Jump to content

పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16. ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదును పెంపొందించి, మధ్యలోనే విద్యను విరమించే వారి నిష్పత్తిని తగ్గించే లక్ష్యంతో 'బడికొస్తా' పథకాన్ని మాప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 1.87 లక్షల బాలికలకు సైకిళ్ళు అందించబడ్డాయి. కిశోరప్రాయంలోని బాలికలను తిరిగి పాఠశాలలో భర్తీ అయ్యే దిశగా ప్రోత్సహించడానికి, వారికి మెరుగైన పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని మరియు ఇతర శిక్షణలను 'సబల' పథకం ద్వారా అమలు చేస్తున్నాము.

17. మా ప్రభుత్వం ప్రారంభించిన 'తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్' పథకం ద్వారా 7.19 లక్షల మహిళలకు ప్రసూతి అనంతరం లబ్ది చేకూర్చింది. 6.91 లక్షల మంది తల్లులుకు ఎన్.టి.ఆర్. బేబీ కిట్లను పంపిణీ చేసాము. అదనపు పౌష్టికాహార కార్యక్రమం ద్వారా 6 సంవత్సరాల లోపు 30.49 లక్షల బాలబాలికలకు; 6.19 లక్షల గర్భిణీ స్త్రీలు, బాలింతలకు; అదనపు పోషకాలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తూంది. మెరుగైన పోషకాహారం అందించే 'అన్న అమృత హస్తం' ద్వారా బరువు తక్కువగా జన్మించే పిల్లల సంఖ్యను తగ్గించటం, ప్రసూతి సమయంలో సంభవించే మరణాలను అరికట్టటం మా ప్రభుత్వ లక్ష్యం.

18. ఇప్పటికే ఉన్న అనుబంధ పోషకాహార కార్యక్రమానికి అదనంగా, 'బాలసంజీవని' ప్రత్యేక ఆహార పథకం పథకం ద్వారా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల బాలబాలికలు, గర్భిణీ స్త్రీలు బాలింతలు; మరియు సాధారణ తరగతులకు చెందిన పిల్లలలో పౌష్టికాహార లేమిని, రక్తహీనత మరియు ప్రమాదావకాశమున్న గర్భిణీ స్త్రీలను మా ప్రభుత్వం ఆదుకుంటుంది. గిరి గోరుముద్దలు పథకం అమలు ద్వారా 1.45 లక్షల గిరిజన ప్రాంత పిల్లలలోని పౌష్టికాహార లేమిని రూపుమాపే ప్రయత్నం జరుగుతుంది.

19. 'దీపం' పథకాన్ని ఇంధన భద్రతగానే కాక కట్టెలు వాడే సమయంలో వచ్చే పొగ వలన కలిగే ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కలిగించే మార్గంగా మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా మా ప్రభుత్వం భావిస్తుంది. ఇంతకు ముందు 15 సంవత్సరాలలో 25.82 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లను ఇవ్వగా, గత నాలుగున్నర సంవత్సరాలలోనే 30.61 లక్షలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 1.55 కోట్ల కనెక్షన్లలతో నూరు శాతం కుటుంబాలకు వంట గ్యాస్‌ను అందిస్తూ కిరోసిన్ మరియు పొగ విముక్తి రాష్ట్రంగా మనరాష్ట్రం ప్రకటించబడింది అని ఈ గౌరవ సభకు తెలియచేయటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.

20. 15 లక్షల స్వయం సహాయ సంఘాల మహిళలు మరియు 10 లక్షల ఇతర కౌమార బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపర్చటానికి మా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో రక్ష పథకాన్ని ప్రవేశపెట్టి శానిటరీ నాప్‌కిన్లు పంపిణీచేస్తుంది.

21. మహిళలకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గురించి వివరించడానికి, హింసకు గురైన మహిళల సహాయార్ధం తక్షణ అత్యవసర ప్రతి స్పందనను అందించడానికి, 24 గంటలు పనిచేసే ప్రత్యేక హెల్ప్ లైన్‌తో పాటు 13 జిల్లా కేంద్రాలలో One Stop Center (OSC) లను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.

5