పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదుకొండవ ప్రకరణము

సాహసపు బనిని చేయఁజాలడు. అటువంటి బలమైన రాతిగోడకు కన్నము వేసినవా రిద్దఱు ముగ్గురుండక తప్పదు. ఆముగ్గురు నెవ్వరైయుందురు? కోటసంగతి గుర్తెఱిగినవారే కాని మఱియొకరు కారు. నాలుగుదిందినముల క్రిందట నీలాద్రిరాజు చేత కోటపటమును వ్రాయించుకున్నప్పుడు ధానాగారమును గూర్చి రెండుమూడు సారులడిగెను. అతడట్లడుగుటకుఁ గారణమేమి? ఈదొంగ తనములో నతనికేదో సంబంధము గలిగియుండ వలెను. అతడు గోడయెత్తు కూడనడిగెను. దొంగతనములో సంబంధమే లేనియెడల గోడయెత్తుతో ఇతనికేమి ప్రయోజనము? అంతియ కాక యీసంగతి గ్రామములో పొక్కక మునుపే వేకువ జామున బహిర్బూమికి వెళ్ళుచుండగా నన్ను బిలిచి యతడు రాజుగారి లోపల దొంగలు పడ్డారఁట యని యడిగినాడు: అతడు దొంగలలో జేరియుండని పక్షమున, అంత పెందలకడ నాతని కాసంగతి యెట్లు తెలియును? నేను సాయంకాల మింటికివచ్చు నప్పుడు వీధిలో నిలుచుండగా నాతని జూచినాను. అప్పుడాతని చర్య వింతగా నున్నది. ఈయన్ని హేతువుల చేతను విచారించి చూడగా ఈతడు దొంగల గురువనుటకు సందేహములేదు. రేపు రాజుగారి నడిగి కొందఱు రాజభటులను బుచ్చుకొని యెవ్వరికిని దెలియకుండ నాతని యింటిమీద పడి పెట్టెలు మొదలగునవి పరిక్షించెదను. అప్పుడు కొంతసొమ్ముయిన దొరకగలదు. అందు మీద నామీద నిందయైనను పోవును. అని యాలోచించి యారాత్రి యెట్లొ వేగించి తెల్లవారినతోడనే రాజుగారి దర్శనముచేసి తనయందు దోషము లేశమయినను లేదనిచెప్పుకొని తనవశమునఁగొందఱు భటులనిచ్చి తన యాజ్ఙ ప్రకారము చేయ నుత్తరువువిచ్చినచో దొంగలను సొత్తుతోఁ గూడఁ పట్టుకొనెదనని దృఢముగాఁజెప్పెను. రాజుగారాతని మాటయందు గౌరముంచి,