పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

గగ్గోలుచే భీతి గలిగి రాత్రులయందు
             నిద్రఁ గానక పగల్ నిద్రఁ జెంది
యలసి యేమఱినచో నదరిపాటుననైనఁ
             బగ లెల్ల నాయత్తపాటు చెంది
బడలినచోట మాపటిజామునందైన
             నడురేయిఁ గడునిద్ర దొడరువేళ
రేతిరిజగడంబురీతి దా నెఱుఁగుచుఁ
             బలుజోళ్ళు కొమ్ముకత్తులును గల్గి


గీ.

కరులచేనైన వేగంబు గలిగినట్టి
శూరతతిచేతనై నను జుట్టుముట్టి
కూటయుద్ధంబుచే శత్రుఁ గూల్పవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

43


సీ.

ఎండకు గాలికి నెదురెక్కి కనుమోడ్చి
             సుడివడి తడఁబడుచోటనైన
నదిగాక క్షుద్రంబు లగునట్టియడవుల
             మంచున మబ్బుల మలలఁ బొదల
వాఁగుల వ్రంతలఁ దీఁగెల గుంతల
             ఱాల నేఱులను బోరానియిఱుకు
తెరవుల నరికట్టి తిరుగువారుచునైన
             మిగులఁ దా నచ్ఛిద్రుఁ డగుచు మించి


గీ.

యదనుఁ జేకొని పైఁబడి చదిపి యైనఁ
బదరి తనమూఁక బడలిక పడఁగనీక
కూటయుద్ధంబుచే శత్రుఁ గూల్పవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

44