Jump to content

పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39. మా ప్రభుత్వం ప్రైవేటు రంగాల ద్వారా 7.7 లక్షల ఉద్యోగాలను కల్పించింది. 2.51 లక్షలు ఉద్యోగాలు పెద్ద మరియు బృహత్ ప్రాజెక్టుల నుండి 3.3 లక్షలు మధ్యతరహా, చిన్న సంస్థల నుండి, 1.78 లక్షలు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా, 0.13 లక్షలు APITA ద్వారా సాధించడం జరిగింది. దీనితోపాటుగా, 42,000 పోస్టులకు నియామకాలు జరగడానికి మా ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది. ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్మాణ కార్యకలాపాలు గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. సృష్టించబడుతన్న ఉద్యోగాల వివరాలను, నియామకమౌతున్న ఉద్యోగి వివరాలను, పారదర్శకతతో అందరికి అందుబాటులో ఉండే విధంగా online లో ఉంచుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గౌరవనీయ సభ్యులకు తెలియచేయడానికి గర్వపడుతున్నాను.

సాంఘిక సాధికారత మరియు సంక్షేమం

40. పుట్టుక పరిస్థితులకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు స్వయం సమృద్ధితో, ఆత్మ విశ్వాసంతో ఉండాలనే సంఘటిత విధానాన్ని అవలంభిస్తూ గౌరవ ముఖ్యమంత్రిగారి నాయకత్వంలో మా ప్రభుత్వం సదా కృషి చేస్తుంది. సామాజికంగా వెనుకబడిన - షెడ్యూలు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు - కు శాచురేషన్ పద్దతిలో మా ప్రభుత్వం సంక్షేమ పథకాల క్రింద సహాయాన్ని మరింత విస్తరింప చేస్తుంది.

41. సబ్ ప్లాన్ బడ్జెట్: గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం 32,843 కోట్ల రూపాయలు షెడ్యూల్డు కులాల సంక్షేమానికి, 8,950 కోట్లు షెడ్యూల్డు తెగల సంక్షేమానికి, 28,805 కోట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది.

42. నూతన కార్పొరేషన్లు: అన్ని వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం యాదవ, తూర్పు కాపు/ గాజుల కాపు, కొప్పుల వెలమ/పొలినాటి వెలమ, కురుబ/కురుమ, వణ్యకుల క్షత్రియ (వణ్ణ రెడ్డి/వన్ని కాపు/పల్లికాపు/పల్లిరెడ్డి), కళింగ, గవర, చేనేత (పద్మశాలిదేవాంగుల తొగటశాలితొగట-వీర క్షత్రియ/పట్టు శాలితొగట శాలిసేనాపతులశాలివన్), మత్స్యకారులు (అగ్నికుల క్షేత్రయపల్లి/వడబలిజ/బెస్త జాలరి/గంగ్వార్/గంగపుత్ర/గూండ్లనయల/పట్టపు మరియు గండ్ల /తెలికుల /దేవటిలకుల వంటి క్రొత్త కార్పొరేషన్లను ఏర్పరచడం జరిగింది.

43. రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సాగర/వుప్పర, కృష్ణ బలిజ/పూసల, వాల్మీకి బోయ, బట్రాజు, కుమ్మరి శాలివాహన లకు ఉన్న కొ-అపరేటీవ్ సొసైటీస్ ఫెడరేషన్ ను, కొ-ఆపరేటీవ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌గా మార్చడం జరుగుతుంది.

44. కల్లు గీత కార్మికుల కార్పొరేషన్లు శెట్టిబలిజ/గౌడ/ఎడిగ/గౌడ్/గండ్ల/శ్రీశయన/కళింగ/గౌండ్ల/ యాదవ కొ-అపరేటీవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ గా పేరు మార్చడం జరుగుతుంది.

9