పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పదమూడవ ప్రకరణము

దీపములు పెట్టిన కొంతసేపటికి వాద్యములచప్పుడు వినఁబడి నందున రాజశేఖరుఁడుగారు మొదలగు వారందరును వీధిలోనికి చూడ వచ్చిరి. బలముగా ద్వాదశోర్ద్థ్వపుఃదడ్రములను ధరించి యొకవైష్ణవస్వామి పల్లకిలో గూరుచుండి యిరుప్రక్కల నిద్దఱునింజామరులు వీచుచుండ కరదీపిక లనేకములు వెలుఁగ నూరేగు చుండెను.ఆ వెనుక కొందరు దెలగాణ్యులును నొకవైష్ణవుఁడును గంధములు పూనుకొని తాళవృంతములతో విసరుకొనుచు నడుచుచుండిరి. ఆ వైష్ణవుని రాజశేఖరుఁడుగా రెఱుఁగుదురు గనుక దగ్గఱకు పిలిచి యీప్రకారముగా ముచ్చటింప నారంభిచిరి.

రాజ----మీరు ధవళేశ్వరములో నున్న గూడూరువారికి గురువులు కారా?
వైష్ణ---- అవును. ఆపల్లకిలో గూరుచున్నవారి కీగ్రామములో నవసరాలవారు శిష్యులు.
రాజ---- వెనుక నేను చూచినప్పుడు మీరు గురువులుగాను, మీకాయన శిష్యుడుగాను ఉండెడివారు కారా?
వైష్ణ---- మాలో మాకటువంటి భేదము లేదు. నాకు శిష్యులున్న గ్రామములో నతఁడు శిష్యుఁడుగాను, అతనికి శిష్యులున్న గ్రామములో నేను శిష్యుఁడనుగాను, మాఱుచుందుము. ఆయన తాతయు మాతాతయు సహోదరులు;

వారితండ్రి ప్రతివాదిభయంకరము గండభేరుండాచార్యుల వారు జగదేకపండితులు. వారు పరమపదమునకు వేంచేసిన తరువాత వారు సంపాదించిన శిష్యులను మాతాతలును తండ్రులును పాళ్ళువేసికొని పంచుకున్నారు. ఈ గ్రామములోనివారు మావాని వంతునకును ధవళేశ్వరములోనివారు నావంతునకును వచ్చినారు. మా కాపురపు గ్రామమైన శ్రీకూర్మము విడిచి యీప్రకారముగా సంవత్సరమున కొకసారి శిష్యసంచారము చేయుదుము.