నా జీవిత యాత్ర-3/నా సత్యాగ్రహ సమర శంఖారావం

వికీసోర్స్ నుండి

8

నా సత్యాగ్రహ సమర శంఖారావం

రాజీనామా ఇచ్చి కేంద్ర శాసన సభనుంచి బయటికి వచ్చే సందర్భంలో నేనిచ్చిన ఉపన్యాస విషయం కాస్త వివరించాలని ఉంది. ఉప్పు సత్యాగ్రహసంరంభం ఆరంభం అయ్యే ఆ పవిత్ర ఘడియల్లో కాంగ్రెసేతరవర్గానికి చెందవలసి వచ్చిన నేను, శాసనసభ ద్వారా సభ్యులకూ, దేశానికీ సందేశం ఇవ్వగలిగినందుకు గర్విస్తూ, ఆ ఉపన్యాసం ఇచ్చాను. అలాంటి అవకాశం నాకు కలగడం నిజంగా గర్వకారణంగానే భావించాను.

నేను ఆ ఉపన్యాసం ఇచ్చేనాటికి గాంధీగారు 'దండీ'కి వెళ్ళే మార్గంలో ఉన్నారు. ఆయన తన ఆశ్రమవాసు లయిన స్త్రీ పురుషులతో కలిసి సత్యాగ్రహ సమరం ఆరంభించడానికి సబర్మతీనుంచి దండీప్రాంతానికి కాలినడకని వెడుతున్నారన్నమాట. సబర్మతీ ఆశ్రమానికీ దండీకి మధ్య ప్రయాణం 21 రోజులు. అక్కడికి జేరి అ సముద్రపు టొడ్డున లభ్యమయ్యే ఉప్పుకల్లులను ఏరుకోవాలన్నమాట!

దారిలో చాలా చిత్రమయిన సంఘటనలే జరిగాయి. ఈ విషయాలన్నీ అనుదినమూ వార్తాపత్రికలద్వారా వస్తూనే ఉండేవి. అంతే కాదు, మన "మిత్రులు" పత్రికలలో పడ్డ వార్తలతో పాటు రకరకాల విమర్శలూ, చిత్ర విచిత్రమయిన అభిప్రాయాలూ వెల్లడించేవారు. అందులో కొన్ని పత్రికలు ఆంగ్లేయులచేతా, ఆంగ్లో ఇండియన్లచేతా నిర్వహింపబడేవి. వాటిలో మా ఉప్పు సత్యాగ్రహ సమరాన్ని ఇష్టమొచ్చినట్లుగా వేళాకోళం చేసేవారు. 'భారతదేశంలాంటి ఒక పెద్ద దేశానికి స్వాతంత్ర్య సంపాదనకోసం సముద్రపు టొడ్డున ఉప్పుకల్లులు ఏరుతారట!" అంటూ రకరకాలుగా వేళాకోళాలు చేసేవారు. కార్టూనులు వేసేవారు. గాంధీగారనే చిట్టెలుక తనకున్న ఆ కొద్దిపాటి మీసాలతో తోక ఆడించుకుంటూ, ఉప్పుకల్లులు ఏరడానికి, తద్వారా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికీ ప్రయత్నిస్తున్నదని వేళాకోళంగా కార్టూన్లు వేసేవారు.

శాసన సభా వాతావరణం

కేంద్ర శాసన సభా వాతావరణమంతా అటువంటి ఉద్దేశాలతోనే నిండి, అటువంటి ఆశ్చర్యాలకీ ఆలవాలమై ఉండేది. సిసలయిన కాంగ్రెసు వారంతా శాసన సభని వదలి 'ఉప్పు' కోసం బయటకు నడిచారుగా! వారి కిదంతా ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగించేది. అసలు ఆ సభలో ఉప్పు సత్యాగ్రహ సమరంమీద పూర్తి విశ్వాసంతో ఉన్నవాణ్ణి నేను ఒక్కడినే. శాసనసభలో ఉన్న యావన్మందికీ నా అభిప్రాయలూ, ఆశయాలూ పూర్తిగా తెలిపి ఉండడాన్ని నన్ను చూస్తే అందరికీ జాలిగా ఉండేది. వారి దృష్టికి బలిపీఠానికి తీసుకుని పోబడుతూన్న మేకలా కనబడ్డానేమో! ట్రెజరీ బెంచీల వారికీ, తదితర శాసన సభ్యులకీ ఈ మూడు సంవత్సరాలలోనూ నన్నుగురించి బాగా తెలిసికోవడానికి సావకాశం ఉందిగదా! వారికి ఆ అసెంబ్లీలోనే, శాసనధిక్కారంచేసి, స్వరాజ్యం సంపాదించడానికిగాను పధ్నాలుగుమందితో ఒక కంపెనీ ఏర్పడ్డదని తెలియదు.

మేము టీ తీసుకుంటూ ఉండగా ట్రెజరీబెంచీలకు సంబంధించిన ఒక ఆంగ్లేయ మిత్రుడు నన్నుగురించి కాస్త బాధపడి, ఆ లాబీలో ఒక చిన్న ప్రసక్తి లేవదీశాడు. "ఎంత తెలివి తక్కువ వాడవయ్యా! సముద్రపు ఒడ్డున ఏరిన ఉప్పుగల్లులతో 'స్వరాజ్యం' వస్తుందని ఎల్లా తలుస్తున్నారయ్యా? ప్రపంచకంలో ఎప్పుడయినా ఇటువంటి వింత విన్నామా?" అన్నాడాయన. "కాస్సేపు ఓపిక పట్టవయ్యా, మిత్రమా! ఈ విషయమై కొద్దిసేపట్లో శాసన సభలో మాటాడదలిచాను. అప్పుడు మీ ప్రశ్నకు సమాధానం సువిదతమవుతుం" దన్నాను.

ఆయనే అన్నమాటేమిటి, సభలో అధికార అనాధికార భారతీయ సభ్యులుకూడా కాంగ్రెసు కార్యక్రమం పట్ల విచారాన్ని సూచిస్తూ, 'దేశంలో ఉన్న కాంగ్రెసువారంతా రాజీనామాలిచ్చి, అన్ని విధాలా చేతులు నలుపుకుంటూన్న ఈ సమయంలో, ఈ సత్యాగ్రహం ఏమిటని అడగడం ఆరంభించారు. వారికీపై విధంగానే సమాదానం ఇచ్చాను.

సంశయాళువులకు సమాధానం

లోగడ చెప్పినట్లు 1930 లో నాకు ఏ విధంగానూ శాసన సభా కార్యక్రమాలలో పాల్గొనాలనే అభిప్రాయంలేదు. నా ఢిల్లీ ప్రయాణ కారణం విఠల్‌భాయ్‌గారి సందేశం. వారికి నా రాకవల్ల ఉపయోగం కలిగినా, కలగకపోయినా, నాకు మాత్రం ఆ ఢిల్లీప్రయాణం గర్వకారణమే అయింది. మాలవ్యా పండితునితో సహా (నేనుగాక) 13 మంది శాసన సభ్యులచేత రాజీనామా ఇప్పించి, వారిలో 12 మందిని ప్రత్యక్ష చర్యగా ప్రవేశపెట్టబడిన ఆ ఉప్పు సత్యాగ్రహ సమరంలోకి లాక్కెళ్ళగలిగాను. విఠల్‌భాయ్‌ని ఒప్పించి, ఆయనచేత రాజీనామా ఇప్పించి, జెయిలుకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసే సమయానికి గాంధీగారు 'దండీ' సమీపిస్తున్నారు.

అసెంబ్లీ కాంగ్రెసేతర సభ్యుడుగా నాకు ఉన్న హక్కుని పురస్కరించుకుని, నేను చేసిన ఉపన్యాసం అసెంబ్లీలోనూ, దేశంలోనూ ఉన్న డౌటింగ్ థామస్[1] లకు సమాధానంగానూ, గాంధీగారి ఉప్పు సత్యాగ్రహ సమరంలో పాల్గొనడానికి పిలుపుగానూ చాలా బాగా ఉపయోగపడింది. అసెంబ్లీ మెంబరుగా పనిచేసిన ఆ మూడు సంవత్సరాలపాటూ నా శక్తివంచన లేకుండా, ఏ ఉడుతా భక్తిగానో, సేవచేశాను. ఆంధ్ర రాష్ట్రీయులకే గాక, ఎన్నో ఇతర రాష్ట్రాలవారికీ, ఖండాంతర వాసులకీ కూడా కాంగ్రెసు కార్యక్రమం విషయమై కాంగ్రెసుద్వారా జరుగుతూన్న, జరుగగల దేశోపకారాల విషయమై నేను కలిగించ గలిగిన పరిజ్ఞానం కలిగించాను.

ఆ కారణం చేతనే ఉప్పు సత్యాగ్రహమే కాదు, మరే యితర శాసనోల్లంఘన కార్యక్రమమయినా అసెంబ్లీ స్థానాలను వదలకుండా సాగిస్తే ఎక్కువ శక్తివంతంగా శీఘ్రతరంగా విజయం సాధించగలమని నా నమ్మిక. పరిస్థితుల ప్రాబల్యంవల్ల కాంగ్రెసుతో దెబ్బలాడి, రాజీనామా యిచ్చి, మళ్ళీ శాసన సభా ప్రవేశం చేయగలిగాను. అంతేకాదు, ఆ ఆఖరు ఘడియలలో కాంగ్రెసు మెంబర్ని కాకపోయినా కాంగ్రెసుకు జీవంపోసే విధంగా ప్రవర్తించగలిగాను.

అందువల్లనే అసెంబ్లీ హాలులో కాంగ్రెసు కార్యక్రమాలమీద విమర్శలు ముమ్మరంగా వస్తూన్న ఆ సమయంలో, ఆ విమర్శల కన్నింటికీ జవాబుగా ఒక స్టేటుమెంటు ఇవ్వగలిగాను. ఆ విమర్శల కన్నింటికీ జవాబు యిస్తూ, కాంగ్రెసుకు సహకారం అందివ్వవలసిందని దేశానికి కూడా విజ్ఞప్తి చేయగల సావకాశం నాకు లభించడం ఎంతటి అదృష్టమో గదా!

'ఆత్మ ప్రబోధం'

కాగా ఈ నా ఉపన్యాసానికి ఏ విధమయిన ముందు ప్రయత్నమూ జరగలేదు. ఆ క్షణంలో మాట్లాడింది నేను కాదు. "నా ఆత్మ." అది నిజంగా ఆత్మ ప్రబోధమనే నా పూర్తి విశ్వాసం. [2] ఉపన్యాసంలో అహింసాత్మక శాంతి సమర విధానానికి, రక్తపాతంతో కూడుకున్న యుద్ధకౌశలంతో జరిగే హింసాకాండకీ మధ్యగల తేడా పాడా లన్నీ వివరించాను. అంతేకాదు, కాంగ్రెసు విధానాలు ప్రయోగాత్మకంగా రుజువు పరచడానికి వీలులే నటువంటివే అయినా, విమర్శకులకు ఆ విధానాలలో జీవం కనబడకపోయినా, దేశం ఉత్తేజపూరితమై, సజీవంగానే ఉన్నదనీ, దేశీయులలో 'స్వాతంత్ర్య' వాంఛ రోజురోజుకూ అధికమై, ప్రజలు ఎటువంటి త్యాగానికయినా సంసిద్ధులై ఉన్నారనీ అన్నాను. ఇంతవరకూ వారి మనోభావాలన్నీ భయోత్పాతం కలిగించే ప్రస్తుత రాజ్యవిధానంలో అణగద్రొక్కబడి ఉన్నాయనీ, స్వాతంత్ర్యం కోసం సాగనున్న అహింసాత్మక శాంతి సమరంలో కూడా హింసాకాండ ప్రయోగించడానికి వెనుదీయని మనస్తత్వంతో పాలకులున్నారనీ గుర్తు చేశాను. నా దేశీయుల పరిస్థితి నాకు అమూలాగ్రం తెలుసుననీ, వారు ఆత్మసాక్షిగా ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు పర్యవసానాలను లెక్కచెయ్యకుండా ఎటువంటి త్యాగాలకయినా సిద్ధపడగలరనీ విశదం చేశాను. దేశీయులందరూ ఈ సమరంలో దుర్మరణాల పాలయినా కోట్లాదిగా ఉన్నవారి ఆత్మలు ఆ 'బక్కవాని' పక్కనే ఉండి ఆయన ఆజ్ఞల ప్రకారం వర్తిస్తాయని స్పష్టం చేశాను. ఇదే ధోరణిలో ఆనాటి నా ఉపన్యాసం ముగించాను.

ఆ అసెంబ్లీ ప్రాంగణం, నిజంగా, స్త్రీ పురుషులకూ, చిన్నలకూ, పెద్దలకూ, యావన్మందికి ప్రబోధం కలుగజేయడానికి నాకెంతో ఉపకరించింది. దేశీయులంతా ఒక్కుమ్మడిని క్రమశిక్షణతో ఒక్క త్రాటిమీద నడుస్తూ, దేశంలో ఆంగ్లేయ ప్రభుత్వాన్ని సాగనియ్యకుండా ముందడుగు వేయవలసి ఉన్నదని ప్రబోధం చేశాను. ఈ అసెంబ్లీ హాలునుంచి నేను నేరుగా ఉప్పు సత్యాగ్రహ సమరంలో పాల్గొనడానికి ఇల్లాగే వెళ్ళిపోయినా ఆశ్చర్యపడవలసింది ఏమీ ఉండదని నొక్కివక్కాణిస్తూ ఆనాటి నా ఉపన్యాసాన్ని సాంతం చేశాను.

రాష్ట్రీయ కాంగ్రెసు ఆహ్వానం

నేను ఈ ఉపన్యాసం ఇచ్చిన తర్వాతనే మాలవ్యా పండితుడూ ఇతర మెంబర్లమూ రాజీనామాలిచ్చి, సత్యాగ్రహ సమర రంగంలో అడుగుపెట్టాం. నా ఆత్మమిత్రుడూ, నాయకాగ్రేసరుడూ అయిన మాలవ్యా పండితుడు ఆ క్షణంనుంచీ సమరం సాగించారు. ఢిల్లీలోనే ఎన్నో సభలలో విదేశవస్త్ర బహిష్కరణను గురించి చాలాధీమాగానూ, శక్తిమంతంగానూ ఉపన్యాసాలిచ్చారు. రాజీనామా యిచ్చిన ఇతర మిత్రులు వారి వారి నియోజక వర్గాలకు తరలి వెళ్ళారు.

గుంటూరులో జరుగనున్న ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెసు కమిటీ మీటింగులో పాల్గొనవలసిందని నాకు పిలుపు వచ్చింది. ఢిల్లీ వదలి మదరాసు వెడుతూ దారిలో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ మీటింగుకు హాజరయ్యాను. ఆ గుంటూరు సభకు మెంబర్లందరూ వచ్చారనే అనాలి. వారు సత్యాగ్రహ సమరానికి ఒక జాబితా తయారు చేశారు. మిత్రుడు దేశభక్త కొండ వెంకటప్పయ్య, ఇతర ప్రముఖులు ఆ సభకు హాజరయ్యారు. ఆ కాగితంమీద మొదటి అంకెని విడిచి తక్కిన అన్ని అంకెలకూ ఎదుట సంతకాలు చేయబడ్డాయి. ఆ మొదటిస్థానం మాత్రం అల్లా ఖాళీగా ఉంచబడింది. వందన పురస్సరంగా నాకు వదలిన ఆ వదలిన ఆ ప్రథమ స్థానంలో నేను సంతకం పెట్టాను.

మా సత్యాగ్రహ పథకం

ఆంధ్రనాయకు లంతా ఈ ఉప్పుసత్యాగ్రహాన్ని విజయవంతంగా సాగించడం ఎల్లాగని ప్రశ్నించారు. అక్కడ జేరిన వారిలో చాలామంది, సముద్రపు నీటిని ఒకరి తర్వాత ఒకరు మరగబెట్టి ఉప్పు చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన జయం సాధ్యంకాదన్న అభిప్రాయం వెల్లడించారు. మేము కొంత తర్జనభర్జన చేసి ఒక పథకం వేశాం.

ఆ పథకం ప్రకారం ఉద్యమం, ఆరంభంలో కాకపోయినా, కొంతవరకూ సాగేసరికి మాంచి రసకందాయపు పట్టులో పడుతుందని నిశ్చయించాం. సముద్రపుటొడ్డున ఉన్న మా సొంత పొలాలలోమళ్ళు గట్టి సముద్ర జలాన్ని ఆ మళ్ళలోకి మళ్ళించి ఉప్పు పండించాలని నిశ్చయించాం. ప్రభుత్వంవారి ఉప్పు గిడ్డంగులపై దాడి చేద్దాం అనీ, వీలునుబట్టి ఎవరికి వారే నీటిని మరగబెట్టి ఉప్పును తయారు చేయాలనీ నిశ్చయించాం.

అలాయిదాగా ఈ కార్యక్రమాన్ని నిశ్చయించుకున్నాక నేను చెన్నపట్నం వెళ్ళాను. ఈ ఉప్పుసత్యాగ్రహాన్ని గురించి కలాన్నింకా సాగించేలోపల, 1928 - 29 లలో జరిగిన ఇతర సంఘటనలను గురించి కూడా కాస్త చర్చిద్దాం.

ఆంధ్రుల కాంగ్రెసు ఆశయ సాధన

కలకత్తా కాంగ్రెసులో కల్లు, సారా అమ్మకాలను నిషేదించాలనీ; విదేశ వస్తు బహిష్కరణ చెయ్యాలనీ; కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఉన్న శాసన సభ్యు లందరూ నిర్మాణాత్మక కార్యక్రమ విధానాల పట్ల ఆసక్తి చూపాలనీ; కాంగ్రెసు మెంబర్లను విరివిగా జేర్చుకోవాలనీ; అంటరానితనం మంట గలపాలనీ; స్వచ్ఛంద సేవకులకు 'పిలుపు' పంపి, వారిని సరి అయిన పద్ధతులమీదు తయ్యారు చెయ్యాలనీ; గ్రామ పునర్నిర్మాణానికి, కష్టజీవుల సంఘాల స్థాపనకీ గట్టిగా కృషి చెయ్యాలనీ - తీర్మానించాము.

ఈ ఆశయాలను అమల్లో పెట్టడం విషయంలో ఎంతో ఉత్సాహం చూపబడింది. ఆంధ్ర దేశంలో ఒక్కొక్క ఆశయ సాధనకీ ఒక్కొక్క సంఘం ఏర్పరచబడింది. ప్రజలు కాంగ్రెసులో చేరినా చేరకపోయినా, నిర్మాణాత్మక కృషిలో వారు ఎప్పుడూ కాంగ్రెసుకు దన్నుగానే ఉండేవారు. మత సామరస్యం సాధించడానికి కొందరు వ్యక్తులు తంటాలు పడ్డా, వారి ప్రయత్నాలు అట్టే ఫలవంతం కాలేదు. ప్రజలలో చాలామంది స్వాతంత్ర్య ఫలసిద్దికోసం కాంగ్రెసుకు ఎప్పుడూ అండగా నిలుస్తూ, పిలుపు వచ్చిన వెంటనే రంగంలో ఉరకడానికి సిద్ధంగా ఉంటూండేవారు.

ఆంధ్ర దేశంలోని అన్ని జిల్లాలూ, తాలూకాలూ పదేపదే తిరగడంలో, నేను ఒకే ఒక సంగతి గ్రహించాను. ఈ రాష్ట్రంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం నాదేననీ, ప్రతి వ్యక్తీ నా వాడేననీ, నేను ఎప్పుడూ వాళ్ళవాడనే ననే భావం నాకు కలిగింది. ఆంధ్ర అంటే ప్రకాశం, ప్రకాశం అంటే ఆంధ్ర అన్న స్థాయికి నా రాష్ట్రీయులూ, నేనూ వచ్చేశాం అన్నమాట! సుమారు ఇరవై సంవత్సరాలపాటు రాష్ట్రీయ కాంగ్రెసు సంఘ అధ్యక్ష స్థానం వహించి ఉండడాన్ని, రాష్ట్రీయలందరి ఆదరాభిమానాలను పూర్తిగా సంపాదింపగలిగా నన్నమాట! నేరుగా వారందరితోనూ కలిసి పోవడమనేది నా హృదయంలోనేగాదు, నా రక్తంలోనే ఉందన్నమాట.

రైతుల ఆందోళనకి నాయకత్వం

1927 - 30 ల మధ్య మూడు సంవత్సరాలలోనూ రీ సెటిల్మెంట్ అన్న ప్రాతిపదికమీద ప్రభుత్వంవారు భూమి శిస్తు విధానపు త్రాళ్ళను బిగించడం తథ్యంగా కనిపించింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో, ఆ కృష్ణా గోదావరీ మండలాలలో అటువంటి పని జరిగే సూచన కనిపించింది. అప్పట్లో పి. జి. హోల్‌డ్స్‌వర్త్ (P. G. Holdsworth) స్పెషల్ సెటిలుమెంట్ ఆఫీసరుగా ఉండేవాడు. దర్మిలా 1939 లో నేను, కాంగ్రెసు పాలనలో, రెవెన్యూ మంత్రిగా వ్యవహరించినప్పుడు, ఈ హోల్‌డ్స్‌వర్త్ నా క్రింద కార్యదర్శిగా పనిచేశాడు.

కాంగ్రెస్సూ, నాబోటి కార్యోత్సాహులం ప్రజాక్షేమానికి సంబంధించిన వివిధ కార్యాలలో నిమగ్నుల మయ్యాం. కాంగ్రెసు కార్యక్రమానికీ, మా పనికీ అంత సంబంధం లేకపోయినా, ప్రజా క్షేమానికి సంబంధించిన ఎన్నో కార్యాలు మేం చేపట్టవలసి వచ్చింది. రీసెటిల్మెంటు పేరున భూమి శిస్తు పెంచితే రైతులు ఇబ్బందుల పాలవుతారు కనుక, ప్రజలకు రక్షణ ఇవ్వడం కాంగ్రెసువారి కర్తవ్యంగా భావించి, రాష్ట్రీయ కాంగ్రెసు అధ్యక్షుడుగా నేను ఈ విషయంలో పూనుకోవలసి వచ్చింది.

మదరాసు శాసన సభవారు అప్పటి ద్వంద్వ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా, ఒక మంత్రిగారి ఆధిపత్యాన, ఈ విషయాలు పరిశీలించడానికిగాను, ఒక ఉప సంఘాన్ని ఏర్పరచారు. అప్పుడు అధికారంలో ఉన్న జస్టిస్ పార్టీవారికీ, కాంగ్రెసు వారికీ ఎప్పుడూ చుక్కెదురేగా! అందుచేత, వారి విచారణ సంఘంతోపాటు, మా రాష్ట్రీయ కాంగ్రెసు సంఘంవారు కూడా, తమకొక ప్రత్యేక నివేదిక కోసం, ఒక ఉప సంఘాన్ని నియమించారు.

ఆ శాసన సభ కమిటీవారి తుది అభిప్రాయాలు ఎల్లా ఉంటాయో, వారు ఏ దృక్పథంతో ఈ విషయాలు పరిశీలిస్తారో అంతు చిక్కలేదు. ఆ మంత్రులు ఏ విధంగానూ ప్రజలకు బాధ్యులు కారు. వారి ఆలోచనలు ప్రజా సహకారం కాంక్షించేవిగా ఉంటా యనుకోవడానికి వీలులేదు. రెవెన్యూ శాఖ, కార్యనిర్వాహకవర్గపు సలహాదారుగా ఉన్న కాంప్‌బెల్ (Compbell) గారి చేతిలో, ఒక ప్రత్యేక విషయంగా ఉండేది. ఆ కమిటీ చైర్మన్ అభిప్రాయంతోగాని, ఆ ముగ్గురు మంత్రుల అభిప్రాయంతోగాని (వారి అభిప్రాయం అనుకూలంగా ఉన్నా), రెవెన్యూ మెంబరుగాని, ప్రభుత్వం తాలూకు రిజర్వుడు సెక్షన్ వారుగాని ఏకీభవించ నవసరంలేదు. అసలు, వారి అభిప్రాయాలను వీరు ఏ విధంగానూ పట్టించుకో నవసరంలేదు.

కాంగ్రెసు సంఘ నివేదిక

రైతుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది, అప్పటికే వారు భరించరాని పన్నులు చెల్లించవలసిన స్థితిలో ఉంటూ, అప్పులలో మునిగి ఉన్నారు. ఎప్పటి కయినా ఆ ఋణాలనుంచి బయటపడి, భూమికి నిజమైన హక్కుదార్లయ్యే అవకాశం ఏ మాత్రం ఉన్నట్లు లేదు. ఆ కమిటీవారి విచారణ సమగ్రంగా లేదు. అంతకంటె మా కాంగ్రెసు సంఘంవారి నివేదిక ఎంతో సమగ్రంగానూ, విమర్శనాత్మకంగానూ ఉంది.

నేను నా నియోజకవర్గంలోని మూడు జిల్లాలలోనూ గ్రామ గ్రామానికీ వెళ్ళి పరిస్థితులు సమగ్రంగా గ్రహించాను. వ్యవసాయపు పెట్టుబడులూ, వ్యవసాయానికయ్యే ఇతర ఖర్చులూ, ఫలసాయంవల్ల వచ్చే ఆదాయమూ పరిశీలిస్తే, రైతులకి ఖర్చులు పోగా వారి కుటుంబపోషణకి సరిపోయేపాటి ధనం కూడా మిగలడం లేదని తేలింది.

ఆ సెటిల్మెంట్ ఆఫీసరుగారు వ్యవసాయపు ఖర్చులు నిర్ధారణ చేయడానికి అవలంబించిన పద్ధతి గమనిస్తే, ఆ లెక్కలు సక్రమ మయినవి కాదని, తేలింది. అక్రమ పద్ధతిగా వేసిన ఆ లెక్కలు చూస్తే, రైతుకు వ్యవసాయాది ఖర్చులుపోను మంచి ఆదాయం లభిస్తోందనీ ఇంకా ఏవయినా పన్నులు వెయ్యవలసివస్తే , అతనికి కష్టంగాని నష్టంగాని ఉండదనీ తేలుతూంది.

అందువల్ల మా తంటాలన్నీ ఆ సెటిల్మెంట్ ఆఫీసరుగారి రిపోర్టు ప్రభుత్వంవారు త్రోసిపుచ్చేటట్టు చెయ్యాలని.

ఘనంగా సాగిన మా అలజడి సత్పలితాలనే యిచ్చింది. అధికంగా విధించబడిన పన్నులు ఏ పరిస్థితిలోనూ, ఎంత మాత్రం చెల్లించ మని రైతులు నొక్కి వక్కాణించారు. పింఛను పుచ్చుకుని వెళ్ళి పోయిన తర్వాత కూడా గవర్నర్‌గా పనిచేసి విరమించిన విల్లింగ్‌డన్ ప్రభువు బోటివారికి మరపురాని విధంగా సాగిన మా గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమం మదరాసు గవర్నమెంట్‌వారు లోగడ రుచిచూసే ఉన్నారు.

పెంచిన పన్నుల వాయిదా

పరిసర జిల్లాలవారు కూడా ఆనాడు చూపించిన అభిమానం, వగైరాలన్నీ గ్రహించిన మద్రాసు ప్రభుత్వంవారు ఈ రీసెటిల్మెంట్ విషయంలో మిగిలిన కార్యక్రమం యావత్తూ విరమించుకున్నారు. ఆ సెటిల్‌మెంట్ ఆఫీసరు సూచన ప్రకారం, ఏటా 17 లక్షల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. కాని దాని వసూలు మా ఆందోళన ఫలితంగా నాలుగు సంవత్సరాలపాటు వాయిదా పడింది.

నేను కేంద్ర శాసన సభా సభ్యుడుగా ఉంటూన్న రోజులలో సేకరించిన ఈ సమాచారమంతా ప్రజల్ని ప్రత్యక్ష చర్యకి తయారు చెయ్యడానికి ఉపకరించింది. మదరాసు ప్రభుత్వంవారు వేసిన అదనపు పన్నులు ఆపు చెయ్యడానికీ ఉపకరించింది.

ఈ విషయంలో నేను చాలాసార్లు కాంప్‌బెల్‌ను కలుసుకున్నాను. గవర్నమెంట్ ఒత్తిడి చేస్తే, ప్రజలు పన్నుల నిరాకరణకి సిద్ధం అవడానికి సావకాశం ఉన్నదని కాంప్‌బెల్‌ను నమ్మించగలిగాను. ఈ విషయం నేను కేవలం కాంగ్రెసు నాయకుడిగా మాత్రమేగాక, కేంద్ర శాసన సభా సభ్యుడిగా కూడా నమ్మకంగా చెప్పగలనని హెచ్చరిక జేశాను. రైతు లందరూ కట్టుగా ఒకే మాటమీద నిలబడి ఉండడం గమనించిన ప్రభుత్వంవారు, 1932 వరకూ అమలు పరచమని అదనపు పన్నులు వాయిదా వేయవలసివచ్చింది.

అ రోజులలోనే గాంధీగారు రౌండు టేబిల్ కాన్ఫరెన్స్‌నుంచి తిరిగి రావడమూ, అ సందర్భాన్ని పురస్కరించుకుని, ఒక అపసవ్యపు సాకుతో, నన్నూ, ఇంకా కొంతమంది మిత్రులనూ ప్రభుత్వంవారు అరెస్టు చేయడం జరిగింది. పెంచిన పన్నుల రద్దు చేయకపోయినా, ప్రభుత్వానికి వాటిని వసూలు చేయగల దమ్ము లేకపోయింది.

ఈ ప్రకారంగా తమ నాయకులయందు భక్తి ప్రపత్తులుగల ఆంధ్ర ప్రజానీకం, ఆ నాయకులపట్ల విశ్వాసంతో ప్రవర్తించి, తమ మీద ప్రభుత్వం విధించిన హెచ్చు పన్నుల బాధనుంచి, తమకు తాముగానే విముక్తులయ్యారు. ఈ సందర్భంలో వారు కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారి సహాయంగాని, దేశంలోని ఇతర ప్రఖ్యాత నాయకుల సహకారంగాని వాంఛించలేదు.

లాహోరు కాంగ్రెస్ తీర్మానానుసారంగా కేంద్ర, రాష్ట్రీయ శాసన సభలలోని కాంగ్రెసు సభ్యులందరూ ఏకగ్రీవంగా వారి వారి సభ్యత్వాలకు రాజీనామాలిచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. యావత్తు భారత దేశంలోనూ నడచిన ఆ ఉప్పు సత్యా గ్రహపు చరిత్ర ప్రపంచ చరిత్రకే తలమానిక మయింది. ప్రతి రాష్ట్రంలోనూ జరిగిన సంఘటనలన్నీ రాబోవు తరాలవారి ప్రయోజనం కోసం సరిగా రికార్డుచేసి ఉంచవలసిన బాధ్యత చరిత్రకారుల భుజస్కంధాలమీద ఉంది.

  1. యేసుక్రీస్తు వారికి ముఖ్యమయిన శిష్యులు పదిమందిలోనూ థామస్ ఒకడు. ఆయనకి, మన పరమానందయ్య శిష్యులకు వచ్చినట్లు, ఎప్పుడూ అనుమానాలు వస్తూండేవి. అందుచేత ఆయన్ని అందరూ 'డౌటింగ్ థామస్‌' ( Doubting Thomas) అనేవారు.
  2. ఈ ఉపన్యాసం సంపూర్ణంగా గ్రంథం చివర 'ఎపెండిక్స్‌' గా ఇద్దామని ఉద్దేశపడ్డారు.