Jump to content

పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

185


మ.

వదనాంభోజము లోచనత్రితయభాస్వల్లీలతోఁ గూడఁ బ
ద్మదళాక్షీమణి యోర్తు మేనఁ దిరమై మత్తిల్లగఁన్ రూపసం
పద సొంపొందియు రూపదూరపరతన్ భాసిల్లుచున్నట్టి ని
న్నిదమిత్థంబని ప్రస్తుతించ వశమే! యీశాన! యెవ్వారికిన్.

280


సీ.

నీయంద పొడముచు నీయంద పొదలుచు
       నీయంద విలయించు నిఖిలజగము
సకలచరాచరాసక్తుండ వగు దీవు
       రత్నంబులోని సూత్రమునుబోలె
రజ్జువునందు సర్పభ్రాంతి పొడకట్టు
       కైవడిఁ బ్రకృతి నీవై వసించు
ననవద్య మచ్యుత మాద్య మాద్యంతవి
       రహితమై వెలుగొందు మహిమ వీవ


గీ.

విష్ణుఁ డన రుద్రుఁ డనఁగ వాగ్విభుఁ డనంగఁ
దగిన నామాంతరంబులు దాల్చి నీవు
భ్రమము సమకూర్తు వెఱుఁగని ప్రాకృతులకు
నీ మహత్త్వంబు చిత్రంబు నీలకంఠ!

281


చ.

పనివడి మున్ను ఖేచరులపాటులు మాన్పఁ గుఱించి ఠేవతోఁ
గనుఁగొనినాఁడ వుద్భటు జగన్నుతమూర్తి యతండు పూనుని
ప్పని గొద యయ్యెనేని పురభంజన యేమియనంగవచ్చు నీ
యనుపమసత్ప్రభావ మకటా! వికటాచరణంబు చూపదే?

282


మ.

అనుచున్ ఖేచరరక్షణార్థ మతిధైర్యస్ఫూర్తి చేపట్టి ప
ట్టిన తెంపున్ విడకున్న రాజునకుఁ గంఠేకాలుఁ డిష్టంబు నీ
ననుకూలస్థితితోడ రాఁ దొడఁగెఁ దారాగంబుపైనుండి గొ
బ్బున నుక్షాధిపవల్గనైకవిచలన్భోగీంద్రహారాళియై.

283