నాగర సర్వస్వం/మన్మధావస్థలు

వికీసోర్స్ నుండి

మన్మధావస్థలు

స్త్రీని పొందవలెనని పురుషుని మనస్సులోను, పురుషునిపొందు బడయవలెనని స్త్రీ మనస్సులోను ప్రాదుర్భవించే కోరికకు కామము అనిపేరు. యీ కామమున్న గుణం పుట్టుకనుండి అజ్ఞాతంగా స్త్రీ పురుషుల మానసంలో బీజప్రాయంగా ఉండి యౌవనోదయముతో స్ఫుటంగా వ్యక్తం అవుతుంది. ఆలుమగలు తమ సంతానానికి ఎదుటనే విచ్చలవిడిగా సంచరించేచోట్ల యీగుణము యౌవనముయొక్క రాకకు పూర్వమే వారిమనస్సులో రూపొంది వారి స్వభావానికి వర్తనానికి చేటు తెస్తుంది. అందుచే ఆలుమగలు తమసంతానమునకు మూడేండ్లు వచ్చినదిమొదలు వారియెదుట విచ్చలవిడిగా శృంగార భావభావితులై చరింపరాదు.

కామము అనే యీగుణముయొక్క దైవభావనయే మన్మధుడు. ఈమన్మధుడు లేక కామముయొక్క శరీరములోపదిరకాలు అవస్థలు యేర్పడతాయి. వానికే మన్మధావస్థలనిపేరు. అవిక్రమంగా వివరింపబడుతున్నాయి. యీ అవస్థలన్నిటియందు పూర్వావస్థ దుర్బలంగా వుంటే తరువాతి అవస్థ జనింపదు.

1 అభిలాష :- వయస్సులోవున్న సుందరివంక పురుషుడు, లేదా సుందరమైన పురుషునివంక యువతి కోరికతో చూడడం జరిగితే ఆ అవస్థకు అభిలాష అనిపేరు. ఇక్కడ కామము లేక మదనుడు మొదటి మెట్టుమీద వున్నట్లులెక్క.

2 చింత :- స్త్రీ పురుషులు తమకంటికి మనస్సుకు నచ్చిన స్త్రీమూర్తులను ఎందరినో చూస్తూ ఉంటారు. కాని వారు తత్కాలంలో కొంత అభిలాష కలవారైనప్పటికి తరువాత ఆ సుందరులనే తలచుకొంటూ కూర్చుండరు. మరచిపోతారు అలా మరచిపోవుట జరిగితే "అభిలాష" అనే అవస్థ దుర్బలమైనదని గ్రహించాలి. కాని కొన్నిచోట్ల అలాకాక తాము సాభిలాషగా చూచిన సుందరాకారం వారిమనస్సులో నిలచిపోయి వారికి మాటి మాటికి గుర్తువస్తుంది అలా గుర్తువచ్చినప్పుడు వారియందలి కోరిక కొంతబలాన్ని పొంది రెపరెపలాడుతుంది. ఇదిగో! కామముయొక్క ఈస్థితి 'చింత' అనబడుతుంది.

3 అనుస్మరణము :- ఏదో ఒకటి రెండుసార్లు గుర్తువచ్చి కోరిక కొంతబలాన్ని పుంజుకొన్నప్పటికి సాధారణంగా అది అంతటితో ముగుస్తుంది. కాని కొన్నిచోట్ల తాము మొదట చూచిన రూపము, తమమనస్సులో కోరిక పుట్టించిన రూపము మనస్సునుండి తొలగిపోక మాటిమాటికి కల్లోలాన్ని సృష్టిస్తూ దానినిగూర్చియే భావించేటట్లు చేస్తుంది. ఈవిధంగా మాటిమాటికి ఆరూపాన్ని భావించుటవలన మనస్సులోని కోరిక పూర్వముకంటె బలముకలదిగా మారుతుంది. ఇట్టిస్థితి 'అనుస్మరణము' అనబడుతుంది.

4 గుణకీర్తనము :- అనుస్మరణస్థితి ప్రబలముగా ఉన్న స్త్రీ పురుషులు తాము ప్రేమించిన వారినిగూర్చి భావించుటతో మాత్రమే తృప్తి చెందరు. వారు తమ ప్రియతములయొక్క గుణాలను, వర్తనమును తెలిసి కొనుటయందు, తెలిసిన గుణవర్ననములకు తమలో తామైకాని, లేక ప్రాణమిత్రుల యెదుటకాని మాటిమాటికి కొనియాడుటయందు ఆసక్తిచూపుతారు ఇట్టిపరిస్థితి "గుణకీర్తనము" అనబడుతుంది.

5 ఉద్వేగము :- గుణకీర్తనమువలన కూడ కోరికకు బలం పెరుగుతుంది. అలాకోరిక మిక్కిలి బలముకలదైనపుడు అది తీరితేసరే! అదితీరకపోతే అట్టి ప్రబలమైన కోరికగల స్త్రీ పురుషులు ఏదో ఆవేశాన్ని ప్రదర్శిస్తూవుంటారు. వారి మనస్సులోని ఈకోరికయొక్క స్వరూపం తెలిసినవారు మాత్రమే వారి ఆవేశానికి కారణం గ్రహించ గలుగుతారు. ఇతరులకు వారి ఆవేశము కారణరహిత మనిపిస్తుంది. ఇట్టిస్థితి 'ఉద్వేగము' అనబడుతుంది.

6 విలాపము :- ఉద్వేగావస్థయందు కూడ కోరిక తీరక ఆ ఉద్వేగము ప్రబలముగా ఉన్నప్పుడు ఆ అవస్థకు చిక్కిన స్త్రీ పురుషులు ఏకాంతములో విలపిస్తారు. ఇట్టిఅవస్థ 'విలాపము' అనబడుతుంది.

7 ఉన్మాదము :- ఉన్మాదము అనగా పిచ్చి. విలాసావస్థయందుకూడ కోరికతీరక ఆ విలాసావస్థ ప్రబలంగా వుంటే ఆ స్త్రీ పురుషులు ఉన్మత్తులు (పిచ్చివారు) అవుతారు. ఈ అవస్థ ఉన్మాదావస్థ అనబడుతుంది. 8 వ్యాధి :- ఉన్మాదావస్థ యందైనను కోరికతీరనిచో ఆ స్త్రీ పురుషులు వ్యాధిగ్రస్తులు అవుతారు. ఇట్టి అవస్థకే 'వ్యాధి' అనిపేరు.

9 జడత్వష :- 'వ్యాధి' అనే అవస్థకు చిక్కిన స్త్రీ పురుషులు కొలదికాలములో జడులు (మందులు మూర్ఖులు) అవుతారు. అనగా పిలిస్తే పలుకరు. ఒకదానికొకటి సమాధానము చెప్పుతారు. ఈ అవస్థకు 'జడత్వము' అనిపేరు.

10 మరణము  :- జడావస్థ క్రమముగా మరణమునకు దారితీస్తుంది. అలా ఎవరైనా తాము ప్రేమించినవారిని పొందజాలక జడులైనపుడు కొలదికాలంలో వారు మృతిచెందుతారు.

ఈ మన్మధావస్థలు 'రతిరహస్యము' మున్నగు గ్రంథముల యందు దీనికంటె కొంత భిన్నముగా చెప్పబడ్డాయి. ఏమైనా అన్నిటిసారము ఒక్కటే. కామము ప్రబలమై వున్నప్పుడు అదినెరవేరాలే కాని నెరవేరకపోతే మృత్యువుదాకా మెట్లుకడుతుంది. అది అలా మెట్లు కడుతూ ఉన్నప్పుడు వీనికి చివరిమెట్టు మృత్యువే అనిగుర్తించి ఎల్లరు జాగ్రత్తపడుట అవసరం. కాని తాము అనుభవించే అవస్థ తీవ్రంగా ఉండనపుడు అది అంతటితో ముగుస్తుందే కాని ముందుకు పోదు. ఈవిషయమెరిగి వివేకముతో వ్యవహరించాలి.

బాల - యువతి - ప్రౌఢ - వృద్ధ

వెనుక చెప్పిన హరిణీ - బడబా - హస్తినీ జాతి స్త్రీలు వయోభేదమునుబట్టి ఒక్కొక్కరు 'బాల - యువతి - ప్రౌఢ - వృద్ధ' అని నాలుగు రకములుగా ఉంటారు.

బాల :- పదునారు సంవత్సరములకు లోపు వయస్సుకల బాల అనబడుతుంది.