పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఎనిమిదవ ప్రకరణము

మరణమునొందెనని నిశ్చయించుకొనిరి. రామరాజును నాడి నిదానించి చూచి యామె చచ్చినదనియే స్థిరపరిచెను. అప్పుడందఱను శవముచుట్టును జేరవిలపించుచుండిరి. ఆ సమయమున సమీపము నుండి వ్యాఘ్రముయొక్క కూఁత యొకటి వినఁబడెను. అంతయాపదలో సహిత మాధ్వని కందఱును బెదరి వడఁకుచుండగా, రామరాజు వారిక ధైర్యము చెప్పి క్రూరమృగములతో నిండియున్న యర్యణమధ్య మగుటచే నచ్చట నిలువఁగూడ దనియ తెల్లవారిన మీఁదట మరల వచ్చి శవమునకు దహనాదిసంస్కారములు చేయు వచ్చుననియు బోధింపజొచ్చెను. కన్నకూఁతును కారడవిలో విడిచి పెట్టివెళ్ళుటకు మనసురాక వారాతనిమాటలను చెవిని బెట్టక రుక్మిణి సుగుణములను దలఁచుకొని యేడుచుచుండిరి. ఇంతలో మఱింత సమీపమున గాండ్రు మని పులి మఱలనఱచెను. ఆ రెండవ కూతతో సూర్యకిరణములను కరఁగునట్టుగా వారి ధైర్యసారము కరిఁగి పోయెను. అప్పుడారామరాజు హితబోధ నంగీకరించి, యెంతో కష్టముతో రుక్మిణిని విడిచిపెట్టి , నడువ కాళ్ళు రాక ముందుకు నాలుగడుగులుపెట్టి మరల వెనుకకు తిరిగి చూచుచు , తుదక విధి లేక రామరాజు వెంట వారందఱును పెద్దాపురమునుకుఁ బోయిరి. తమ ప్రాణముల మీఁదికి వచ్చునప్పుడు లోకములోనెల్లవారును తామావఱుకు ప్రాణాధికులనుగాఁ జూచుకొనువారి యాపదలయినను మఱచిపోయి తమ యాపదను తప్పించుకొనుటకే ప్రయత్నింతురు గదా?