నా జీవిత యాత్ర-4/వ్యక్తి సత్యాగ్రహము

వికీసోర్స్ నుండి

8

వ్యక్తి సత్యాగ్రహము

గాంధీగారు స్వాతంత్రోద్యమాన్ని ఏ విధంగా కొత్తగా నడిపిస్తారో ఎవరికీ అవగాహన కాలేదు. "యుద్ధ సమయంలో, ఇంగ్లండు దేశం ప్రాణ సంకట సమయంలో ఉన్నపుడు నే నిబ్బంది కలుగజేయను," అన్న ఆయన వాగ్దానం అందరూ ఎరిగిందే. శత్రువుకు ఇబ్బంది కలిగించనిది ఉద్యమం అలా అవుతుంది? ఏదైనా చేసినా, అది ఉద్యమం అని అనిపించుకోవడానికి తగినదవుతుందా?

ఇలా ఉండగా, ఆయన ఒక ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారం దేశంలో ప్రతి జిల్లాలోనూ సత్యాగ్రహ సంఘాలు ఏర్పాటు కావాలన్నారు. ప్రత్యేకమైన సంఘాల ఏర్పాటుకాక, జిల్లా కాంగ్రెస్ సంఘాలే సత్యాగ్రహ సంఘాలుగా మారవలసిందని మార్చి నెలలో రామ్‌ఘర్ కాంగ్రెస్ కాగానే ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారం, 24 - 4 - 1940 నాడు విశాఖపట్నం జల్లా కాంగ్రెస్ కమిటీ, విశాఖపట్నం జిల్లా సత్యాగ్రహ సంఘంగా మారడానికి తీర్మానించి, అలా మారి పోయింది. నెహ్రూగారు కూడా ఇంగ్లండు సంకటావస్థలో ఉన్న సమయంలో సివిల్ డిస్ ఒబీడియన్స్ (సాత్విక నిరోధం) పైన ఉద్యమం ఏదీ చేయకూడదని ప్రకటించారు. ఈ కట్టుబాట్లలో సుభాస్ చంద్రబోస్ ఎప్పుడూ ఇమిడి ఉండలేక పోయేవారు. ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఎన్నికయినప్పుడు, గాంధీగారు ఆయనను వ్యతిరేకించి, సహకరించక పోవడంవల్ల - ఆయన తన స్వంత ప్రచారంలోనే ఉండేవాడు. ఆయనను జూలై 2 న అరెస్టు చేశారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరొకసారి తిరిగి పూనాలో సమావేశ మయింది. గాంధీగారి అహింసా సూత్రానికి భిన్నంగా ఒక తీర్మానం చేసింది. తాత్కాలికంగా కేంద్రంలో జాతీయప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే యుద్ధంలో కాంగ్రెసు మంత్రివర్గాలు బ్రిటిషువారికి, వారి మిత్రులకు సహాయం చేస్తాయని తీర్మానించారు. ఆ మీటింగులో ఈ విషయమై గాంధీకి, రాజాజీకి వివాదం వచ్చింది. గాంధీగారు "మనం మన దృక్పథాలలో ఒకరినుంచి ఒకరం దూరమవుతున్నామని నేను చాలా కాలంనుంచి గ్రహిస్తూ వస్తున్నాను," అని రాజాజీతో అంటే ఆయన, "మీ దృష్టి మందగించిం"దని ఒక విసురు విసిరారు. ఈ వాగ్వివాదం జరుగుతున్నప్పుడు ప్రత్యేకాహ్వానంపైన ఆ సమావేశంలో ప్రకాశంగారు హాజరయి ఉన్నారు. అయితే, చేసిన ఆ తీర్మానం చాలా పొరబాటయినదని ప్రకాశంగారు ఒక బహిరంగ సభలో చెప్పి, మరొక మాటకూడా అన్నారు - "కాంగ్రెస్ కమిటీవారు కొంతకాలంలోనే మోకాళ్ళమీద నిలబడి, నాయకత్వం వహించమని మళ్ళీ గాంధీగారినే ప్రార్థించే పరిస్థితి రాకతప్ప"దని.

ఆగస్టు 8 న పూనాలో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అడిగిన ప్రకారం జాతీయప్రభుత్వం ఏర్పాటుచేయడం సాధ్యంకాదని వైస్రాయి ప్రకటించారు. కావలిస్తే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విస్తృతపరుస్తానన్నారు. అంతేకాని, బాధ్యత అన్నది తన చేతిలోనుంచి జార విడవడం మాత్రం సాధ్యం కాదన్నారు. సెప్టంబరు 12 న ప్రకాశంగారి నాయకత్వంక్రింద గుంతకల్లులో సమావేశమైన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ వైస్రాయి చెప్పినదానికి జవాబుగా దేశవ్యాప్తమైన శాసనోల్లంఘానాన్ని కాంగ్రెసువారు ఆరంభించవలసిందని అఖిల భారత కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి సిఫారసు చేశారు. తరువాత మూడు, నాలుగు రోజులకు కాంగ్రెస్ అధిష్టానవర్గం, అదివరకు జాతీయప్రభుత్వం ఏర్పాటుచేస్తే యుద్ధానికి సాయం చేస్తామని జూలై లో పూనాలో చేసిన వాగ్దానాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పి, ప్రకాశంగారు కొన్నాళ్ళ క్రిందట చెప్పినట్లే వారి తప్పును వారే సవరించుకున్నారు. గాంధీగారు "ఆత్మనిగ్రహం అనేది ఆత్మనాశనం క్రింద పరిణమించడానికి వీలు లేదు కదా?" అన్నారు. తర్వాత ఆ నెల 28 న గాంధీగారు వైస్రాయిని సందర్శించారు. అప్పటి కప్పుడే 'వ్యక్తి సత్యాగ్రహం' అనే ఒక కొత్త ప్రక్రియ గాంధీగారి పదకోశంలో రూపొందటం ఆరంభించింది.

ఈ పూనా సమావేశం అయిన తరువాత, 18-10-40 నాడు ప్రకాశంగారు అనంతపురం బహిరంగ సభలో వ్యక్తి సత్యాగ్రహ ప్రక్రియా వివరాలు, దాని ప్రభావంగురించి గంభీరోపన్యాసం గావించారు.

అంతకుముందు రోజే, గాంధిగారు ఈ వ్యక్తి సత్యాగ్రహం అన్నది వినోబాభావే గారితో ప్రారంభిస్తామని ప్రకటించేసరికి, జవహర్లాల్ నెహ్రూ ప్రభృతులకు కోపం వచ్చింది. అది విప్లవం తేగలిగే ఉద్యమమే అయినట్లయితే అటువంటిదానికి తమకు అగ్రతాంబూలం ఇవ్వాలంటూ - "ఎవరీ వినోబా భావే?" అని ప్రశ్నించారు.

"ఆయన సత్యా హింసలలో సంపూర్ణమయిన విశ్వాసం కలవ్యక్తి. నాతోనే ఆశ్రమంలో ఉండంవల్ల ఇతని పేరు పైకిరాలేదు. కాని, నేను తలపెట్టిన వ్యక్తి సత్యాగ్రహానికి ఆయనే తగిన వా"డని గాంధిగారు జవాబిచ్చారు. అంతేగాక, ఆ సత్యాగ్రహానికి నాయకత్వాన్ని తన ఒక్కరి చేతిలోనే ఉంచుకోవాలని గాంధిగారు నిర్ణయించారు. తాము చెప్పినవారే దేశంలో వ్యక్తి సత్యాగ్రహం చేయాలన్నారు. మొదట కొందరు అగ్రనాయకులు, వారి తరువాత కేంద్ర రాష్ట్ర శాసన సభలలోని కాంగ్రెస్ సభ్యులు, ఆపైన దేశంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, డిస్ట్రిక్ట్ బోర్డు మొదలైన స్థానిక సంస్థల అధ్యక్షులు ఈ సత్యాగ్రహంలో పాల్గొనవలసిందని ఆయన ఏర్పాటు చేశారు. రాష్ట్రాలనుంచి పంపిన పేర్ల వరుసలను ఆయన అనుమతించిన తరువాతే సత్యాగ్రహంలో పాల్గొనవలసి ఉండేది.

ఈ విశాల భారతదేశ మంతటికీ ఏకైక నాయకుడుగా ఆయన చెప్పినట్టు సత్యాగ్రహులు దేశం మారు మూలలనుంచి ఒక క్రమశిక్షణతో రావడం అన్నది గొప్ప విప్లవాత్మకమైన, రాజకీయోద్యమ ప్రక్రియ. అయితే, శీఘ్రంగా తిరిగి మంత్రి పదవులలోకి వెళ్ళడం తప్ప వేరే గత్యంతరం లేదనుకున్నవారికి గాంధిగారి మంత్ర రహస్యం అర్థం కావడం కష్టమయింది. "ఈ ఉద్యమం రేపే చప్పబడి పోతుంది" అని రాజాజీ వ్యాఖ్యానించారు. కానీ అది చప్పబడకపోగా, రాబోయే "క్విట్ ఇండియా" మహాసంగ్రామానికి మొదటి మొగ్గరముగా పరిణమించింది.

గాంధిగారు ఇంకొక సూత్రంకూడా చెప్పారు సత్యాగ్రహానికి తాను నియమించే వ్యక్తులు తమకు తోచినట్టు ఉపన్యాసాలేవీ చేయక, తామిచ్చే రెండు వాక్యాలను - ముందుగా అధికారులకు సమయం, స్థలం తెలుపుతూ నోటీసు ఇచ్చి, అక్కడ అప్పుడు చదవాలన్నారు. ఆయన ఆదేశించినట్టు, అవి నిజానికి రెండు వాక్యాలు కాక ఒక వాక్యమే. అది - "ఈ యుద్ధములో బ్రిటిషువారికి మనుష్యులతోగాని, ధనముతోగాని సాయము చేయుట నీతి విరుద్ధము; దోష సహితము." మేమంతా ఈ ఒక్కవాక్యం చదివే సత్యాగ్రహం చేశాము. ఇది బహిరంగ సభలలో జరిగేది. ప్రజలందరికి సత్యాగ్రహ సందేశమిచ్చి, శాసనోల్లంఘనం చేయాలి.

అయితే, దీనికికూడా రాజాజీ వ్యతిరేకియే. ఆయన "ఇదంతా బహిరంగంగా చేయవలసిన అగత్యమేముంది? లాభమేముంది? యుద్ద సంబంధమైన ప్రభుత్వంవారి ఉపసంఘ సభ్యులకు మనం ఎందుకు సహాయం చేయమో వివరిస్తూ ఉత్తరం వ్రాస్తే చాలదా?" అని వాదించారు. గాంధిగారు ఆయన బాధపడలేక, ఆయనను ఒక్కడినే అలా చేసుకోమన్నారు.

కాని, రాజాజీ మాత్రం తనలో ప్రత్యేక విశ్వాసంగల సభ్యులచేత యుద్ధ సంఘ సభ్యులకు దీర్ఘమైన ఉత్తరాలను వ్రాయించారు. తెలుగు రాష్ట్రంలో ఒకరో, ఇద్దరో తప్ప ఆయన మాట ఎవరూ వినలేదు. ఈ విధంగా వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించిన తర్వాత చెన్న రాష్ట్రంలోని వేలూరు, తిరుచినాపల్లి, కోయంబత్తూరు జెయిళ్ళు రోజు రోజుకూ సత్యాగ్రహ్ ఖైదీలతో నిండిపోతూ ఉండేవి. గాంధివారి వద్ద అనుమతి పొందిన ముగ్గురు నలుగురు తప్ప పేరుపడ్డ కాంగ్రెస్‌వాదులు ఎవరూ జెయిలు ఆవరణకు అవతల లేరు. వ్యక్తి సత్యాగ్రహాన్ని వ్యతిరేకించిన వారు - జెయిళ్ళలోకి ఎవరూ రారని తాము చెప్పినందుకు వ్యతిరేకంగా జరగడం కంటగింపు కాగా, జెయిళ్ళలోకి వస్తేమాత్రం ఏమి లాభమనే కొత్త నినాదాన్ని ప్రచారం చేయసాగారు.