నారాయణీయము/దశమ స్కంధము/79వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

79- వ దశకము - రుక్మిణీస్వయంవరము


79-1
బలసమేతబలానుగతో భవాన్ పురమగాహత భీష్మకమానితః।
ద్విజసుతం త్వదుపాగమవాదినం ధృతరసా తరసా ప్రణనామ సా॥
1 వ భావము :-
భగవాన్! ఆ విప్రకుమారునితో కలిసి నీవు రధమునధిరోహించి 'కుండిన' నగరమునకు బయలుదేరితివి; బలరాముడు సైన్యముతో నిన్ను వెన్నంటి వచ్చెను. మీరు ఆ నగరమును చేరగనే విదర్భరాజగు భీష్మకుడు సగౌరవముగా మిమ్ము ఆహ్వానించెను; విప్రకుమారుడు, నీవు వచ్చిన విషయమును రుక్మిణికి తెలిపెను; అదివిని ఆమె అత్యంత ఆనందముతో ఆ విప్రకుమారునికి నమస్కరించెను.
 
79-2
భువనకాంతమవేక్ష్య భవద్వపుర్నృపసుతస్య నిశమ్య చ చేష్టితమ్।
విపులఖేదజుషాం పురవాసినాం సరుదితైరుదితైరగమన్నిశా॥
2వ భావము :-
ప్రభూ! కృష్ణా! ఆ 'కుండిన నగర 'ప్రజలు నీ భువనైకసౌందర్య రూపమును చూచి ఆశ్చర్యానందమును పొందిరి. వారు 'రుక్మి' రుక్మిణిని దుష్టుడగు శిశుపాలునికిచ్చి వివాహము జరిపించనున్నాడను దుర్వార్తను విని మిక్కిలి వ్యధచెందిరి. ఆ విషయమునే వారిలో వారు మాటలాడుకొనుచు దుఃఖించుచూ ఆరాత్రి అంతయూ గడిపిరి.
 
79-3
తదను వందితుమిందుముఖీ శివాం విహితమంగళభూషణభాసురా।
నిరగమద్ భవదర్పితజీవితా స్వపురతః పురతః సుభటావృతా॥
3వ భావము :-
ప్రభూ! కృష్ణా! మరునాడు ఉదయమున ఆ ఇందువదన రుక్మిణి మంగళప్రదముగా ప్రకాశించుచున్న ఆభరణములు ధరించి, పార్వతీదేవిని అర్చించుటకు బయలుదేరెను. రక్షకభటులు తనచుట్టూ ఆవరించియుండగా, ఆ రాజకుమారి తనజీవితమును నీకే అర్పించుటకు ధృఢముగా నిశ్చయించుకొని రాజభవనమును వీడి వచ్చెను.
 
79-4
కులవధూభిరుపేత్య కుమారికా గిరిసుతాం పరిపూజ్య చ సాదరమ్।
ముహురయాచత తత్పదపంకజే నిపతితా పతితాం తవ కేవలమ్॥
4వ భావము :-
ఆ రుక్మిణి ముత్తయిదువులతో కలిసి పార్వతీదేవి ఆలయమును చేరెను; ఆ దేవిని పూజించెను. ఆ దేవత పాదపద్మములకు భక్తిప్రపత్తులతో నమస్కరించి ప్రభూ! కృష్ణా! నీవే తనకు భర్తగా లభించవలెనని ఆదేవిని మరల మరల ప్రార్ధించెను.
 
79-5
సమవలోక్యకుతూహాలసంకులే నృపకులే నిభృతం త్వయి చ స్థితే।
నృపసుతా నిరగాద్గిరిజాలయాత్ సురుచిరం రుచిరంజితదిజ్ముఖా॥
5వ భావము :-
ప్రభూ! కృష్ణా! ఆ రాజకుమారి రుక్మిణిని చూడవలెనని ఆ ఆలయసమీపమున నిలబడియున్న 'రాజుల' సమూహమునకు దూరముగా నీవొక్కడివే నిలచియుంటివి. దిక్కులను మిరిమిట్లుగొలుపు కాంతులువెదజల్లు రూపముతో రుక్మిణీదేవి అప్పుడు ఆ గిరిజాదేవి ఆలయమునుండి బయటకు వచ్చెను.
 
79-6
భువనమోహనరూపరుచా తదా వివశితాఖిలరాజకదంబయా।
త్వమపి దేవ । కటాక్షవిమోక్షణైః ప్రమదయా మదయాంచకృషే మనాక్॥
6వ భావము :-
ప్రభూ! కృష్ణా! ఆ రాజకుమూరి రుక్మిణియొక్క భువనమోహన రూపలావణ్యములకు అచ్చట గుమిగూడిన రాజులు మోహపరవశులయిరి. ఆ రుక్మిణీదేవి ఓరకంటివీక్షణమునకు, నీవు సహితము పరవశుడవయితివి.
 
79-7
క్వ ను గమిష్యసి చంద్రముఖీతి తాం సరసమేత్య కరేణ హరన్ క్షణాత్।
సమధిరోప్య రథం త్వమపాహృథా భువి తతో వితతో నినదో ద్విషామ్॥
7వ భావము :-
"ఓ చంద్రముఖీ! ఎటుపోవుచుంటివి? 'ఇటు! ..ఇటు!" అనిపలుకుచూ ప్రభూ! కృష్ణా! నీవు వేగముగా ఆమెను సమీపించి, ఆమెకు నీ హస్తమును అందించితివి; ఆమె నీ రథమును అధిరోహించుటకు సహకరించితివి. శత్రువులు చేయు రణగొణధ్వనితో భూమి ప్రతిధ్వనించుచుండగా ఆ రుక్మిణీ దేవిని తక్షణమే నీవు అపహరించుకొనిపోయితివి.
 
79-8
క్వను గతః పశుపాల ఇతి కృధా కృతరణా యదుభిశ్చ జితా నృపాః।
న తు భవానుదచాల్యత తైరహో పిశునకైః శునకైరివ కేసరీ॥
8 వ భావము :-
ప్రభూ! కృష్ణా! "ఆ గోపాలుడు ఏడి? ఎక్కడకు పోయినాడు?" అని అరుచుచు ఆ రాజులందరూ క్రోధావేశములతో యాదవసైన్యముతో తలపడి యుద్ధముచేసిరి; మీ చేతిలో వారు పరాజితులయిరి. శునకము ఎంత అరిచినను సింహమును చలింపలేనట్లు ఆ దుష్టులు నిన్ను ఏమియును చేయలేకపోయిరి.
 
79-9
తదను రుక్మిణమాగతమాహవే వధముపేక్ష్య నిబధ్య విరూపయన్।
హృతమదం పరిముచ్య బలోక్తిభిః పురమయా రమయా సహ కాంతయా॥
9 వ భావము :-
ప్రభూ! కృష్ణా! నీపైయుద్ధమునకు వచ్చిన రుక్మిణి సోదరుడగు 'రుక్మి' నీ చేతిలో పరాజితుడయ్యెను. బలరాముని మాట ప్రకారము అతనిని చంపక విరూపిని చేసి విడిచిపెట్టితివి; అతని అహంకారమును అణచివేసితివి. అటుపిమ్మట సాక్షత్తూ లక్మీదేవియగు 'రుక్మిణితో' కలిసి నీవు నీ నగరమగు ద్వారకను చేరితివి.
 
79-10
నవసమాగమలజ్జితమానసాం ప్రణయకౌతుకజృంభితమన్మథామ్।
అరమయః ఖిలు నాథ యథాసుఖం రహసి తాం హసితాంశు లసన్ముఖీమ్॥
10 వ భావము :-
భగవాన్! కృష్ణా! నీ ఎడల బిడియముగానున్న రుక్మిణీదేవిని పలువిధములగా అలరించితివి; ఆమెను ఆనందపరిచితివి; ఆమె ముఖమున దరహాసకాంతిరేఖలు ప్రకాశించునట్లు చేసితివి.
 
79-11
వివిధనర్మభిరేవనుహర్నిశం ప్రమదమాకలయన్ పునరేకదా।
ఋజుమతేః కిల వక్రగిరా భవాన్ వరతనోరతనోదతిలోలతామ్॥
11వ భావము :-
ప్రభూ! కృష్ణా! వివిధరకములగు హాస్యోక్తులతో నీవు ఆ రుక్మిణీదేవిని రేయుపగలు రంజింపజేయుచుంటివి. ఇట్లుండగా, ఒకనాడు నీవు ద్వంద్వార్ధమువచ్చు మాటలను మాట్లాడితివి. ఆ మాటలకు ఆ ఋజుమనస్కురాలగు రుక్మిణి మిక్కిలి కలతచెందెను.
 
79-12
తదధికైరథ లాలనకౌశలైః ప్రణయినీమధికం సుఖయాన్నిమామ్।
అయి ముకుంద।భవచ్ఛరితాని నః స్రగదతాం గదతాంతిమపాకురు॥
12 వ భావము :-
ప్రభూ! కృష్ణా! అదిజరిగిన తరువాత నీవు మునుపటికంటెను మరింత నేర్పుగా వ్వవహరించుచు ఆ రుక్మిణీదేవిని ఆనందపరచుచుంటివి. ఓ! ముకుందా! నీ చరితమును పలుకుచున్న నాకు (మాకు) ఈ రోగమునుండి కలుగుచున్న బాధను తొలగించుము అని ప్రార్ధించుచున్నాను
 
దశమ స్కంధము
79వ దశకము సమాప్తము
-x-