నారాయణీయము/తృతీయ స్కంధము/11వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము

11వ దశకము - హిరణ్యాక్ష- హిరణ్యకశిపుల ఉత్పత్తి వర్ణనం

11-1-శ్లో.
క్రమేణ సర్గ పరివర్ధమానే కదాపి దివ్యాః సనకాదయస్తే।
భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ!
1వ భావము.
గురవాయూరు పురాధీశా! క్రమక్రమముగా లోకసృష్టి వృద్ధిచెందుచున్న కాలమున, ఒకానొక సమయమున దివ్యజ్ఞానులైన సనకాది మునీశ్వరులు నిన్ను దర్శించుటకు వైకుంఠమునకు వచ్చిరి.

11-2-శ్లో.
మనోజ్ఞ నైఃశ్రేయస కాననాద్యైరనేకవాపీమణిమందిరైశ్చ।
అనోపమం తం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీతకక్ష్యాః।
2వ భావము.
అట్లు వచ్చిన సనకాదులు, అచ్చట 'నైశ్రేయసము' అనబడు మనోహరమైన వనమును, అనేకములైన తటాకములను మరియు మణిఖచిత మందిరములతో విలసిల్లు ప్రాకారములను దాటి, నిరుపమానముగా వెలుగొందుచున్న నీ నివాసస్థానమును చేరిరి.

11-3-శ్లో.
భవద్దిదృక్షూన్ భవనం వివిక్షూన్ ద్వాః స్థౌ జయస్తాన్ విజయో౾ప్యరుంధామ్।
తేషాం చ చిత్తే పదమాప కోపః సర్వం భవత్ర్పేరణయైవ భూమన్।
3వ భావము.
భూమన్! నిన్ను దర్శింపగోరి నీ భవనమున ప్రవేశించుచున్న సనకాది మునీశ్వరులను, వైకుంఠ ద్వారపాలకులైన జయుడు మరియు విజయుడు అడ్డగించిరి. అందులకు దేవా! నీ ప్రేరణచేతనే, దివ్యజ్ఞానులైన సనకాదుల చిత్తములు ఆగ్రహమునకు వశమయ్యెను.

11-4-శ్లో.
వైకుంఠలోకానుచితప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతమ్।
ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నో౾స్త్వితి నేమతుస్తాన్
4వ భావము.
ఆగ్రహించిన సనకాది మునులు అప్పుడు - “వైకుంఠలోకమున ఉండు మీరు దురహంకారులై అనుచితముగా ప్రవర్తించితిరి, కావున మీరు దైత్య జన్మను పొందుదురుగాక!” అని జయవిజయులను శపించిరి. అంతట, నీ ఆశ్రితులైన జయవిజయులు (పశ్చాత్తప్తులై), " శ్రీహరి స్మరణను మాత్రము విడువకుండు స్థితిని" అనుగ్రహించమని ఆ మునులను వేడుకొనిరి.

11-5-శ్లో.
తదేతదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరాంబుజాక్ష।
ఖగేశ్వరాంసార్పిత చారుబాహుః ఆనందయంస్తానభిరామ మూర్త్యా।
5వ భావము.
జయవిజయలను సనకాది మునులు శపించిన ఉదంతము తెలిసి, పద్మనేత్రా! నీవు బయటకు వచ్చితివి. గరుత్మంతునిపై ఒక హస్తమును నిలిపి లక్ష్మీసహితముగా నయనాభిరామమైన రూపముతో నీవు సనకాదులకు ఆనందమును కలిగించితివి.

11-6-శ్లో.
ప్రసాద్య గీర్భిః స్తువతో మునీంద్రాన్ అనన్యనాథావథ పార్షదౌ తౌ।
సంరంభయోగేన భవైస్త్రిభిర్మామ్ ఉపేతమిత్యాత్తకృపం న్యగాదీః।
6వ భావము.
సనకాది మునీశ్వరులు నిన్ను స్తుతించు చుండగా వారిని అనుగ్రహించి, తదనంతరము, నిన్నే ఆశ్రయించినవారు, నీవేతప్ప రక్షకులు వేరెవరు లేనివారు అయిన ఆ జయవిజయలను - "సంరంభయోగమున [వైరి భావముతో] మూడు జన్మలు గడిపి ఆ పిదప నన్ను జేరగలరు“ అని దయతో వారిని అనుగ్రహించితివి.

11-7-శ్లో.
త్వదీయభృత్యావథ కాశ్యపాత్తౌ సురారివీరావుదితౌ దితౌ ద్వౌ।
సంధ్యా సముత్పాదనకష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమావివాన్యౌ।।
7వ భావము.
దేవా! నీ భృత్యు లయిన జయవిజయలు, శాపవశమున కశ్యప ప్రజాపతి పత్ని అయిన ‘దితి ‘ గర్భమున వీరులు - దేవతలకు శత్రువులు అయి, కవలలుగా జన్మించిరి. సంధ్యాసమయమున జనింపజేయబడుటచే, ఆ కవలసోదరులు దుష్టస్వభావులై ఇద్దరు యములను తలపింపసాగిరి.

11-8-శ్లో.
హిరణ్యపూర్వః కశిపుః కిలైకః పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః
ఉభౌ భవన్నాథమశేషలోకం రుషా న్యరుంధాం నిజవాసనాంధౌ।
8వ భావము.
దితి గర్భమున జన్మించిన ఆ సోదరులు, ఒకరు ‘హిరణ్యకశిపుడు‘ అనియు మరియెుకరు ‘హిరణ్యాక్షుడు‘ అనియు ప్రసిద్ధిచెందిరి. వారిరువురును, క్రోధస్వభావముతో గర్వాంధులై నీవే నాధుడని తలచు అశేషలోకమును పీడించసాగిరి.

11-9-శ్లో.
తయోర్హిరణ్యాక్షమహాసురేంద్రో రణాయ ధావన్ననవాప్తవైరీ।
భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్జ్య చచార గర్వాత్ వినదన్ గదావాన్।।
9వ భావము.
వారిరువురిలో గొప్పరాక్షసుడయిన హిరణ్యాక్షుడు, యుద్ధకాంక్షాపరుడై, తనతో యుద్ధమునకు తలబడు శత్రువు కానరాక, గధాధరుడై అహంకారముతో, నీకు ప్రియమయిన భూదేవిని జలమున ముంచివేసి గర్జించెను.

11-10-శ్లో.
తతో జలేశాత్ సదృశం భవంతం నిశమ్య బభ్రామ గవేషయంస్త్వామ్।
భక్తైకదృశ్యః స కృపానిధే! త్వం నిరుంధి రోగాన్ మరుదాలయేశ!
10వ భావము.
జలేశుడగు వరుణదేవుడు హిరణ్యాక్షునితో, నీతో పోరాడువాడు పరమాత్మ మాత్రమే అని పలికెను. అట్లు వరుణదేవుడు పలుకగా విని హిరణ్యాక్షుడు నిన్ను వెతకసాగెను. భక్తులకు మాత్రమే, కరుణించి దర్శన మిచ్చు ఓ! గురవాయూరుపురాధీశా! నన్ను అనుగ్రహించి నా రోగమును హరించుము.

తృతీయ స్కంధము
11వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 10:41, 8 మార్చి 2018 (UTC)