నాగర సర్వస్వం/అలంకరణము - ఆవశ్యకత

వికీసోర్స్ నుండి

అలంకరణము - ఆవశ్యకత

కామం చాలా సున్నితమైన గుణం. అది మనస్సుయొక్కలోపలి పొరలలో జనించేదై ఉంటుంది. పురుషుడుకాని, స్త్రీకాని ఎవరైనా కామించి వారి అనురాగాన్ని సంపాదించదలచినపుడు - తమచే ప్రేమింపబడే ఆజనంయొక్క మనస్సులో తమ విషయమై ఒక సుముఖత ఏర్పడేలా వర్తించవలసిన వారవుతారు. ఆఎదిరిమనస్సులోని సూక్ష్మ సుక్ష్మభావాలనుకూడ గుర్తించి వానికి అనుకూలమైన వేషభాషాదికాన్ని అలవరచుకొనవలసి వుంటుంది.

అసహ్యము-మలినము అయిన వేషముకలవాని హృదయంలో అమృతంవలె స్వచ్ఛమైన ప్రేమ నెలకొనివున్నా వానిప్రేమ తిరస్కరింపబడుతుందేకాని ఫలించదు. అందుచే స్వచ్ఛమైన వేషధారణం అందరకూ మిక్కిలి అవసరం.

అందులోనూ నాగరకులై మిక్కిలి ప్రజ్ఞా విశేషాన్ని గడించి ఏ పని అయినాసరే సుందరంగా కళాత్మకంగా ఆచరించే స్వభావంకలవారై-ధనవంతులై-సౌందర్యం కలవారై = మదవతులైన పడతుల అనురాగాన్ని సంపాదించి, ఆఅలభ్య సుందరీసమ్యోగ పారవశ్యంలో సుఖిద్దామని వువ్విళ్ళూరేవారు-తమ శరీరాలంకరణ విధానంలో మిక్కిలి యెక్కువ ఆసక్తి చూపవలసి వుంటుంది. అలాకాక శరీరాలంకరణలో స్వచ్చవేషధారణలో అశ్రద్ధ చూపితే అట్టి నాగరకులైన యువతులు వారిని కన్నెత్తికూడ చూడరు.

నాగరకులైన స్త్రీ పురుషులు కాలాను గుణములైన స్వచ్ఛ వస్త్రాలను ధరించాలి. వేసవియందు తాపం ఎక్కువగా వుంటుంది, అందుచే సన్నని పలుచని దుస్తులు, ధరించే వానికేకాక చూచేవారికి కూడ తృప్తిని కలిగిస్తాయి. వర్ష ర్తువులో పరిమితములైన దుస్తులను ధరించడం మంచిది. చలికాలంలో ధరించే దుస్తులు కొంత ముదుకగా వున్నప్పటికి బాధలేదు. కాని ఏ కాలంలో ధరించే దుస్తులైనాసరే స్వచ్చంగా వుదుక బడ్డవై వుండాలి.

కేవలం ఇలాదుస్తులతో మాత్రమేకాక నాగరకులు నానారత్నాలతో నిండిన సముచితమైన ఆభరణ సముదాయముతోడను, మంచి సువాసనలు వెదజల్లే సుందర పుష్పాలతోడను కూడ తమ్ముతాము అలంకరించుకొనడం అవసరం. యీ ఆభరణాలు, పూలమాలలు శరీర సౌందర్యాన్ని ఇనుమడింప జేసేవై పుంటాయి. రత్నహారాలచే కంఠము పుష్పమాలలచే కేశపాశము, కంకణాలచే కరయుగ్మము అందాలు చింది ఎదిరిచూపులను మనస్సును ఆకర్షిస్తాయి.

అత్తరు, పన్నీరు మొదలగు పరిమళ ద్రవ్యాలను సముచితముగా వుపయోగించడం కూడ నాగరకులకు అవసరం. ఎల్లపుడు ఏదో ఒక మంచి సువాసనా ద్రవ్యం అలచుకొని నలుగురులోనికి ఎవడైనావస్తే ఆ సువాసనాద్రవ్యం కారణంగా అక్కడవున్న జనంయొక్క చూపులు అనుకోకుండా అతని వంకకు మళ్ళుతాయి. "ఎక్కడిదయ్యా! ఈసువాసన!"అని ఓహో! ఇతడా! అందుకే యీ ఘుమఘుమ!” అని అంటూ వారాతనిని నాదరంగా ఆహ్వానిస్తారు.

అందుచే అత్తరు, పన్నీరు, కర్పూర తాంబూలము-వీనిని నాగరకులు తప్పక సేవించవలసి వుంటుంది. ఇక శరీరంయొక్క చర్మంమీద విశేషించి మొగంమీద పూసుకొనే అంగరాగాలు (పౌడరు, షెదవి రంగు మొదలుగునవి) విషయంలోకూడ నాగరకులు అశ్రద్ధ చూపకూడదు. మేలైన అంగరాగద్రవ్యాలను ఎంచి జాగ్రత్తచేసి తగినట్లుగా వానిని వుపయోగించడంవల్ల చర్మసౌందర్యము, ముఖసౌందర్యము ఇనుమడిస్తాయి. యీ అంగరాగద్రవ్యాలను వుపయోగించికపోతే ముఖమందు శ్రమలక్షణమైన జిడ్డుతోకూడిన చెమట ఏర్పడివున్న సౌందర్యానికికూడ లోపం కలిగిస్తుంది. యీ కారణంచే నాగరకజనం శరీరాలంకారానికై ఉపయోగించే సర్వవస్తువులను నిత్యము ఉపయోగిస్తూండాలి. అలా కానినాడు వారికి నాగరకులతో గౌరవం లభించదు. ఇలా కేవలం శరీరాన్ని అలంకరించుకొనడమే కాక నాగరకులు తమ నివాసాలనుకూడ సుందరంగా అలంకరించి స్వచ్చంగా ఉంచుకొనాలి. ఏమంటే తాము ప్రేమించేజనం అనుకోకుండా తమయింటికి రావడం జరిగితే-తమ నివాసం కశ్మలంగా మలినంగా ఉంటే- తమ వేషం కారణంగా వారిమనస్సులో ఏర్పడుతూన్న సుముఖత కాస్తా నశించిపోతుంది. ఏమంటే- "ఇతడు బయటకు వచ్చినపుడు కొంచెం అలంకరించు కొంటాడేకాని ఇంటి దగ్గఱ గొడ్డులా ఉంటాడు. చీ ! చీ! యీ యింటిలో ఎలా ఉంటున్నాడు? ఏ వస్తువుకూ తీరుతెన్నూ లేదు. ఇలాంటి మలిన ప్రదేశాలలో ఉండేవాని మనస్సుకూడ మలినంగానే ఉంటుంది. నేనేదో మంచివాడు, అందంగా- నాజూకుగా ఉన్నాడనుకొన్నాను. వీని అసలు రూపం ఈ ఇంటిలోని వస్తువులను చూస్తే తెలుస్తోంది. చాలు వీనితోడి స్నేహం”- అన్న భావం వారి మనస్సులో కలుగుతుంది.

అందుచే నాగరకజనం తమ నివాసాన్ని సుందర వస్తునిచయంతో చూపరదృష్టిని ఆకర్షించేలా ఆలంకరించాలి. వీణ-వేణువు మృదంగము మొదలగు వస్తులను గృహంలో సముచిత స్థానంలోవుంచాలి. అవి దృష్టిని ఆకర్షిస్తాయి. తాము ఎవరి అనురాగాన్ని వాంఛిస్తున్నారో వారే తమయింటికి తలవని తలంపుగా వచ్చి-వీనిని చూస్తే వారిమనన్సులో రేఖామాత్రంగా వున్న సుముఖత పెరుగుతుంది. "కేవలం వేషమే అనుకొన్నాము. ఇల్లుకూడ చూడముచ్చటగా వున్నది. ప్రతి వస్తువూ చక్కగా వుండవలసినచోటవున్నది. వీణ-వేణువు మృదంగము కనబడుతున్నాయి. వానియందుకూడ ఇతనికి ప్రవేశంఉన్నది, కాబోలు. ఒకవేళ ప్రవేశం లేకపోయినా ఆకళ (సంగీతము) అంటే ఇతనికి మంచి ఆసక్తి అయినా వుండివుండాలి. లేకపోతే ఇవి ఇక్కడ ఎందుకుంటాయి.! ఏమో అనుకొన్నాను. మొత్తానికి ఇతడు మంచి రసికుడే!-"అన్నభావం వారి మనస్సులో కలుగుతుంది.” ఇంటిలో అవసరమైన పాత్రలు మొదలగునవి ఎలాగా ఉంటాయి. అవికూడ సుందరంగా ఉండేలా చూచుకొనాలి. ఇంటియొక్క ప్రతి ద్వారానికి రంగురంగు వస్త్రాలతో పరదాలు ఉంచడం కూడ అవసరం, అవి గృహంయొక్క అందాన్ని ఇనుమడింపజేస్తాయి.

గోడలకు వ్రేలదీయబడిన చిత్రాలను అందమైన పూలమాలలతో అలంకరిస్తూండడం. గృహాన్ని అగరు ధూమంతో సువాసనా వాసితం చెయ్యడంకూడ అవసరం.

నాగరకులు తమ యింటిలో వ్యాయామ సాధనాలనుకూడ జాగ్రత్తచేసి ఉంచుకొనాలి. ఏమంటే అవి నిత్య వ్యాయామానికి ఉపయోగిస్తూ శరీరారోగ్యాన్ని కాపాడుతూ వుండడమేకాక చూపరకు- "ఇతడు కేవలం పిండి బొమ్మకాదు. శరీరంలో తగినంత పిండి వున్నవాడే"- అన్న భావం కలిగిస్తాయి.

గృహంలోని ఆసనాలు, మంచాలు చిత్రచిత్రాలంకారాలతో తేజరిల్లేలా చూచుకొనాలి. మంచాలు, కుర్చీలు కంపించే లక్షణం కలవి (స్ప్రింగు ఇచ్చేవి) అయివున్నప్పుడు చూచేవారిని అవి వెంటనే ఆకర్షిస్తాయి. అంతేకాదు-ఆవచ్చిన వారి మనస్సులో ఆ స్ప్రింగుమంచంమీదనో లేక కుర్చీమీద ఒకసారి కూర్చొవాలన్న కోరికకూడ కలుగుతుంది. ఆ వచ్చినవారి అనురాగాన్నే కోరియత్నించేవాడైనప్పుడీ నాగరకుడు వారిమనస్సులోని కదలికను కనుపెట్టి ఆదరంగా- "కూర్చో! కూర్చో! బాధలేదు” అంటూ వారిని అందు కూర్చుండబెట్టి వారి మనస్సులోని అనురాగానికి దోహదం చెయ్యడానికికూడ వీలుకలుగుతుంది.

ఇక ఇంటి ముంగిలియుందు, పార్శ్వభాగములయందు సుందర పుష్పవృక్షాలను, చిన్న జలాశయాలను (ఇప్పుడు ఫౌంటైన్) ఏర్పచుటద్వారాకూడా ఇంటియొక్క అందం పెరుగుతుంది. చిలుకలు, పావురములు మొదలగు మధురంగా కూసే పక్షిజాతులు తమ గృహ ప్రాం