నేటి కాలపు కవిత్వం/నాయకాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

నాయకాధికరణం.

ఆక్షేపం.

అవునయ్యా; యెంకిపాటలవంటి క్షుద్రశృంగారమన్నారు. ఇక వర్తమానాల్లో యెవరిది ఉదాత్తశృంగారం? ఇప్పటి ఆంధ్రదేశపురాజుల్లో జమీందారుల్లో సాధారణమనుష్యుల్లోకంటె యెక్కువ ధర్మరక్షకత్వం కనబడదు. అందరూ ఒకటే దశలో వున్నారు. ఇక ఉదాత్త నాయకులేరీ? అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను; నాయకుణ్ని నెదుక్కోవలసినపని కవిది. ఉచిత నాయకుణ్ని సృజించండి. చేతకాకుంటే వీలులేకుంటే మానండి. వర్తమానంలో యెవరైనా ధర్మరక్షకులు ఉదాత్తశృంగారనాయకులు కనబడితే స్వీకరించండి. అసలు భారతవర్షంలోనే అనేక శతాబ్దులకిందటనే ఆరంభమయిన ధర్మపతనం నేడు అనేకవిధాల ఆంధ్రదేశంలో నల్దిక్కులా విరివిగాగోచరిస్తున్నది. జాతిస్వతంత్రమై సర్వసమృద్ధమై ధర్మార్థ కామాలు అకలుషితాలై వర్తిస్తున్న దశలోవలె జాతిపతితమై జీవితం కుళ్లుడుతో వున్న దశలోఉత్తమకవితోదయానికే అనుకూల్యాలుండవు. మన పద్యం సయితం మురికిలక్షణాలతో వికృతమైవున్నదని పద్యం వ్రాయడమే కవితగాదని పద్యంవ్రాయడం విద్యగాదని యిదివరకే చెప్పినాను. మనస్సు జాతిసాధారణమైన ఈప్రాతికూల్యభారాన్ని తొలగించుకొని స్వచ్ఛవికాసాన్ని పొందడం యేఅలోకసామాన్య పురుషుడియందో తప్ప సాధారణంగా గోచరించదు. ఇక మనస్సును చీకటివలె ఆవరించే కామం బీజమైన శృంగారంయొక్క నిర్మలస్వరూపాన్ని దర్శించగలగడం. జాతిలో వర్తమానంలో దానికి తగిన ఆలంబనం దొరకడం దుర్లభంగావచ్చును. భారతవర్షపు తక్కినజాతుల్లో యెట్లావున్నా మన ఆంధ్రులయందు ఆర్యమైన వీరత్వం నశించింది. స్వపురుషార్ధరక్షణ చేసుకొనలేని పిరికిపందలాజాతియొక్క శృంగారం నిస్తేజం. వీరత్వం లేనిచోట యేసుగుణం యేధర్మం తలయెత్తజాల దన్నమాట సత్యం వీరత్వం నశించి ఆర్యపవృత్తి చ్యుతమైపోయిన ఆపద్దశలో ఆ ఉదాత్తగుణప్రభోదానికి బదులు కవికి పిరికిజాతి శృంగారమందు తత్పరత వాస్తవంగా గర్హ్యమే అవుతున్నది. అయితే యీదశలో జాతియందు స్త్రీలూ పురుషులూ కలియడం జరుగుతూనే వున్నదిగదా అంటే అది క్షుద్రకోటిలోది గనుక కవికి ప్రధానంగా అనుపాదేయమంటున్నాను. తక్కిన రసాల్లో ప్రస్తుతం ఉపాదేయమైనవాట్లో అభినివేశం తీర్చుకొనడానికి అది అంగంగా స్వీకార్యమైతే కావచ్చును. కాని ప్రధానంగా స్వీకారం గాదంటున్నారు.

కావ్యరచన ఉద్దిష్టమైతే రసనిర్ణయం. రసానికి ఉచితుడైన నాయకుడి నిర్ణయం తదనుగుణమైన వస్తుసృష్ఠి మొదలైనవన్నీ కవికి సంబంధించిన ధర్మాలని చెప్పి యీవిమర్శ చాలిస్తున్నాను. కరుణాదుల్లో ఉత్తమేతరులు సయితం విరుద్దులుగారు గనుక ఆరసాలకు వర్తమానులు ఉచితులు గావచ్చును. అదంతా కవికార్యమని వదలుతున్నాను. కావ్యం సృష్టమైనప్పుడు ఇది మంచిది. ఇది దుష్ఠం. ఇది క్షుద్రశృంగారం. ఇది పులుముడు అని యిట్లావిచారణచేసి సాహిత్యవేత్తలుచెప్పడం సంభవిస్తున్నది.

అని శ్రీ ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నాయకాధికరణం సమాప్తం