నానకు చరిత్ర/తృతీయాధ్యాయము

వికీసోర్స్ నుండి

శ్రీ

నానకు చరిత్ర.

తృతీయాధ్యాయము.

నానకునకు నానాటికి వ్యవహారములో లాభమధికముగ వచ్చెను వచ్చిన లాభమంతయు నతడు మునుపటికకంటె నెక్కుడుగ దైవభక్తులకు దీనులకు దానము చేయదొడగెను. అందుచేత గ్రామములోని జనులందఱు వానివతన్‌నముంగూర్చి తమలో దారు చెప్పుకొన నారంభించిరి. కొందఱతని యౌదార్యమును మెచ్చుకొనిరి. మఱికొందఱతని వితరణమునకు విపరీతార్ధములను గల్పించి నిందింపసాగిరి. లోకులు పరమార్ధము నరయక వినినదంతయు నమ్మువారగుటచే నానకు యజమానుని ధనమంతయు యధేచ్ఛముగ వమ్ముసేయున్నాడని యభిప్రాయపడిరి. యజమానుని ధనమే యిచ్చవచ్చినట్లు వ్యయము సేయక పోయిన పక్షమున నిద్దఱు మనుష్యులకు గావలసిన కర్చులే గాక సన్యాసులకు బిచ్చగాండ్రకు దోచి పెట్టుటకు వీని కెక్కడినుండిసొమ్మువచ్చినదని లోకులు పలుక జొచ్చిరి. ఆవిషయమున లోకులు నిశ్చయముగా దురభిప్రాయ పడిరి. ఏలయన నానకునకు వాని శిష్యుడగు బలునకు గావలసినభోజనపదార్ధముల నిమిత్తమగు వ్యయము మిక్కిలి స్వల్పము. నానకువేదాంతియగుటచే గేవల ముదరపోషణమే ప్రధాన కార్యముగ జేసికొనక యేదితినినను దినము వెళ్ళిపోవునని సామాన్యులు భక్షించు వస్తువులనే యుపయోగించుచు వచ్చెను. గంజి యన్నమెంతో వానికి బంచభక్ష్యపర మాన్నములు నంతె. మధురాహారములు గ్రహించి తన పొట్టనింపి కండలు పెంచుటకంటె సొమ్ముమితముగా వాడుకొని మిగిలినసొమ్ము సద్వినియోగముం జేయుట యిహపర సాధనమని యతండు నమ్మి జాగ్రతతో నుండెను. అట్టి మహానుభావులు తిండిపోతులుగా నుండరుగదా. అతడు చేయు దానములు మెరమెచ్చుల దానములుగాక యపాత్రదానములుగాక పేదలకు భగవగ్భక్తులకు నీయబడిన సత్పాత్ర దానము లయ్యెను. గ్రామవాసులలో ననేకులు నానకుచేయు వ్యయములగూర్చి యత్యద్భుతముగా జెప్పుకొనుచుండుట విని జయరాముడు లోకులమాటలే నిశ్చయములైనపక్షమున నవాబు నానకును దండించుటయే గాక తనకుగూడ మహాపకారముచేయునని భయపడి మరది నడుగుట కిష్టములేక సందేహించుచుండెను. నానకును లోకుల గోలవిని బావమనస్సు సంశయాకలితమైనదని తెలిసికొని తనచరిత్రము నిర్దుష్టమని వెల్లడిచేయుటకును, నిందారోపకులకు బుద్దిచెప్పుటకును, బా వనుబిలిచి మునుపటియట్లె తనలెక్కల బరీక్షింపుమని కోరెను. జయరాముడు తనమనస్సులో ననుమానముగా నున్నట్లు నానకునకు దెలియుట కిష్టములేని వాడయి యంగడిలో నేదోలోపమున్నదని మాత్రము మనస్సులో నభిప్రాయపడి లెక్కలు పరీక్షించుమని కోరినమాత్రముననే యందుకీయకొని నానకును నవాబువద్దకు తీసుకొనిపోయి యాతని దరిశనముచేసి లెక్కలు పరీక్షింపుమని కోరెను. నవాబు వానిమాటలువిని నానకును తనయెదుటికి పిలిచి పేరేమనియడిగి పేరు తెలిసికొన్నపిదప జయరామునివంక తిరిగి వీనికి వివాహమయినదాయని యడిగెను. వివాహము కాలేదని జయరాముడు ప్రత్యుత్తరము జెప్ప విని నవాబు "అదిగో అదేకారణము వివాహము కాకపోవుటచేతనే యతడు మాసొమ్మిట్లు పాడుచేయుచున్నాడు. నీవు నాస్వభావ మెఱుగుదువుగదా. లెక్కలు సరిగా నుండనిపక్షమున మీగతి యేమగునో చూచుకొనం" డని కఠినోక్తులు పలికెను. నానకు వానికఠోరభాషణము లాలకించి యించుకేని వెఱపునొందక "లెక్కలు చూపినపిదప మీయిష్టము వచ్చినట్లు చేయవచ్చును లెం"డని నిలన్‌క్ష్యముగ బదులుచెప్పెను. తనయంతవాని యెదుట నానకు నిర్భయముగా నిలన్‌క్ష్యముగా నిశ్చలముగా నట్లు ప్రత్యుత్తరము చెప్పుటచేత నవాబునకు మితిమీరిన కోపమువచ్చెను. ఆకోపముపైకి స్ఫుటముగాక ముందే జయరాముడు వానిముఖలక్షణములు గనిపెట్టి మిక్కిలి వినయముగా చేతు లుజోడించి నానకు గొప్పవారి దరిశనము లెన్నడు చేయని పల్లెటూరు వాడగుటచేత మర్యాదలు తెలియక యట్లు వచించెనేకాని యనుమానింప దలచుకొనలేదనియు దనయం దేదోషమును లేదని నమ్మి యంతవిస్పష్టముగా బలుక సాహసించెననియు బ్రధమ దోషమగుటచే క్షమియింపదగు" ననియు బలుతెఱంగుల ప్రార్థించెను.

ఆవేడికోలు విని దయాళునయి నవాబు తనకోటలో నున్న యదురావను మంచి లెక్కగానిని పిలిపించి యంగడి లెక్కలు శోధింపుమని యానతిచ్చెను. యదురావు మిక్కిలి జాగరూకతతో నైదుదినములు లెక్కలు పరీక్షించెను. నవాబుపెట్టిన పెట్టుబడియు దానిమీదవానికి రావలసిన లాభమునుగాక 321 రూపాయలు కొట్టులో నిలవయున్నట్టు లీపరీక్ష వలన దేలెను. నానకు తననిమిత్తము దానధర్మముల నిమిత్తము వ్యయముచేయగా నతనివంతు మిగిలినసొమ్మిది. అదిచూచి జయరాముడు మానప్రాణములు దక్కినవని మిక్కిలి సంతోషించి మరునాడు నవాబు దరిశనమునకు బోయెను. అదివఱకే యదురావువలన లెక్కల పరీక్షనుగూర్చి నవాబు వినియున్నందున జయరామునిజూచి యతడు "నీమరదిమీద నీవిధముగా వాడుకలు కలుగుటకు కారణమే"మని యడిగెను. అనవుడు జయరాముడిట్లనియె. "లోకములో నెంతమంచి వారికయినను శత్రువులుండక మానరుకదా. అట్లే మానాన కుమీద కూడగిట్టనివారు కొందఱున్నారు. ఇదియంతయు నామహాత్ముల సృష్టియేకాని మావాని లోపమేమియు లేదు" పరీక్షానంతరమున నవాబు నానకుమీద నెక్కువ విశ్వాసము గలవాడై మునుపిచ్చిన సొమ్మునకు దోడుగ పెట్టుబడి క్రింద మరిమూడువేల రూపాయల నిచ్చి వ్యాపారమునెక్కుడుగ సాగించమని చెప్పెను. నానకు నిర్దోషియని తెలిసినప్పుడు జయరాముడు వానిభార్యయు నొందిన యానంద మింతింతయని వర్నింప నలవికాదు. ఆపరీక్షవలన నవాబునకు నానకుమీద నమ్మిక పొడముటయేగాక జయరామునిమీదకూడ నధిక గౌరవము గలిగెను. కుబుసమువిడచిన కోడెత్రాచుననుకొన్నది పూలదండయయినట్లు బావమరుదులనిద్దరిపయి నలిగి వారిం జెరుపదలచిన నవాబు పరమాప్తుడగుటచే నానకుమీద నిందలుమోపిన శత్రువులు సిగ్గుపడి నోళ్లు మూసికొనవలసిన వారైరి. నానకు మేలునే గోరునట్టి బరమమిత్రులు సంతోషపరవశులైరి. తనకుమారుడు బుద్ధిహీనుడనియు జిల్లిగవ్వయైన నార్జింపలేడనియు, గొరమాలినవాడనియు దలంచి వాని నింటనుండి వెడలనడచిన కాళుడు పుత్రుని మిత వ్యయము నిర్దోషిత్వము నవాబునకు వానిపై దయగలుగుట మొదలగు వార్తలు విన్నప్పుడు పొందిన సంతోషమనుభవైక వేద్యమేగాని వర్నన కసాధ్యము. మొదటి నుండియు నానకు మహాత్ముడగునని నమ్ముచుండిన రాయబులారు దానినివిని యెంతో సంతోషించెను. ఒకనాడు సాయంకాలము జయరాముడు భార్యయు నానకునుగూర్చి మాటలాడుకొను చుండునంతలో నతడేవచ్చివ్యాపారములో తనవంతువచ్చిన లాభపుసొమ్ము దెచ్చి దాచుడని వారిచేతికిచ్చెను. అక్కడకు దమ్మునిమీదననుమానమెన్నడును లేకపోయినను లోకులుచేసిన నిరాపనిందల కామెమన:ఖేదమునొంది పరీక్షానంతరమున నిష్కళంకుడైవచ్చినసోదరుని బహువిధముల గారవించెను.

నానకు గుణవంతుడై ధనసంపాదకు డగుటచేత స్వకుటుంబభారము వహింపగలడు గావున వానికి వివాహము శీఘ్రముగ జేయుట యుచితమని సోదరీ భావుకలు తొందర పడిరి. అదియునుగాక సంసార బంధమునందు వానిని బ్రవేశపెట్టినచో నతడందే తవుల్కొని యన్యవిషయమునుండి మనస్సు మరల్చి బాగుపడునని వారెంచి యీవఱకే వానికొక సంబంధము కుదిర్చిరని మనమెఱుగుదుముగదా. జయరాముడు నానకునకు బిల్ల నీయదలచిన మూళునిపేర ముహూర్త నిశ్చయము చేయుమని జాబులువ్రాసెనుగాని మూలుడు వివాహమునకు గావలసిన సంబారములు తనకు సమకూడలేదని కొంతయాలస్యము జేసి యెట్టకేలకు భాద్రపద బహుళ సప్తమిదినమున సుముహూర్తము నిశ్చయించి వివాహమునకుం దరలి రమ్మని వ్రాసెను. కాలుడు సకుటుంబ పరివారముగా సుల్తానుపురమునకు బోయి యటనుండి పెండ్లికొడు కును జయరాముడు మొదలగు చుట్టములను దోడుకొని తరలిపోయెను. వియ్యంకుడు వియ్యాలవారిని దనస్థితికి దగినట్లు గౌరవించెను. వివాహ మహోత్సవము మూడుదినములు జరిగెను. నాలవనాడు కాలుడు పెండ్లికూతురును వెంటబెట్టుకొని సపరివారముగ బయలుదేరి సుఖముగ సుల్తానుపురము జేరెను.

పెండ్లికూతురుపేరు సల్లఖి. అత్తవారెందుచేతనొ తల్లి దండ్రులు పెట్టిన పేరంబిలువక చూనియని యామెను బిలుచుచువచ్చిరి. సుల్తానుపురమునకు వచ్చినపిదప కాలుడు కొడుకునుం గోడలిని స్వగ్రామమునకు దోడ్కొనిపోవదలచెను. తాల్వెండిగ్రామమునకు బోవుటకునానకున కిష్టము లేదు. ఆకారణముచేత జయరాముడు నానకియు దాని కంగీకరింపరైరి. కాని కొందఱు పెద్దలు నానకుయొక్క తల్లి వివాహమునకుం రానందున కొడుకుంగోడలు కాపురము చేయుచుండ నామెకన్నులు చల్లగ చూడగోరుననియు నొక్కనెలయైన నామెకడనుండుట యుచితమనియు నుపదేశించిరి. ఆయుపదేశముంబట్టియు దల్లిమీదగల గౌరవముంబట్టియు నానకు స్వగ్రామమునకు బోవ నిష్టపడి భార్యాసమేతుడై తండ్రితో గూడ జనియెను. అతడు వచ్చువఱకు నంగడిపని బలుడు చూచుట కొప్పుకొనెను. వివాహ దీక్షితుడై కళ్యాణవేషముతోనున్న కుమారుడు ధర్మపత్నీసమేతుడై తల్లిపాదములకు నమస్కరింప, త్రిప్తాదేవి కొడుకుం గోడలి గౌగిలించుకొని యానందబాష్పములని యెడి ముత్యాల సేసలు వారిపై చల్లెను. నానకు రాకవిని చుట్టములు నెచ్చెలులు పరిచితులు వానిం జూడవచ్చి యతడు మంచివృత్తిలో బ్రవేశించినందుకు ధనము సంపాదించుచున్నందుకు జాల సంతసించి కొనియాడిరి. కొడుకక్కడనున్న నెల దినములలో దండ్రి సహజముగ గఠినుడయ్యు మరల నేమి సాహసము పుట్టునో యను భయమున నేమియుననక నడుమనడుమ నెవరితోనో యన్నట్లు "ధనము సంపాదించుట మంచిది. ధనములేనివారి నెవరుజూడరు. దుస్సహవాసములుచేయగూడ"దనుచు నెమ్మదిగ గాలము వెళ్ళబుచ్చెను. ఆమాసము ముగిసినపిదప నానకు భార్యాసమేతుడై సుల్తానుపురమునకు బోయి యెప్పటియట్ల తనపనిలో బ్రవేశించెను. పుట్టినింటివారు చూనీదేవిని మరల స్వల్పకాలములోనే బంపుదుమని చెప్పితీసికొనిపోయిరి.