల కెంతయు
   ననుకూలం బగుసహాయ మచ్చర లిపు డీ
   పని కరయ వారిలోనన్
   ఘనతరముగ నీకు నేర్పు గల దని తోఁచెన్. 181

సీ. కడు నల్లికలుగొనుకలికిబిత్తరపుఁజూ
            పులక్రొమ్మెఱుంగులు వలలు గాఁగఁ
    నెఱయంగఁ బర్వెడునిద్దంపులేనవ్వు
            తెలినిగ్గుతరఁగలు తెరలు గాఁగఁ
    గొమరొందునవవిలాసములకన్బొమ లులి
            వాడుచోపుడుగోల లగుచుఁ దనరఁ
    దేనె లుట్టెడుమాటతేటలపసలు వా
            కట్టుమంత్రంబుకరణి నమర

ఆ. నీవు గడఁగి యమ్మునీంద్రశార్దూలుత
    పోమహత్వదర్పమును హరించి
    కీరవాణి యతనిఁ గ్రీడామృగంబుగాఁ
    జేయవలయుఁ గుసుమసాయకునకు. 182