నా జీవిత యాత్ర-4/మంత్రివర్గంలో ప్రకాశంగారి స్థానము

వికీసోర్స్ నుండి

2

మంత్రివర్గంలో ప్రకాశంగారి స్థానము

మంత్రివర్గంలో ప్రకాశంగారు ఒకరయి ఉండాలా అన్న సందేహం కూడా కాంగ్రెస్ పెద్దలకు తోచినట్లు కనిపించింది. అందుచేత రాజాజీ మొదట ప్రకాశంగారిని అసెంబ్లీ స్పీకరుగా ఉండాలని కోరారు. ప్రకాశంగారు ఒప్పుకోలేదు. సాంబమూర్తిగారు కూడా మెత్తని వాడు కాడు. ప్రకాశంగారు మంత్రి అయితే, వారికితోడు సాంబమూర్తిగారు కూడా ఉన్నట్లయితే అసలు ముఖ్యమంత్రిగారి మాట మంత్రివర్గంలో చెల్లుతుందో, లేదో అన్న పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. అందుచేత, సాంబమూర్తిగారిని స్పీకరుగా ఉంచినట్లయితే తగువు తీరు తుందని ఆయనను స్పీకరుగా ఉండాలని కోరారు. మహర్షి సాంబమూర్తిగారు అంగీకరించారు. తరువాత తెలుగు మంత్రులను ఎవరిని వేయాలి అని ఒక ప్రశ్న. నాకు తెలిసిన విషయం ఇది: గిరిగారి పేరు, కోటిరెడ్డిగారి పేరు ప్రకాశంగారు సూచించారు. గిరిగారి పేరు రాజాజీ వెంటనే అంగీకరించారు. కాని, కోటిరెడ్డిగారి పేరు అంగీకరించలేదు. కోటిరెడ్డిగారు రాయలసీమ కంతకూ పేరు ప్రఖ్యాతులు పొందిన సాత్విక నాయకులు. ఆయన సతీమణి అప్పటికే కడపజిల్లా బోర్డు అధ్యక్షురాలై, స్త్రీ అయినా మగతనం చూపిస్తున్న నాయకురాలు. అందుకే కాబోలు రాజాజీ రెడ్డిగారిని ఒప్పుకోలేదు. దానిపైన ప్రకాశంగారు కాంగ్రెసులో అనుభవంగల నాయకులను కాకుండా యువకుడైన బెజవాడ గోపాలరెడ్డిగారి పేరును సూచించారు. గోపాల రెడ్డి యువకుడు, చురుకైనవాడు, త్యాగశీలుడు. రాజాజీ ఆ పేరు ఒప్పుకొనడం జరిగింది.

మిగిలిన మంత్రులలో రామున్ని మేనోన్ కేరళనుంచి వచ్చిన ఆయన. ప్రకాశం గారు మాప్లా తిరుగుబాటు సందర్భంలో మలబారు పర్యటన చేసిననాటినుంచి ఈయనకు పరిచితులు. మిగిలిన మంత్రులలో డాక్టర్ సుబ్బరాయన్, మునుస్వామిపిళ్లైగార్లు21వఉద్యమంలో కాని, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాని కాంగ్రెస్ వారితో బాటు జైలుకి వెళ్లినవారు కారు. డాక్టర్ టి.ఎస్. రాజన్ పూర్వకాలపు విప్లవవాసన కలవాడు.ఏ మంత్రికి ఏ శాఖలు ఇవ్వాలో నిర్ణయించే భారం అంతా రాజగోపాలాచారిగారికే విడిచి పెట్టడమైయింది.

ప్రకాశంగారికి రెవిన్యూ శాఖ ఇచ్చారు. కాని, రెవిన్యూమంత్రికి జిల్లా కలక్టర్లను నియమించడానికిగానీ బదిలీచేయడానికిగాని అప్పుడున్న ప్రభుత్వ నిబంధనలప్రకారం అధికారం లేదు. ఆ విధంగానే, బోర్డ్ ఆఫ్ రెవిన్యూ-రెవిన్యూశాఖలోనిదే అయినా మెంబర్లంతా ఐ.సి.యస్.వారు కావడంచేత వారిని నియమించడానికిగాని, మార్చడానికిగాని రెవిన్యూమంత్రికి హక్కులేదు అయినా రెవిన్యూశాఖ అనేసరికి ప్రభుత్వానికి వెన్నెముక వంటిదనే ప్రథ ఒకటి ఉండేది. గ్రామోద్యోగులు, తహశీల్దారులు- వీరందరూ బోర్డ్ ఆఫ్ రెవిన్యూఖాయిదాలోనే పనిచేస్తారు. బోర్డ్ ఆఫ్ రెవిన్యూకి శాసనరీత్యా, అనేక వ్యవహారాలలో మంత్రివర్గం ప్రమేయంలోకుండా తుది నిర్ణయాలు తీసుకునే హక్కుంది. అలాగుననే కోర్టువార్డ్సు(ప్రతిపాలక అధికరణ) బోర్డ్ ఆఫ్ రెవిన్యూవారి చేతిలోనే ఉండెను.డెప్యూటి కలెక్టర్ల నియామకె, బదిలీల సంబంధమైన తుది నిర్ణయం మాత్రం రెవిన్యూమంత్రి చేతిలో ఉండేది. అయితే ఆ ఉద్యోగస్థులు కూడా శాసనరీత్యా అనేకమైన రెవిన్యూ విషయాలలో తమంతట తామే నిర్ణయాలు చేసుకోగలిగే హక్కు కలిగి ఉండేవారు. ఈ పరిమితులమధ్య ప్రకాశంగారు మంత్రిత్వం నడిపించుకోవాలి. అట్టే ఇబ్బంది ఎవ్వరికి కలుగజేయలేడని, అప్పుడున్న నిబంధనల ననుసరించి ఈయన సాధించగలిగింది కూడా ఏమీ లేదనీ రెవిన్యూశాఖ అప్పచెప్పిన వారి అభిప్రాయం కాబోలు!

కాబినెట్ మీటింగు

రాజాజీ చాల నిపుణుడు. దానికి తోడు మహాత్మాగాంధీగారికి సంబంధి. గాంధీగారు మొదటిసారి జైలులో ఉన్న రోజులలో ఆయన నడిపించే "యంగ్ ఇండియా" పత్రికను జాగ్రత్తగా నడిపించిన వాడు. గాంధీ తత్వం ఆయనకు తప్ప మరొకరికి అంత సంపూర్ణంగా ఒంట బట్టలేదని పేరుపడిన ఆయన.

1937 లో ఎన్నికలలో గెలిచిన వెంటనే కాంగ్రెసువారు మంత్రి మండలులు ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు. దీనికి కారణం - అనేక విషయాలలో గవర్నరుకు మంత్రివర్గం చేసే తీర్మానాల్ని త్రోసిపుచ్చడానికి కొన్ని అధికారాలు కూర్పబడి ఉండడము. అట్టి సందర్భంలో కాంగ్రెసు వారు మంత్రులుగా కార్యనిర్వహణ ఏలాగున జరుపగలరు? అలాగని చెప్పి మంత్రివర్గాలు తాము ఏర్పాటు చేయకపోతే రాష్ట్రాల పరిపాలన బాధ్యతా రహితులైన గవర్నర్ల చేతులలోనికి పోతుంది. అంటే, వారు దేశస్వాతంత్ర్యానికి విముఖులైన వారి సలహాలపైన పరిపాలన సాగిస్తారు. ఈ రెండు ఇబ్బందులు లేకుండా గాంధీగారు ఒక సూత్రం పన్నారు. మంత్రివర్గం చేసే తీర్మానాలనే పాటిస్తామనీ, తమకు సంవిధానం ద్వారా వచ్చిన హక్కును వినియోగించము అనీ గవర్నర్లు మాట యిచ్చే లాగున ఇంగ్లండులో ఉండే ఇండియా కార్యదర్శి ప్రకటించినట్లయితే, - ఆ ప్రకటనను అనుసరించి కాంగ్రెసువారు మంత్రివర్గాలు ఏర్పాటు చేస్తారని గాంధీగారు అద్భుతమైన, ఒక అహింసాత్మక సూచనను చేశారు. మూడు నెలలు ఆలోచించి బ్రిటిషు గవర్నమెంటువారు ఈ సూచనను అంగీకరించారు. దానిపైన, ఎనిమిది, తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెసు ప్రభుత్వాలు ఏర్పాటు అయాయి. అ ప్రకారంగానే, చెన్నరాష్ట్రంలో కూడా గవర్నర్ కాన్‌స్టిట్యూషనల్ (Constitutional) గవర్నర్‌గా ఉంటాడని మాట ఇచ్చిన మీదటనే రాజాజీ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పాటయింది.

అయినప్పటికీ, మొదటి కాబినెట్ మీటింగులోనే, గవర్నర్ కాబినెట్ మీటింగులకు అధ్యక్షత వహించేటట్లు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పొరబాటని ప్రకాశంగారికి తోచింది. అలా తోచడం న్యాయమే. కాని, రాజాజీ మాత్రం ప్రకాశంగారి మాట వినలేదు. నూటికి నూరుపాళ్ళూ గాంధీ తత్వవాది అన్న పేరు తనకు కలిగినప్పుడు ఇతరుల మాట తానెందుకు వినాలి? పాత భేదాభిప్రాయాలతో బాటు ప్రకాశం, - రాజాజీల మధ్య వైమస్యం ప్రబలడానికి ఇదికూడా ఒక గట్టి కారణం అయింది. విప్లవ వాదివలె కనిపించే మితవాది శ్రీమాన్ రాజాజీ. మితవాదివలె కనిపించే విప్లవకారుడు ప్రకాశం. అందుచేత, ఎంత సర్దుకు పోదామని ప్రకాశంగారు యత్నిస్తూ వచ్చినా దృష్టి భేదం వల్ల ఏదో ఒక చిన్న తగాదా రావడమూ, మబ్బులు కమ్మడమూ - ఎలాగో తిరిగి క్షేమంగా ఆ మబ్బులు చెదరిపోవడమూ మంత్రివర్గం ప్రారంభమైన దగ్గరనుంచీ కొంత అలవాటయి పోయింది.

ఈ కార్య నిబంధనలో మరొక సూత్ర ముండేది. దాని ప్రకారం కార్యదర్శికి, మంత్రులవరకు కాగితం రాకుండానే, ఒక విషయంలో తుది నిర్ణయం తీసుకొనే హక్కుండేది. ఇదివరకే ఇటువంటి విషయంలో ఒక విధమైన తీర్పును బట్టి, మంత్రివర్గం గాని, ప్రభుత్వంగాని ఒక అభిప్రాయం తీసుకోవడంచేత ఆ అభిప్రాయం ప్రకారం కార్యదర్శియే తుది నిర్ణయంచేసి కాగితం తిరుగగొట్టవచ్చు. మంత్రిగారు తిరిగి పునరాలోచన చేయుదురా అన్న విషయం కార్యదర్శే ఊహించి, ఆ కాగితం మంత్రిగారికి పంపించాలా, అక్కరలేదా అన్న నిర్ణయం తానే తీసు కోవచ్చు. అది రెండు, మూడు శాఖలతో సంబంధించినప్పటికీ ఆయా శాఖల కార్యదర్శులు ఏకాభిప్రాయానికి వచ్చిన సందర్భాలలో అలాగే చేయవచ్చు. మంత్రులకు తెలియకుండానే ఈ విధంగా దాదాపు నూటికి డెబ్బై ఐదు పైళ్ళలో ప్రభుత్వం పేరున అటో ఇటో ఆర్డర్లు పడుతుంటాయి. ఒక్కొక్కప్పుడు మంత్రులు కాంగ్రెసు సూత్రాల ప్రకారంగా ముఖ్యమనుకొనే విషయాలలో కూడా ఇదే విధంగా జరుగుతుండేవి.

కార్యదర్శులు ప్రజల వోట్లు పుచ్చుకొని వచ్చినవారు కాక, కేవలం ఉద్యోగస్థులు కావడం చేతను, ఏ శాసనాల ప్రకారంగానూ వారికి ఈ విధాన సభలు హక్కు లివ్వకపోవడం చేతను, ప్రభుత్వం నడిపించడానికి అవసరమైన అధికారాలను కార్యదర్శులకు సంక్రమింప చేసే శాసనం లేకపోవటంవల్లను - కార్యదర్శులు తుది నిర్ణయాలు చేసి, మంత్రులకు తెలియనక్కర లేకుండా పరిపాలించే విధానం మంచిది కాదని ప్రకాశంగారు గట్టిగ దెబ్బలాట ఆరంభించారు. మంత్రుల సంఖ్య చాలకపోయినట్లయితే మంత్రి మండలిని విస్తృతపరచాలి. దానికి తోడు పార్లమెంటరీ కార్యదర్శులకు అధికారాలు సంక్రమింప చేయవచ్చని వారి ఊహ.

సచివాలయం సంపూర్ణంగా దీనికి వ్యతిరేకంగా ఉండేది. అందుచేత, రాజాజీ కూడా సంపూర్ణంగా వ్యతిరేకులైరి. అనగా మంత్రి మండలిలో మరో ఇద్దరో, ముగ్గురో మంత్రులు తప్ప, మిగిలినవారు ప్రకాశంగారి వాదానికి వ్యతిరేకులైరి. రానురాను, ప్రకాశంగారు కూడా ఈ ప్రసక్తి మెల్లమెల్లగా వదలిపెట్టారు. కాని, కొంతకాలం రాజాజీకి, ఈయనకూ మధ్య చాలా వాదులాటలు సాగినాయి.

విజయనగరము మహారాజా కేసు

జబ్బుతో ఉన్న విజయనగరం రాజా, తన ఎస్టేటు కోర్టు ఆఫ్ వార్డ్సు చేతిలో ఉన్న కారణంచేత, తనకు మూడువేల రూపాయలు మెడికల్ ఎలవెన్స్ ఇవ్వవలసిందని కోరితే, మంత్రికి తెలియకుండానే లేదు పొమ్మన్నారు. తర్వాత, మంత్రి కీ విషయం తెలిసిన మీదట కాగితం తనవరకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే, కార్యనిబంధనల క్రింద త్రోసివేయడానికి హక్కు తమకుందని ఆ కార్యనింబంధన ఒకటి ప్రకాశంగారికి చూపించడం మొదలు పెట్టారు. విజయనగరం రాజా శాసన సభ సభ్యుడు కూడా. ఇటువంటి సందర్భాలలో, ఈ ఉద్యోగులు చేసే అపచారాలు తగ్గించడానికి వీలుగా కార్యనిబంధనలు మార్చడానికి కూడా రాజాజీకి మనస్కరించకపోవడం వల్ల వీరిద్దరి మధ్యను ఎప్పుడూ ఏదో రగుల్కొంటూనే ఉండేది. ఇటువంటి యిబ్బందుల విషయం పైవారికి తెలియకుండా ఉండడానికి, కలిసికట్టుగా మంత్రివర్గం నడుస్తున్నదని చెప్పేందుకు వీలుగా ప్రకాశంగారు సర్దుకొనిపోతూ ఉండేవారు. మంత్రివర్గం పని ఆరంభించిన వెంటనే ప్రకాశంగారిని ఎదుర్కొన్న సమస్యలలో ఒకటి - విజయనగరం రాజాకూ, కోర్టు ఆఫ్ వార్డ్సుకూ మధ్య ఉన్న విపరీతమైన తగాదా.

విజయనగరం రాజా చెన్న రాష్ట్రంలోని జమీందార్లందరిలోనూ పెద్ద జమీందారు. అకలంకమైన జాతీయవాది. బ్రిటిషు గవర్నమెంటువారు మన దేశంలో చేస్తుండే అన్యాయాలను విమర్శిస్తూ, మన స్వరాజ్యం మనకు అప్పజెప్పవలసిన బాధ్యత వారియందున్నదంటూ ఆయన పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశారు. ఏ పెద్ద జమీందారూ సాహసించి అటువంటి పనికి పూనుకోలేదు. అందుచేత గవర్నమెంటువారికి ఈయన పైన నిఘా ఉండేది. ఏదో గృహ సంబంధమైన వివాదాన్ని పురస్కరించుకొని, ఈయన తన విషయం కూడా తాను ఆలోచించుకోలేడనీ, సంరక్షణ చేసుకోలేడనీ ఏవో సాకులు చూపుతూ - ఆయన ఎస్టేటునేగాక, వ్యక్తిగా ఆయనను కూడా తమ సంరక్షణలోనికి తీసుకుంటూ ఒక ప్రకటన చేశారు. అంటే, ఆ ప్రకటన తర్వాత ఆయన ఒక మైనరుతో సమానమైనాడన్న మాట.ఇది చాలా అమానుషమైనది. ఈ ఆర్డరు 1935 లో జారీ అయింది. 1937 లో కాంగ్రెసు పక్షాన ఆయనను అభ్యర్థిగా నిలబెట్టేందుకు కాంగ్రెసువారము నిశ్చయించాము. అయితే, ఆయన కాంగ్రెసు పేరునగాక, స్వతంత్రమైన అభ్యర్థిగా ఉండునట్లు ఏర్పాటు జరిగింది. మిగిలిన వ్యవహారాలకు ఆయన కాంగ్రెసు సభ్యునితో సమానము.

ఎన్నికల తర్వాత వెంటనే మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని ఇదివరలో చెప్పడమైనది. ఆ మధ్యకాలంలో ఇంటెరిమ్ మినిస్ట్రీ అనే పేరున ప్రభుత్వంవారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఓడి పోయిన జస్టిస్ పార్టీకి చెందిన ప్రముఖుడు సర్. కె. వి. రెడ్డినాయుడు ముఖ్యమంత్రి. విజయనగరం రాజా ఆయనకు తన ఎస్టేటు విడుదల చేయాలని, తనను వ్యక్తి సంరక్షణనుంచి విడుదల చేయాలని విజ్ఞప్తి పంపారు. అలా విడుదల చేస్తే వెంటనే గవర్నమెంటు పైన విజయనగరం రాజా దావా వేయడానికి అవకాశముందనీ, అందుచేత ఎంత మాత్రమూ విడుదల చేయడం దుస్సాధం (impossible) అనీ తేల్చారు. రెడ్డినాయుడుగారు ఆ సలహా ప్రకారంగానే తమ అభిప్రాయాన్నీ వ్రాశారు. దాన్ని అనుసరించి గవర్నరుగారు ఆ పైలు మీద "Impossible" అని వ్రాశారు. ఇలా ఉండగా కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడడం, ప్రకాశంగారు రెవిన్యూ మంత్రి కావడం సంభవించాయి. వెంటనే విజయనగరం రాజా ప్రకాశంగారికి మరో విజ్ఞప్తిని, లోగడ ఇంటెరిమ్ మినిస్ట్రీకి పంపించిన రీతిగానే పంపించారు. అదే పద్ధతిలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్‌వారు ఇప్పుడు కూడా అభ్యంతరాలు పెడదా మనుకున్నారు. అయితే, ప్రకాశంగారు చోటివ్వలేదు. ఈ విజ్ఞప్తి వచ్చిన వెంటనే బోర్డ్ ఆఫ్ రెవిన్యూ ప్రథమ మెంబరుకు రావలసిందని కబు రంపారు. ప్రథమ మెంబరైన హాల్వ్ దొరవచ్చి, పాతకథ మొదలుపెట్టబోగా, ప్రకాశంగారు సూటిగా ఒక ప్రశ్నవేశారు. "విజయనగరం రాజా చనిపోయే లోపున మీ ఆలోచన పూర్తవుతుందా? లీగల్ అభ్యంతరాలు (విధి సంబంధ అభ్యంతరాలు) తేలుతాయా? ఒక మనిషికి ప్రాణ రక్షణ చేయడానికి ఏ శాసనం మిమ్మల్ని అడ్డుతున్నది?" అని అడిగారు. ప్రాణ రక్షణ అనే మాట వినేసరికి హాల్‌కి ఒక నూతన దృక్పథం గోచరించింది. ఆయన ఆయన అన్నారు కదా - "ప్రాణ విషయమంటూ మీరు చెప్పింది ఒక క్రొత్త దృక్పథము. ఆయనకు ఏదైనా ప్రమాదం జరిగిన యెడల ఆ బాధ్యత భరించడం కష్టం అనేది ఇప్పుడు గ్రహించ గలిగాను. వెంటనే కోర్టు సంరక్షణనుంచి రాజాను విడుదల చేస్తూ ఆర్డరు ఇప్పుడే మీరు చెప్పినట్లు పంపుతాను."

ప్రకాశంగారు రాజాను కోర్టు సంరక్షణనుంచి విడుదల చేయాలని తను సూచన వ్రాసి వెంటనే రాజాజీ గదిలోకి స్వయంగా పైలు తీసుకువెళ్ళి ఆయన సంతకం కూడా పెట్టించి, తక్షణమే కార్యదర్శిచేత కోర్ట్ ఆఫ్ వార్డ్స్‌కు ఆజ్ఞాపత్రం పంపించారు. జమీందారు ఈ ఆర్డరు చూసిన తర్వాత కొంతవరకు తేరుకొన్నాడు. కాని, దురదృష్ట వశాత్తు అనారోగ్యంచేత ఆ తర్వాత త్వరలో ఆయన స్వర్గస్థుడైనాడు.

ఉద్యోగాలు పోయిన గ్రామోద్యోగులకు మళ్ళి ఉద్యోగాలు

బ్రిటిష్ గవర్నమెంటుకు రెవిన్యూ డిపార్టుమెంటు వెన్నెముకవంటిదని లోగడ వ్రాయడమైంది. రెవిన్యూ శాఖకు గ్రామోద్యోగివర్గం వెన్నెముక వంటిది. సహాయ నిరాకరణోద్యమ సమయాన అనేకమంది గ్రామోద్యోగులు నిస్వార్థమైన దేశభక్తితో తమ శక్త్యానుసారం ఉద్యమానికి సహాయంచేయడమే గాక, వారిలో అనేకులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు కూడా ఇచ్చారు. ఇది 1921 - 1939 మధ్య జరిగిన ఉదంతము. వీరిలో కొంతమంది బ్రతికి ఉన్నారు. ఉద్యోగంపైని మరల ఆశ కలవారు తమ ఉద్యోగాలు తిరిగి తమకు ఇప్పించ వలసిందని, రెవిన్యూమంత్రి అయిన ప్రకాశంగారికి అర్జీలు పెట్టడం మొదలుపెట్టారు. ఇది సర్వజనామోదకరం కావడంచేత కష్టమేమీ కాలేదు. రమారమి నూటఇరవైతొమ్మిదిమందికి, వారి ఉద్యోగాలు వారికి తిరిగి లభింప జేయడమైనది.

గ్రామోద్యోగులే కాక ఇతరులుకూడా 1930 లో ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో ఉద్యోగాల నుండి విరమించుకొన్నారు. వారిలో ఒకరు శ్రీపాద వెంకటనారాయణ గారు. ఆయన సబ్‌రిజిస్ట్రారుగా వుండి, ఉద్యోగానికి రాజీనామా చేసి ఉప్పు సత్యాగ్రహంలో నా నాయకత్వాన నడచిన దళంలో చేరారు. ఈయన ఉద్యోగంలో తిరిగి చేరడానికి వయ:పరిమితి దాటిపోయింది. అందుచేత ఆయన తనకు పెన్షన్ ఇప్పించాలని కోరారు. సచివాలయంవారు గట్టిగా అడ్డారు. అందులో రాజాజీ ఆర్థికమంత్రి కావడంచేత, వారు ధనం కావాలన్న అర్జీ ఏదివచ్చినా నిరాకరించవలెననే సూత్రం ఏర్పాటు చేసికోవడంచేత, పెన్షన్ ఇచ్చేందుకు వీలులేదని గట్టిగా చెప్పేశారు. కాని, పునరుద్యోగ లాభం ఆయనకు లేకపోవడంచేత ప్రపోర్షనేట్ పెన్షన్ ఇవ్వడం జరిగింది. కార్యసాధన అయిందని అనుకున్నాను. అయితే, వెంకటనారాయణగారు దాంతో వదలిపెట్టలేదు. పూర్తి పెన్షన్‌కు తాను అర్హుడని వాదించాడు. రాజకీయ కారణాలు లేకపోతే, వయ:పరిమితివరకూ తాను తప్పక ఉద్యోగం చేసేవాడిననీ, రాజకీయంగా మనం జయం పొందినపుడు తాను పూర్తిగా వయ:పరిమితి వచ్చేవరకు తప్పక ఉద్యోగం నిర్వర్తించినట్లే ప్రభుత్వం భావించవలెనని ఆయన వాదము. అటువంటి వాదం ఆనాటి ఆర్థికమంత్రి కనుచూపుమేరలో ఉండే రోజులు కావు. ప్రకాశంగారుకూడా చాలా ప్రయత్నం చేశారు కాని, మా వాదం ఫలించలేదు.

దండి సత్యాగ్రహ ఫిల్ములపై గల ఆంక్షల తొలగింపు

సత్యాగ్రహ సమరంలో ఉప్పు సత్యాగ్రహ ఘట్టం చాలా చరిత్రాత్మక మైనది. మార్చినెల ఆఖరిభాగంలో గాంధీమహాత్ముడు సబర్మతినుంచి పాదయాత్రపై దండీకి పోయి, సముద్రపు టొడ్డున నున్న ఉప్పు అధికారుల అనుమతి లేకుండ తీసి, ఆ విధంగా శాసనోల్లంఘనం ఆరంభించి దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నడిపించిన ఘట్ట మది. కాలినడకను ఆయన సబర్మతినుంచి బయలుదేరి జంబూసరు చేరేసరికి నేను, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు మొదలైనవారము - ఆయనను, ఆయన నడిపిస్తూన్న సత్యాగ్రహదళాన్ని సందర్శించి నాము. ఆ దళంతోపాటు మేమూ ఒకరోజు నడిచాము. గాంధీగారు నడిచినంత మేరకు బ్రిటిషు గవర్నమెంటువారి అధికారం అమలులో ఉన్నట్టు ఎవరికీ తోచలేదు. బ్రిటిషు గవర్నమెంటు ఆ క్షణంతోనే పోయిందని ప్రజలు అనుకుంటూన్న తరుణం. గాంధీగారి రామరాజ్యం ఏర్పాటైందన్న మహాసమయం అది.

అప్పట్లో, అనేకమంది భారతీయులే కాక, విదేశీయులుకూడా వచ్చి చలనచిత్రాలను తీసేవారు. ఆ సందర్భంలో తీసిన చలనచిత్రా లను ప్రదర్శింపరాదని బొంబాయి, చెన్నరాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించినవి.

చెన్నరాష్ట్రంలో కాంగ్రెసు మంత్రివర్గం ఏర్పాటైన రెండు నెలలలో ఆ ఆంక్షలు తొలగించారు. ఆ విధంగా ఆంక్షలు తొలగింపబడిన చిత్రాల పేర్లు ఇవి:

శారదా ఫిల్మ్ కంపెనీవారు నిర్మించిన, "మహాత్మా గాంధీగారి స్వాతంత్ర్యయాత్ర"; కృష్ణా ఫిల్మ్ కంపెనీవారి "మహాత్మా గాంధీజీ చారిత్రకయాత్ర"; రంజిత్ ఫిల్మ్‌ కంపెనీవారి "మహాత్మా గాంధీ యాత్ర"; పై కంపెనీవారే నిర్మించిన "దేశభక్తుడు"; పయొనీర్ ఫిల్మ్ కంపెనీవారి "పటేలు యాత్ర"; అమెరికన్ ఫిల్మ్ కంపెనీవారి "దేశభక్తుడు; "మహాత్మా గాంధీకి బాంబే స్వాగతము"; కృష్ణా ఫిల్మ్ కంపెనీవారి "మహాత్మా గాంధీజీ పునర్జన్మము"; "మహాత్మా గాంధీ ఇంగ్లండునుంచి పునరాగమనము" (నిర్మాత: బిల్లి మోరియా); సినిమాటోగ్రాఫ్ సౌండ్ న్యూస్ ఫిల్మ్"గాంధీజీ చక్రవర్తిని సందర్శించుట"; శ్రీకృష్ణా ఫిల్మ్‌కంపెనీ వారి "అమర ప్రభ" (ఇమ్మోర్టల్ గ్లోరీ)' "జితేంద్రదాసు యాత్ర"; "వసంత బంగాళీ."

ఈ పై ఫిల్ములమీద ఉన్న ఆంక్ష జి. ఓ. నంబరు 3672 (హోమ్ 29 - 1937) మూలంగా రద్దు చేయడమైనది.

లెప్టినెంట్ కర్నల్ శాస్త్రి విషయము

ప్రకాశంగారు మంత్రిగా ఉన్న సమయంలో కష్టంలో ఉన్న వారందరూ ఆయనను తమ ఆపద్బాంధవునిగా చూచుకొనేవారు. తన శాఖకు చెందినా, చెందక పోయినా, ఆయన వచ్చినవారి ఆర్తిని హరించడానికి వీలయితే తగిన సహాయం చేసేవారు.

మంత్రుల క్రోధానికి గురి అయిన ఉద్యోగస్థులలో ఒకరు లెప్టినెంట్ కర్నల్ శాస్త్రి, ఐ. ఎం. ఎస్.

డాక్టర్ టి. ఎస్. ఎస్. రాజన్ వైద్యశాఖా మంత్రి అని ఇదివరలో చెప్పడమైనది. ఆయన తిరుచినాపల్లి వాస్తవ్యుడు. ఆయనకు, వైద్యునిగా చెప్పకోదగ్గ ప్రాక్టీసు ఉండేది. ఒకప్పుడు లెప్టినెంట్ కర్నల్ శాస్త్రి, డిస్ట్రిక్టు మెడికల్ ఆఫీసరుగా పనిచేయడం తటస్థించింది. ఆయన గవర్నమెంటు ఉద్యోగి, రాజన్ ప్రైవేట్ ప్రాక్టీషనరు. వారిద్దరిమధ్య ఏవైనా తగాదాలు రగుల్కొనేందుకు కారణాలు ఉండి ఉండ వచ్చును. కాలం కలిసివచ్చి రాజన్ మంత్రి అయ్యాడు. లెఫ్టినెంట్ కర్నల్ శాస్త్రి మెడికల ఉద్యోగి కావడంచేత, ఆయన రాజన్ ఆధిపత్యంలో ఉండడం జరిగింది. శాస్త్రికి, అకస్మాత్తుగా ఒకరోజున, ఉద్యోగంలో నుంచి తనను ఎందుకు తీసివేయకూడదో తెలుపవలసిన దంటూ నోటీసు ఒకటి అందింది. అందులో ఉన్న ఛార్జీ ఇది: ఆయన ఒక రోజున ఆస్పత్రిలో ఒక నర్సును బలవంతంగా ఒక ప్రక్కకు లాక్కొని వెళ్ళాడని.

అంతకుముందు జరిగినది ఇది: ఎవడైనా ఉద్యోగి ప్రమోషన్ పొందడానికి సిద్ధంగా ఉన్నా డన్న సమయంలో ఇటువంటి అర్జీలో, లేక లంచం పుచ్చుకొన్నాడని పిటీషనులో రావడం మామూలు. లెఫ్టినెంట్ కర్నల్ శాస్త్రి ఏదో పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళే సమయ మది. ఆయన కాన్ఫిడెన్షియల్ పైలులో ఈ చార్జీ ఎంక్వయిరీ తేలేవరకు, ఆయన ప్రమోషను ఆపుదల చేయడ మైనదన్నమాటకూడా మొదట వ్రాసి ఉంది. తరువాత ఎంక్వయరీ సంపూర్ణంగా జరిగింది. ఆపైన, ఆయన మీద మోపిన నేరం అభూతకల్పన అని తేలింది. ఆయన ప్రమోషన్‌మీద ఈజిప్టు వెళ్ళడానికి అభ్యంతరం లేదనీ తేలిపోయింది. ఇదికూడా కాన్పిడెన్షియల్ పైలులో వ్రాయ బడటంతో ఆయన ఆ ఛార్జీనుంచి గౌరవంగా విముక్తుడయ్యాడని పేర్కొనబడింది.

ఇలా ఉండగా, రాజన్‌గారు అదే ఛార్జీని వివరిస్తూ, తనను ఎందుకు డిస్మిస్ చేయరాదో చెప్పుకోమని శాస్త్రికి నోటీస్ ఇప్పించారు. మీద చెప్పిన సంగతులన్నీ నేను స్వయంగా ఫైలు చూసిన తర్వాత తెలిసినవి. ప్రకాశంగారు, మేము 1938 లో వేలూరు జెయిలులో ఉన్నపుడు శాస్త్రిగారు మూడుమారులు జెయిలుకు వచ్చి మమ్మల్ని చూసి ఉన్నారు. ఆయన ప్రకాశంగారితో తనకు వచ్చిన నోటీస్ విషయం చెప్పగా, ప్రకాశంగారు వెంటనే ఆ ఫైలు తెప్పించారు. మీదచెప్పిన విషయాలను నేను ఫైలులో చదివి, ప్రకాశంగారికి విషయమంతా బోధపరిచాను. ఇపుడా నోటీస్ ఇవ్వడానికి కారణం లెఫ్టినెంట్ కర్నల్ శాస్త్రి, డెపుటేషన్‌పైన ఏదో పెద్ద ఉద్యోగానికి విదేశం వెళ్లడానికి యత్నించడమే. ప్రకాశంగారు ఫైలులో వున్న విషయాలు గట్టిగా వ్రాసి - గవర్నమెంటు నోటీస్ ఉపసంహరించు కోవాలని, లేకపోతే ఈ విషయం కాబినెట్‌లో చర్చకు తేవాలనీ వ్రాశారు.

ఈ ఫైలు మామూలు పద్ధతిగా గవర్నర్‌గారికి వెళ్ళింది. గవర్నర్‌గారు - ఒకసారి నేరారోపణ జరుగగా, పూర్తిగా విమర్శించి ఒక ఉద్యోగిని నిర్దోషి అని తీర్మానించిన తర్వాత, రెండవ మారు అది నేరారోపణ చేయడం ఎలా సంభవ మవుతుందనీ, కాన్ఫిడెన్షియల్ ఫైలు పరిశుభ్రంగా ఉన్నందున శాస్త్రిగారి మీద చర్య తీసికొనే వీలులేదనీ ప్రకాశంగారితో ఏకీభవిస్తూ వ్రాయగానే దానిపై రేగిన గాలి దుమారం ఆగి పోయింది.

జి. వి. రావుగారు - ఆయన పని

ఆ రోజులలో లేకలేక ఒక తెలుగు వ్యక్తి రాజధాని నగరంలో పెద్ద ఉద్యోగిగా ఉండడం తటస్థించింది. ఆయన పేరు జి. వి. రావు. ఆయన చెన్నరాష్ట్రం అంతటికీ శానిటరీ ఇంజనీరుగా ఉండేవారు. మొదట విశాఖపట్నం నీటి సప్లై స్కీములో నీటి సూపర్ వైజరుగా పనిచేయ నారంభించిన ఆయన, మెల్లమెల్లగా ఈ పెద్ద పదవికి చేరుకొన్నాడు. ఆ మధ్యలోనే ఎప్పుడో ఇంగ్లండు వెళ్ళి, డిప్లమో ఒకటి సంపాదించి దాంతోబాటు ఒక పాశ్చాత్య స్త్రీని వివాహమాడి, పెద్ద ఉద్యోగిగా పరిణమించాడు. జస్టిస్ పార్టీ పాలన కాలంలో ఈయన ఇలా పైకి వచ్చాడు. 1932 - 33 ప్రాంతాలలో నేను విశాఖపట్నంలో మునిసిపల్ కౌన్సిలర్‌గా ఉన్నపుడు ఈయనతో నాకు నీటి సప్లై స్కీము విషయంలో తగాదా వచ్చింది. ఇనుప గొట్టాలద్వారా నీరు తీసుకురావాలని నేను వాదించగా, సిమెంటు పైపుల ద్వారా తెస్తే చవక అవుతుంది గనుక వాటితో స్కీము నడిపించాలని ఆయన అన్నాడు. ఈ సిమెంటు గొట్టాలు ప్రెషర్‌మెయిన్స్ - అంటే, నీటి ప్రవాహం జోరుకు ఆగవని అనుభవం వల్ల తెలిసిన విషయము. పుస్తకాలలో చెప్పిన ప్రకారం తయారయితే వాటికి తగిన బలం ఉండవచ్చుకాని, ఆ విధంగా పని జరగదు. భార్యపేర ఒక సిమెంటు పైపుల కంపెనీలో ఆయనకు కొన్ని షేర్లు ఉండేవి. ఇదికాక, మేఘాద్రి గడ్డనుంచి మంచినీరు తీసుకురావాలని ఆయన స్కీము. ఆ నీరు వర్షాకాలంలో తప్ప, తక్కినప్పుడు ఉప్పగాను, చప్పగాను ఉంటుంది గనుక, ఆ స్కీము పనికి రాదనీ, గోస్తనీ నీరు తీసుకురావాలని నా వాదము. చైర్మన్ ఆయన స్నేహితుడు కావడంచేత, మేఘాద్రి గడ్డ స్కీమే అప్పటికే ఖాయమయింది. ఆ నూతిలోంచి వచ్చిన నీరు ఇప్పటికీ చప్పగాను, వేసవిలో ఉప్పగానూ ఉంటుంది. తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత గోస్తనీ స్కీము, తత్పూర్వం యుద్ధకాలంలో మిలటరీవారు చేసిన యత్నపూర్వకంగా విశాఖపట్నానికి ప్రాప్తించింది. ఆ నీరు బాగా రుచిగాను, ఆరోగ్యకరంగాను, మృదుత్వం కలిగిఉన్నదన్నది అందరికీ అనుభవ వేద్యమైన విషయము.


సరే, అది అలా ఉంచండి. రాష్ట్రంలో అనేకచోట్ల ఇటువంటి సంబంధాలు కల్పించుకోవడంవల్ల, ఆయనకు అంత మంచి పేరుండేది కాదు. అప్పట్లో పబ్లికు హెల్తు మంత్రి అయిన టి. ఎస్. ఎస్. రాజన్ ఈయనను ఎలాగైనా తప్పించివేయాలని పట్టుపట్టాడు. దీనికితోడు, జి. వి. రావు క్రింద పనిచేసే ఒక డిప్యూటి చీఫ్ ఇంజనీరు చాలా తెలివైనవాడు. శానిటరీ ఇంజనీరింగులో పెద్ద విదేశ డిగ్రీలు పొందిన వాడు. పైగా, ఆయన మంత్రులతో స్నేహంగల వ్యక్తి. చీఫ్ శానిటరీ ఇంజనీరు పైన చాడీలు చెప్పడం కూడా ఆయనకు మామూలు. ఇటువంటి పరిస్థితులలో జి. వి. రావు పైన ముప్పైరెండు, ముప్పైమూడు నేరముల ఆరోపణలుగల ఛార్జీ షీటు ఒకటి ఆయనకు ఇవ్వడం జరిగింది. జి. వి. రావు ఇతర స్నేహితుల ద్వారా ప్రకాశంగారి దగ్గర మొర పెట్టుకొన్నాడు. ప్రకాశంగారు ఫైలు తెప్పించారు. "చాలా గ్రంథం పెరిగిపోయింది," అని నన్ను చూడ మన్నారు. అపుడు నేను నాకు ఆయన పైన ఉన్న అనుమానం చెప్పి, "నేను పైలు చదవకపోతేనే ఆయనకు శ్రేయస్కర" మని చెప్పాను. ప్రకాశంగారు "అయితే సరే! నేనే చదువుకుంటాను కాని, ఆ ఛార్జీషీటు ఏమిటో చూడు" అన్నారు. ఆ పొడుగైన ఛార్జీషీట్లో లంచగొండితనం విషయమై ఒక్క ఛార్జీకూడా లేదు. ఆ సంగతే ప్రకాశంగారికి చెప్పాను. "సరే, అయితే అతనిని బయట పడేద్దా" మని ఆయన అన్నారు. ఈ వ్యవహారం కాబినెట్ లోకి వెళ్ళింది. దాదాపు మంత్రులందరూ ఈయన పేరు వినేసరికి మంత్రిచెప్పిన ప్రకారం ఉద్యోగంనుంచి బర్తరపు చేయాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. గిరిగారు మాత్రం ప్రకాశంగారికి ఎప్పటివలె అనుకూలురుగా ఉండిరి. ప్రకాశంగారు ఛార్జీ లన్నింటిని క్రిమినల్ అప్పీళ్ళు వాదించినట్లు వాదించి, సాంకేతికమైన విషయాలలో మంత్రికీ, ఉద్యోగికీ భేదం వచ్చినంత మాత్రాన ఉద్యోగిని బర్తరపు చేయడం మహా అన్యాయం అని వాదించి - కాబినెట్ అధ్యక్షుడుగా కూచున్న గవర్నర్ మనసు మార్చ గలిగారు. దాంతో, చల్లగా మిగిలిన మంత్రులుకూడా మారారు. కాని, అందరి మనసుల్లోను ఆ ఉద్యోగి డబ్బు వ్యవహారంలో మంచివాడు కాడని ఒక అభిప్రాయం గట్టిగా ఉండడంవల్ల ఎలాగైనా అతనిని ఉద్యోగంనుంచి తీసివేయాలని పట్టు పట్టారు. ప్రకాశంగారే ఒక రాజీమార్గం, పైకి శిక్షలా కనిపించేటట్లుగా రూపొందించారు. ఆ ఉద్యోగి తన ఉద్యోగకాల పరిమితి వరకు ఉద్యోగంచేస్తే అతనికి అందే వేతనం, మిగిలిన ఉద్యోగ విరమణ సంబంధమైన అన్ని లాభాలు కలిగిస్తూ అతనిని ఉద్యోగంనుంచి అప్పుడే విరమించుకొనేటట్లు చేయటమే అది. అంటే - ఆ ఉద్యోగి మరొక నాల్గు, ఐదు సంవత్సరాలు పనిచేయకుండానే ఆ జీతం మొత్తం, ఆ తర్వాత వచ్చే ఉద్యోగ విరమణ లాభాలు పొందగలిగాడు. ఆ రోజు కాబినెట్ మీటింగ్ కాగానే ప్రకాశంగారి గదిలోకి వచ్చి గిరిగారు నాతో అన్నారు: "విశ్వనాథంగారూ! ప్రకాశంగా రీ రోజున కాబినెట్‌ను క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ క్రింద మార్చివేశారు. మరొక పర్యాయం ఆయన క్రిమినల్ న్యాయవాది నైపుణ్యాన్ని విజృంభింపజేశారు. ఆ ఉద్యోగికి ఉరిశిక్షలాంటిది (ఈ సమయంలో డిస్మిసల్) తప్పించేశారు. గవర్నరు ప్రకాశంగారి వాదానికి ముగ్ధుడయినాడు. ఉద్యోగికి శిక్ష అంటూ పైకి కనిపించేటట్టూ పనిచేయకుండానే, పనిచేస్తే వచ్చే లాభాలన్నీ క్షణంలో కల్పించేశారు."

ఈ విధంగా అనేక శాఖలలో మంత్రుల క్రోధాలకు గురిఅయిన ఉద్యోగులు ప్రకాశంగారివల్ల రక్షణ పొందేవారు.

డిప్యూటి కలెక్టరుపై పాళీలచోరీ కేసు

ఒక సందర్భంలో నెల్లూరులో ఒక డిప్యూటీ కలెక్టరుకు ట్రెజరీ డ్యూటీలు కూడా ఉండేవి. ఒకసారి అతడు ఒక కష్టదశలోకి వచ్చాడు. అతని చేష్టలు కొంత వికృతంగా కనబడేవన్న మాట మాత్రం వాస్తవమే. అతనిపై కలెక్టరుగా ఉన్నది ఒక ముస్లిమ్. నెల్లూరు చెన్నపట్నానికి దగ్గర గనుక ఆ ముస్లిమ్ కలెక్టరు పనిఉన్నా లేకున్నా చెన్నపట్నం వెళ్ళి అక్కడ కాలక్షేపం చేస్తూండేవాడు. ఎందుకు వెళ్ళినదీ కారణం తెలపని ట్రావెలింగ్ ఎలవెన్స్ బిల్లులు మాత్రం వస్తూండేవి. ఈ ట్రెజరీ డిప్యూటీ కలెక్టరు తన తాహతు తెలీక వాటిని పాస్ చేయడానికి వీలులేదని అడ్డుపడ్డాడు. అందుచేత ఇద్దరికీ పైకి చెప్పుకోలేని తగాదా ఒకటి ఏర్పడింది. వెంటనే కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు నిబంధనలు ఒప్పుకొన్న దానికన్న హెచ్చుగా కలం పాళీలు, ఒకటో రెండో పెన్సిళ్ళూ మొదలైనవి న్యాయవిరుద్దంగా తన ఇంటికి తీసుకుపోయి వాడు కొన్నాడనీ, అందుచేత అతనిని ఎందుకు శిక్షించగూడదో సంజాయిషీ ఇవ్వాలనీ నోటీసు జారీ చేయించాడు. డిప్యూటి కలెక్టరు, కలెక్టరు ఆఫీసుకు తెలియకుండా రాత్రికి రాత్రే బయలుదేరి చెన్నపట్నం వచ్చి, మేము ఆఫీసుకు వెళ్ళేసరికి, సరిగా వచ్చి ప్రకాశంగారి ఆఫీసుగదిలో సిద్దమయినాడు. ఇదీ అతడు చెప్పుకున్న సంజాయిషీ: కొన్ని ఏండ్ల క్రిందట ప్రకాశంగారి కాంగ్రెసు పర్యటనలో అతడు ఆయనకు ఎలాగో పరిచయమైనవాడు. ఆ చనువు చేత బంట్రోతుకు నచ్చజెప్పి లోపలికి వచ్చి మఠం వేశాడు. ప్రకాశంగారు నేను లోపలికి వెళ్ళేసరికి దండం పెట్టి "గురువుగారూ!" అంటూ కోటు జేబులు రెండింటిలోంచి రెండు మామిడి పళ్ళుతీసి ఆఫీసుబల్లపై పెట్టాడు. "ఏమిటండీ?" అని ప్రకాశంగారు అడిగేలోపున పంట్లాం జేబులు రెంటిలోంచి మరి రెండు మామిడిపండ్లు తీసి బల్లపై పెట్టాడు. అతని వైఖరిలో కొంత వెర్రితనం కనిపిస్తున్నది. "ఏమిటయ్యా విషయం?" అనేసరికి, తన బ్రీప్‌బేగ్‌లో ఉన్న మరో రెండు మామిడి పండ్లు తీసి బల్లపై పెట్టాడు.

"ఇదంతా ఏమి?"టని గట్టిగా ప్రశ్నిస్తే, "గురువుగారూ! ఆ తురకవాడు నన్ను బతక నివ్వడండి," అన్నాడు. అది వినగానే అతడు నెల్లూరు ట్రెజరీ డిప్యూటీ కలెక్టరు అయివుంటాడని గ్రహించ గలిగాను. అతడు జిల్లాకలెక్టరు ట్రావెలింగు ఎలవెన్సు విషయమై పెట్టిన అభ్యంతరాలు, వాటికి కలెక్టరు ఇచ్చిన సంజాయిషీ, డిప్యూటీ కలెక్టరు అవకతవక మనిషి అన్న బోర్డు రిపోర్టు మొదలైన కాగితాలున్న పైలు, మేము అంతకు రెండు మూడు రోజులక్రితం చూడడం తటస్థించింది. నేను వెంటనే "నాయుడుగారూ! మీరు ఇలా మంత్రిగారిని నేరుగా చూడడానికి వస్తే, మీ నిబంధనలు ప్రకారం మీపైన ఇంకోనేరం రాదుగదా!' అంటే, వెంటనే అతడు "నే నిక్కడికి వచ్చినట్టు అక్కడ ఏం రికార్డుంటుందండీ?" అని ప్రశ్నించాడు. ప్రకాశంగారు, నేను అనుకోకుండా పెద్దగా నవ్వుకున్నాము. మే మిలా మాట్లాడుతుండగానే, అతడు ప్రభుత్వం తాలూకు కలాలు, పాళీలు దుర్వినియోగం చేస్తున్నాడని కలెక్టరు అతనిపై పెట్టిన ఛార్జీ ఫైలు బంట్రోతు తెచ్చి, అక్కడున్న ఫైళ్ళకట్టలపై పెట్టడం జరిగింది. ఫైలురాగానే దాని ముఖపత్రం చూడడం ఏ ఉద్యోగికైనా, మంత్రికైనా అలవాటు. తీసి చూసేసరికి అది ఈ డిప్యూటీ కలెక్టరు పాళీలఫైలు.

"ఏమిటి నాయుడుగారూ, ఈ పాళీల వ్యవహారం?" అని ప్రకాశంగారు నవ్వుతూ అడిగారు. "అదేనండీ గురువుగారూ! ఆ తురకవాడు నన్ను బతకనివ్వడు. అది చెప్పటానికే వచ్చాను," అని మరోమారు అన్నాడతడు.

అపుడు ప్రకాశంగారు "ఏమయ్యా! నిన్ను ట్రెజరీ డిప్యూటీ కలెక్టరు అనుకోమన్నావా? పిచ్చివాడనుకో మన్నావా?" అని కొంచెం గట్టిగా అడిగారు.

దానికతడు మెల్లగా తలవంచుకొని "మీరేమయినా అనుకోండి. నన్ను మాత్రం వాడినుంచి రక్షించండి," అని ప్రాధేయపడ్డాడు.

ప్రకాశంగారు "సరే వెళ్ళు. మేము చూసు కొంటాము," అని అతనిని మెల్లగా పంపించివేశారు. పాళీల కేసు వట్టి పనికిమాలినదని డిపెన్సుకోసమని నే నేదో ఒక కథనం అల్లబోతూంటే, మరో రెండు రోజులకల్లా మరొక ఫైలు ఇదే ట్రెజరీ డిప్యూటీ కలెక్టరుపైన ఛార్జీషీటుతో వచ్చింది - కలెక్టరు అనుమతి లేకుండా చెన్నపట్నం వెళ్ళాడని, అలా చేయలేదని అతని జవాబూ, దానిపైన తానూ డిప్యూటీ కలెక్టరుకూడా ఒకే ట్రైనులో చెన్నపట్నం ప్లాట్‌ఫారంమీద దిగామనీ, దిగినపుడు అతడు దొరికాడని కలెక్టరు రిపోర్టు అందులో ఉన్నవి. ప్రకాశంగారిని చూసివెళ్ళిన అతనిని కాగితాలమీద రక్షించడం దుస్సాధ్యమని ప్రకాశంగారు గ్రహించారు. ఆయన బోర్డు మెంబరును గదిలోనికి పిలిపించి, కలెక్టరు టి. ఏ. బిల్లుల విషయంపై డిప్యూటీ కలెక్టరు పెట్టిన అభ్యంతరాలు సరైనవికావని నిర్ణయించడానికీ, డిప్యూటీ కలెక్టరుపై పాళీలకేసు చాలా చిన్న వ్యవహారం గనుక దాన్ని వదిలిపెట్టడానికి ఏర్పాటు చేయించారు.

అంతటితో ఆ విషయం సమసిపోయింది. కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు ఇద్దరూ తప్పుచేసిన వాళ్లే. ఇలాంటి విషయాలు చాలా ఆఫీసుల్లో జరుగుతుంటాయనీ, ఇవి మంత్రులవరకూ రావనీ, వీటి మూల కారణాలు తరచుగా ఉద్యోగానికి సంబంధం లేనివై ఉంటాయనీ వేరుగా చెప్పనక్కరలేదు.

జమీందారీల సమస్య

మంత్రివర్గం ఏర్పాటైన రెండు నెలలలో జమీందారీల విషయమై దర్యాప్తు సమస్య ఉద్భవించింది. ఒక రోజున, రాజమహేంద్రవరం కాంపులో ప్రకాశంగారూ, నేనూ ఉండగా, కాండ్రేగుల జమీందారుగారు ప్రకాశంగారిని చూడడానికి వచ్చారు. ఆయన చాలా చిన్న జమీందారు. స్వాతంత్ర్యోద్యమంలో రహస్యంగానో, బహిరంగంగానో కాంగ్రెసు నాయకులకు సాయం చేస్తూండేవాడు. ఆయన కున్నది నీటి తగవు. ఆయన వెళ్ళిన తరువాత ఆయన తాలూకా రైతులు గుంపుగా వచ్చి ప్రకాశంగారిని చూశారు. వారూ ఆ నీటి తగవుకోసమే వచ్చారు. వారు ఫిర్యాదు చేసింది జమీందారుపై. జమీందారుగారు ఫిర్యాదు చేసింది ప్రభుత్వం పైన. ఇవి రెండూ ఒకే నీటి వనరును గూర్చినవి. సాయంకాలం ప్రకాశంగారూ, నేనూ చల్లగాలికోసం నడుస్తూన్న సమయంలో ఈ జమీందారు ప్రసంగం వచ్చింది. అప్పుడు నేను ప్రకాశంగారితో ఇలా అన్నాను: "మన రాష్ట్రంలో జమీందారీ రైతులకు ఆక్యుపెన్సీ రైటు (సాగు హక్కు), ఆ హక్కును వారసత్వం క్రింద పొందగలిగే హక్కు, విక్రయించగలిగే హక్కు ఉండడంచేత 1908 నుంచి కొంత స్ఢిమితం కలిగింది. అయితే, ముఖ్యమైన ఇబ్బంది నీటి విషయమైనదే.

"నీటి వనరులు - నదులు మొదలైనవి - జమీందారీ, ప్రభుత్వానివి, ఇనాముదారీ అనే మూడు రకాలైన భూముల గుండా ప్రవహిస్తాయి. ఈ భూముల విస్థీర్ణాన్నిబట్టి తగాదాలు హెచ్చినవి. అంతకు పదిహేను పదహారు సంవత్సరాల క్రితం ఉర్లాము జమీందారీలో గల నీటి హక్కుల విషయమై వచ్చిన ప్రివీ కౌన్సిల్ తీర్పువల్ల లేనిపోని చిక్కులు కలిగి, రైతులు బాధపడుతున్నారు. ఆ తీర్పులో, నదికి రెండు ప్రక్కల జమీందారీ భూములు న్నట్లయితే అంతమటుకు జమీందారే నదికి స్వామి అన్నారు. అదే విధంగా ఇనాము భూములున్నట్లయితే ఇనాముదారే నదీస్వామి అన్నారు. రెండు ప్రక్కల ప్రభుత్వపు భూములు - అంటే రైత్వారీ భూములు - ఉంటే అంత మటుకు ప్రభుత్వాన్ని నదీస్వామి అన్నారు. ఒక ప్రక్క ఒకరు, రెండవ ప్రక్క ఇంకొకరు భూస్వాములైతే నదీ గర్భంలో వారిరువురికి చెరి సగం స్వామిత్వం కలుగుతుందన్నారు.

మాట వరసకేమో - సేద్యపు హక్కులకు భంగం రాకుండా పైన చెప్పిన నదీస్వాములు నదులపైన వారికి కావలసిన కట్టడాలు కట్టుకోవచ్చన్నారు. అయితే, న్యాయశాస్త్ర ప్రకారం ఈ కట్టడాలు కట్టేముందు క్రిందా మీదా ఉన్న నదీస్వాముల అనుమతి పొందాలి. ఆ పొందడంలోనే కష్టాలన్నీ ఉండేవి. ఒకరికొకరు అనుమతించడానికి సంవత్సరాలు పట్టేది. ఒక్కొక్కప్పుడు ఎన్ని ఏళ్ళయినా అట్టి అనుమతి వచ్చేది కాదు.

"ఈ విషయంలో ప్రభుత్వంవారు, జమీందారు, ఇనాముదారు - ఒకరి కొకరు తీసిపోకుండా ఉండేవారు. ఈ అనుభవం నాకు స్వయంగా కలిగింది. అందుచేత, నీటి సరఫరాపై గల హక్కులు సంపూర్ణంగా శాసనం ద్వారా ప్రభుత్వం తీసుకొంటేనే భూములకు, రైతులకు మేలు జరుగుతుంది. పెర్మనెంటు సెటిల్‌మెంటు శాసనాలలో నీటి హక్కు జమీందారులకు సంక్రమింపజేయలేదు. సంక్రమింపజేసిన ఆ హక్కులు ప్రభుత్వం న్యాయరీత్యా తీసికొనే హక్కు సర్వదా ఉన్నది."

ఈ విషయాలన్నీ నేను ప్రకాశంగారికి చెప్పగా, ఆయన దాని కొక బిల్లు తయారు చేయవలసిందని చెప్పారు. బిల్లు డ్రాప్ట్ తయారీ మొదలు పెట్టేసరికి అనేక న్యాయ సందేహాలను (లా పాయింట్లు) లేవదీశారు. ఇవన్నీ మొత్తం పైన చేయాలన్నారు. దీని కొక కమిటీవేసి, దాని సిపార్సుపై నడిస్తే బాగుంటుందన్నారు. రెవిన్యూ శాఖకు అప్పుడు సెక్రటరీ రామున్ని మేనోన్ అనే ఐ. సి. యస్. ఉద్యోగి - కమిటీ అనగానే ఆలస్యం తప్పదు.

అయితేనేమిగాని, ఒక కమిటీ వేయడానికి ప్రకాశంగారు ఒప్పుకొన్నారు. ఆ కమిటీకి ప్రశ్నావళి ఏర్పాటుచేసే విషయమై అనేక న్యాయ సమస్యలు సముద్ర తరంగాలవలె ఉద్భవించినవి. దానికి కారణం దృష్టి భేదము. నేను చదువుకొన్నది హిందూ జ్యూరిస్ స్పృడెన్స్. దాని ప్రకారంగా, భూమి హక్కు రైతుది. ఉపరిభాగంలో దాని గర్భంలో అతని భూమి పరిమితి మధ్యగలదాని సర్వ సంపూర్ణమైన హక్కు రైతుది రైతు రాబడిలో ఒక నిర్ణీత భాగంపైనే ప్రభుత్వానికి హక్కుంది. కాని. ఐ. సి. యస్. ఉద్యోగులు చదువుకొన్నది ఇంగ్లీషు జ్యూరిస్ స్పృడెన్స్. దాని ప్రకారం భూమి హక్కు ప్రభుత్వానిది. రైతుకు పన్ను చెల్లించి, దున్నుకొనేందుకు మాత్రమే హక్కు కలదని దాని తాత్పర్యము. అందుచేత, ప్రశ్నలలో చాలా భాగం ఈ హక్కుల నిర్ణయం పైనే ఆధారపడి ఉండడంచేత మొదటి ప్రశ్నగా, "ఈ భూమి హక్కు జమీందారుదా? రైతుదా? మీ అభిప్రాయం చెప్పవలసిన"దని నేను వ్రాశాను. ఎందుకైనా మంచిదని ప్రకాశంగారికి ఈ ప్రశ్నను గురించి చెప్పాను. అసలు ఉర్లాము కేసు ఈ హక్కుపైన ఆధారపడిందే కాబట్టి, "అలాగే కాని"మ్మన్నారు. దానిపైన మిగిలిన అనుబంధ ప్రశ్నలు, నీటి వనరుల సౌకర్యాలు, శిస్తులు హెచ్చింపు తగ్గింపుల విషయాలు, జమీందారీలోగల కొండలు, అడవులు నీటి సరఫరా విషయాలు, జమీందారులకు రైతులకూ ఉన్న సామరస్య వైషమ్య సంబంధాలన్నీ పరిశీలించేందుకు శాసన సభ్యులుగల ఒక ఉప సంఘాన్ని నియమించడానికీ, వారి రిపోర్టు శాసన సభకు అందజేయవలసినదిగానూ శాసన సభలోను, శాసన మండలిలోను ప్రకాశంగారు తీర్మానాన్ని ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం ఆ కమిటీ సభ్యుల పేర్లు, వారు పరిశీలించవలసిన విషయాల స్థూలమైన వివరాలు ఆ తీర్మానంలోనే ఉన్నవి.

ఈ ఉప సంఘం కొన్ని ప్రశ్నావళులను పత్రికల మూలంగా ప్రకటించి, రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన కేంద్రాలలో సాక్ష్యములు తీసికొని చర్చలు జరిపి, రిపోర్టు తయారుచేసి, దానిపై సంతకము చేయడానికి సహజంగానే కొంతకాలం పట్టినది. 1938 నవంబరులో ఈ రిపోర్టు శాసన సభకు అందజేయడమైనది. 1939 జనవరి, ఫిబ్రవరి నెలలలో ఉభయ శాసన సభలు నివేదికను, అందులో పొందుపరచిన బిల్లులను ఆమోదించడం జరిగింది. అయితే, దురదృష్టం కొద్దీ అవి శాసన రూపంగా శాసన సభ ముందుకు రావడానికి నోచుకోలేదు. ఆ విషయం క్లుప్తంగా చెప్తాను.