Jump to content

పుట:ఉదాహరణపద్యములు.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

బాహుజుండయ్యుఁ దపశ్శక్తి నెవ్వాడు
బ్రహ్మర్షియై యెక్కె బ్రహ్మరథముఁ
బందెమోడి దివంబు పంచియిప్పించె ని
శ్శంక నెవ్వడు హరిశ్చంద్రునకును
గీ. నమ్మహాత్ముండు సకలలోకైకవినుతుఁ
డౌర్వసేయునితోడి మండ్రాటకాఁడు
నిష్ఠతోడుత నాశ్చర్యనియమవృత్తిఁ
దరమునకునుండె నంబికాధవునిగూర్చి.

గౌతమునికి - పెదపాటి సోమయ కేదారఖండము
సీ. చరియంచువారికి సంకల్పసిద్ధిగా
నిర్మించె నెవ్వాఁడు నిజవనంబు
సార్వకాలికఫలసస్యంబుఁ గల్పించి
వరమునిశ్రేణి నెవ్వాఁడు బ్రోచె
చీకటితప్పు సేసిన నెవ్వఁడదలించె
నింద్రుని తనువెల్ల హేయముగను
నుర్వీసురశ్రేణి కొమరి లేకుండఁగఁ
బలికె నెవ్వఁడు ప్రతాపంబు మెఱసి
గీ. యట్టి శ్రీవీరశైవాగమాదివేది
యైన గౌతమసంయమి యాశ్రమంబు
బొంతనెంతయు నొప్పారి పొగడనెగడు
ననఘమానస శ్రీవైజయంతిపురము.

భైరవుని శ్రీరంగమహత్వము — (మార్కండేయునికి)
శా. చండాంశుప్రతిమప్రతీకరుచు లాశాచక్రవాళంబునన్
నిండంబర్వఁ బ్రవాళపాటలజటానీకంబు దూలం గ్రియా
పాండిత్యప్రథమానసంయమికదంబం బర్థి సేవింప మా
ర్కండేయుం డరుదెంచెఁ దన్మఖదిదృక్షాకౌతుకోల్లాసియై.