పుట:అభినయదర్పణము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హస్తంబు పొడచూపునచట దృష్టియు నుంచి
              మఱి దృష్టి గలచోట మనసు నిల్పి
మనసు నిల్పినయెడ నెనయ భావము నుంచి
              భావంబుతో రసం బలరఁజేసి


గీ.

యెలమి నివియెల్ల నొక్క టై మెలఁగుచుండ
నట్టిదే సూడ నిలలోన నభినయంబు
నెనసి భరతజ్ఞు లిది మెత్తు రింపు మీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

19


వ.

ఇట్లు, ఋగ్యజుస్సామవేదంబులచేత బోధింపబడిన నాట్యశాస్త్రంబు బ్రహ్మదేవుం డను భరతజ్ఞునివలన గంధర్వులు నప్సరస్త్రీగణంబులు బోధింపఁబడినవార లైరి. వారలచేత దేవలోకంబున నీ భరతశాస్త్రార్థంబు విశదమై గనఁబడుచుండె. నంత.

20


చ.

సరగున నొక్కనాఁ డలరి శంభుడు మిక్కిలి ప్రేమతోడుతం
జెలువుగ నాట్యశాస్త్రమును జెన్నుగఁ బార్వతిదేవి కొప్పుగం
బలుమరు బోధచేయుచును భావములన్ వివరించునంత, నా
నెలఁత ముదంబు జెందె, మఱి నిక్కము, గస్తురిరంగనాయకా!

21


ఉ.

అంతట, నార్యధాత్రిఁ గల యా మునిసంఘముతోడఁ బ్రేముడిన్
వింతగ నాట్యశాస్త్రమును వేమఱు భావము [1]వీడఁ దెల్పినన్,
సంతస మంది యా మునులు సారెకు నార్యకు మ్రొక్కి వార ల
త్యంత వినోదయుక్తులయి రంబుజలోచన! రంగనాయకా!

22


గీ.

నాట్యశాస్త్రంబు మునులు [2]సౌరాట్యదేశ
స్త్రీలకును దెల్ప, వారిచేఁ జెలువు మీఱి
సకలదేశంబు లందెల్ల సాగి మహిని
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

23
  1. వీడు=విశదమగు
  2. సౌరాట్యదేశము = సౌరాష్ట్రదేశము. సురాట్యము=దేవతలచేఁ దిరుగఁదగినది. సురాట్యమే 'సౌరాట్యము'. ఈవ్యుత్పత్తితో 'సౌరాష్ట్రము'నే 'సౌరాట్యము'గాఁ గవి వ్యవహరించినట్లు గానవచ్చుచున్నది.