పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పుడామెకు బరిమళ మబ్బినట్లు, ఇప్పుడిప్పుడే యౌవనము తలచూసి యాపె మేనిసోయగమునకు మెఱుగు దెచ్చుచున్నది. పచ్చని దేహము మీద అప్పుడు కట్టుకొన్న తెల్లని బట్టయు బంగారమునకు పటిక పూసినట్టులొక విధమయిన యందమునే కలిగించుచుండెను. సుందరాంగుల యంగముం జేరినప్పుడేది యందముగా నుండదు? ముక్కున నడ్డబాసయు, చెవుల నీలాల బావిలీలును, చేతుల కంకణములును, మెడలో పట్టెడయును, మొలను వెండి వడ్డాణమును, కాళ్లనందెలును, మట్టెలును, ఆమె యప్పుడు ధరించుకొన్నది. కంకణములకు సాహాయ్యముగా రంగురంగుల గాజులును లక్కపట్టెలును ముంజేతుల నలంకరించుచుండెను. ఈ నగలచే నామె యవయవములకేమైన శోభ కలిగినదో లేదో కాని యవయవములచే నగలు కొంత శోభ గాంచుట మాత్రము కరతలామలకముగా గనబడుచున్నది.

సృష్టిలోని యే పదార్థమునకును బరిపూర్ణత్వమును దయ చేయని రీతినే, సర్వసముడగు భగవంతుడు రుక్మిణి సౌందర్యమందును గొంత కొఱతను గలిగించినాడు కాని బొత్తిగా గలిగింపక మానినవాడు కాడు. నిజముగా అది యొక కొఱతయే యయ్యెనేని యామెకుం గల లోపమెల్లను మెడ మిక్కిలి పొడుగుగా నుండుట. అయిననూ ముష్టి సర్వశాస్త్రి యాయవారమునకు వచ్చినప్పుడెల్ల నామె మెడను జూచి సంతోషించి, "మిక్కిలి నిడుదగు మెడ కామిని కులవర్ధని దాని నెఱిగికొండనిరి బుధుల్!" అను సాముద్రిక గ్రంథములోని పద్యమును జదివి పోవుచుండును.
అప్పుడొక్కవిధవ మొల లోతు నీళ్లలో దూరముగా నిలుచుండి నోటిలో నేమేమో జపించుకొనుచు నడుమ నడుమ దలయెత్తి సూర్యుని వంక జూచి దండములు పెట్టుచు, దోసిటిలో నీళ్లు పట్టి సూర్యునకర్ఘ్యము