Jump to content

పుట:ఉదాహరణపద్యములు.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రిపురవిజయము 7

సీ. కెంజాయ జడముడి కేశపాశంబును
బూపచందురుఁడును బూవుదండ
యురగకుండలమునుఁ దరళతాటంకంబు
వనజాప్తుఁడగు కన్ను వాలుఁగన్ను
ముదు(పంబుగ)లపేరు ముత్యాలహారంబుఁ
గడుఁ గొంచెమగు జన్ను ఘనకుచంబుఁ
బులితోలుదుప్పటి వెలిపట్టుచీరయుఁ
బాపపెండెంబును బసిఁడియందె
మృదువుఁ దెలుపును నగుభూతి మృగమదంబు
నింతయొప్పునె కుడివంక నెడమవంక
నిమ్మహాదైవమున కని యిచ్చమెచ్చి
యర్ధనారీశ్వరునిఁ గొల్చి రఖిలజనులు.

(పెదపాటి సోమయ – కేదారఖండము)

శివస్తుతి

సీ. కహ్లారమకరంద కలితమందాకినీ
లహరీపరీతకోలాహలంబు
బాలేందుచంద్రికా పరభాగశోభాప
రాగసంభావితారగ్వధంబు
సేవాసమాసన్న సిద్ధసీమంతినీ
తాలవృంతోత్తాలతాండవంబు
కాత్యాయనీదత్తకర్ణావతంసక
ర్పూరఖండామోదపూరితంబు
మారుతంబు నా ముందట మలసియాడఁ
గలుగునొకో యొకనాఁడని కన్నులార
శివుని జూచెడి పుణ్యంబు చింత మెఱయ
మొదలివేలుపుఁ బొడఁగంటి మ్రొక్కగంటి.

(సోముఁని హరివంశము 2.173)