పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాంజనేయ విగ్రహమొకటి చేతులు జోడించుకొని స్వామి కభిముఖమయి నిలిచి యుండును. ఈ శిలావిగ్రహమునకును ధ్వజస్తంభమునకును ఉత్తరముగా గళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణ దినములలో నుత్సవవిగ్రహములు నందు వేంచేయింపజేసి యథావిధిగా వివాహతంత్రమునంతయు మహావైభవముతో నడిపింతురు.

ప్రతి మాసమును, రెండు పక్షములయందును ముఖమంటపము మీద ఏకాదశి నాడు రాత్రి హరిభజనము జరుగుచుండును. హరిభక్తులు తులసి పూసల తావళములను ధరించుకొని ద్వాదశోర్ధ్వపుండ్రములను స్ఫుటముగా బెట్టుకొని కరతాళములును మృదంగములును మ్రోగుచుండగా దంబురలు మీటులు, బిగ్గఱగా దమ యావచ్ఛక్తిని "నవనీతచోరా", "గోపికాజారా", "రాధికాలోలా", "గోపాలబాలా" మొదలగు నామములచే నిష్టదేవతలను సంబోధించుచు మధ్యమధ్య గొంతుకలు బొంగుపోయినప్పుడు మిరియములను బెల్లపుముక్కలను నమలుచు కృష్ణలీలలను పాడుచుందురు. తలలు త్రిప్పుచు భక్తులు తమ సత్తువంతయు జూపి చేతికొలదిని వాయించుటచే నొకానొకప్పుడు మద్దెలలును తాళములును పగిలిపోవుటయు సంభవించుచుండును. దేవతావేశము చేత తఱచుగా భక్తులలో నొకరిద్దఱు దేహములు పరవశమయి రెండు మూడు నిముషముల వఱకు వెనుకకు స్తంభము మీది కొఱగుచుండుటయు గలదు. ఇట్టి భక్తి మార్గమును బొత్తిగా గుర్తెఱుగని యన్యదేశీయులకు మాత్రము వారి యప్పటి చేష్టలు పిచ్చిచేష్టల వలె గనపడును గాని, వేడుక చూడవచ్చిన జనులు వారెంత వికృతముగా కేకలు వేయుచు భజన చేయుదురో యంత పరమ భాగవతోత్తములని తలతురు.

కొంచెము శ్రమపడి యెవ్వరైన మధ్యాహ్నవేళ నొక్కసారి కొండ మీదికెక్కి నలుగడల జూడ్కి నిగిడించినచో, వన్నెవన్నెల