పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కార్యసిద్ధిసూచకములు

గీ.

పౌరుషంబు సహాయసంపద మనఃప్ర
సన్నతయు దేహదార్ఢ్యంబు సమకొనుటయు
బుద్ధి విశ్వాసమును జాలఁ బొడముటయును
గార్యసిద్ధికి గుఱుతులై కానుపించు.

44


క.

సులభములగు యత్నంబులు
గలుగుట, తగుసాధనములు గలుగుట, విఘ్నం
బులు లేకుండుట, కార్యం
బులకున్ ఫలసూచకములు భువి నివి తెలియన్.

45


క.

పలుమరు మదిలోఁ దలఁపఁగ
వలయున్ మంత్రము ధరింపవలయును యత్నం
బలరఁగ నటుగాని యెడం
జలియింపుచు నగ్నిలీలఁ జాల దహించున్.

46


క.

వెలివడు మంత్రం బాప్తుల
వలనన్ రక్షింపకున్న వసుధాపతికిన్
దెలిసి యటుగాన నాప్తుల
వలనను మంత్రంబుఁ బ్రోవవలె యత్నమునన్.

47


ఆ.

కలువరింతపలుకువలనఁ గామమువల్ల
మదమువలన మఱి ప్రమాదములను
గదిసి గుట్టుఁదెలియుఁ గామినీవితతుల
వలన మంత్ర మదియు వసుధలోన.

48


గీ.

కంబములు లేక సోరణగండ్లు లేక
నడుమ గోడలు లేక పెంపడరుచోట
మేడపైఁ గానలో నైన మెలఁకు వలర
మంత్ర మూహింపవలయును మనుజవిభుఁడు.

49