పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

తగుకార్యములె విహితమునఁ
దగిలినయవి యెపుడు మీఁదఁ దా మంచివియై
తగు నవి తొలుతన్ సజ్జను
లగువారిక్రమాగతంబు లైనవి పతికిన్.

24


గీ.

ఎట్టికార్యంబు దనకును హిత వొనర్చు
నెట్టికార్యంబుచే నింద లెనయకుండు
నట్టికార్యంబె పూని చేయంగవలయు
నప్పు డించుకకఠినమై యడరెనేని.

25


క.

సులభమునఁ గార్యసిద్ధులు
గలుగుటకై బుద్ధిచేతఁ గార్యము బూనన్
వలయుఁ బతి మంచిమిత్రులఁ
గలిగినచో సింహవృత్తి కడు మేలొకటన్.

26


చ.

తొడిఁబడ మించి పై కుఱికి దుష్టవిరోధుల వంచి సంపదల్
వడయుట లెంచ దుష్కర ముపాయబలమ్మున నేదియైన చొ
ప్పడి తగుమావటీఁడు బలభద్రగజంబుశిరంబుమీఁదటన్
దొడరియు వాయుమార్గములతోడఁ బదం బిడు టెందుఁ జూడమే.

27


ఆ.

చతురమతి కుపాయసరణిచే సాధ్యంబు
గానివస్తు నించుకయును గలదె
యినుపముద్ద యైన నిలలోన నీరుగా
కఱఁపఁ బడును చెఱిపి విఱుపఁబడును.

28


క.

జల మింగలంబు నార్చుట
యిలమీఁదటఁ గడుఁబ్రసిద్ధి యీ యింగలమే
బలువగు నుపాయశక్తిని
జలచలచలఁ దెరలఁజేసి జల మిగిరించున్.

29