దశావతారచరిత్రము/8. బలరామావతారకథ

వికీసోర్స్ నుండి

8. బలరామావతారకథ

అష్టమాశ్వాసము



దసఖశౌర్య యాధుని
కాదిమహారాజదాన హసనక్షమధై
ర్యౌదార్యాదికగుణధు
ర్యాదవనము కృష్ణయార్య యధికైశ్వర్యా.

1


తే.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని
ధరణివర బలరామావతార మిఁకను, దెలియఁ జెప్పెద వినుమని తెలుపఁదొణఁగె.

2


చ.

మధురమణీయకేళి వనమంజుళవంజులకుంజమంజరీ
మధురసధారలన్ రమణమానితమానితమానినీమణీ
మధురవచోవిలాసముల మాసరమై సరమైకవాసమై
మధుర యనంగ నొక్కపురి మండితమౌ మహిమండనంబుగన్.

3


క.

అసదృశవితరణలీలా, వసుదేవుఁ డమిత్రమిత్రవనజాతవిభా
వసుదేవుఁ డనఁగ మధురన్, వసుదేవుఁడు దనరు యాదవకులోద్వహుఁడై.

4


క.

కల రతనికిఁ బదునలువురు, కులభార్యలు వారిలో సగుణలౌ భార్యల్
వెలయుదురు వచోజితకో, కిలలై రోహిణియు దేవకియు నన నిరువుర్.

5


క.

కమలాక్షుఁడు దేవకిస, ప్తమగర్భముఁ జేరి పిదపఁ దనయోగముచే
విమలంబౌ రోహిణిగ, ర్భమునఁ బ్రవేశించి పుట్టె బలరామాఖ్యన్.

6


తే.

గర్భసంకర్షణమున సంకర్షణాఖ్యఁ, గలిగె బలరామునకు నంతఁ గంసభీతి
రోహిణీకాంత నందుని గేహమున వ, సించి పోషింపఁ బెరుఁగుచు సీరపాణి.

7


మ.

హరియుం దానును గొల్లగుబ్బెతలగేహంబుల్ ప్రవేశించుచుం
బెరుఁగుం బాలును గొల్లలాడుచును గోపీవృత్తవక్షోజముల్
కరజాగ్రంబులఁ జీరుచుం గదిసినం గౌఁగిళ్లఁ జొక్కించుచుం
గరమర్థిన్ విహరించు సీరి సఖసంఘంబుల్ ప్రశంసింపఁగన్.

8


క.

బృందావనముల నావులు, మందలు మేఁపుచును గోపమాణవకులతో
నెందును బాలక్రీడా, నందంబునఁ బొదలు నందనందనుతోడన్.

9

సీ.

ఒకనాఁడు బలభద్రుఁ డుత్సాహమునఁ దోడిబాలురఁ బిల్చి యో బాలురార
మనలోన నెవ్వ రేమాత్రంబు దాటఁగా వలతురో కనుఁగొనవలయు హెచ్చు
దాఁటినవారిని దాఁటఁజాలనివారు వహియించి భాండీరవటముదాఁక
నరిగి రావలెనంచు హరికి శ్రీదాముని దక్కినవారికిఁ దగినవారి


తే.

యుద్దు లేర్పాటు సేయుచు నున్నచోఁ బ్ర, లంబదైత్యుండు గోపవేషంబుతోడ
వచ్చి వంచనచే సీరివధ మొనర్తు, ననుచు సంకర్షణున కుద్ది యయ్యె నపుడు.

10


తే.

నేరుపున నిట్టు లుద్దులు నేరుపఱిచి, రామకృష్ణాదు లొకట శ్రీదామముఖ్యు
లొకట నెలకొని తమతమయురుబలంబు, వెలయ లంఘించుచుండిరి వేడ్క మీఱ.

11


క.

చిరుబొజ్జ గదల జిగిబం, గరుగజ్జెలు మొరయ మద్దికాయలు మెఱయం
బరువెత్తివచ్చి దాఁటెన్, హరి యిరువదినాలుగడ్గు లౌరా యనఁగన్.

12


క.

హరి పాటిగ దాఁటెద నని, పరపున శ్రీదాముఁ డెగిరిపడె ముప్పదిటన్
సరివారలు ముప్పదిరా, యరయఁగ వేయనుచు గొల్లుమని నవ్వంగన్.

13


సీ.

సిగఁజుట్టుకొన్న సంపఁగిమొగ్గతాయెతు చేరు చేరువ తేఁటిబారుఁ గదుమ
నొసపరిమొసలివాయొంట్లు జాళ్వాచెక్కు నిద్దంపుచెక్కుల నీడఁ జూడ
బిగియించి కట్టిన మొగిలువన్నియచేల చెఱగులు కటియందు జిందు ద్రొక్క
వనమాలికవిశాలవక్షఃస్థలీశాలి బాలికాడోలికాకేళి దెలుప


తే.

దూరమున నిల్చి తొడదట్టి తోవవారిఁ, దొలఁగుమని దృష్టి చక్కఁగా నిలిపి పిడికి
లించి కరములు గుదియించి ఠీవిఁ గునుకు, పరువునను దాఁటె బలుఁడు తొంబదియడుగులు.

14


తే.

ఒకట కుదయాద్రి కస్తాద్రి కొక్కపంగ, దాఁటజాలియు గిరుదుగా దాఁటి యోడె
దానవుఁడు మీఁద గెలువఁగాఁ దలఁచి యాడె, గెలువ సులభంబె యోటమి గలుగుగాక.

15


సీ.

ఎగిరి నల్బదినాల్గడుగులు దాఁటగ నొకం డళికింప దాఁటక నెలమి నొకఁడు
దాఁటి నలివను ముందఱికి మ్రొగ్గె నొకండు మ్రొగ్గక యట మెరంబున నొకండు
గుఱికివ్వ లడుగిడ గుఱిలోనఁ బడె నొక్కఁ డివ్వలవ్వల దాఁటె నెలమి నొకఁడు
పరువిడుచో జాఱుచెఱగు ద్రొక్కె నొకండు లివగా దనుచు మరలిచనె నొకఁడు


తే.

నడుమఁ బిరివట్టి ఱొమ్ములఁబొడవు
భుజము, పొడవు కుత్తుకపొడవును బూన్కి దప్ప
కుండ గుప్పించి రొండొరు లుద్దు లగుచు, గెలిచె హలి చేర్వ యవ్వలిబలము లోడె.

16


శా.

అంతం గృష్ణుఁడు గేరి నవ్వుచును బావా యింక నీ కేను మున్
బంతంబుల్ పలుకంగ వంగుమని దర్పం బొప్ప శ్రీదాముపై

సంతోషం బలరంగ నెక్కి పదముల్ జాడించుచున్ వల్లెత్రా
డెంతే గైకొని హా యటంచుఁ గదిమెన్ హేలావినోదంబునన్.

17


క.

వేడుక గెలిచిన బాలకు, లోడిన బాలకుల నెక్కి యుల్లసములు పె
క్కాడుచుఁ బఱవ బ్రలంబుఁడు, తోడనె బలుఁ డావహించి దులదుల నడిచెన్.

18


తే.

దిటము మీఱంగ భాండీరవటము దాఁక, నరిగి యందఱు మరలంగ మరల కసుర
బలునిఁ గొని సనె గుఱి దాఁటి భారమైన, యంతఁ దనరూపు గైకొనె నద్భుతముగ.

19


సీ.

తగిలికాలినమోడు చిగిరించినటువలెఁ గఱకుజుంజుఱువెండ్రుకలు దనర్ప
నగ్నికుండము లంచు నక్షిగోళంబులు గములు గూడుక పతంగములు వ్రాల
వివృతాస్యపాతాళవివరనిస్సరదచ్ఛదారుణాహులనాఁగ దంష్ట్ర లమర
గగనంబునను వానకాళ్లు జాతినరీతి నురుతరదీర్ఘబాహువులు దనరఁ


తే.

గుంభతటమున సింగంపుఁగొదమ నుంచి, తను వెఱుంగక చనుమత్తదంతిలీల
వరనిశాటవిపాటనబలుని బలుని, యంస మెక్కించుకొనిపోయె నసురవిభుఁడు.

20


క.

అపు డాబలుఁడు నిశాచరు, కపటముఁ గని కృష్ణకృష్ణ గ్రక్కునఁ జెపుమా
యిపు డేమి యుపమ వచ్చెన్, విపరీత మటన్న నగుచు వెన్నుం డనియెన్.

21


సీ.

గగనాదిసృష్టి గల్గకముందు వెల్గొందు నిర్మలబ్రహ్మంబు నీవ కావె
ప్రభవించువెనక ప్రపంచస్వరూపమై నెగడు విరాణ్మూర్తి నీవ కావె
జన్మాదిరహితుఁడై సత్త్వగుణంబు వహించునారాయణుం డీవ కావె
వేయుఫణంబుల విశ్వంభర భరింప నిపుణుఁడౌ ఫణిరాజు నీవ కావె


తే.

యేను నీవయ కాదె నీ వేను గాదె, యవని రక్షింప నిరువుర మైతి మింత
తలఁపు నిజమూర్తి మానుషత్వంబు నిలుపు, మఱువ నేటికి యన్న నీమహిమ లన్న.

22


క.

కడువడి బలుఁడు నిజస్మృతి, బెడిదం బగుకడిమి దనుజుఁ బిడికిఁటఁ బొడవన్
బొడబొడ నెత్తురు గ్రక్కుచుఁ, బడియెఁ బ్రలంబుండు గోపబాలురు సెలఁగన్.

23


వ.

అంత.

24


క.

తొలుతన్ రాముఁడనై ఖరు, బొలియించితి నిటుల ననుచు భూజనములకుం
దెలిపెడుగతి బలరాముఁడు, పొలియించెన్ ఖరుని తాళముల నవని బడన్.

25


వ.

యివ్విధంబున ననేకబాలక్రీడాలోలుండును బ్రలంబధేనుకాసురవిఫాలుండును
నగుచుం గామపాలుం డంత నృశంసుండగు కంసుండు జిఘాంసాక్రూరబుద్ధియై
యక్రూరుచేత ధనుర్యాగావలోకనవ్యాజంబునఁ బిలిపించినఁ గొంచక కాంచనాం
బరసహాయుండై మధురాపురంబున కరిగి.

26


సీ.

తొగఱేనిలీల ముద్దులు గుల్కు నెమ్మేను వలుదకాటుకకొండవంటిరూపుఁ
బిడికిటి కడఁకువౌ బెగడు నెన్నడుమును బ్రేవులప్రోవైన పెద్దకడుపు
నట్టహాసంబున నడరెడు తెఱనోరుఁ దళుకుగోఱలపేరిదంతయుగము
వెఱక పై గమకించువిక్రమక్రమమును మైయెఱుంగని మదోన్మత్తవృత్తి

తే.

దనర హరియును గరిని మార్కొనినకరణిఁ, గంససభలోన ముష్టికుఁ గఠినకులిశ
నఖముఖంబులఁ జీరి తన్మస్తదళన, గురుయశోమౌక్తికములఁ గైకొనియె బలుఁడు.

27


తే.

కృష్ణుచే గంసుఁ జంపించి యెలమి నుగ్ర, సేను తద్రాజ్యమున కభిషిక్తుఁ జేసి
తల్లులును దండ్రియును దాము మొల్లమి గని, యెల్లసంతోషములఁ జెంది యుల్లసిలఁగ.

28


వ.

అంతఁ గంసపత్నులును దనపుత్రికలు నగునస్తియుఁ బ్రాస్తియు నను నాస్తిమధ్యలు
ప్రోత్సాహంబు చేసిన నాహవబాహులేయబాహుబలుం డగుజరాసంధుండు
పదునెనిమిదవమాఱు మాఱులేనికడిమి నిరునదిమూఁడక్షోహిణులం గూడి మధు
రాపురంబు సుట్టుకొనినం గలఁగఁ బాఱు యదువృష్ణిభోజాంధకవీరులం జూచి
పురక్షోభంబు గాకుండ నేర్పున రాజసుతులతో జరాసుతుం బరాజితుం జేసెద
నని మురాహితసహితుండై ఖరారిపురంబు నిర్గమించి దక్షిణాభిముఖుండై య
నేకజనపదవనంబులు దాఁటి సహ్యనగంబున నసహ్యతేజోభిరాము భార్గవరా
ము దర్శించి తదీయకామధేనుపయఃపానపీనబలు లగుచు భార్గవోక్తదుర్గమార్గం
బున ననర్గళప్రమోదంబునం జనిచని.

29


శా.

శ్రీమంతంబు శిరోగ్రధామసుషమాసింధూరితద్యోరమా
సీమంతంబు వధూసమేతవిహరత్సిద్ధాదినానామరు
త్సామంతంబు విలోకిదుష్కృతపయోజస్తోమహేమంతమౌ
గోమంతంబున కేఁగి యబ్బలుఁ డనుంగుందోడుతో నిట్లనున్.

30


సీ.

కాంచనమయ మౌటఁ గనకాద్రి యనవచ్చుఁ గలితైకశృంగంబు గాదు గాని
ఖర్జూరమయ మౌటఁ గైలాస మనవచ్చుఁ బలలాశిచేఁ బెల్లగిలదు కాని
హిమనిఛానం బౌట హిమశైల మనవచ్చుఁ బడుచుఁజూలని చెప్పఁబడదు గాని
కలితగంధం బౌట మలయం బనఁగవచ్చు జడమరుద్విహృతి చొప్పడదు గాని


తే.

యదిర యేగిరు లెనయింక నమరమిథున, మందహసనాతితుహినహేమంతదరికి
హరివిలోకపలాయద భ్రాంబుపాయ్య, మర్త్యనామంతకరికి గోమంతగిరికి.

31


మ.

అని వర్ణించుచు నగ్గిరిం గలుగు నాయావింత లీక్షించుచున్
ఘనతాపింఛమహావనీతమములోఁ గంజేక్షణుం బాసి యొం
టిని దా నొక్కకదంబభూరుహముక్రీనీడన్ వసించెన్ బలుం
డనురాగంబున నట్టె యప్పు డుదయంబౌ చంద్రు నీక్షించుచున్.

32


ఉ.

అంతట నొక్కమందమలయానిల మెంతయుఁ జల్లనై శ్రమం
బంతయు శాంతిగా మలయునప్పుడు మద్యము తావి రాఁగ వి
భ్రాంతమనస్కుఁడై హరి పిపాసఁగదంబమహీజకోటరా
భ్యంతరసీమ నున్న సురఁబానము జేసెఁ బ్రమత్తచిత్తుఁడై.

33


తే.

అంత వారుణి కాంతియు నబ్జసదన, యనఁగ మువ్వురుపువ్వులబోం డ్లతనుభువన
విజయలక్ష్ములొ యన రూపవిభ్రమములు, హెచ్చి మచ్చిక హలిఁ జేరవచ్చి రపుడు.

34

సీ.

మదిరారసముగబ్బు మాటలతబ్బిబ్బుఁ గొదమగుబ్బలయుబ్బు నిదురమబ్బుఁ
దొలఁగుపయ్యెదకప్పు దూసియాడెడుకొప్పు వెడవీడు నెఱికొప్పువిరులయొప్పు
మొదటిలత్తుకఠీవి చెదరినకెమ్మోవి జాఱినచెంగావిచీరనీవి
కమ్మ నెమ్మేనిగ్గుకడకెడు బలుసిగ్గుఁ దడఁబాటు నడజగ్గుఁ దగ్గుమొగ్గు


తే.

వాలుఁగన్నులకెంపుపై వ్రాలుమంపు, నేలపాటిల నొక్కకెంగేలిమ్రొక్కు
మురువు నెమ్మేనిబిగువుఁ గెమ్మోవినగవు, నలర నిట్లనె హాల మోహాలవాల.

35


క.

వరుణునిపంపున వచ్చితి, వరు నిను వరియింపఁ గుముదవల్లభునివిభా
వరి యింపు మీఱి మదిలో, వరియించు క్రమంబు మెఱయ వరియింతు నినున్.

36


క.

అనునంతఁ గాంతి శశిక, న్నను జక్కనివాఁడవౌట నాయకుఁగా ని
న్ననుమతిఁ గోరితి న న్నీ, యనుమతి రతిఁ దేల్పుమని పటాంచల మలమన్.

37


క.

ఆరామచిలుకలందగు, నారామలఁ గూడియున్న యారామునితో
శ్రీరామ యనియెఁ గుచతట, హారామలకాంతి నగవునందుఁ జిగుర్పన్.

38


మ.

విన రామా యభిరామ వీరల దయన్ వీక్షించి గైకొన్నరీ
తిని నన్నుం గయికొమ్ము దెచ్చితిఁ బయోధిన్ నీలచేలంబులున్
ఘనకోటీరము వజ్రకుండలము సింగారించుకొ మ్మన్న మ
న్నన వానిన్ గ్రహియించి యెచ్చినమతిన్ నారీమణిం జేకొనెన్.

39


మ.

బలితంపున్ వలిగుబ్బచన్ను లొరయం బైవ్రాలుబంగారపుం
గళుకుంజెక్కిలి ముద్దుఁ బెట్టుకొను సింగారంపుఁ గెమ్మోవికెం
దలిరుందేనెలు గ్రోలు సోలు మొనపంటన్ నొక్కు సొక్కున్ ముదా
కులయై తానరగంటఁ గాంతునుర మెక్కున్ హాల ప్రౌఢక్రియన్.

40


సీ.

ఉదుటుచన్దోయి మేనొరయ దగ్గఱ నిల్చుఁ గౌఁగిలించిన ప్రేమఁ గౌఁగిలించు
మోహంబు మీఱ నెమ్మొగము చెక్కిలిఁ జేర్చు ముద్దుఁగొన్నను వేడ్క ముద్దుగొనును
దావిచెంగావికెమ్మోవి మోవిని గూర్చుఁ గంటి చేసినఁ దమిఁగంటి సేయు
బంధోచితంబుగాఁ బవళించుఁ బైకొని బడలినఁ బైకొని బడలజేయుఁ


తే.

జిలుగుఁబయ్యెదసురటిచే సేద దేర్చి, వేడ్క మీఱంగఁ గపురంబువిడె మొసంగు
రమణుఁ డిటు రమ్మనినఁ బునారతికి నొగ్గుఁ, గాంతి హరిమధ్య మధ్య శృంగారములను.

41


తే.

చన్నుఁగవ ముట్టనీయదు చిన్నిమోవి, యానఁ గానీదు నీవిఁ జెయ్యాడనీయ
దటులనయ్యును మిగులమోహంబు వెనిచె, వనజగేహిని ముగ్ధభావమున పతికి.

42


సీ.

ఒకకొమ్మఁ గౌఁగిలించుక వెన్క మెలిగొన్నఁ గేల నిర్వుర గుబ్బక్రేవ లంటుఁ
జెలుల లోఁదొడఁబిఱుందుల గోరు లుంచుచు మురువుతో నొకతెకు ము ద్దొసంగు
సకియలజఘననాభికలఁ జేయార్చుచు మొనపంట నొకతెకెమ్మోవి నొక్కుఁ
గేలిచే నొకతె సొక్కించి యిర్వుర నంగుళీరతంబునం గళల్ జాఱఁ జేయు

తే.

మధురగంధోత్తమాపానమత్తు లగుచుఁ, జిత్తమున నాన యెఱుఁగక మొత్తముగను
హత్తుకొనుబిత్తఱుల గూడి చిత్తజన్ము, జన్మసాఫల్యకరుఁడు ప్రసన్నవరుఁడు.

43


ఉ.

గంధగజేంద్రలీల యెసఁగంగ హలాయుధుఁ డానతాంగపు
ష్పంధయనీలవేణికటి చిక్క బొసంగఁగ నిల్చి ధేనుకా
బంధధురీణుఁ డౌచు నిరుప్రక్కలఁ గాంతలయందు నొక్కసౌ
గంధికగంధి ముద్దుగొనుఁ గ్రమ్మఱ నొక్కతెగుబ్బ లంటుచున్.

44


చ.

అలసితి వంచుఁ బైకొనులతాంగి మిటారము సూచి నవ్వుచున్
వలపునఁ దాళలేక యెదవ్రాలెడుబాలికఁ గౌఁగిలించుచున్
జిలిబిలిచెక్కు ముద్దుఁగొను చేడియవాతెఱతేనె లానుచుం
గళలు గరంచి యేలె హలి కాంతల మువ్వుర నొక్కనేర్పునన్.

45


తే.

కంతుకేళిక నీరీతిఁ గలసి మెలసి, యంత సురతాంతరంబున నలసిసొలసి
యలయికలు దీర్చి తెమ్మెర ల్పొలసిబలసి, చెలులు జెలువుఁడువేడ్కల వెలసిరొలసి.

46


తే.

అంతఁ గృష్ణుడు చనుదెంచి యాదవేంద్ర, యదె జరాసంధుఁ డరుదెంచె నఖిలరాజ
సైన్యములతోడ నంచు నాశైలశిఖర, మెక్కి కనుఁగొనుచుండి రయ్యిరువు రపుడు.

47


మ.

శరధి న్నిద్దురవోవు శ్రీహరి శిరస్సౌవర్ణకోటీరమున్
విరసుండై కొనిపో విరోచనువడిన్ వెన్నాడి దైత్యఘ్నుఁడై
గరుడుం డాత్మకఠోరతుండమున దేఁగా నప్డు శ్రీకృష్ణశే
ఖరభాగంబున వ్రాలెఁ దన్మకుట మర్కచ్ఛాయ నందంబుగన్.

48


క.

హలికి మకుటము మణికుం, డలమేచకనిచయచయము నందసుతునకుం
గలితసువర్ణకిరీటము, గలిగెన్ గిరి నిటు లయత్నగౌరవసిద్ధిన్.

49


వ.

నగరంబు వెలువడివచ్చిన యది మొదలుఁ గరంబు చలంబునం బ్రలంబారి యెందుఁ
బాఱిపోయెదు నాబారింబడితి వింక బాగిలించక యింగిలించిన విడుతునే
యనుచుం బారీంద్రంబు వెంబడిం బడు గంధసింధురంబు తెఱంగున జరాసంధ
వసుంధరావరాజరాధిరాజన్యుండు కంటకంబు లాడుచు వెంటంబడి యగ్గట్టు
చుట్టుముట్టి నేలమట్టంబుగాఁ గొట్టుచు నని బెట్టి దంపు కట్టల్కవుట్ట నక్కట్టిడి
దిట్టయై నెట్టుకొని మద్రకళింగచేకితానబాహ్లికకాశ్మీరగోనర్దకరూశకింపురుష
మాళవభూపాలురఁ బర్వతాపరభాగంబునందు దుర్యోధనదుశ్శాసనకర్ణ
వైదర్భభోజాధిపరుక్మిద్రుపదవిందానువిందదంతవక్త్రశతధన్వవిదూరదభూరి
శ్రవత్రిగర్తాదు లుత్తరపార్శ్వంబున నులూకకైతవేయైకలవదృఢాక్షక్షత్రధర్మజ
యద్రథోత్తమోజసాల్వకౌరవేయులు పూర్వభాగంబునఁ దరదచేదిరాజసహితుం
డై దక్షిణభాగంబున విడిసి దుర్గంబులు లగ్గలుపట్టు నగ్గలిక వెగ్గలంబు గటంకం
బులు గిరివిటంకంబులు భుజాటంకములఁ బొంకంబులుగా భేదించియు గదాదం
డంబు వేదండోపమగండంబులఁ దుండించియుఁ బరిఘల వ్రేసియుఁ బట్టసంబుల గ్రు

చ్చియు ఖనిత్రంబుల గ్రొచ్చియు నుద్దవిడి నుద్దామకుద్దాలంబులం ద్రవ్వియు
నగ్గుంటి గంటి సేయంజాలక మందరవసుంధరాధరోత్పాటనపరాయణులై నిరా
కృతులగు సురాసురులచందంబునఁ బరానీకినీనిరాకరణప్రవీణపరాక్రమవిరాజిత
ధరాదిరాజన్యులు దురాపంబిద్ధరాధరంబని పరాక్రాంతులైన సురాళించి జరా
సంధుండు గరాలంబితకరాళశరాసనవరాముక్తకరాళశరాసారంబున ధరాగ్రం
బుఁ గప్పియుం బురాణపురుషులగు ఖరాహితమురాభిరాతుల బరాభూతులం జే
యఁజాలక దురాలోచనంబు చేసిన.

50


మ.

సరసాధృచ్చిఖరానుజస్వకదిదక్షాకోపభూపాగ్రణీ
పరితఃప్రజ్వలితానలోజ్జ్వలశిఖాపర్యాకులత్ఖడ్గకా
సరమత్తేభవరాహసింహచమరీశార్దూలముఖ్యాటవీ
చరదుర్వారభయారవాకులితమౌ శైలంబు వీక్షించుచున్.

51


శా.

గోమంతంబున కీయవస్థ మనలం గూడం గదా కల్గె నా
హా మేలే యిటువంటిదుర్యశము బాహాశక్తి మీఱన్ నృప
గ్రామంబుల్ మడియింపలేమొ యని శృంగం బద్రిశృంగస్థమై
యామత్తద్విపకోటిలో దుముకుచాయం గుప్పునన్ సేనలోన్.

52


క.

దుమికిన హలితో దుమికెం, గమలాక్షుఁడు ముసలనందకప్రముఖములౌ
విమలాయుధములుఁ దోడనె, సమకూడెన్ మింటనుండి జను లరుదందన్.

53


క.

ఈరీతి శౌరి సీరియు, ఘోరాయుధపాణు లగుచుఁ గ్రూరారిచమూ
వారణహయదారుణరథ, వారణలీలాపరానివారణభంగిన్.

54


క.

చరియించుచు బలుఁ డుద్ధతిఁ, గరముసలముచేత సమరకరులన్ ఖరులం
బరులం గరులన్ హరులం, బొరలంగాఁ జేసెఁ గదనభూభాగమునన్.

55


క.

దరదుఁడను ధరణిరమణ, ద్విరదుని ముసలమునఁ గూల్చె విబుధారి చమూ
దరదుఁడు సంస్మితనవకుం, దరదుఁడు హలధారి దేవతలు మే లనఁగన్.

56


క.

అంత జరాసంధుఁడు దు, ర్తాంతగదాదండతుండదారుణమదమౌ
దంతావళంబుఠేవం, బంతంబునఁ గదిసి కామపాలుని బలికెన్.

57


మ.

హలముం గైకొని దున్నగావలయుఁగా కాయోధనక్రీడకుం
బొలయన్ శక్తుఁడవే హలాయుధ రణంబున్ మాని మాభూమిలో
వలఁబా లెక్కుడు దున్నర మ్మటకు గోపాలుండవై తేని సం
బళమిత్తుం బసిఁగావు కావు ప్రతిభూపాలుండ వీ వాజికిన్.

58


చ.

హలమున వచ్చుధాన్యముల కప్పటికప్పుడు దంచుకోఁగ రోఁ
కలిఁ గయికొంటి వౌర యిటు గామిని గూలికి ధాన్య మెద్ది ప
ల్లెలఁ బసి గాచుచున్నఁ బనిలే దిఁకఁ జక్రము శూర్పధారిగా
వలయును నీదుసోదరుఁడు వారిజనాభుఁడు రోహిణీసుతా.

59

వ.

అనిన మాగధునకు హలాయుధుం డిట్లనియె.

60


మ.

క్షితినాథత్వము లేదుగావునఁ బరక్షేత్రంబులం దున్ని లో
హితధారం బదనిచ్చి రాజమకుటీహీరావళీబీజసం
తతులం జల్లితిఁ గీర్తిసస్యములకై తద్వేళ యుష్మద్ద్రుశా
కృతిపుల్ మొల్వఁగఁ గల్పుతీయుటకు నే నేతెంచితిన్ మాగధా.

61


తే.

మాగధాధమ బహుధాన్యమర్దనమున, కేను రోఁకలి గైకొంటి నిది నిజంబె
యింక మీలోన గట్టిపొ ల్లేరుపఱిచి, చెరఁగఁ జక్రంబె చాలదే శ్రీహరికిని.

62


శా.

రారా మాగధ మానరా మదము క్షాత్రం బేదిరా నీకుఁ గై
వారంబుల్ సవరింపరా నృపసభన్ వారింపరా నీచమూ
వారంబు ల్బురిసేర ఘోరతరదుర్వారుండరా నేను గ
ర్వారంభంబులు వీడరా యన మదేర్ష్యామర్షదుర్ధర్షుఁ డై.

63


చ.

అటు నిటుఁ బొంచి పొంచి మగధాధిపుఁ డొయ్యన నేటవాలుగాఁ
దటుకున వ్రేసె వేటు దను దాఁకఁగనీయక తట్టివైచి య
క్కుటిలునురంబు వైచె యదుకుంజరుఁ డందునఁ గొంతనొచ్చి య
ప్పటుబలశాలి సందుగొని పార్శ్వము వేసెఁ దటానఁ దప్పఁగన్.

64


వ.

ఇవ్విధంబున మాగధహలాయుధులు గదారణప్రవీణులై పెక్కువిన్నాణంబులం
బోరునెడ డస్సిన మాగధు వధింప నుద్యోగింప మాగధవైరి వేఱెయున్నాఁడు
నీవు ప్రయాసపడవలవ దనినుడువు నాకాశవాణిపలుకుల కులికిపడు జరాసం
ధుం బ్రథమసంగరంబున దశకంధరు దయదలంచిన సింధుబంధనుం డగు రఘు
రాముచందంబునఁ గృపాభిరాముండై బలరాముండు వెఱవక పురంబున కరుగు
మని జరాసంధుం బంచి యన్యరాజన్యులం బరాజితులం జేసి విజయలక్ష్మీవిరాజి
తుండై విజయసఖసమన్వితంబుగా ద్వారకాపురమున కరిగి సుఖంబుండె నంత.

65


మ.

ఎలవంకన్ వలవంకఁ జక్రధరుఁడున్ వృష్ణ్యాదులౌ బాంధవుల్
నలువంకన్ మడిఁజంక చేతులిడి నానాభూపతు ల్గొల్వఁగాఁ
దలపంకం నెలవంకఁ గల్గు దొరచందానన్ బ్రభావాఢ్యుఁడై
కొలువయ్యెన్ నలువై హలాయుధుఁడు దళ్కుం గొల్వు కూటంబునన్.

66


తే.

అప్పు డొకద్వారపాలకుఁ డరుగుదెంచి, స్వామి విన్నపమొకటి యెవ్వాడొ కాని
పుడమి జనులకు ముమ్మడిపొడవువాఁడు, నివ్వెఱఁగుతోడ వాకిట నిలిచినాఁడు.

67


క.

దనుజుఁడు గాఁడు నృపాలక, ఘనలక్షణలక్షితుండు గాఁ డమరుండుం
గనుఱెప్పపాటు గలఁ దా, తనిఁ గని జను లదరిపాఱెదరు పురిలోనన్.

68


చ.

అదియునుగాక యొక్కధవళాంబుజలోచన వెంటవచ్చి యు
న్నది భువనైకమోహనమహాద్భుతరూపము కల్మి నిందిరా

సుదతియుఁ దప్ప దీధరణిఁ జూడము తాదృశరూపలక్ష్మి యా
త్రిదివములోన నైనఁ గలదే యిఁక దేవరచిత్తమం చనన్.

69


క.

ఎవ్వఁడొకో యని మదిలో, నివ్వటిలన్ సంశయంబు నృపవరులన్నం
గవ్వడిచెలికాఁ డనియెన్, నవ్వచుఁగృతపురుషుఁ డౌట నాకుం దోఁచెన్.

70


తే.

ఎవ్వఁ డైన నేమి యిటకు రావలె నన్న, దోడి తెమ్మటన్న వాఁడు వోయి
తోడి తేర నతఁడు దుస్సహతనుదీప్తి, హెచ్చఁ గొలువు సేర వచ్చుటయును.

71


క.

ప్రత్యుద్యుతుఁడై యతనిం, బ్రత్యేకవరాసనంబుపై నిడి యర్చ్యా
కృత్యములు దీర్చి హలధరుఁ, డత్యుత్తమప్రీతివినతుఁడై యి ట్లనియెన్.

72


ఉ.

వింటిరె మిమ్ముఁ జూచినను విస్మయ మయ్యెడు నాకు నన్నఁ గ
న్గొంటి మహాద్భుతంబు సమకూరెడు మీకునుఁ గాలభేద మీ
రెంటికి హేతు వింక వివరించెద నా కథ విన్ము నాకభి
త్కంటకలుంఠనప్రవణకారణజన్మఫలా హలాయుధా.

73


సీ.

ధర్మంబు నాల్గుపాదంబులఁ జరియించు నేయుగంబునఁ గుం టొకింత లేక
తోడ మాటాడుచుందురు బంధువులఁబోలి మేయుగంబున నాకనాయకులును
దనసాత్త్వికము దోఁప ధవళాంగుఁడై మించు నేయుగంబునను లక్ష్మీశ్వరుండు
నేవిఘ్నములు లేక యెల్లవాంఛితములు నేయుగంబున ఫలియించుచుండు


తే.

నట్టికృతయుగమున కీర్తిహారి యగుచుఁ, బ్రబలు నానర్తమేదినీభర్తసుతుఁడ
బేరు రైవతుఁ డండ్రు నాయూరు లవణ, జలధిలోపల దగుఁ గుశస్థలి యనంగ.

74


క.

అనఁ గృష్ణుఁడు రైవతకా, ఖ్యనగర మదె నీదుపేరఁ గావించినదే
యలసర్వజ్ఞుఁడ వీ వెఱుఁ, గనిది గలదె యటుల నౌను గంజదళాక్షా.

75


క.

అది యుండె వినుము నాకథ, హృదయాంబుజమధ్యమునను శ్రీహరిమధ్యం
బదిలముగ నిల్పి సలిపితిఁ, బదివేలేఁడులు మహాతపం బతినిష్ఠన్.

76


తే.

అంత నైదేండ్లబాలిక యైపయోధి, కన్నె నాతోడనున్న రాకన్నె యనుచు
బ్రేమ ముద్దాడుచుండితి రామ నాఁటి, యద్భుతప్రేమ యింతంత యనఁగరాదు.

77


తే.

కడపట మఱేమి యిటువంటికన్నె గలుగ, వలయునంచును నాతపఃఫలము గాఁగ
నడిగితిని వెన్కఁ బ్రత్యక్షమైన లక్ష్మి, నటుల దయజేసె నాయమ హర్ష మొదవ.

78


క.

తనయుల నూఱ్వురఁ గంటిం, దనుసంభవ యొకతె లేమిఁ దటినీపరిణీ
తనయన్ వేఁడితిఁ దనయం, దనియన్ లేకున్నఁ గోటితనయులనైనన్.

79


తే.

ఆఁడుపడుచా యటంచు నత్యల్పముగను, మది నెఱుంగక కొంద ఱాడుదురు గాని
కన్య సామాన్యమే పుత్త్రుఁ గాంచెనేని, నుభయకులములఁ దరియింపనోపుఁ గాదె.

80


తే.

అది విని చెలంగె మత్సతి యటులుఁ గాదె, యల్లుఁడని యాఁడుబిడ్డని యగవు తగవు
లంపకము శుభశోభనమని యివెల్ల, సంతసముఁ జేయుఁ గన్యకాజనములకును.

81

క.

కొన్నాళ్లకు గర్భిణియై, కన్నియఁ గనె మద్వితీయకరములు మొగుపం
గన్నజనుల్ శశిరేఖం, గన్నట్టిద్వితీయపోలెఁ గళఁ జెలువొందన్.

82


తే.

చూచువారెల్ల నమ్మక్క చుక్కరీతి, జొక్కమైయున్న దీకన్య చక్కఁదనము
నిక్క మెక్కడ లేదని చొక్కి పడఁగ, రేవతీనామ మిడితిఁ బుత్త్రికి మహాత్మా.

83


తే.

ఏఁటఁ బెంచుదానిఁ బూటఁ బెంచెనటంచు, జనులు పల్కుపలుకు సత్యముగను
గన్నతల్లి మిగుల గారాబమునఁ బెంపఁ, బెరిఁగెఁ జైత్రలతిక పెంపు మీఱ.

84


సీ.

అచ్చనగండ్లు దోయాలును డాఁగిలిమూఁతలు నాలుగుమూలలాట
గుజగుజరేకులు గుజ్జనగూళ్లును బొమ్మలపెండ్లిండ్లు నమ్మనములు
నత్తగోడలియాఁట నాలుమగనియాట తాటిచెట్టాట కోలాటములును
బింపిళ్లుఁ జెండుగోరింపులు వామనగుంతలు వెన్నెలకుప్పలాది


తే.

మఱియుఁ బుడికిళ్లు మొదలుగా మనసు వచ్చు, నాటలన్నియుఁ దోడి తొయ్యలులఁ గూడి
పడుచుఁదనమున వేడుకపడుచు నాడు, ముద్దరాండ్రకు నల్లారుముద్దుగాను.

85


సీ.

అయ్యయయ్య యటంచు నెయ్యంబు మీఱఁగాఁ బలుమాఱు పైపక్కఁ బడకయుంటఁ
జెల్లె బొమ్మలపెండ్లి చేసె దిం దేటికిఁ జేయవైతివె యన్న సిగ్గుపడుట
దాదులమనవి యత్నమున నాతోఁ దెల్ప నరుదెంచితివి యన్న మఱలిచనుట
యమ్మ యెవ్వరిఁ బెండ్లి యాడెదవేయన్న ముసిముసినగవుతో మసలుటయును


తే.

గరగరిక గాఁగనుమనోమఁ గలుగుటయును, బ్రేమ మీఱంగ వన్నెలు పెట్టుటయును
గురులు గొప్పునఁ గూడెడు కొమరువయసుఁ, దెలిపె నానాఁటఁ గన్యకాతిలకమునకు.

86


వ.

ఇవ్విధంబునఁ గన్యకారత్నంబునకు మెఱుఁగుసానయుం బోలి యనన్యాదృశహావ
భావం బగుయౌవనప్రాదుర్భావం బగుటయు స్వయంవరంబు చాటించిన.

87


శా.

సప్తద్వీపమహీపశేఖరసుతు ల్సౌందర్యరేఖాన్వితుల్
సప్తార్చిప్రతిమానతేజులు బిడౌజస్ఫర్ధిసంపద్భుజుల్
సప్తాశ్వక్షణదాకరాన్వయభవు ల్శౌర్యక్రియాశాంభవుల్
సప్తాంభోధిమణీవిభూషణధరుల్ చన్దెంతు రశ్రాంతమున్.

88


క.

చంద్రానన యిందొకరా, జేంద్రకుమారునిని గోర దింతియ కాదా
యింద్రుని మెచ్చదు మఱి యా, చంద్రుని మెచ్చదు విలాససంపదకలిమిన్.

89


ఉ.

ఓయిగురాకుఁబోఁడి కనవో వినవో యిది యేమి చెల్ల నీ
ప్రాయపుతోయజాక్షు లెడఁబాయ రొకప్పుడు ప్రాణనాథులం
బ్రాయము రిత్తవుత్తురటె పల్కవె నీమది నున్న యట్టియా
నాయకుఁ దెల్పవే త్రిదశనాయకుఁ గోరినఁ దెచ్చి కూర్చెదన్.

90


క.

అని కన్నతల్లి వేఁడినఁ, జనవున నే వేఁడికొనిన సకు లడిగిన వీఁ
డని వ్రీడ నొడువకున్నం, దనయకుఁ బతి నిశ్చయించుతలఁపు జనించెన్.

91

శా.

సన్న్యాసంబునఁ గాని మర్త్యులకు గాంచన్ రాక త్రైలోక్యమూ
ర్ధన్యంబై తగు బ్రహ్మలోకమున కేతన్మర్త్యదేహంబుతోఁ
గన్యారత్నముతోడ నేఁగి భవనాగ్రక్షోణి సంప్రాప్తసౌ
జన్యుండై మను ద్వారపాలకుఁడు వంచం బోవుచోఁ గొల్వునన్.

92


చ.

మిళితగభీరమర్దళధిమింధిమినాదముఁ గిన్నరాంగనా
కులకలతానమానములు ఘుమ్మని వీనుల విందు సేయ సం
కులసురసిద్ధసాధ్యమునికుంజరముఖ్యులఁ ద్రోచికొందు లో
పలి కటువోయి సందడిని బాలిక యెంతయుఁ దత్తఱింపఁగన్.

93


క.

ఒకయోర నిలిచి దివిష, న్ముకురాస్యల మంజులాస్యములఁ జూచుచుఁ గొం
డొకదడ వుండితి నానృ, త్యకళావైభవము లెన్నఁ దరమే మనకున్.

94


క.

ఎక్కడఁ జూచెనో యప్పుడె, వాక్కాంతుఁడు సూచి పిలువ వడిఁ జని భక్తిన్
మ్రొక్కి నిలుచున్నఁ గన్నియ, నిక్కడి కేమిటికి దెచ్చి తీవని యడుగన్.

95


శా.

ఈయారాజు లటంచుఁ గొందఱికిఁ బేరేర్పాటు గావించి ధా
తా యిందేనృపమాళి కిత్తుఁ దనుజాతన్ దెల్పుమా కన్యకుం
బ్రేయుం డెవ్వఁ డటన్న నవ్వుచు వచోబింబాధరావల్లభుం
డేయేరాజులు నీవు దెల్పితివొ వారెవ్వారు లే రుర్వరన్.

96


తే.

నీవు వచ్చినవెనుక క్షోణితలమున, కృతయుగం బాది యిరువదియేడుమాఱ్లు
దిరిగె నాలుగుయుగములు దెలియవింత, వింత గాదిది యిది యొకవింత వినుము.

97


చ.

మును వరమిచ్చుటం గలిమిముద్దియ ముద్దులకూఁతు రయ్యె గా
వునఁ బెఱవారి నేగతి ధవుండుగఁ గోరు మురారి సీరియై
తనరెడు ద్వాపరంబునను ద్వారకలో హరి కిమ్ము పొమ్ము చ
య్యన నన వారిజాసనుని యంఘ్రులకున్ నతి చేసి గ్రక్కునన్.

98


వ.

సత్యలోకంబు వెడలి తపోలోకంబు దాఁటి జనర్లోకంబు నిర్గమించి మహర్లోకంబు
గమించి నాకలోకసౌభాగ్యంబులు గనుంగొనుచు భువర్లోకంబు డిగ్గి.

99


సీ.

తమతమనిత్యకర్మములు గావించుచు నధిపులఁ గొల్చు బ్రాహ్మణులఁ జూచి
దాయాదిపాళ్లకై తమలోపలనె పోరు నన్నదమ్ముల కలహంబుఁ జూచి
పరులకుఁ గలుగు సంపదలు జూడఁగలేక మతి నీర్ష్య నొందు దుర్మతులఁ జూచి
పతుల నొల్లక యన్యసతులఁ గోరెడివారిఁ జేరఁగోరెడు కులసతులఁ జూచి


తే.

హ్రస్వదేహుల బధిరుల నంధకులను, రోగపీడితులను దరిద్రులను లోభ
వంతులను దుఃఖశీలుర వింత గాఁగ, ధరణి జూచుచు మిగుల ఖేదంబు పొడమి.

100


తే.

వెనుకకాళ్లనె దాఁటులు వ్రేయు పాండు, వృషభ మీక్షించి ముందటిరెండుపదము
లెవ్వి యన నొప్పి పట్టిన దిందులోనఁ, గుడిపదంబని యతివల జడిసి యేను.

101

క.

వచ్చితి నీద్వారావతి, కిచ్చటఁ గృతయుగముఁ బోలె నింపైనది నీ
వచ్యుతుఁ డవుటం గన్నియఁ, బుచ్చుకొనుము తపము సేయఁ బోయెద నింకన్.

102


చ.

అని సుత నొప్పగించిన హలాయుధుఁ డెంతయుఁ బ్రేమ మీఱఁ ద
ద్వనితగళంబుపై హలము వైచి యొకించుక వంచునంతలో
మునుపొడవైన యమ్ముదిత ముద్దుగ వల్లభు నంతమాత్రయై
తనరె విలాససంపదలు తద్దయు మించె విచిత్రవైఖరిన్.

103


సీ.

జలజాక్షినగుమోముచంద్రుఁడు శారదపూర్ణిమాశశిఁ బోలె పొలుపు గాంచె
ముద్దియకమ్మకెమ్మావిమాణిక్యంబు సానదీరినరీతిఁ జాయలూనెఁ
బద్మాక్షివలిగుబ్బబంగారుకుండలు మెఱుఁగుఁబెట్టినఠీవి మెఱుఁగుసూపె
నంగనామణిమోహనాంగహేమశలాక పటిక నార్చినరీతి బాగుమీఱె


తే.

మఱియు వాసంతవేళఁ గ్రొమ్మావిలీలఁ, దొలకరిని మించు కేతకీదళము పోల్కి
వింతచెలువున రేవతీకాంత వెలసె, హలధరుని యోగమాయామహత్త్వమునను.

104


వ.

అంత గర్గాదిపురోహితు లారేయి వివాహశుభముహూర్తం బున్నదని విన్న
వించిన నెంతయు సంతసంబున యాదవసార్వభౌముండు పురంబు గైసేయించిన.

105


సీ.

రాజబింబాననల్ రాజవీథులఁ జల్లు మలయజోదకముల జలకమాడి
మేలిమి మీఱంగ మేలుకట్టులు గట్టు రమణీయచీనాంబరములు గట్టి
కేవలరమ్యమౌక్తికరంగవల్లికాతారహారంబులు దనరఁ బూని
కమనీయవిపణికాఘుమఘుమాయతబహుపరిమళంబులు మేన హరువు పఱిచి


తే.

మానితవితానకుసుమదామములు దాల్చి, ప్రతిగృహద్వారరత్నదర్పణములందు
గాంచుచున్నెడ నాద్వారకాపురంబు, లక్ష్మి యొప్పెఁ జతుర్విధాలంకృతులను.

106


వ.

అంతట బలభద్రుండును మంగళతూర్యఘోషంబులు మొరయ నభ్యంగన
స్నాతుండును జతుర్విధాలంకారసమేతుఁడును నై సమావర్తనాదివైవాహిక
శుభకృత్యంబులు నిర్వర్తించి కల్యాణవేదికాంతరంబున నున్నయెడ.

107


సీ.

శిరసు మజ్జనమయి నెఱిగొప్ప సవరించి యరవిరివిరవాదిసరులు దుఱిమి
వలిపెచెంగావిపావడ నిగ్గు లీనంగ జాళువాసరిగంచుచేలఁ గట్టి
తిలకంబు దీర్చి చెక్కుల జవాది యలంది గుబ్బచన్దోయిఁ గుంకుమముఁ బూసి
కట్టాణిముత్యాలకమ్మలు మొదలుగా నవరత్నమయభూషణములు దాల్చి


తే.

నిలువుటద్దంబులోపల నీడఁ జూచి, వ్రీడఁ జెలి యిచ్చుకపురంపువీడియంపుఁ
గెంపు కెమ్మోవి కొకవింత సొంపునింప, రేవతీకాంత యభినవశ్రీఁ జెలంగె.

108


తే.

రేవతీకాంతఁ దోఁ దెచ్చి రైవతాఖ్య, భూమిపాలుఁడు మధుపర్కపూర్వముగను
రామునకు ధారవోసిన రామకేలు, పట్టె బలరాముఁ డెంతయుఁ బ్రమదమునను.

109


క.

అప్పుడు పువ్వులవానలు, దెప్పలుగాఁ గురిసె మ్రోఁగె దివిదుందుభులున్
ముప్పిరిగొనుమోదంబున, నొప్పిరి జనులెల్ల నమ్మహోత్సవవేళన్.

110

వ.

ఇవ్విధంబున సకలసంభ్రమంబులు గలిగి వెలయు రేవతీబలరాములవివాహమ
హోత్సవంబు కన్నులపండువుగాఁ జూచి వైవాహికదినచతుష్టయానంతరం
బున రామకృష్ణానుజ్ఞాతుండై రైవతకమహీపతి బదరికాశ్రమంబునకుం దపంబు
సేయం జనియె నంత.

111


మ.

కళుకుమ్ముత్యపుగచ్చుసౌధముల సింగారంపుఁబూఁదోఁటలన్
జలధిప్రాంతరకాంతసైకతములన్ సౌవర్ణగేహంబులన్
నెలఱాతిన్నెలఁ దూగుటుయ్యలల మాణిక్యంపుసౌధంబులన్
బలుఁ డారేవతిఁ గూడి క్రీడ సలిపెన్ భావంబు రంజిల్లఁగన్.

112


సీ.

అది వింత యిది వింత యని రిత్తచూపుచు సొలపుఁజూపుల సారె జూడ నేర్పెఁ
జెలిమితోఁ బయ్యెదచెఱఁగు దెమల్పుచు విడుమంచు నొయ్యన నుడవ నేర్పె
నరవింద మందు కొమ్మని కేలు పొడవెత్తి వలిగుబ్బ లురమున నలమ నేర్పె
నధరబింబముఁ జురుక్కన నొక్కి కన్కతో మినుకుఁజెక్కిలి గోట మీట నేర్పె


తే.

సొంపు మీఱఁగఁ గళలంటి సొక్క నేర్పెఁ, గూడి రతికేళి వేడ్క నోలాడనేర్పెఁ
గూర్మిఁ గొసరుచు నంతఁ బైకొనఁగ నేర్పె, నెఱతనంబున రమణుఁ డన్నియును సతికి.

113


క.

కతిపయదినములలోపలఁ, జతురతఁ బ్రౌఢత్వమొంది జవ్వని యొకనాఁ
డతిముదమున రైవతక, క్షితిధరమున మెలఁగుచుండి చెలువున కనియెన్.

114


సీ.

మును పిందుఁ గదళికావనరాజి చెలువొందుఁ బందిటిద్రాక్షలఁ బ్రబలె నిప్పు
డీకానలోపల నేఁ గాన నీకాన నెంతగా బలిసెఁ బ్రాణేశ కంటె
యమృతోపమానంబు లాదొనయంబువు లనిశంబు మాతండ్రి కదియ ప్రియము
పొలుపొందె గొజ్జంగిపూఁదేకాలువ నీవు దీర్పించితో నిన్న నేఁడు


తే.

మొన్నఁ జూచిన యటువలె నున్న డపుడె, యింతలోపలెనే యెంత వింత పుట్టె
ననుచుఁ బలుకంగ బెడబెడలై నగంబు, గదల రేవతి ప్రాణేశుఁ గౌఁగిలించె.

115


చ.

వెఱవకు మంచుఁ దేర్చి యదువీరుఁడు నల్గడఁ జూడగట్టురా
పఱగట నిల్చి యన్నగము బాహులఁ నూపుచు మంచుగట్టునా
మెఱయు కపీంద్రుఁ జూచి తరమే ధర మెత్తఁగ నెవ్వఁ డీవురా
యెఱుఁగవె రామ నన్ వనచరేశ్వరుఁడన్ ద్వివిదుండ శూరుఁడన్.

116


క.

తరమే పెకలింపఁగ నీ, గిరి యంటివి మునుపు జానకీపతి పనుపన్
శరనిధి గట్టఁగఁ దెచ్చిన, గిరులశిఖర మాత్ర మింతగిరియే యిదియున్.

117


క.

నాసఖుఁడగు నరకాసురు, శాసించెను శౌరి గాన శైలముతో ని
న్నాసంద్రంబున వైచి ము, రాసురరిపుతోడ ముంతు నట ద్వారకయున్.

118


క.

అని మాటలాడుచునె యా, ఘనశైలం బగలఁజేయఁ గని హరి కినుకం
తనముసలంబున వ్రేసిన, వనచరపతి శిరము వగిలి వసుమతిఁ గూలెన్.

119

వ.

ఇవ్విధంబున ద్వివిదు వధియించి యెప్పటిలీల బాలికామణింగూడి కేళినీరమణి
కేళికాలోలుండై విహరించుచు హాలామనోహరుఁ డొకనాఁడు పూర్వాను
భూతగోపికలం దలంచి కృష్ణానుమతంబున నందవ్రజంబున కొక్కరుండ చని
నందనప్రతినందనాలింగనమృదుభాషణంబుల నందయశోదాశ్రీదామోపనం
దాదిబంధువులకు సంతసంబు సేయుచు జరాసంధాదిపలాయనంబు నొడువుచుఁ
బ్రొద్దు గడుపుచున్నయెడ.

120


సీ.

మధుమదాకులహలాయుధవిలోచనలీల నరుణుఁడై యరుణుఁ డస్తాద్రిఁ జేరె
వరుణుండు వారుణీవరున కీవచ్చుచెంగావినా సాంధ్యరాగంబు మెఱసె
హలిహలాకృష్టయై యమున యీగతి నుండు ననురీతి నిండె గాఢాంధకార
మాతమోయమునపై నలరారు దెలికల్వవిరులునాఁ జుక్కలు విరివికొనియెఁ


తే.

గలితనీలాంబరుండునుఁ గామపాలుఁ, డమలవర్ణుండు రేవతీరమణుఁ డగుట
రాముపోలిక లోకాభిరాముఁ డగుచు,సోముఁ డుదయించె సురసార్వభౌమదిశను.

121


తే.

పాంథజనములు గొమ్మలప్రాపుఁ గోర, సొరిది నొండొంటి లతకూన లొరఁగిపడఁగ
ధరణిచక్రంబు మిగుల సంతాప మంద, నడరె రేయెండ లప్పు డత్యద్భుతముగ.

122


వ.

అట్టిపండువెన్నెల నయ్యేకకుండలుండు గోపికాపుండరీకనయనల సంకేతంబులఁ
గూడుక యమునాతీరంబునకుం జని.

123


సీ.

కలికి యీపొదరింటఁ గాదె నీ వూరకె కినిసి నాచేత మ్రొక్కించుకొనుట
తెరవ యీద్రాక్షపందిటఁ గాదె నడికిరే యనివచ్చి నీవు న న్నేలికొనుట
మెలఁత యీగుజ్జుమామిడినీడఁ గాదె చిల్కలు పల్కఁ జెలులంచు నులికిపడుట
వనిత యీకదళికావనిఁ గాదె దళవీజనముచే రతాంతరశ్రమ ముడుపుట


తే.

దలఁచుకొందువె యీసైకతమునఁ గాదె, నానఁ బైకొనకున్న నోచాన మంచి
దత్తతోఁ జెప్పి కొట్టింతు ననిన జడిసి, నీవు నాకోర్కి దీర్చుట నీలవేణి.

124


క.

అని యిష్టాలాపంబుల, వనిఁ దిరుగుచు మద్యపానవాంఛ జనింపన్
వనితామణులుం దానును, గొనియెన్ మదిరారసంబు గుత్తుకమోవన్.

125


సీ.

అలవోక ఱెప్పవేయక చూచుచును తెల్పె భామయోర్తు సురానుభావపటిమఁ
గాంతు నేరము ద్రోచి కౌఁగిలించుచుఁ దెల్పె నాతియొక్కతె ప్రసన్నాతిశయముఁ
దలయూఁచి చొక్కుచుఁ దలపించె నొకపంకజానన గంధోత్తమానుభవము
పరిహాసబహుళోక్తి ప్రకటించె నట నొక్కకంబుకంఠి యిరాతికౌకలంబు


తే.

హసనకుసుమంబు లందంద నెసఁగఁ జేసి, వనిత యొక్కతె మధువైభవంబు సూపెఁ
గన్నుఁగవయందు సాంధ్యరాగంబు మొనయఁ, గాంతయొక్కతె వారుణిగరిమ నెఱపె.

126


మ.

తళుకుంగుబ్బల పైఁట వేయు మని కాంతల్ దూఱ హాలామదా
కులితస్వాంత యొకర్తు వేగజిలుగుంగుచ్చెళ్లకొం గెత్తి గు

బ్బలపైఁ గప్పిన బైలు దెల్పు జఘనవ్రాతంబు వీక్షించి యో
చెలువా సిగ్గరి వౌదువంచు నగియెం జిత్తేశ్వరుం డింపునన్.

127


తే.

కొదమగుబ్బలతావి కుంకుమముపూఁత, విభుఁడు చెంగావిఱవికంచు విడువఁబోవఁ
గొసరుఁజూపులఁ దప్పించుకొనుచు నొక్క, కలికి వెన్నెలఁ బైఁటగాఁ గప్పుకొనియె.

128


సీ.

ఓయత్త చిలికితి నూరకె నన్నేల కొట్టెద వని యొడ్డుకొనియె నొకతె
మగఁడు వచ్చెనటంచు మచ్చికఁ గట్టుకొం గెడలించి తమిఁ బడుకిచ్చె నొకతె
యొకసురాఘటి నెత్తి నుంచి చల్లో చల్ల యంచును వనవీథి కరిగె నొకతె
యెలనాఁగ బలరాముఁ డేల రాఁడాయెనే యని సారెముచ్చట లాడు నొకతె


తే.

తోడికోడ లటంచును దోడి చెలిని, దబ్బఱలె తిట్టె నొక్కతె దానిఁ దనదు
కోడలంచును జెక్కిలి గొట్టె నొకతె, మదిర సొక్కున గోపికామానవతులు.

129


మ.

మదిరాపానవిఘూర్ణమాననయనున్ మత్తద్విరేఫాలకున్
వదనాంభోరుహగంధలుబ్ధమధుపవ్యాఘాతలోలద్భుజాం
గదుఁ గర్ణోజ్జ్వలవజ్రకుండలు వలగ్నప్రస్థనీలాంబరున్
మదథామున్ బలరాముఁ జూచి వ్రజభామారత్నము ల్వేడుకన్.

130


మ.

తళుకుం జెక్కిలిముద్దుకెంపుజిగినిద్దాకమ్మకెమ్మోవితే
నెలు నాలింగన మంగనాజనము లెంతేవేడ్కతో నొండొరుల్
పలుమాఱుం దగ మార్చికొంచు సుఖయింపన్ వారితోఁ గూడి యా
బలభద్రుండును క్రీడ సల్పుచు ననల్పంబైన దర్పంబునన్.

131


ఉ.

వారివిహారముం జలుప వాంఛ జనించెను జేరరాఁగదే
వారిజమిత్రపుత్త్రి యని వాకొని పిల్చిన ఫేనహాసము
ల్మీఱఁగ నెంతలేదనుచు మించి చనన్ యమునాస్రవంతిక
న్నారఁగఁజూచి యల్కను హలాగ్రమునం బెకలించె నత్తటిన్.

132


వ.

ఇవ్విధంబున గోధుగ్వధూసవిధంబున నేధమానసమధికక్రోధధనంజయక్వథితన
యనపథుం డగుచు హలాయుధుండు నిర్ణిరోధపాథఃప్రవాహధామనిధితనూ
భవారోధంబు విశ్లథంబు గావించి శతథా ప్రవహింపంజేయు సమయంబున.

133


సీ.

కోడెజక్కవగబ్బిగుబ్బచన్నులమీఁద దరగపయ్యదకొంగు పొరలిపడఁగఁ
దమ్మికన్నుల మరందపుబాష్పములు చింద గరువంపుతేఁటిముంగురులు చెదర
జలపక్షిమేఖలాకలకలధ్వని మించ సైకతజఘనంబు సంచలింప
నబ్జపాదంబుల హంసకంబులు మ్రోయ బెళుకుబేడిసచూపు బిత్తఱింప


తే.

నృపబలాకృష్ణ పరమృగీనేత్రఁ బోలి, హలికరాకృష్ణవేణియై జలనినాద
నటన మొరయుచు యమున బృందావనంబు, నందుఁ బ్రవహించె వ్యాకులితాత్మ యగుచు.

134

తే.

అంత భయమునఁ గాంతయై యమున చేరి, సీరికి వినమ్రయై కటాక్షింపు నన్నుఁ
దగునె కులసతి మార్గంబు తప్పి నడువఁ, బరులు నవ్వరె రేవతీప్రాణనాథ.

135


చ.

అలుక శమించి నాపయి హలాయుధ తావకలాంగలాగ్రని
దళితవికీర్ణమత్తటనితంబములన్ నఖరేఖలట్లు నీ
హలముఖరేఖలం గని వయస్యలఁ బోలు సపత్ను బెల్లఁ బాం
సులవయితంచు నవ్వెదరు శుద్ధపయోజనిభాచలంబునన్ .

136


చ.

జలనిధి యేమియంచనునొ చయ్యనఁ బోవలెఁ దోడిచేడియల్
నిలువకపోయి రేపగిది నింద గడింతురొ యంచు వేఁడినన్
బలుఁడు దయాళుఁడై భువనపావని యేమిటి కింతమాట నీ
చెలువునిఁ జేరుమంచుఁ బనిచెం గని చెంతలవారు మెచ్చఁగన్.

137


తే.

కొదమరాయంచ జవరాండ్రగుంపుతోడ, సరసి విహరించు రాజహంసంబుఁ బోలి
గోపికాహంసయానలఁ గూడి యాము, నాంబువులఁ దేలె యదురాజహంస మపుడు.

138


క.

ఈరీతిఁ గొన్నిదినములు, నారీతిలకములఁ గూడి నందవ్రజసం
చారముల నలరి యంతట, ద్వారావతిఁ జేరెఁ గృష్ణదర్శనరతుఁడై.

139


వ.

అంతట.

140


సీ.

వలపు మీఱఁగ స్వయంవరమహోత్సవమున లక్షణకన్య బలంబు మెఱసి
కొనివచ్చుసాంబుని గినిసి పట్టుకచన్న కురుకుమారులఁ గని క్రోధమునను
బదఘట్టనల మహీభాగ మట్టిట్టుగా నలసీరి వడిఁ జేరి హస్తిపురము
ఘనసాలమూలంబునను లాంగలము గ్రుచ్చి పెకలించఁ బెళపెళఁ బెకలి పురము


తే.

యమునకై యొడ్డగిల భీతి సాంబుతోడ, లక్షణాకన్య నర్పించి యాక్షణంబె
చేరి మ్రొక్కు సుయోధను చెలిమి మీఱఁ, గౌఁగిటను జేర్చె రేవతీకాంతుఁ డంత.

141


తే.

అవని యొక్కఁడె సాంబుకల్యాణవేళఁ, బెల్లగిలె నట్టిదేవునిపేరివాని
పెండ్లి కొకపట్టణంబైనఁ బెల్లగిలదె, యనుచు భీష్ముఁడు నగియెఁ దాలాంకుఁ జూచి.

142


వ.

అంత హస్తినాపురప్రవేశంబు చేసి సాంబునకు లక్షణకన్య వివాహంబు చేసికొని
దుర్యోధనుం డరణంబుగా నొసంగు శతాంగమాతంగతురంగమణిమయభూష
ణాంబరకోటులఁ గైకొని ద్వారపతి కరుగుదెంచె నిప్పుడు నాహస్తినాపురంబు
యమునానది కొడ్డగిలినట్లె యున్నది బలదేవు భుజాబలంబు సన్నుతింప నెవ్వరి
తరం బదియునుంగాక నింకనొక్కవిచిత్రంబు వినుము.

143


సీ.

అలభోజపురమున ననిరుద్ధునకు రుక్మవతిఁ బెండ్లి చేసి తర్వాత రుక్మి
ద్యూతంబు దలపెట్టి యొడ్డిన యొడ్డెల్ల గెలిచి హలాయుధు గేలిచేయఁ
జేనచ్చినట్టిపాచికలు గావున గెల్చె దవి వలదని వేఱె యక్షములను
గ్రీడించ హలి గెల్చు గెలుపులన్నియు రుక్ష్మి కావని పలుక నక్కడిజనంబు

తే.

వాని నేగూడ నాకాశవాణి యపుడు, బలుఁడు గెల్చె నటంచన నలిగి బలుఁడు
రుక్ము నష్టాపదంబున రూపణంచి, పరనృపాలుర గెలిచె దోర్బలము మెఱయ.

144


మ.

జనకక్షోణివిభుండు భక్తుఁ డగుటన్ సౌహార్ద్ర మింపొందఁగాఁ
జని తత్పట్టణవాసియై యతనిచే సంపూజితుండై సుయో
ధనుఁ డచ్చోటికి వచ్చి శిష్యుఁడయి పాదద్వంద్వసంవాహనం
బొనరింపం దెలిపె న్గదాకదననానోపాయము ల్మక్కువన్.

145


క.

కురుపతి శిష్యుం డయ్యున్, హరిపక్షము పాండుపుత్త్రు లని తలఁపుచుఁ దా
నిరువురఁ గలయక తీర్థా, చరణంబున కరిగె సీరి సమరమువేళన్.

146


వ.

అరిగి యశుభతిమిరవిభాకరప్రభాసముదంచితం బగుప్రభాసతీర్థంబునఁ గృత
స్నానుండై నిజవిలాససముదితసరస్వతి యగు సరస్వతీతటిని మునింగి గగనర
మాకబరీసుమనఃకోరకాయితబిందుసరం బగుబిందుసరంబున నవగాహనంబు చేసి
కలుషభూధరవజ్రధరం బగువజ్రతీర్ధంబున మజ్జనం బొనర్చి రామాదిభూరామేశ
తటస్థాపితమాసరయూపం బగుసరయూనది నాడి దురితలతానివారణాసి
యగువారాణసిం జేరి యచ్చట.

147


మ.

కనియెన్ రాముఁ డభంగమంగళతరంగన్ రంగదంభోధిలం
ఘనసంప్లావితదేవమానవభుజంగన్ జంగమాఘచ్ఛటా
ఘననైకక్షమదివ్యనామశతసంగన్ సంగరాసింధుబిం
బనభశ్చారితరూపమానసుషమాభాగంగ గంగానదిన్.

148


వ.

కని వినయభక్తిపూర్వకంబుగా నమస్కరించి.

49


మ.

సవరించెన్ యమునాభమాధవు సరస్వత్యాభపద్మోద్భవున్
భవదీయచ్ఛవిశంభు నైక్యమగుటం బ్రత్యక్షమౌ బ్రహ్మ మీ
వె వివేకాఢ్యుఁడు నీయెడం దనువు వే వీడ్కొన్నచో బ్రహ్మయో
గవిశిష్టాత్ముఁడవోలె ముక్తిఁ గను గంగా సర్వముక్తిప్రదా.

150


వ.

అని నుతియించి స్నానదానంబులు చేసి ముముక్షుజనశరణ్యం బగు నైమి
శారణ్యంబున కరిగి తన్నుంగని ప్రత్యుత్థానంబు సేయని ప్రతిలోమజాతు సూతు
ముసలాఘాతంబున గతజీవితుం జేసి మునిప్రార్థితుండై పురాణార్థవేది పునర్జీవి
తుంగాఁ గటాక్షించి సవనాంగణకల్పితమునిజనరక్తపల్వలుండును నిల్వల
తనూభవుండు నగు పల్వలు వధియించి మునిజనసంస్తూయమానుం డగుచుఁ
బ్రశంసాపరకాశిక యగు కౌశికం దీర్థమాడి ప్రతిదినకల్పితవిప్రయాగం బగు
ప్రయాగంబున కరిగి కృతమజ్జనుండై సంశ్రితాపాశ యగువిపాశను గోకనద
శోభాశోణ యగుశోణంబునం గృతమజ్జనుండై తరువిజితమహేంద్రనగం బగు
మహేంద్రనగంబున నిశ్చలసమాధిలీలాసమావృతరేణుకాయుని రైణుకేయుని

దర్శించి కృతమజ్జనాగోదావరీతి వెలయు గోదావరీతీరంబు చేరి కృతఫ్లావనుండై
వినతశ్రీశైలబిలహితాధిష్ఠితం బగు శ్రీశైలంబు దర్శించి వేంకటాచలంబున కరిగి.

151


సీ.

జాతికిరీటిపచ్చలకిరీటము డాలు ఖంజరీటంబుల పుంజి దెలుప
మకరకుండలమరీచికగండమండలి మండలీనాట్యసంభ్రమముఁ జూప
గరశంఖచక్రము ల్వరచక్రతిమిరవారణచక్రరిపుహితప్రౌఢి మెఱయ
రమణీయపీతాంబరప్రభాడంబర మంబరంబునకు హేమంబు నెఱప


తే.

వక్షమునఁ గౌస్తుభంబు శ్రీవత్సతులసి, దామముల కాంతియును సముద్దామలీలఁ
గలసి కుంకుమకస్తూరికల ఘటింప, మెరసి కొలువుండు వేంకటేశ్వరునిఁ గాంచి.

152


సీ.

సదయవీక్షాచకచ్చకలవీక్షావని గనుపట్టు వీరరాఘవునిఁ గొలిచి
క్ష్మాకాంచి యనమించు కాంచీపురంబులో విలసిల్లు వరదరాజుల భజించి
యుభయకావేరీమహోజ్జ్వలాశ్రీరంగధాముని శ్రీరంగధాముఁ బొగడి
దక్షిణద్వారకాస్థలరాజమునను గృపాళుఁడౌ రాజగోపాలుఁ జూచి


తే.

దర్శనంబున బ్రహ్మహత్యానువర్ణ, మోషణాదిమహాదోషములు దొలంగఁ
జేయుటకు హేతువౌ రామసేతువునను, మునిఁగి రామేశ్వరునిపదములకు మ్రొక్కి.

153


తే.

ముత్యములు పండునదిలోన మునిఁగి మంచి,గందపుంగొండయందు నగస్త్యమౌని
భర్గు సేవించి కన్యాఖ్య దుర్గ గాంచి, భక్తి గోకర్ణనాథునిఁ బ్రణుతి సేసి.

154


తే.

అంత మాహిష్మతీపురి కరుగుదెంచి, భక్తి మను తీర్థమాడి ప్రభాసమార్గ
మునను సీరి కురుక్షేత్రమునను గాంచె, యోధమానుల భీమదుర్యోధనులను.

155


క.

కాంచి దయ న్వలదని వా, రించుచు వినకున్న శ్రీహరిప్రహితుండై
కాంచనమణిమయభవన, ప్రాంచితమగు ద్వారకాపురంబున కరిగెన్.

156


సీ.

బలదేవుఁ డొకనాఁడు పద్మాక్షుతోఁగూడ ధర్మనందను సభాస్థలికి వచ్చి
యిష్టగోష్ఠిని వసియింప నారదమౌని యరుదెంచి సత్కృతుఁడై వసించి
బకుని హిడింబుఁ గీచకుని జరాసంధు రారాజు గెల్చి విక్రమము మెఱసె
ఘనుఁడు గదాయుద్ధమునను భీముఁడు బలదేవున కొరునకు దిగుడుగాని


తే.

యనిన నటులేల హలిసరి పెనఁగలేనె, యనిన భీముని గనుఁగొని కినుక వొడమి
సీరి గదదిక్కుఁ జూచినఁ జిత్తమటుల, నైన నాకోర్కె ఫలియించె ననుచు లేచి.

157


క.

భీముఁడు గదఁ గైకొనినన్, రాముఁడు గదఁ బూనెఁ గ్రోధరక్తాక్షుండై
యామేటిమగలఁ గనుగొని, భూమీశులు మిగుల వెరఁగుఁ బొందుచుఁ దమలోన్.

158


సీ.

కలహాశి యిప్పు డెక్కడనుండి వచ్చె నీయన్యోన్యరణమున కనియె నొకఁడు
గురుఁడు గాఁడే సీరధరుఁ డధికుండన్నఁ దనకేల యీరోస మనియె నొకఁడు
ఇతనిశిష్యుఁడు కురుపతి గెల్వఁడే సీరికిని సరిపోరఁడా యనియె నొకఁడు
నది యేటిమాట తాలాంకులోపల సహస్రాంశంబుఁ బోలలేఁ డనియె నొకఁడు

తే.

వలదు బలభద్రుతో నేల కలహ మనుచు, బుద్ధికొలఁదిని సమవర్తిపుత్రముఖులు
దెలిపి వినకున్న నూరకె నిలిచి రంత, నురివి బలభీమసేను లొండొరులఁ దాఁకి.

159


ఉ.

అర్పుల నట్టహాసముల నబ్జభవాండము పిక్కటిల్లఁగా
దర్పము మీఱఁ బోరు మదదంతులపోల్కి యుగాంతలోకభి
ద్దర్పకవైరిరోషమున దారుణులై యరుణాయతాక్షులై
నేర్పులు మీఱఁ బోరి రతినిష్ఠురమైన గదారణంబునన్.

160


క.

తనశిష్యుండైనసుయో, ధను జంపెనటంచు మిగుల దారుణమగు కి
న్కను గొట్టె బలుఁడు భీముని, ననిలసుతుం డతని గురుఁ డటంచుం గొట్టెన్.

161


క.

బలుగదపెట్టున భీముఁడు, కులిశాహతిఁ గొండఁ బోలి గులగులలగు న
బ్బలుఁ డనిలజుగదపెట్టున, నలరు సరిన్ వింధ్యమట్టు లలుకఁడు కడిమిన్.

162


ఆ.

చేరి మూఁడునాల్గు చేతులు వెడలిన, యంతలోన వలసి యనిలసుతుఁడు
చెదరి యదరి చాల పెదవులు దడుపుచు, స్రుక్కి నాల్గుదెసలు చూడఁదొణఁగె.

163


క.

అప్పుడు విడువక వైసెం, గుప్పున నడునెత్తి పగులఁ గుదిగొని వెడలెం
గప్పెఱ నెత్తురు భీమున, కప్పాండవలోచనముల నశ్రులుతోడన్.

164


సీ.

కన్నీళ్లు వఱదలై కాఱఁగాఁ గుంతియు ద్రౌపతి యొకచోటఁ దల్లడిల్ల
మునుపు నేఁ జెప్పిన వినఁడాయెఁ గార్యంబు దప్పెనంచును ధర్మతనయుఁ డడలఁ
జూచి యుపేక్ష చేసుక యున్న నాయమా కృష్ణా యటంచుఁ గిరీటి నుడువ
ధౌమ్యాదు లింతక్రోధం బేల శిష్యుపై నంచు నక్కడనుండి యభినుతింపఁ


తే.

గినిసి యెవ్వరు చెప్పిన వినక భీముఁ, జంపఁ గడఁగెడు యాదవసార్వభౌము
కేలు గదఁ గూడబట్టి శ్రీకృష్ణుఁ డప్పు, డేల వల దన్న కోపంబు చాలునన్న.

165


క.

హరివాక్యామృతధారం, బరుషరుషానామదావపావకుఁ డాఱం
గరుణించి విడిచె లాంగల, ధరుఁ డనిలకుమారుఁ బాండుతనయులు చెలఁగన్.

166


క.

కళవట్టిపడిన భీముఁడు, దెలిసెన్ హరికరుణ నంత దేవుఁడ నిన్నుం
దెలియక పోరితి నేరము, గలదనఁగా భీము సీరి గౌఁగిటఁ జేర్చెన్.

167


ఉ.

పుణ్యము శౌనకాదిమునిపుంజశరణ్యము నైన నైమిశా
రణ్యమునందు నొక్కమఖరాజ మొనర్చెను రేవతీసతీ
మణ్యభిరాముఁడై బలుఁ డమానుష వైభవముల్ జగత్త్రయీ
గణ్యములై తనర్ప జనకామితము ల్దయసేయఁజాలుచున్.

168


తే.

సాంగదక్షిణ లొసఁగి యజ్ఞంబు చేసి, యవభృథస్నాన మొనరించె నతివఁ గూడి
సకలబంధుజనములతో సంభ్రమమునఁ, గలుషతిమిరహరుండు లాంగలధరుండు.

169


సీ.

ధగధగద్ధగితరత్నకిరీట కాంతులు పదివేల సూర్యబింబములు దెలుప
దళధళద్వజ్రకుండలకాంతిమండలి గండమండలమున మెండుకొనఁగఁ

జకచకజ్జలదమేచకకటీరపటాంచలము భుజాగ్రమ్మునఁ గొమరు మిగులఁ
గలకలక్వణితకంకణముఖ్యనవరత్నమయభూషణములు నెమ్మెయిఁ దనర్పఁ


తే.

బుష్పవర్షంబు సురదుందుభులరవంబు, బ్రహ్మరుద్రాదినిర్జరప్రణుతు లలర
బ్రహ్మరథ మెక్కి రేవతీప్రాణభర్త, ద్వారపతి చేరి పాలించె వైభవమున.

170


క.

ఇది బలరామచరిత్రం, బిది దురితలతాలవిత్ర మిది యతిచిత్రం
బిది భక్తియుక్తి వినినం, జదివిన జనుఁ డిందు నందు సౌఖ్యముఁ జెందున్.

171


క.

మును బలునిచరిత దెలిపిన, వెనుకన్ కృష్ణుకథ నీకు వినిపించెదనం
టి నరేంద్రా యిపు డది విను, మని మునిపతి దెలుపఁ దొణఁగె నధిపతితోడన్.

172

శ్రీకృష్ణావతారము

శా.

శ్రీమత్కృష్ణవలాహకంబు సుమనశ్రీచాయియై దేవకీ
శ్యామాభ్రంబునఁ బుట్టె శ్రావణమునన్ సద్యోగళత్తాపథా
త్రీమానుష్యముపైఁ గృపామృతము వర్షింపన్ నిజోరఃస్థల
శ్రీమించం దులకింప నిచ్చ సురభేరీగర్జన ల్మీఱఁగన్.

1


సీ.

కమనీయదేవకీగర్భసంభవుఁ డయ్యు రోహిణీసంభవరూఢి గాంచి
దీప్యమానధరావతీర్ణుఁ డయ్యు నభోవతీర్ణవిఖ్యాతిచేఁ దేజరిల్లి
కృష్ణపక్షమున భ్రాజిష్ణుఁడై కలిగియు శుద్ధపక్షమునఁ బ్రసిద్ధిగాంచి
యిందిరాలింగితహృదయుఁ డయ్యును రేవతీనాథసహజనిస్థితి వహించి


తే.

చంద్రదశ దెల్ప ముఖము త్రిస్థానభాను, కరణి గనుపట్టుతేజంబు గురుముఖేచ్ఛ
హేతువై దివ్యకారుణ్యవృష్టి వెలయ, శౌరి దనరారె సూతికాసదనమునను.

2


తే.

ఘనమనోరంజక కరంజకప్రవాళ, మంజురుచిబాలుఁ గనుఁగొని మంత్రసాని
సమ్మదము పూని శూర్పానిల మ్మొనర్ప, బొడ్డు గోయఁగఁ జూడ నద్భుతము గాఁగ.

3


సీ.

మొలిచెఁ బొక్కిలిచక్కిఁ దొలుపల్కులను మ్రోయు నలుమోము తుమ్మెద గలుగుతమ్మి
పొలిచె మస్తమ్మున భూరిరత్నప్రభాపాళిలాలితకోటిహేళిమౌళి
నిలిచె హస్తంబుల నిఖిలదైతేయభయంకరోదగ్రపంచాయుధములు
వలచె వక్షంబున వైజయంతీదామశోభితతులసీప్రసూనపటలి


తే.

మఱియుఁ గంకణకేయూరమకరకుండ, లాదిమణిభూషణములు హేమాంబరములు
జారుతరమైన మేనితేజంబు మీఱి, శౌరి పురుటింటిలోన సాక్షాత్కరించె.

4

తే.

అప్పు డాశ్చర్యమును మోద మతిభయంబు, వెనుకొనఁగ మంత్రసాని వేవేగ వచ్చి
యవలికడను నమోనమో యనుచుఁ గాచి, యున్న వసుదేవుఁ గన్గొని యుల్ల మలర.

5


సీ.

వెడఁదకన్నులవాఁడు నెడఁదమానికెపుఱా వెడఁదకన్నులమిన్న నిడినవాఁడు
నీలకాయమువాఁడు నిద్దంపుతమి గుల్కు నీలకాయము వేల్పు మేలువాఁడు
కేలిచక్రమువాఁడు కితవుల మన్నించు కేళిచక్రముఁ ద్రోవఁ జాలువాఁడు
వన్నె మించినవాఁడు చిన్నంపుపదియాఱు వన్నె మించిన వల్లెవాటువాఁడు


తే.

దేవదేవుఁడు దేవకీదేవిగర్భ, జలధి జనియించె సంపూర్ణచంద్రులీల
నేమి తప మాచరించితో యీవు పూర్వ, మునను వసుదేవపాలితభూమిదేవ.

6


క.

అని తెలిపిన వసుదేవుఁడు, విని రొద వల దనుచు ననుచు వేడుకతోడన్
జని లక్ష్మీవిభుఁ గన్గొని, కనుఁగవ నానందబాష్పకణములు దొరుగన్.

7


చతుష్కందము.

శ్రీవాసుదేవప్రియస, ద్భావావేదాంతవాదఫలితామోదా
సేవింతు నిన్ను మునికృత, సేవాశ్రితసుప్రసాద శ్రితబహుభేదా.

8


క.

పటుమతి ననుమానోక్తిన్, ఘటియింతు “జగత్సకర్తృకం కార్యత్వాత్ ఘటవ త్త” ని తాదృశు నిను, నిటువలెఁ గాంచితిమి చిత్ర మే మనవచ్చున్.

9


తే.

అని పొగడ శౌరి దయ మీఱి యాదివృత్త, మంతయును దెల్ఫి భావివృత్తాంతములును
దెలిపి యెప్పటిబాలునిచెలువు గులుక, శయమునను బూనె వటపత్రశాయితండ్రి.

10


క.

విడికెంపుపడగగొడుగులు, కడువేడుక శేషుఁ డూనఁ గాళిందియు గా
ల్నడ గాఁగ నరిగి నందుని, పడఁతుకకడ కొడుకు నునిచి పడుచును దెచ్చెన్.

11


తే.

తెచ్చి కంసుని కొసఁగ నుద్వృత్తి నెగుర, వ్రేసి యసి పూన నద్దేవి మింట నిలిచి
వేఱె యున్నాఁడు నీవైరి వెఱ్ఱి యనుచుఁ, జనియె నట పల్లెలో మహోత్సవము చెల్లె.

12


సీ.

దళపుష్పఫలసమాకులకోకిలమిళిందకీరంబు లగుచు శృంగారవనులు
కలహంసికాదత్తకమలనాళమరాళజాలంబు లగుచుఁ గాసారములును
గలశాబ్ధికల్లోలకల్పనోత్కక్షరక్షీరంబులై నైచికీకులములు
నిరతిశయానందనిర్నిద్రమానసాబ్జముల నాబాలగోపాలజనము


తే.

లలరె వింతగు మాధవోదయమునందు, సప్తకులపర్వతంబులు సౌరధేను
లక్షణోజ్జ్వలధేనుద్విలక్ష నొసఁగె, ధరణిసురులకు నందుఁ డౌదార్యమునను.

13


తే.

అభినవగుణైకసామగ్రి నుభయకులయ, శోదయై మించునట్టియశోద యంత
భువనపోషణుఁ బోషించెఁ బుత్త్రమమత, సర్వసముఁడును మాతృవత్సలతఁ దనరె.

14


తే.

మేదినీనాథ నెలలు తొమ్మిదియు మోసి, కన్నదేవకి యటులుండ కడకు నందు
భామినికిఁ గల్గె శ్రీకృష్ణబాలలీల, కన్ను లారంగఁ జూడ భాగ్యంబు గాదె.

15


ఉ.

జోలలు పాడఁగా మిగుల సొంపగుపున్నమచందమామనుం
బోలినకృష్ణుముద్దుమొగముం బలుమాఱును ముద్దులాడఁగా

లాలనమించుజిట్టకములం గనుదోయి చెలంగి చూడఁగాఁ
దాలిమి నేమి నోఁచిరొ తల్లియుఁ దండ్రియుఁ దొంటిపుట్టునన్.

16


తే.

కంసుపంపునఁ బూతన కామరూప, యగుచు జనుబాలువిష మీయ నమృత మొసఁగె
వైరులందును దయగలవాఁడు కృష్ణు, డాశ్రితుల పట్ల నిఁక వేఱె యడుగ నేల.

17


తే.

బండిఁ బడఁదన్నెఁ దొడలపైఁ బండి పర్వు, తల్లికి ఘటించె సురగాలి త్రు ళ్లడంచె
జన్ను గుడుచుచుఁ దల్లికి సకలజగము, లాస్యమునఁ జూపె శౌరి మహాద్భుతముగ.

18


తే.

అస్తిభాతిప్రయాత్మకమైన బ్రహ్మ, మాకృతి వహింపఁజూచి కృష్ణాఖ్య యిడియె
గర్గమౌనీంద్రుఁ డాగమక్రమము మెఱయ, నందునకు దన్మహత్త్వమంతయును దెలిపి.

19


సీ.

సిగను జుట్టిన తావి చెంగల్వ లరవీడఁ గొనరావిరేక ముంగురుల నాడ
నపరంజిమద్దికాయలు చెక్కుల నటింపఁ గమ్మకస్తురితిలకము రహింపఁ
బంచరత్నమ్ముల పంచాయుధము మించఁ దళుకుముంగామురంబులు సలింప
గంటలమొలకట్టు ఘణఘణధ్వని సేయ నందెలు ఘలుఘల్లు మనుచు మ్రోయ


తే.

నందె గాలిడి యొకపాణి యవని నూఁది, యన్యకరమున నవనీత మవధరించి
బాల్యమునఁ గ్రీడసల్పు గోపాలకృష్ణు, చెలువు వర్ణింపఁ దరమె యాశివునికైన.

20


ఆ.

సగమురాత్రివేళ జనియింపఁగానేమొ, జారచోరలీల మీఱె శౌరి
విశ్వవిభుని కేల వేళానుసరణంబు, లవియు నొకవినోద మయ్యెఁగాక.

21


క.

నందునియింటను రాధ య, నందగునొకకన్య జవ్వనంబునఁ దనరుం
గెందలిరాకుజిరాదొర, పందెము గెలుపింపఁజాలు బాగులు మెఱయన్.

22

గూఢచతుర్థిసీసము

కలికిచూపును గుచంబులు మోవి మోమును గమలారిబింబవిభ్రమము గాంచి
రమణికొప్పును మధ్యమము దృష్టి నూఁగారు వరుసనీలాభ్రాళి గరిమఁ బూని
యెలనాఁగచెవులు పల్కులు కరంబులు మెడ నవసితాబ్దస్ఫూర్తి నవఘళించి
మగువనాసిక నితంబము నఖంబులు మేను స్వర్ణాచలాభాతిశయము గడచి


తే.

రతికిఁ గుచఫలరత్నదర్పణతమోణు, కాండశైవాలశష్కులికాశుకీకి
సలయపాళీతిలకుసుమసైకతాచ్ఛ, కుందకోరకతిలకలఁ గుందుపఱుచు.

23


క.

వల్లభునిఁ బ్రోచురతిగతి, నెల్లప్పుడు ఱొమ్ము డించ కెంతయుఁ దమి న
ప్పల్లవమృదుపద పెనుపఁగఁ, గల్లరికృష్ణుండు దానిఁ గని మది సొక్కెన్.

24


సీ.

తొడలపై నుంచి యుగ్గిడువేళఁ జికిలిపెందొడలసం దొయ్యనఁ బుడికిచూచు
వేడుక విందులు విందు లంచును బిల్వఁ గదిసి పయ్యెద జార్చి కౌఁగిలించు
నునుముద్దుఁ బెట్టుమంచును వేఁడుకొనఁ గోటికొనఁ జెక్కు మీటి చుంబన మొనర్చు
ముదముతో నెత్తుక మోవి ముద్దాడినఁ జక్కెరకెమ్మోవి చప్పరించుఁ


తే.

బట్టుకొని లేచుగతి నీడ్చుఁ గుట్టుకొంగు, తొలఁగి జఘనంబు గనుపింపఁ గెలసి నవ్వు
నెన్నిమాయలు నేర్చెనే చిన్నికృష్ణుఁ, డనుచు దనుఁ బెంచు రాధ ముద్దాడ శౌరి.

25

ఉ.

ఎవ్వరు పట్టిన న్నిలువఁ డెంతయుఁ గృష్ణుఁడు పోరు పెట్టెడిన్
జవ్వని యెత్తుకొమ్ము పని చాలు నటంచు యశోద పిల్వఁగా
నవ్వుచు రాధ యెత్తుకొనిన న్నగుఁ గృష్ణుఁడు నొద్దివారలుం
దవ్వులవారు నిద్దఱకు ద్వంద్వ మటందురు వారలుబ్బఁగన్.

26


తే.

చిన్నికృష్ణుని దినము గైసేయ వెన్న, ముద్ద వెట్టఁగ నెత్తుక ముద్దులాడఁ
గాని వేఱొకపని సేయఁ గానరాదు, రాధికాదేవి మిగుల గారాబమునను.

27


తే.

అంత నైదేండ్లప్రాయంబునందె శౌరి, తోడిబాలురతోఁ గూడి వేడుకలర
గొల్లయిండ్లను వెన్నలు కొల్లలాడు, గొల్ల లాడుకటూక్తికిఁ గొంకు లేక.

28


సీ.

వెన్నఁ బెట్టెద మేది విద్దెమన్నను గోపరమణులయొద్ద విద్దెములు సల్పు
నొకయింత నేమఱియున్నఁ గవ్వము దీసి పక్కున భాండము ల్పగులఁగొట్టు
నది యేమిరా కృష్ణ యనిన నేమియు లేదు చేతప్పి పడెనంచుఁ జెలఁగి నవ్వుఁ
బట్టుకోవచ్చిన బ్రహ్మాదులైనను బట్టనేర్తురె యంచుఁ బర్వు లెత్తు


తే.

భామయొక్కతె వెన్నంటి పట్టుకొనిన, మోము ద్రిప్పి చుఱుక్కున మోవి నొక్కు
నమ్మనేఁ జెల్ల నెంతకాయకుఁ డటంచు, తరుణి విడిచిన విడువక దాఁ బెనంగు.

29


క.

లోలయగు లోలలోచన, వాలుంజనుదోయిఁ గేల వడిఁ బట్టుక ను
య్యాలో జంపాలో యని, వ్రేలుం గృష్ణుండు సఖులు వికవిక నవ్వన్.

30


మ.

కినుకన్ వ్రేఁతలు వచ్చి కొల్లలిడియెం గృష్ణుండు పాల్వెన్నలం
చనినం గోపముతో యశోద యది యేరా కృష్ణ వ్రేపల్లెలో
నను బాల్వెన్నలుఁ గొల్లవెట్టితని యన్నం దల్లి లేదే తమిం
డ్లనెయుండే ననఁ జూడఁ బంపఁ జెలినట్ల న్నిండియుండు న్వడిన్.

31


చ.

పనివడి దొంగిలించుతఱిఁ బట్టుక కృష్ణుని దొంగసిక్కె ర
మ్మని యొకప్రోడ చేడియల నందఱఁ గూడుక తల్లి యొద్దనుం
చినతఱి దత్తనూభవుని చెల్వము గైకొన నీకుమారు దం
డన మొనరింప మేము వలెనా యన సిగ్గునఁ బోదు రందురన్.

32


సీ.

జనయిత్రి రోటఁగట్టిన నర్జునంబులఁ బడద్రోసె నర్జునప్రాయముగను
బృందావనంబునఁ బృథుశక్తి దగ ధేనుబృందావనము సేసెఁ బ్రేమదనర
బకునిరోషారుణాంబకుని చంచులు రెండు చించి చెండాడె విచిత్రముగను
వత్సరూపకుఁడైన వత్సదైత్యుని బట్టి వక్షంబు పగులఁగా వైచి చంపె


తే.

బాలగోపాలకబళనప్రాసితాఘు, నఘు విచారించె గహనమధ్యంబునందుఁ
బద్మలోచనుఁ డైదేండ్లప్రాయమునను, భక్తలోకైకరక్షణప్రౌఢి మెఱసి.

33


వ.

అంత నొక్కనాఁడు.

34


ఉ.

వెన్నున బర్హిబర్హమును వేత్రము గేలఁ గటీతటిం బదా
ర్వన్నెపటంబు దట్టిపొరవాంశికనాళముఁ బైఁడికొమ్ము ద

ధ్యన్నకరంబు గల్గి చెలువందుచు గోపకబాలుయుక్తుఁడై
వెన్నుఁడు ధేనుబృందముల వెంటఁ జరింపఁగఁ జూచి నివ్వెఱన్.

35


తే.

జలజగర్భుండు గోపవత్సముల డాఁప, భక్తవత్సలుఁ డట్టిరూపముల నొక్క
వత్సరంబును మెలఁగ శ్రీవత్సవక్షుఁ, గాంచి వెరగంది మ్రొక్కి నుతించె నిట్లు.

36


సీ.

మహనీయతతపుష్పమాలికాంచితచంచరీకపక్షసపక్షకాకపక్ష
చిత్రైంద్రచాపరోచిస్సాంద్రచంద్రికాంచితకరాదికలాపకృతకలాప
బాలభానుప్రభాజాలకల్పనశీలకటివిలోలవిశాలకనకచేల
వేత్రదండవిషాణవేణుదధ్యన్నప్రశస్తపంకజశస్తచారుహస్త


తే.

నందనందన శాశ్వతానందభక్త, నందనద్రుమసనకసనందనాది
ముక్తజననందకాకార యుక్తిదూర, నందకకరాబ్జ నినుఁ గొల్తు నన్నుఁ బ్రోవు.

37


తే.

ఏను నీమాయఁ దెలియఁగా నెంతవాఁడ, మోహినీరూపమున శంభు మోహితాత్ముఁ
జేయవే మున్ను నను దయచేయుమయ్య, సంతతాక్షయ్య శేషభుజంగశయ్య.

38


తే.

జనకుఁడవు నీవు గోపవత్సలుఁడ వౌట, నేను నటువలె నైతి నేఁ డింతెగాక
లేదు నేరంబు నామీఁద లేశమైన, ననుచుఁ జతురోక్తి వినుతించి యజుఁడు చనియె.

39


వ.

ఇట్లు భక్తవత్సలుండు వత్సగోపాలబాలకుల మరలించి మఱియుఁ బెక్కువినో
దంబులఁ జరియించుచుండె నంత.

40


క.

ఏడెనిమిదివత్సరముల, వాఁడై కృష్ణుండు కొన్నివగలఁ జరించె
న్వేడుకతోఁ గాయకపుం, జాడలు విడువకనె గోపసహితుం డగుచున్.

41


సీ.

నాబంతి దాఁచుకొన్నను నేను విడుతునే యని యొక్కచెలిగుబ్బ లంటి చూదుఁ
జెలువ యేకాంతంబు చెప్పెద రమ్మంచుఁ జెవియొగ్గినను గవకివలు గొణుగుఁ
బడఁతి యీముడి నేమి ముడిచితే యే దేది విడుమంచు నునుపోఁకముడికిఁ బెనఁగుఁ
గాల్దాఁకి మ్రొగ్గునంగనకు ముందై పుత్త్రు గనుఁగొమ్మనుచు నెత్తి కౌగిలించు


తే.

నొడ లెఱుంగక నిదురించు నువిదతొడలఁ, గుచ్చల దెరల్చి యత్తను దెచ్చి చూపు
నేమి చేసెద రిద్దఱే యిం దటంచు, దంపతుల వేఁడు హరి దంటతనము మెరసి.

42


చ.

రమణి యొకర్తె యొంటి మధురాపురికిం బెరుఁ గమ్మఁబోవుచో
సమయము గాచి పోఁకముడి జార్చిన జాఱెడుచీర గట్టఁగా
నమరిక లేక కుండ విడ కత్తభయంబున దించుమంచు న
క్కమలదళాక్షి వేఁడుకొనఁ గల్లరిచేష్టలు చేయుచు న్నగున్.

43


సీ.

క్షోణీశ యంత యశోదతోఁ బుట్టిన కుంభకుం డనియెడిఘోషభర్త
మిథిలాపురముచెంత మేటిసంపదలచేఁ దనరంగ నతనిమందను నిశాటు

లేడ్వురు మదమత్తవృషమూర్తులై చొచ్చి యనిశంబు బాధింప నతఁడు వీనిఁ
జంపినవారికిఁ జక్కనినాకన్య భక్తి నిచ్చెదనంచుఁ బ్రతిన సేయ


తే.

శౌరి యట కేగి వృషముల సంహరించి, భువనమోహిని నీలను స్వవశఁ జేసి
తత్సహోదరు శ్రీదాముఁ దనకు మిత్రుఁ, గాఁగఁ గైకొనివచ్చెనుత్కంఠ హెచ్చ.

44


క.

ఆనీలాకన్య యశో, దానందులపట్ల నెల్లఁ దగుభయభక్తు
ల్వూనుచు రాధాచంద్రని, భాననతోఁ జెలిమి సలుపు నప్ప యటంచున్.

45


వ.

అంతఁ గ్రమక్రమంబున.

46


సీ.

మొనలు చూపెడి పినపినమొల్కచనుదోయి యలఁతిపయ్యంటకు నాస సేయఁ
గొంకున ఱెప్పలాఁగుచుఁ జూచుచూపులు మిసిమికతొలకుల దుసికిలంగఁ
జిగురాకుపోలిక జిగిఁజూపువాతెఱఁ జిన్నిలేనవ్వులు చెంగలింప
నొక్కింతబటువైన యుదుటుఁ దెల్పెడి శ్రోణితటి పటంబునకు నెత్తరము నెఱుపఁ


తే.

బొన్నపొక్కిలి లోఁతైన సన్నమైన, నడుము బిగిఁజూపు నునుబోఁకముడికి లోఁగ
శాకబీజాలివలె నారు చంద మొంద, నీల నవయౌవనంబున నెగడెఁ జాల.

47


క.

మదవృషభంబులఁ గూలిచి, సుదతీమణిఁ దెచ్చునపుడు చూడఁగ హరికిం
బదుమూఁడేడులు గావునఁ, బొదలుం జవ్వనము భువనమోహనలీలన్.

48


సీ.

కలికిసింగారంపుమొలకలో యన ముఖాబ్జమున నూనూఁగుమీసములు దనరఁ
గెంపుల గెల్చిన కీర్తియోయన గావిమోవిపైఁ జిఱునవ్వు ముద్దుగులుక
సంతతగోపికాస్తనఘట్టనంబున గడుసయ్యె నాఁగ వక్షంబు మెఱయఁ
గలభహస్తోపమోరులఁ బోలి యాజానులంబియై బాహుయుగ్మంబు వెలయ


తే.

జవ్వనంబున గోపాలచక్రవర్తి, నిండుపున్నమచందురు గండుమిగిలి
కన్నుఁదొగలకు విందయి యన్నుఁ దెగల, మనసు నెలఱాలఁ గరగించి మమత నించె.

49


ఆ.

పిన్ననాఁటనుండి కన్నులకింపయి, యున్న రాధమీఁదఁ గన్ను వేసి
యున్నవాఁడు గాన వెన్నుఁ డాప్రాయంపుఁ, గన్నె పొందుఁ గోరి సన్న సేయు.

50


సీ.

ఫలపుష్పములు దెచ్చి పట్టుమంచును బైఁట నించుచో గుబ్బఁ దాఁకించుఁ గేల
నిక్కట్టుతోవల నెదురైన నొదుఁగక యొయ్యారిమేను మే నొరయ నేగుఁ
జీఁకటిలోఁ గన్నఁ జెలియ నాపై దయ లేదటే యని కౌగిలింపఁ దివురు
సఖులతో రతిరహస్యములు ప్రసంగించు నెలగాఁగ వినఁగఁ దా నెఱుఁగనట్ల


తే.

చిలుకసాంబ్రాణితేజివజీరుఁ గేరు, కమ్మనెమ్మేన వగవగ సొమ్ములూని
యెమ్మె మెరయించు శ్రీకృష్ణుఁ డెల్లవేళ, రాధ లంకించుకొనెడి యారాటమునను.

51


క.

శౌరి కడుఁబ్రేమ నిటువలెఁ, జేరిక సేయంగ సిగ్గు చిత్తము గరఁగన్
మారుఁడు పొడుపొడుమని యొ, య్యారంబున వెడలె నంత ననురాగమునన్.

52


క.

కిలికించితవతి కృష్ణుం, దిలకించఁగసాగె సారెఁ దీరగుగుబ్బల్
పులకించఁ గళుకుఁజెక్కుల, గులకించుక చెమట జాఱఁ గోర్కులు మీఱన్.

53

సీ.

పనిలేనిపనిఁ బూని పైఁడియందియ ఘల్లుఘల్లనఁ గృష్ణుచెంగట నటించుఁ
దనపైఁట యతనిఁ దాఁకిన గిఱుక్కున మొగం బొరయై చూచు సిగ్గొలయు చూడ్కి
నేఁ జెల్ల నమ్మ వానికి నెట్లు దోఁచునో చెఱఁగు దా కె నటంచుఁ జెలికిఁ దెలుపు
నెటుల దోఁచిన మంచిదే యన్నఁ జాలును పొమ్మంచుఁ గెంగేలఁ దమ్మివైచు


తే.

నాననము వంచు బొటవ్రేల నవని వ్రాయు, వేఁడినిట్టూర్పు వుచ్చు నావెత యెఱుంగ
వింతెగదె యంచు ననఁబోవు నంతలోన, గ్రుక్కు మక్కువఁ జొక్కి యక్కువలయాక్షి.

54


మ.

నునుపయ్యెంటచెఱంగు జాఱ హరి కన్నుంగోనలం జూచినం
గినుకన్ వాతెఱ పంట నొక్కుచును జంకించు మృగాంకాస్య గ్ర
క్కున లేదంచును శౌరికన్నులను మ్రొకున్ రాధ కెమ్మోవిపై
నెనయించుం దరహాసచంద్రికల శ్రీకృష్ణుండు హర్షింపఁగన్.

55


మ.

 కనుఁగోకృష్ణు నెఱుంగనట్లు సకియం గౌఁగింటికిం దార్పుచుం
బెనగు న్నాపయి బత్తి లేదనుచుఁ గోపించున్ బలా యేలనే
యనుచు న్నివ్వెఱపాటుతోడ నది త న్నెట్టో విలోకింపఁ బ
క్కున నవ్వు వలిచన్నుదోయి గులుకం గౌఁదీగెజ వ్వాడఁగన్.

56


ఉ.

కొప్పున జాజులున్ బిగువుగుబ్బల కుంకుమతేనె మోవిపైఁ
గప్పురవీడియంబు జిగికస్తురిబొట్టును నిచ్చచల్వముం
జొప్పడ వారకాంతవలెఁ జూడ్కికి విందొనరించెఁ గాని యొ
క్కప్పుడు మైలదోఁప నడయాడదు రాధ ముకుందు ముందటన్.

57


సీ.

దోర్మూలములు గాంచఁ దొలఁగించుఁ బయ్యెద నాభి గన్గొన వితా నానఁ బూను
మురువుతోఁ గెమ్మోవి విఱుచు చుఱుక్కున నుదుటుగుబ్బలు నిక్క నొడలు విఱుచు
మెలఁతమైనొరగు నేమో చూచి పక్కున నగుఁ బాలు ముద్దాడు నన్నుఁ జూడు
మను నొక్కవ్యాజంబునను జెంతఁ జేరు జెక్కుల చెమ్మవో మీటుఁ గొప్పు నిమురుఁ


తే.

గటితటం బంటి సొలయుఁ గ్రేఁగంటఁ జూచుఁ, బంత మీడేరెనా యని పైని విరులు
వైచుఁ గనుసన్నఁ బిలుచు రావా యటంచుఁ, జిలుక పైనిడి కెలయు నచ్చిగురుఁబోణి.

58


క.

అలచెలువ వలపుసొలపులు, దిలకించుచుఁ జెలఁగి బళిర తేరకు డక్కెన్
వలకారిచిలుక యని చం, కలు దాటించుచును శౌరి కడునిర్భయుఁడై.

59


సీ.

మగువ నీవ్రేలికి మట్టాయెనా యని కడవ్రేలుఁ బట్టు నుంగరము పెట్టు
నిది లెస్స యనుచుఁ బాలిండ్లమీఁదికిఁ బాణికమలము ల్సాఁచు హారములు వై చుఁ
జెలి చూడవే యని చెంగల్వమొగ్గ యిందని వేఁడి యిచ్చు కర్ణమున నుంచుఁ
గుంకుమ యలఁదుచు గోట నితంబంబు కడ విదలించుఁ బక్కున హసించు


తే.

గురుజనంబులు నెడ గల్గి తిరుగువేళ, శౌరి రాధను జేరి రాజసము మీఱ
నామిటారియు నతనిమాయలకు లొంగి, యుండెఁ గావునఁ జెలరేగుచుండె నపుడు.

60

క.

వనితామణి యిటువలె న, వ్వనజదళాక్షునకుఁ జాల వలచి మనం బా
ఘనవర్ణుచెంతఁ దనుపుం, బనిపాటలు మాని మెలఁగు భవనములోనన్.

61


సీ.

ఒంటిపాటునఁ గౌఁగిలొసఁగుఁ దత్తఱముతో నంతలోపల మళ్లు నలుకుఁడైన
నేమైనఁ జూచుచు నెఱుఁగనిరీతిని మాఱుమోమునఁ జెంతఁ జేరి నించుఁ
గట్టుకొం గెడలించి గట్టునల్లల్లన గంభీరనాభి క్రేగంటఁ జూడఁ
జెలియ రావే యని చెయి వేయుఁ జీఁకటి గాంచి నీవా యంచుఁ గడకుఁ బోవు


తే.

నెదురెదుర చూచు మందల కేగియున్న, నేల రావైతివని దూఱు నాళిఁ జూచి
యతనిపల్కులె చెవియొగ్గి యాలకించు, వలపునను రాధ కృష్ణునివలకుఁ దగిలి.

62


తే.

మాధవుఁడు రాధ నీరీతి మరులు కొల్పి, మఱియు గొల్లమిటారుల మరులు కొల్ప
నారజపువన్నెఁ బెట్టుచు ననుదినంబు, వీథిలోపల విహరించు వేడ్క మీఱ.

63


చ.

మునిమునిచీఁకటి న్నడువ ముంగిటవాఁకిట నైన నొంటిపా
టున నడయాడుజవ్వనుల డొంకక పయ్యెదయైనఁ జట్టయై
నను జడయైనఁ బట్టు నెఱనవ్వునఁ గృష్ణుఁడు లోఁగిరేని గ్ర
క్కన నొకచోటుఁ జూచుకొను గాదనినన్ వెడలున్ హుటాహుటిన్.

64


సీ.

జిలుఁగుఁబయ్యెద జాఱఁ జెక్కుల చెమరూరఁ గనుఱెప్పయిడక చూడనిమిటారి
చెలియచెక్కునను దోఁచిన కృష్ణవదనంబుఁ గూర్మి మీఱఁగ ముద్దు గొననివనిత
పులకండములు గుల్కు బొమ్మంచుమోవికిఁ గ్రుక్కిళ్లు మ్రింగని కుందరదన
పైఁడికంబంబునఁ బ్రతిఫలించినమూర్తిఁ గౌఁగిటఁ జేర్చి చొక్కనిలతాంగి


తే.

కలుగనేరదు రేపల్లెచెలులలోన, గురుజనంబుల కళికి పైకొనరు గాని
కరఁగరే చంద్రు గనుచంద్రకాంతమణుల, జోక గోపాలరాయనిఁ జూచునపుడె.

65


తే.

ఉల్లమునఁ గృష్ణమూర్తి యచ్చొత్తినటులు, సంతతంబును జెలువొంద జంద్రముఖులు
తన్నిమగ్నైకచిత్తలై ధ్యానయోగి, వరులవలెఁ జొక్కుదురు పారవశ్యమునను.

66


సీ.

అమ్మనేఁ జెల్ల మాయత్త చూచినఁ గొట్టుఁ బయ్యద విడర గోపాలరాయ
యోరి నాగుబ్బల గోర జీరకు పోర నీకు మ్రొక్కెద యశోదాకుమార
యవులేర మంచివాఁడవు గంటు సేతురా వాతెఱపై నవనీతచోర
చెల్లఁబో నడివీథి నెల్లవారును జూడ ముద్దాడవత్తురా ముద్దుకృష్ణ


తే.

యంచు బ్రక్కను బవళించుమించుబోండ్లు, నిదురమబ్బునఁ బగ లిట్లు జదురులెల్లఁ
గలవరించిన నాసంచు తెలియలేరు, పనులఁ గాచిరి కాన తత్ప్రాణవిభులు.

67


ఆ.

పనులు సేయువేళఁ బాటఁ బాడెడువేళ, నాటలాడువేళ హరినె కాని
యన్య మెఱుఁగ రెందు నలగోపసతు లేమి, నోమినారొ తొల్లిబాములందు.

68


సీ.

అదిగో కృష్ణుఁడు వచ్చెనన నెంతపనియైన వదలివత్తురు తలవాకిళులకు
యముననీళ్ళ కటంచు నరిగి మాధవువేణునాదంబు విందురు మోద మలరఁ

బనిలేనిపని పెట్టుకొని నందసుతుని గేహమున కేగుదురు నూఱారుమాఱ్లు
తమినిబ్బరమునఁ జెంతలవారి నెఱుఁగక కులుకుదు రాశౌరికెలన నిలిచి


తే.

కమ్మవిలుకానిచేకీలుబొమ్మ లనఁగ, సమ్మదంబునఁ బసిగాపుకొమ్మ లట్టు
లెమ్మె నడయాడుదురు సంతతము మాన, సము వెన్నునియందు మగ్నమ్ము గాఁగ.

69


క.

ఈకైవడిఁ గృష్ణుఁడు వ్రజ, కోకిలవాణులను మరులు కొల్పె మనోజ
వ్యాకులితలైన వారలఁ, జేకొని క్రీడింపఁదలఁచి చిత్తములోనన్.

70


మ.

కమలావల్లభసౌఖశాయ నికమాగచ్ఛద్వచోవల్లభా
శ్వమణీస్వాగతికంబు గైరవనుహృత్సరక్తికంబాపగో
ద్యమ మాశబ్దిక మంగభూవిజయయాత్రావావదూకంబునై
కమనీయంబుగ మించె నంతట శరత్కాలంబు భూపాలకా.

71


తే.

ఆశరత్కాలమునఁ బూర్ణిమావసరము, నందు రవి జాఱెఁ జంద్రోదయంబు మీఱెఁ
దనరె నిరుదెసఁ గెంజిగి ధవళరుచియుఁ, గీరహయునిప్రతాపసత్కీర్తు లనఁగ.

72


మ.

స్మరతేజంబు జనించె నించె దివి సచ్చక్రంబు చక్రంబు దు
స్తరమోహాబ్ధి భ్రమించె మించెఁ దుహినాసారంబు సారంబులౌ
నరవిందంబులు తీరెఁ దీరెననెఁ గల్హారంబు హారంబుడాల్
నెరయన్ వెన్నెలమించె మించె విటసందేశంబు దేశంబులన్.

73


సీ.

అట్టివెన్నెలలోన యమునాతటంబున ననిచిన శృంగారవనములోనఁ
బారిజాతముక్రింద మారు గెల్చినభంగి నంగుమీఱఁ ద్రిభంగి యగుచు నిల్చి
పదముపై వేఱొకపద ముంచి జాళువావన్నెదుప్పటివలెవాటు మించ
సాచీకృతానన జలజాతవేణురంధ్రములయందుఁ గరాంగుళము లమర్చి


తే.

ప్రౌఢి మీఱంగ మదనగోపాలమూర్తి, గాన మొనరించె నలతానమానములకు
మానములు వీడ గోపికామానవతులు, గీతికాదూతికాసమాహూత లగుచు.

74


సీ.

కెంగేల జలపాత్ర గీలించి యెలదోఁట త్రోవగా నవ్వలదూఁటె నొకతె
[1]యత్త యెక్కడి కంచు నడుగ నెక్కడకి లే దిదిగొ వచ్చెదనందు నేఁగె నొకతె
పొరుగింట నుండు మాపొరుగింటిపడుచును చూచి వచ్చెద నంచు లేచె నొకతె
మంచినీళ్ళకుఁ బోయి మఱలివచ్చెద నంచు వేడ్క మీఱఁగ నేఁగె వెలఁది యొకతె


తే.

త్రోవలో తోడికోడలు పోవఁ జూచి, యేడకే యన్న నదియు నీ వేడ కన్నఁ
గూయకుమటంచు నిద్దఱుఁ గూడి తోడి, దొంగలై పోయి రాగోవధూర్తుకడకు.

75


చ.

కడవెఁడువేఁడినీళ్ళ జలకంబయి కమ్మనిపాలు వంటకం
బిడిన భుజించి నాథుఁడు శయించిన వీడెము వేసికోక య

ప్పుడె నిదురా యటంచు నొకబోటి హసించుచుఁ దల్పుమూసి వె
ల్వడియె ముకుందు డున్నెడకుఁ బంచశిలీముఖచంచలాత్మ యై.

76


సీ.

మొగములోఁ దేటలేనగవు వీడెముకెంపు పెంపునింప సమర్తపెండ్లికూఁతు
లనువొంద నీరువట్టినమేనితళతళల్ దిలకింపఁ దొలుచూలుతలిరుఁబోండ్లు
పసదేరు పసపుదువ్వలువ కాటుక బొట్టు వింతచెల్వూన బాలెంతరాండ్రు
గమకపుగుబ్బ లంగములలో నుదుటునిచ్చలు ప్రేమగల నిండుజవ్వనులును


తే.

మఱియు వ్రేపల్లెలోనున్న మందమంద, గామినులు కామినులు కీరకాండకాండ
కుసుమదోదూయమానమానసముతోనఁ, [2]దోనఁ దన్నందపుత్త్రుండు తోన నగుచు.

77


తే.

ఏల వచ్చితి రీవేళ బాలలార, యనినఁ గొందఱు ప్రౌఢరాకాబ్జముఖులు
కృష్ణ నిన్నేలవచ్చితి మిప్డు మరుర, ణంబునం దన నందనందనుఁడు వలికె.

78


క.

మగనాండ్రు మీరు మిముం, దగిలి రమించుటలు నాకు ధర్మువె నేనా
వగకాఁడుగాను బొండో, మగువలు మీకైన నిట్టిమార్గము దగునే.

79


మ.

అనినం గన్నెలు చిన్నవోవ నగి ప్రౌఢాంభోజపత్రేక్షణ
ల్విన మేమంటివి కృష్ణకృష్ణ యవురా వేసాలు మాతోడనా
యనరా దింతియెకాక కన్నయపుడల్లా తప్పుదండాలు వె
ట్టిన మాసామివి నీవకాక వలపంటే వచ్చెనా బింకముల్.

80


శా.

కానీ పోదుమె ప్రొద్దుపొద్దునను వేడ్క న్నీవు ప్రార్థింపఁగాఁ
బోనీ పో మనవాఁడుగా యనుచు మాపుణ్యానకున్ వచ్చితే
కానంజాలక ధర్మశాస్త్రములు వక్కాణింపఁగాఁ జొచ్చినా
వౌనే కాక మఱేమిప్రోది కడు లెస్సాయెన్ యశోదాత్మజా.

81


మ.

దినముం జేష్టలచేఁ గరంచఁగను బాతివ్రత్యధర్మంబు మే
మెనయంజాలుదు మెట్లుగా నదియుఁ గా కేనాఁడు కాళిందిలో
నను నీరాడఁగ వస్త్రము ల్గొనితొ యానాఁడే జనెన్ లజ్జ య
న్నను గోపాగ్రణి యేమి చేసితిని నానాఁ డేల నన్ దూరఁగన్.

82


చ.

అనవుడు నవ్వి యవ్వికసితాంబుజనేత్రలు నీ వెఱుంగవే
కనికని యుండి బిత్తలియె గట్టుకు రమ్మని చేతులెత్తి మ్రొ
క్కిన దనకాళుఁబోరి తిలకింపవె మర్మము లెల్ల నెట్టిసీ
మను సతు లట్లు సూపుదురె మాయెడఁ గల్గెను గాక మాధవా.

83


తే.

అనిన నింతియ కాదె పద్మాక్షులార, దృష్టిదోషంబు పనిలేదు తెలియ కేను
జెనకితినె గాక నన్నుఁ జూచితిరె చూడ, వల్లవుఁడ గాని నే మీకు వల్లభుఁడనె.

84


సీ.

అలివేణి నీవె కావా గుబ్బపయిఁ జెయి వేసిన జెయిఁ దట్టివేసి చనుట
వనజాక్షి నీవె కావా మోవి యాన వచ్చిన నెమ్మొగం బోర చేసికొనుట

యంగన నీవె కావా వేణి పట్టినఁ బెనఁగి నాచెయి విడిపించుకొనుట
అబ్జాస్య నీవె కావా వెన్కఁ జేరి నే కన్నులు మూసినఁ గసరుకొనుట


తే.

వలపు లేదేమొ నల్లనివాఁడ నగుట, నటుల నేల పతివ్రత లగుదు రింతె
యదియె మంచిది సౌఖ్యంబు లందు నిందుఁ, జెందుటకు మంచికార్యంబుఁ జేసినారు.

85


ఉ.

చిత్తమెలర్పఁగా మగలసేవ లొనర్పక యిట్టివేళలన్
వత్తురె మెత్తురే పరులు వంశమువాసికి గాసి దెత్తురే
చొత్తురె జారవిద్యలకుఁ జూచిన పెద్దలు సాగనిత్తురే
యుత్తమశీలలార [3]నను దూఱక మీశరణంబు లొందుఁడీ.

86


మ.

అనినం గాంతలు దృష్టిదోషములు లేవా ధర్మము ల్పల్కు నీ
వనినం జాలును సృష్టిదోషములు లే వట్టైన బల్సిగ్గునన్
నిను సేవింపము గాని యుండు నెపుడు నీయందె మాచిత్తము
ల్పెనఁగన్ వల్లవచక్రవర్తి వివపాభేదంబునం జూడఁగన్.

87


తే.

రూఢి శృంగారరసమె యీరూప మగుట, శ్యామవర్ణుఁడ వౌదు గాదనఁగ నేల
యెఱుఁగుదుము నిన్ను మము నీ వెఱిఁగియుందు, వేల యీవట్టిజోలి యీవేళఁ గృష్ణ.

88


సీ.

ధవసేవ ధర్మ మంటివిగదా నీవె మాధవుఁడవు గావె కందర్పజనక
వంశంబునకు హాని వచ్చునే చేపట్టినావు వేడుక వేణునాదలోల
కనిన నిత్యానందకాముకు ల్మెచ్చరే తగులు చేసిన నమృతస్వరూప
యాత్మనివేదనం బౌఁగాక మాభక్తి జారత్వమే భక్తపారిజాత


తే.

కలరె సర్వనియంతను గాదనంగఁ, దగినపెద్దలు జగదద్భుతప్రభావ
శరణ మెయ్యది నీపాదజలజయుగమె, శరణ మగుఁగాక గోపాలజనశరణ్య.

89


వ.

అని మఱియు నిట్లనిరి.

90


సీ.

నటియింపవా విషానలఘోరఫూత్కారకాళియాహిస్ఫటాగ్రములయందుఁ
గబళింపవా జ్వలత్కాలానలజ్వాలికాభీలలోలదావానలంబు
ధరియింపవా మహీధరవైరిముక్తాశ్మవర్షదుర్ధర్షగోవర్ధనంబు
మరలింపవా వార్ధికరభటానీతతల్లోకగామినినందు లోకు లెన్న


తే.

మఱియు గల వెన్ని యైన నీమహిమ లెన్న, సులభమా మాకుఁ బరపురుషుండ వగుదు
ననఁగ నినుఁ గొల్చెదము నేఁడు కరుణఁ జూడు, మేల మ మ్మింత సేయఁ గోపాలరాయ.

91

క.

గాయకునకు మోహింపుదు, రేయెడ స్త్రీ లనుచుఁ దెలుపదే శ్రుతి గావో
గాయకుఁడ వేము గామో, తోయజనేత్రలము వట్టి దూఱేమిటికిన్.

92


క.

చిక్కులఁ బెట్టినఁ బోమిక, నక్కున గదియించి తారహారావళులం
జిక్కులఁ బెట్టక యనుచున్, మక్కువఁ బైఁబడిన యదుకుమారుం డంతన్.

93


సీ.

అలమఁబోయినఁ జేతికందని చిన్నిగుబ్బలబాలల వికాసబంధములను
దిమిరంబు నిండుప్రాయము మోహనాంగులఁ గెరలించి యుపరతిక్రీడనముల
నగవుల నఖరదంతక్షతంబులఁ దెల్పు ప్రౌఢల బహుచిత్రబంధములను
జాతిస్వభావచేష్ట లెఱింగి తత్తత్కళాస్థితు ల్గరఁగించి లలితగతుల


తే.

నందఱికి నన్నిరూపంబు లందిపొంద, దక్షుఁ డయ్యును నొకవినోదంబు గాఁగ
నిరువురకు మువ్వురకు మఱి నేవురకును, బడుక యిచ్చుచుఁ బెనఁగె గోపాలుఁ డపుడు.

94


చ.

అలయ వొకింతయైనఁ జెమటంటదు చెక్కుల మించి యూర్పులం
బొలయవు చాలుఁ జాలు నిఁక బొమ్మనఁ వెందఱు వచ్చి వేఁడినం
గలయక నీవు దేవుఁడవు గాక మనుష్యుఁడవే యటంచుఁ బ్రేఁ
మల నని రింతు లాహరిని మన్మథకేళిక మించు లాహరిన్.

95


తే.

పాలు చల్లాఱఁబెట్టి యావేళ యింత, పాలుమాలిక రాఁగ రాధాలతాంగి
పవ్వళించెనొ లేదొఁ గోపాలగీతి, చెవినిఁ బడ నుల్కి పడి లేచి శీఘ్రమునను.

96


క.

పాలని మజ్జిగలోపలఁ, బాలుని తోడంటు వెట్టి భ్రమచే నిదురన్
సోలెడిగృహజన మదియే, వేళ యనుచుఁ బడుకయిలుఁ బ్రవేశించి తమిన్.

97


సీ.

ముంగొంగుబంగారుచెంగావి యటులుండ జిలుఁగుపైఠాణిదువ్వలువ గట్టి
సంపెంగ లటులుండ జాజిక్రొవ్విరిదండ మెండుగాఁ గీల్జడనిండఁ జుట్టి
కుంకుమపంకంబు పొంకంబుగా నుండ గబ్బిగుబ్బల మంచిగంద మలఁది
కళుకు ప్రాగెంపుచెక్కడపుసొమ్ము లటుండఁ దెలిముత్తియంపుసొమ్ములు ధరించి


తే.

సొగసు మీఱఁగ వెన్నెలసోగ యంచుఁ, గాంచువారలు భ్రమయ శృంగార మెనయఁ
బండువెన్నెల నొకయింత భయము లేక, రాధ వెలువడె గోపికానాథుకడకు.

98


ఉ.

తోరపుగుబ్బ జక్కవలతో వలతోదన నీలజాలముల్
తూఱెడివేణిఁజాక చకితోచకితోరు మృగంబులం బొదల్
దూఱఁగఁ జేయు చూప రహితో రహితోర్జితగంధకేతకిన్
దూరము సేయువాసనలతో నలతోయజగంధి వచ్చుచున్.

99

తే.

ప్రొద్దుముద్దులకూఁతురి యొద్దితోఁటఁ, గన్నెమావులక్రీనీడఁ గలువరాచ
చలువఱాతిన్నెపై జాజిశయ్యమీఁద, గోపకాంతాసహస్రము ల్గొల్వుసేయ.

100


ఉ.

ఒక్కతె గుబ్బపై నొరగి యొక్కతె యూరుల నంఘ్రి సాచి వే
ఱొక్కతె వీడె మీయ మఱియొక్కతె వీవన వీవ బత్తితో
నొక్కతె పైఁటఁ జెక్కు చెమరొత్తఁగ లీలరతాంతతాంతుఁడై
చొక్కెడు కృష్ణు దూరమునఁ జూచి గిఱక్కున రాధ మర్లుచున్.

101


సీ.

నిండారుపండువెన్నెలకాక కోర్వక యెలమావినీడల నిలిచినిలిచి
కలకలపల్కు చిల్కలపల్కు వినలేక చెవుల నంగుళములు చేర్చిచేర్చి
చల్లనితెమ్మెర ల్సైపఁగాఁ జాలక జిలుఁగుఁబయ్యెద చాఁటు చేసిచేసి
హృదయంబు భేదించు మదనాశుగములకుఁ దప్పించుకొనలేక తలఁకితలఁకి


తే.

ధవవియోగదవాగ్నిచేఁ దాళలేమి, సాహసము షడ్గుణంబంట సహజముగను
గంజపనలోల యగుచుఁ దత్కంజలపన, చూతవనమండలాగ్రంబుఁ జూచునపుడు.

102


క.

అమ్మమ్మ తెగువ యేటికి, సమ్మతి నీవిభుఁడు వచ్చుఁ జయ్యన ననుచుం
గొమ్మపయినుండి కొమ్మ క, రమ్మున నొకచిల్క వాలఁ బ్రమదము మీఱన్.

103


క.

చిలుకా పక్షము నాపైఁ, గలిగెనె నీకైన ననుచుఁ గరమున నునుఱె
క్కలు దువ్వుచు నొకపూఁబొద, జలజాక్షుని దూఱుకొనుచు సతి యున్నంతన్.

104


సీ.

అది యెవ్వరే రాధ యౌఁ గదా యిందేల వచ్చెనో హరిఁ బిల్వ వచ్చెనేమొ
యీవేళ నొంటిగా నింతదూరము వచ్చునా యశోదాదేవి యంపఁబోలుఁ
గాదుగా యిదియేమొ కలదుపో దోసమే యటువలె నుందురా యంబుజాక్షి
యెక్కడి దోసమె యెవ్వతె వలవదె వనజనాభుని చక్కఁదనము గనిన


తే.

ననుచుఁ జెలులాడఁ జూచి యిట్లాడ నేల, పిలువవచ్చుట నిక్కంబు తెలిసివత్తు
మీర లిటు నిల్వుఁడని నిల్పి శౌరి వెడలి, యల్ల పూఁబొదకడఁ బొంచి యాలకింప.

105


తే.

చిలుక శ్రీకృష్ణదేవుండు చిన్ననాఁట, నుంచి నాపయిఁ గడుఁబ్రేమ నుంచి దినము
చెలఁగి యెన్నైనఁ జేష్టలు సేయు నకట, యేలలేదాయెనొక్కొ యాహాళి నేఁడు.

106


సీ.

వెనుకపాటున వచ్చి వెడఁదకన్నులు మూయుఁ జెలిపేరు చెప్పిన జెలఁగి నవ్వు
చెలులెవ్వరైన వచ్చెదరు పోపొమ్మన్నఁ బడుక యిమ్మని కొంగు పట్టి తివియు
నలతోఁటలోన న న్నలయించి కొనిపోయి విడువక నగుచు నీవిక సడల్పు
నెడరైనతావున నెదురైన న న్నాఁగిపోనీక వాతెఱతేనె లాను


తే.

సిగ్గు ప్రతిబంధమై యంత సేయ నాదు, కోర్కె యీడేఱదయ్యె నీకూర్మి యెంత
యరసియుండ్రు యశోదాదు లైనవారు, నెనరుకలిమిని గనిపించుకొనరు గాని.

107


ఉ.

ఒకనాఁ డొంటిగఁ గేళికాగృహములో నుండంగ శ్రీకృష్ణుఁ డే
టికొ నేఁ బోయితిఁ బోయినం జెఱఁగుఁ బట్టెం బట్టినం గొంగు దీ

యకు రావచ్చెద రెవ్వరైననని మల్లాడంగ నావేళ నే
లకొ యేతెంచి యశోద చూచి చనె నుల్లాసంబు సంధిల్లఁగన్.

108


క.

అది మొదలుగ ముదమున నా, సుదతీమణి నామొగంబు చూచిన నగుఁ దా
నిది యేలనినను నేమో, పెదవి గదలనీక తెలుపుఁ బ్రియసఖతోడన్.

109


సీ.

హరిఁ జేరవచ్చుచో నట్టె నేఁజూచినఁ బడఁతులఁ గనుగీఁటి కడకుఁబోవు
నందుఁ డదేమన్న నవ్వుచు మీకేల పొమ్మంచు నొకవేళఁ బులిమిపుచ్చు
నొంటిగా నున్నచో నొకలేనిపని చెప్పి కమలలోచనుని చెంగటికిఁ బంపు
వనిత నీచేఁ గాని వల్లఁడు మాకృష్ణుఁ డనినన్నుఁ బనుపు భోజనము పెట్ట


తే.

గంధమైనను విరులైనఁ గాని విడియ, మైనఁ బండైన నాచేతఁ గాని వేఱె
యొకరిచే నంప దే నెంత యెడ్డికొనినఁ, బ్రేమ వేఁడు యశోద యదేమొ యెఱుఁగ.

110


ఉ.

నవ్వుచు మాయశోద యొకనాఁడు విలాసిని యాగృహంబులోఁ
బువ్వులు దెమ్మటన్న నటఁ బోయెడిచో హరి గుబ్బ లంటరా
నివ్వలి కేఁగుదెంచిన నదే విరు లేవి యనన్ యశోద నేఁ
బువ్వులు గాన నం దనిన బోటులు హాస్యము సేసి రయ్యెడన్.

111


చ.

హరి యొకమాపునన్ జలకమై కురులార్పఁగ జీనిజాళువా
నురటి యొసంగి చేతికి యశోద చనెం దమి నేను వీవ బం
గరునునుజెక్కులం జెమట గ్రమ్ముట సాత్వికమౌ టెఱింగి యో
గురుకుచ నీ కిఁక న్విసరికొమ్మనె శౌరి దరస్మితంబుగన్.

112


చ.

తిలకము దిద్దుచున్న సుదతిన్నగఁ దిన్నఁగ నీవు దిద్దుమా
తిలకిని యమ్ముకుందునకు దిద్దెడిచో భుజమూలకాంతి క
న్గొలఁకులఁ జూడ నే నెఱిఁగి గొబ్బునఁ గేలటు వంపఁ దోడితొ
య్యలు లది యే మటండ్రు వశమా వినుతింపఁగ వ్రీడ మున్గుచున్.

113


ఉ.

హరితో నే నొకవేళ నొంటిమయి మాటాడంగ నీళాకృశో
దరి తా నత్తఱిఁ బొంచిపొంచి కన నంతన్ శౌరి హు మ్మన్నచో
నగుచు న్నే నటు చిన్నదానిపయి నేలా యింతకోపంబనన్
దరహాసంబున నెంతలే దను జగన్నాథుండు నాపైఁ దమిన్.

114


ఉ.

ప్రేమము నిచ్చ నిట్లు వలపించి ననుం గికురించి యిప్పు డీ
భామలతోడఁ గూడుకొని భావములో నను నెంచఁ డీవిధం
బేమని చూచుదాన నిఁక నెవ్వ రెఱుంగుదు రీయధర్మ మా
కాముఁ డెఱుంగుఁగాని చిలుకా కలకాలము తన్నె నమ్మితిన్.

115


క.

అని మంచిది రావలెఁ గద, యని కోపము మీఱఁ నేమొ యనఁబూనినచో
నిను నమ్మినాఁడ రాధా, యని హరి కౌఁగిటను జేర నది గని యలుకన్.

116

తే.

పెనఁగి విడిపించుకొనుచు నబ్బిసరుహాక్షి, మంచివాఁడవు పొమ్మంచు మాఱుమొగము
సేసికొనియుండ నేమి చేసితిని నేర, మేలనే యల్క యనుచు గోపాలవిభుఁడు.

117


సీ.

బారికిన్నెరకాయ బటువుగుబ్బలుమీఁద గోరుంచనీయవే కీరవాణి
తళుకుబంగారునిద్దాచెక్కుటద్దాలు ముద్దాడనీయవే ముద్దుగుమ్మ
కండచక్కెరపానకము గుల్కుకెమ్మోవి గంటి సేయఁగనీవె కలువకంటి
తొలుకాఱుమెఱుగుతోఁ దులదూఁగునెమ్మేను గౌఁగిలింపగనీవె కమలవదన


తే.

పైఁటచా టేల చేసెదే పద్మగంధి, మోము దిప్పెదవేలనే మోహనాంగి
సారెజంకించె దేటికే సారసాక్షి, యేల మేనోసరించెదే యిగురుఁబోణి.

118


క.

నాళీకశరుఁడు సుమనో, నాళీకము నేయఁ దాళ నవచంద్రకళా
ఫాలా చాలా యీలా, గేలా చాలా నలంచ కిఁక నేలఁగదే.

119


క.

అని వేఁడుచు నేరం బిది, యని మోపక యలుగ నేమి యనియెద నేఁడే
చనియెద నని యివలికిరా, వనితామణి పిలువ కేల వచ్చితి వనినన్.

120


చ.

వనజదళాక్షి యెచ్చటికి వచ్చితి పిల్వక ప్రొద్దువోక యే
వనమునఁ బాటపాడినను వల్లవకామిను లెల్ల వచ్చిరిం
తనుచునుఁ జేర నీవునను దారున గన్గొని వారిఁ బాసి క్ర
న్నన నిటు వచ్చితిం గలదె నాయెడ నేర మొకింతయేనియున్.

121


తే.

అనినఁ జిలుకయుఁ గలికి నీ వపుడు చూచి, మగుడు సాహన మెఱిఁగి నీమగఁడు వేగ
నన్నుఁ గనుగీఁట వచ్చి క్షణంబులోన, నీతెగువ మాన్పనే యనఁ గృష్ణుఁ డపుడు.

122


తే.

కాక నామీఁద నేరంబు గలిగెనేని, యిదిగొ నామేను నీవేణి యిదిగొ వలయుఁ
లీల దండించు మంచు గోపాలవిభుఁడు, గీలుజడఁ గేలు కందీయ బాల నగియె.

123


వ.

అంత.

124


ఉ.

వెన్నుఁడు సంతసించి మనవేడ్కకు వెన్నెల లెస్సగాఁగఁ గ్రే
గన్నుల చిన్నినవ్వు దొలఁకం దిలకించుచు సిగ్గులాడు న
క్కన్నియ ద్రాక్షచప్పరము కమ్మనిశయ్యకుఁ దార్చియంక సీ
మ న్నెలకొల్పి ముంగురు లమర్చుచుఁ జెక్కిలి ముద్దులాడుచున్.

125


తే.

మోవి తన కిచ్చి కనుఁగవ మూసికొనిన, బాళిమీఱంగఁ దేనియ గ్రోలి బాల
సొగసుకాఁడింత యఱకంటఁ జూచెనేని, మాను మరలంగ మోడ్చిన నానఁ బూను.

126


ఉ.

చక్కెరమోవి యానినను జన్నులఁ గ్రొన్నెలవంక లుంచినం
డెక్కులు మించ నొల్లమి నటించఁ బెనంగును నింతెకాని యా

చక్కనిసామి లోఁదొడల చక్కిఁ జుఱుక్కన గోట నొక్కినం
జొక్కి మిటారి సొమ్మసిలుఁ జూపు కరంగుట సాటి చెప్పఁగన్.

127


చ.

వలపులు రేచి గోలయని వల్లభుఁ డల్లనఁ గేలిసల్పుచో
మెలఁతుక నిబ్బరంపుతమి మించగఁ జేతులు ద్రిప్పికొంచు న
చ్చెలువుని మందవేగము హసించుచు వెన్ జఱచెం గరాగ్రసం
కలితసువర్ణకంకణము ఘల్లన వల్లవుగుండె జల్లనన్.

128


మ.

గళనాదంబులు దత్తఱించుచును సీతార్కంబు రెట్టింపఁ జె
క్కులపై స్వేదము గ్రమ్మ సొమ్మసిలి తళ్కున్ మేను వాల్గన్నుద
మ్ములు సోలన్ మృదులోరువు ల్పెనఁచుచుం బూఁబోణి దీనోక్తులం
జెలువు న్వేఁడ రతాంతమంత సడలెన్ శ్రీకృష్ణుఁడున్ వేడుకన్.

129


ఉ.

సురతాంతంబున తాంతయై తరుణి మించు ల్గుల్కుశ్రోణి న్నిజాం
బర మొక్కించుక వైచి యొత్తిగిలఁ బ్రేమం గృష్ణుఁ డొయ్యారిబం
గరుచెక్కు ల్దనచేలచేఁ దుడిచి సింగారంబు గావించి క
ప్పురపున్ వీడె మొసంగె నంత నలరెం బూఁబోణి విశ్రాంతయై.

130


వ.

అంత.

131


మ.

తిలిరున్ మోవిని గద్దు లేదనెడు నిద్దాకెంపుచిన్నారి చ
న్నులపై సన్నపుక్రొన్నెల ల్వెలయ వెన్నుం డిచ్చు కైదండతోఁ
గలకంఠీతిలకంబు వెల్వెడలి రాఁగాఁ జల్లనై యామునా
నిలమున్ మెల్లన వచ్చెఁ జెంగలువపూనెత్తావి పైఁజల్లుచున్.

132


తే.

అంతఁ గృష్ణుఁడు రాధాలతాంగిఁ జూచి, కంటె యుత్పలపత్త్రసంక్రాంత మగుచు
నీనితంబంబువలె మించె నీరజాక్షి, యనుచు యామునసైకతంబున వసించి.

133


సీ.

ఒప్పుగా విరులతో నొరగొప్పు ఘటియించి బటువుముత్యాలపాపట యమర్చి
తావిపన్నీటిచేఁ దడియొత్తి మోమున సొగసుగాఁ గపురంపుచుక్క దీర్చి
చిరుగోటితాఁకులఁ జిమచిమల్గొనుచెంప సంది కుంకుమగంధ మందపఱిచి
చెక్కుల మకరిక ల్చిత్రించి పాలిండ్లఁ జెదరినహారము ల్చిక్కు దీర్చి


తే.

కటిని బురుసాచెఱగుచీరఁ గట్టనిచ్చి, సొంపుమీఱ నెగాదిగఁ జూచి ప్రేమ
గడలుకొన శౌరి నిలువునఁ గౌఁగిలించి, మోహనాంగిని జెక్కిలి ముద్దుగొనుచు.

134


తే.

చిలుకతో నన్ను దూరుచుఁ జెలువ వెనుక, నలిగి యేమని గడఁగితి వనిన నేమి
లేదనియె రాధ యెటువలెఁ గాదు తెలుపు, మనుచు గృష్ణుఁడు వేఁడ సిగ్గున లతాంగి.

135


ఉ.

వచ్చినయప్పు డేననుచు వాకొని గ్రుక్కగ చాన యేటికో
మచ్చిక దెల్పుమంచు హరి మాటికి వేఁడిన నిన్ను బాహులం
జెచ్చెరఁ బట్టి క్రిందుపడఁజేసి మదం బణఁగింతు గట్టిగాఁ
దచ్చెననైనఁ గంతునకుఁ దప్పుదునంచుఁ బ్రతిజ్ఞ పూనితిన్.

136

మ.

అనినన్ రాధ హసింప యింత యలుకా యౌరౌర నామీఁదనై
నను నీకోపము తీర్చుకొ మ్మటులనైన నీదుకోపంబు దీ
ర్పనె భావింతు నటంచు వేఁడుకొనుచున్ రాధావధూరత్నమో
హనపుంభావకళావిలాసముల నబ్జాక్షుండు హర్షింపఁగన్.

137


క.

ఆరాధాధరమధురసు, ధారసధారాతిదర్పితస్వాంతమునన్
గూరిమి రమణుఁడు దముఁదమిఁ, జేరమి నేరమిగ నచటిచెలియలు కలఁగన్.

138


మ.

ఇదిగో వచ్చెద నంచుఁ బోయి యిది యేమీ రాడు కృష్ణుండు రా
గదరే చూతమటంచు నంగనలు రంగద్రత్నమంజీరము
ల్గదలం గుబ్బల పయ్యెద ల్పొదల సింగారంపుఁగీల్గొప్పులం
బొదలం దుమ్మెద లెల్లఁ బూఁబొదల నెమ్మిం బల్మరుం జూచుచున్.

139


చ.

ఒకపొదరింటిలో దలిమ మొక్కటి గాంచి యిదేమి చెల్ల నా
యకుఁడు విశేషబంధముల నంగనఁ గూడినపొల్పు దెల్ప రే
వికసితజాతిశయ్య కడువేడుక మీఱఁగ రాధఁ గూడి యే
డకొ చన నోపు నింక నకటా శకటారిని నమ్మవచ్చునే.

140


సీ.

గట్టిగాఁ గీల్జడఁ గట్టివేయక మున్నె మోసపోతిమి గదా ముగుదలార
గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చుకొని విడువకయుండ నేరమైతిమి గదా నెలఁతలార
మనచేలచెఱగు లాతనిచేల ముడిగొల్పఁ దెలియమైతిమి గదా చెలువలార
యొకతెపై నొకతె మానక గూడి యలయింప నేరమైతిమి గదా నెలఁతలార


తే.

యెవ్వ రెఱుఁగుదు రింతలో నిన్నివగలు, సేయుటలు దక్కెగా యని చెలఁగియుంటి
మెంత గృష్ణుని వెతకెద మింత ననుచు, వెతల మతి తల్లడిల్లి యా వ్రేతలెల్ల.

141


సీ.

లత పెనంగొను తమాలముఁ జేరి యదె రాధికాకృష్ణు లని చేరి కనుచుఁ గనుచు
శారిక కృష్ణకృష్ణ యటన్న నదె కాంత శౌరిఁ బిల్చె నటంచుఁ జనుచుఁ జనుచుఁ
జాటున బర్హిపింఛముఁజూచి చెలికొప్పు హరియూనుపింఛమో యనుచు ననుచుఁ
కలరవంబులు వల్క లలనామనోహరఘనగళధ్వనియంచు వినుచువినుచుఁ


తే.

దరువుఁ దరువును బొదఁ బొదఁ దెరువు దెరువు, సైకతము సైకతమును సారె సారె
యరసి యరసి వ్రజాంగన లందు నందు, మఱియు మఱియును వెదకుచు మమత మెఱయ.

142


సీ.

నెమిలిపించెమువాఁడు నెఱి మించు సరి మించు గరమించుకాంచనాంబరమువాఁడు
వేణునాదమువాఁడు వినుగెంపు నునుగెంపు గనుపింపు కౌస్తుభకాంతివాఁడు

మొగులుచాయలవాఁడు మురిపెంపుఁగరిపెంపుమఱపింపుగతివిభ్రమములవాఁడు
వెడఁదకన్నులవాఁడు విరిపువ్వు సరిక్రొవ్వు చిఱునవ్వు కెమ్మోవిఁ జిలుకువాఁడు


తే.

సారఘనసారచందనచర్చవాఁడు, కాంతతిలకాంతమౌళిభాగంబువాఁడు
మారసుకుమారసౌందర్యమహిమవాఁడు, మాధవుఁడు వచ్చెఁ గానరే మల్లెలార.

143


వ.

అని మఱియు నగంబుల ఖగంబుల మృగంబుల నడుగుచు నడుగుచుఁ జుఱు
క్కను వెన్నెలబయిళ్ల వల్లభాయల్లకభరంబునం దల్లడిల్లుచు హల్లకీభల్లకృపా
ణులకు లోఁగి వల్లవపల్లవపాణు లల్లనల్లనం జనిచని.

144


క.

కందళదిందీవరని, ష్యందితమకరందబిందుసందోహపరి
స్పందామందానందా, ళిందమిళిందవ్రజం గళిందజఁ గనుచున్.

145


మ.

యమునా నాయము నాకుఁ గాదనక పద్మాక్షుండు మ మ్మీవనాం
తమునన్ స్వాంతమునం దొకింత దయయైనన్ లేకయే డించి స
ప్రమదుండై ప్రమదంబుతో నరిగెఁ జూపన్ లేవుగాఁ దద్వియో
గమునన్ భంగమునందె మాధృతు లనంగప్రౌడి రూఢిం గనన్.

146


తే.

భూరికాఠిన్యమత్కుచంబులను బోలి, యవనిఁ బుట్టంగ నట్టి దోషాప్తివలన
నబ్జదచక్రాంగకరసంగ మభిలషించి, వగచెదరు మీరు నిట చక్రవాకులార.

147


క.

అనుచున్ వెదకుచుఁ జనుచో, వనజాప్తసుతానితంబవైఖరి బటువై
నునుఁదెలివెన్నెలచెలువుం, దనరిన యొకవిపులపులినతలమధ్యమునన్.

148


సీ.

విరవాదిసరులతో వెడఁజాఱుసిగతోడఁ గమ్మకస్తురితిలకంబుతోడ
మోవిపైఁ దిలకించు మొలకనవ్వులతోడఁ గలితనాసామౌక్తికంబుతోడఁ
గండమండలచలత్కుండలంబులతోడ రమణీయతారహారములతోడ
ఘనకటీతటబద్ధకనకాంబరముతోడ నవరత్నమయభూషణములతోడ


తే.

నిఖిలభువనైకమోహననిరుపమాన, మానితాకారరేఖాసమగ్రగరిమ
సమరు మన్మథమన్మథుఁ డైనకృష్ణుఁ, డంబుజాక్షులమ్రోలఁ బ్రత్యక్షమయ్యె.

149


వ.

అప్పుడు.

150


ఉ.

చక్కనివాని బోధనిధిసాధుతపోధనచిత్తవృత్తికిం
జిక్కనివానిఁ బ్రహ్మశశిశేఖరముఖ్యుల కైన దృక్పథం
బెక్కనివాని సంతత్సమేధికభక్తికి కాని యేటికిం
జొక్కనివాని మానధనచోరుని శౌరినిఁ జూచి కామినుల్.

151


క.

మనమానధనము దొంగిలి, చనుచోఁ దద్ద్రోహమునను జరణంబులు రా
క నిలిచె విడిగోఁ గృష్ణుం, డని యవ్విభుఁ జేర నేఁగి యంగనలెల్లన్.

152


సీ.

ఏకుందరదనరా యీకమ్మకెమ్మోవిచిగురాకు నజ్జునజ్జుగను గఱచె
నేగుబ్బలాఁడిరా యీవెడందయురంబు గ్రుచ్చుచో గుబ్బల గ్రుమ్మి కమ్మె

నేపద్మపాణిరా యీతేటముద్దుచెక్కుల నెత్తురులు గ్రమ్మ గోరఁ జీరె
నేనీలవేణిరా యీతళ్కుమేనంట ఘనవేణిచే వ్రేసెఁ గందువార


తే.

నట్టిజగదంటకే గాని యనఁగి పెనఁగి, యుండుదువె నీవు మాబోంట్లయొద్దఁ జేరి
యనుచు నెకసక్కియములాడువనజముఖులఁ, గాంచి నవ్వుచు గోపికాకాంతుఁ డనియె.

153


చ.

నెలఁతుకలార మి మ్మిచట నిల్పి యటం జనుదేర రాధ చె
య్వుల నెలయించి తావకవియోగము తెల్పిన నల్గిపోయె నా
మెలఁతుకఁ గూర్చుకోక మనమే విహరించిన రట్టుపుట్టునా
వెలఁదులు మంచిదంచు హరివెంటను రాధను జేరి నంటునన్.

154


సీ.

ననవిల్తుగరడిసాధనకట్టుకంబంబు శుకవాణి ప్రాణనాయకునిమేను
కమలసాయకుపానకపుఁజలివెందర యిగురుఁబోణిరొ జీవితేశుమోవి
మకరకేతనునిధర్మంపుగొటారంబు జలజాక్షి విభునివక్షఃస్థలంబు
వలరాజుపెండ్లిబువ్వపునిందు సంపూర్ణచంద్రాస్య కృష్ణునిజవ్వనంబు


తే.

కలికి యటుగాన మనము నాటలకుఁ బెనఁగి, దప్పి దీరంగఁ గ్రోలి ఖేదంబులెల్ల
వదలఁ బవళించి యనుభవింపుదము గాక, యలుగ నేటికి నన రాధ చెలఁగె నంత.

155


మ.

హరిమధ్యాద్వయమధ్యవీథి హరిమధ్యా శౌరిమధ్యంబునన్
హరిమధ్యామణి గల్గుమండలము మధ్యంబొంది యానంది యై
మురళీనాద మొనర్చెఁ గృష్ణుఁడు జగన్మోహైకశృంగారభా
స్వరత న్గన్గొని యచ్చర ల్సొగయ రాసక్రీడయం దంతటన్.

156


సీ.

అలసట మీఱ నొయ్యారంబుగాఁ గేల దుఱుమునఁ దుఱిమినవిరులు రాల
వలసి వల్లములుగా వలిగుబ్బచన్నులఁ గదియించు సరిగెపయ్యెదలు జాఱ
నొకవిలాసము గాఁగఁ జికిలి గోరుల మీటు చెక్కుల జవ్వాజిచెమట దొరుగ
బడలికపొడమి పైపైనూర్చునూర్పుల కమ్మకస్తురితావి ఘమ్మనంగ


తే.

నల్లనల్లన నిడుపాదపల్లవముల, ఘల్లుఘల్లున కీలందెకవలు మొరయఁ
జెలువుకైదండ గైకొని చెలువు మెఱయ, నంబుజాక్షులు యమునాతటంబు దొరయ.

157


చ.

అతివలవక్త్రము ల్వికసితాబ్జములందును జేర షట్పద
ప్రతతుల చేర నిమ్ము మధుపానమున న్నిశియౌ టెఱుంగ వ
ద్భుత మిది గాదె వారి కుచము ల్దమజోళ్లనుభ్రాంతి నెంతయున్
హితమతిఁ జేరు కోకముల కేమి వివేకము లేకపోయెనే.

158


వ.

అయ్యవసరంబున.

159


మ.

సరిగెమెఱుంగుబంగరపుఁజందురకావిపటంబు లూడ్చి బి
త్తరముగఁ జల్వపావడలు దాల్చి బయల్పడుగుబ్బజక్కవ

ల్గరములఁ గప్పుకొంచుఁ గుతుకంబునఁ దోయముఁ జొచ్చి రయ్యెడన్
దెఱకువతో మిటారు లొఱదీసిన మారుకటారులో యనన్.

160


తే.

మదవతుల మర్లుకొనఁజేయు మదను మెచ్చి, ముదముతో దోఁ పొసంగిన మురువు దోఁపఁ
దాళిగోణంబు గట్టి గోపాలమౌళి, చెలులతోఁ గూడి జలకేళి సలుపునపుడు.

161


రగడ.

అదిగొఁ జూచితె కృష్ణ యరవిందకోశంబు
సుదతి యౌనౌను వక్షోజప్రకాశంబు
అవులేర యివి గంటె యలరారె విరిగల్వ
లవియె నీకన్నులకు ననుఁగుఁజుట్టలు చెల్వ
పిలుకుబేడిసమీల బిత్తరంబులు గంటె
నెలఁత బెళ్కఁగలాదె నీదుచూపులకంటె
ఎడలేదు నిదురించె నిది చిన్నరాయంచ
నడికియున్నది నీదునడ కూర కాయంచ
మెండయ్యెనౌర తుమ్మెదల ఝంకారంబు
దండిమన్మథునికోదండఠంకారంబు
కడలేని వెతలచేఁ గందెగాఁ గోకంబు
పడఁతిఁ గానకయున్నఁ బాయునే శోకంబు
సుడిలోనఁ గేలేల చొన్పెదవు గోపాల
బెడఁగొల్కు లీలలం బెంపొందు నోబాల
కలువపూవుల వ్రేయఁగాఁ గందె నామేను
తలిరాకుఁబోఁడి మెత్తనిదాన వౌనౌను
పూనినను గొంచానఁ బోను పోపో చాలు
కాననా మది యేటి కనిపించు నీమేలు
లోతైన వెఱతు లోలోపలికిఁ దీయకుము
నాతోనె యీవగలు ననువింత సేయకుము
తలరోరి నీచోరతనము లేటికిఁ గూడుఁ
తొలుపల్కులకుఁ గదా దూఱెదవు నను నేఁడు
తలచూప నెందుఁ బోఁదరము నీ కేవేళ
కలికి నీచనుగొండకడ నుందు నీవేళ
పూనుకొని మోరతోపునఁ బోవ బోనీను
నేను నీకటిభూమి నిల్తు నేడకుఁ బోను

క్రొవ్వాఁడి నీచేతిగోరఁ జీరఁగ రాకు
నవ్వెదను నీమేన నాటింతు నా పోకు
వేఁడెదవు కోపంబు వీడితిని మన్నించి
మూఁడులోకంబు లిమ్ముల నేలనా మించి
తావికుంకుమశోణితహ్రదము చేసితివి
కావునను నేఁగట్టుగనిమేల దీసితివి
వనములో విహరించు వాంఛ పుట్టెనె నీకు
నినసూతిపైఁ బ్రేమ హెచ్చ నట్లనె పోకు
బలశాలి వౌదు పైపై నీళ్లు చల్లకుము
చెలియ నీయధరమధుసేవవలె మళ్లకుము
మగవాండ్ర నింతగా మరులుకొల్పితి వౌర
వగలాఁడి నే జక్కవలువఁ గట్టఁగనేర
కలికిచెయ్వుల నెన్నిగతుల మించెదొ యింక
వెలఁది ధర్మపుత్రోవ విహరింతు నీకింక.

162


వ.

అని పెక్కుతెఱంగుల మర్మగర్భితంబులయి శర్మదంబులగు నర్మోక్తులు వెల
యంగఁ గర్మసాక్షికూర్మినందననిర్మలోర్మికలఁ దేలి కుసుమధర్మధర్మసధర్మ
భ్రూవిలాసపటుభర్మపటునితోడం దటము సేరి యంతట.

163


మ.

బురుసాసీరలు గట్టి జంటఱవిక ల్పొంకించి సంపంగిక్రొ
వ్విరిదండ ల్నెఱిగొప్పులం దుఱిమి తావి న్మించు గంధంబుఁ గ
స్తురియున్ గోవజవాది కుంకుమము మెచ్చు ల్గుల్కఁగాఁ బూసి క
ప్పురపున్ నాభులు దీర్చి సొమ్ము లిడి యంభోజాతపత్రేక్షణల్.

164


సీ.

చికిలి సేయించిన చిగురుఖండాజోదుకన్నెగేదంగిచేకత్తు లనఁగఁ
గందర్పుఁ డాడించు కుందనాటకమునఁ బొల్చు కుందనపుకీల్బొమ్మ లనఁగఁ
జిలుకతేజీదొర శృంగారవనమున మెలఁగెడికస్తూరిమెకము లనఁగ
రతిరాజుమణిపంజరము వాసి తమయిచ్చఁ జెలఁగెడు ముద్దురాచిలుక లనఁగఁ


తే.

గొలను వెలువడు రాయంచకొదమ లనఁగ, మేఘములఁ బాయు క్రొక్కాఱుమెఱుఁగు లనఁగఁ
బూర్ణిమాచంద్రకళలనఁ బువ్వుఁబోండ్లు, వెలసి రభినవశృంగారకలనమునను.

165


ఉ.

ఒక్కతె పూలు చుట్ట మఱియొక్కతె గంద మలంద ముందె వే
ఱొక్కతె మిన్నసొమ్ము లిడ నొక్కతె బంగరుసాల్వు గట్టఁగాఁ
జక్కెరవిల్తుకన్న నెఱచక్కఁదనంబుల జాణరాయఁ డ
మ్మక్క యనంగఁజాలిన యొయారమునం దగె నట్టివేళలన్.

166

సీ.

స్వామి పరాకు హెచ్చరికంచుఁ గొందఱు పంకజాక్షులు బరాబరులు సేయఁ
గీలుకంకణముల కేలెత్తి కొందఱు మోహనాంగులు కొల్వు మ్రొక్కు లిడఁగఁ
దంబుఱ మీటి కొందఱు కుందరదనలు తనమీఁదిపదములు వినికి సేయ
ఘనగోపికామానధనహారి యనుచుఁ గొందఱు చెలు ల్బిరుదపద్యములు చదువఁ


తే.

గొమలుకొందఱు దగ నూడిగములు సేయ, భవ్యయామునసైకతభద్రపీఠి
రాధ నంకంబు నుంచి రా రాజసమునఁ, బెద్దకొలువుండె గోపాలభిదురపాణి.

167


మ.

తొడపై నుంచిన రాధికామణియు నెంతోవేడ్కతోఁ గప్రపున్
మడుపు ల్పల్మొన నొక్కి తా నొసఁగఁ బల్మాఱు న్విలాసంబు గ
న్పడఁగా నందుచు మోవి నొక్కుచును బైపైఁ బొంగు పాలిండ్లఁ గే
లిడుచుం జెక్కిలి ముద్దుగొంచు నలరెం గృష్ణుండు లీలాగతిన్.

168


సీ.

తరలాక్షి యొకతె చేసురటి నడ్డము సేసి బోటినొక్కతె కన్ను గీఁటికొనియె
సిగ్గులే యేమి చూచెదమంచు నొకలేమ భామనొక్కతెను జేపట్టి దిగిచె
సుదతి యొక్కతె యట్టె చూచి జంకెన బొమ్మముడితో నుచుక్కని మోము త్రిప్పె
నెఱుఁగవా యిందు రా యిఁక నంచు నొకకల్కి చిలుకపై నిడి యట్టె కెలయసాగె


తే.

మఱియుఁ దగునీరసంబున మగువ లెల్ల, గుసగుసలఁబోవ వారలకోర్కి నెఱిఁగి
యందఱకు నన్నిరూపుల నతులగతుల, రతుల నలయించె గోపికారమణుఁ డపుడు.

169


చ.

వలిచనుగుబ్బ లూఁతగొని వాతెఱ గ్రోలుచు నెత్తి కౌఁగిటన్
మెలఁవుచుఁ గొంతసేపు తమిమించఁగఁ గేళి ఘటించి తెచ్చుకో
లలయిక నూరకున్న జలజాక్షునిచిత్త మెఱింగి గోపికల్
చెలఁగుచుఁ దాము పైకొనిరి చెల్వుఁడ చిక్కితి వంచు నవ్వుచున్.

170


సీ.

కలగళధ్వనులతో ఖగకులంబులు, మ్రోసెఁ గ్రమ్ము నిట్టూర్పుతో గాడ్పు విసరెఁ
దెగుముత్తెసరులతోఁ దెరలెఁ దారావళి చెదరుముంగురులతో మెదలెఁ దేంట్లు
కులుకుగుబ్బలతోడఁ జెలరేఁగె జక్కన ల్వీడువేనలితోడ వీడెఁ దమము
నెమ్మోము చెమటతోఁ గ్రమ్మెఁ దమ్మిని తేనెసొగయుగన్నులతోడఁ దొగల మునిఁగె


తే.

నింక మీమీగృహంబుల కేఁగవలదె, యనుచు రత్యంతమున గృష్ణుఁ డాదరమునఁ
బలికినను విన్ననౌ గోపికలముఖాబ్జ, తల్లజంబులతోఁ దూర్పు తెల్లనయ్యె.

171


తే.

అంత వారల మక్కువ నక్కుఁ జేర్చి, యిందుముఖులార యీవేళ నిండ్ల కేగుఁ
డటులనయ్యెడు రాత్రులయందు ననుచు, నమ్మిక లొసంగి హరి పంప నలినముఖులు.

172


తే.

వెన్నుఁ గనుగొని కనుఁగొని విడిచిపోవ, లేక తమి మీఱఁగాఁ గౌఁగిలించికొనుచు
రేయి రమ్మని వేఁడుచు వేయువగల, మఱలి రొకభంగి గోపికామానవతులు.

173


సీ.

అంఘ్రులు ఘలుఘల్లుమనఁగఁ గీలూడ్చి వైచినరత్నఖచితమంజీరములును
హొయలుగాఁ గొప్పుల పయిపయిఁ జరుపుచో జాఱిన కమ్మగొజ్జంగివిరులు

త్వరఁగొన్ని ద్రెవ్విన దగఁ గ్రువ్వగా లేక యట్టెవేసిన తారహారములును
ఘణిఘణిల్లన మ్రోయఁగా విసర్జించిన చిఱుగంటమొలనూలిసరిపెణలును


తే.

మరలి త్రోవలఁగంచు విస్మయముతోడ, నాదునిలు వెళ్ళినంజాలు ననుచు వెడలి
నట్టిరమణులు రమణు లేమండ్రొ యను భ,యమున నిజగేహములు సేరి రవనినాథ.

174


తే.

కొమిరె చందురుకావి టెక్కెములలీల, నమరె నరుణోదయద్యుతు ల్కమలనాభు
రథమువలెఁ దోఁచె రవియంత రశ్మిగణము, లలమ ద్విజసంఘములకలకలము లెసఁగ.

175


మ.

తళుకుంగన్నులకెంపు కెంపు జిగినిద్దామోవి బల్ గెంపు చ
న్నులపై గ్రొన్నెలసొంపు సొంపు గనియున్ నోరెత్తఁగాఁజాల క
తలు మామ ల్మగలున్ లతాంగుల యశోదాపుత్రుఁ డెన్నేనిమా
యలు గావించెనొ కాని కాక యిటు సేయంబూనునే దాసులన్.

176


వ.

అంత శంఖజూటవృషభాసురకేశిహంతకడ కొకనాఁడు నారదుం డరుగుదెంచి
సత్కృతుండై యిట్లని నుతించె.

177


ఉ.

శ్రీవసుదేవపుత్ర సరసీరుహనేత్ర సువర్ణనేత్ర బృం
దావనమిత్ర ప్రత్యహవినస్యదమిత్ర హితాబ్జమిత్ర సం
భావితగోత్ర వేత్రపరిపాలిత గోత్రకరాంత గోత్రతా
రావగగోత్రకృష్ణ యదురాజశిఖామణి నిన్నుఁ గొల్చెదన్.

178


వ.

అని ప్రశంసించి భావికార్యవృత్తాంతంబు దెలిపి చనె నంత జిఘాంసాకంసప్ర
హితుండై విప్రహితుండగు నక్రూరుఁడును రేపల్లెకు నరుగుదెంచి వల్లవీవల్లభు
పాదంబులకుఁ బ్రణమిల్లి యిట్లని నుతించె.

179


చ.

జయజయ కృష్ణకృష్ణ ఘనసన్నిభవిగ్రహ విగ్రహక్షమా
జయజయ దేవదేవ జలజాతరవిక్రమ విక్రమస్పృహా
జయజయ శౌరిశౌరి వరసంవృతమార్గణ మార్గణప్రియా
జయజయ చక్రిచక్రి వరసంభృతగోపక గోపకల్పనా.

180


వ.

అని యక్రూరుం డభినందించిన నందనందనుఁ డానందించి నందయశోదాను
మతుండై రాధాదిగోపికల నూఱడించి బలరామాక్రూరసమేతుండై మధురా
పురంబున కేఁగునెడ.

181


క.

భువనవ్యాపకుఁ డగుమా, ధవుఁ డప్పుడు చూపె భక్తతమునకు యమునా
భువనంబున మృదుతాజిత, భవితాఖలనీలమూర్తి ప్రత్యఙ్మూర్తిన్.

182


క.

అక్రూరుని వెంబడిగాఁ, జక్రాయుధుఁ డేఁగుదెంచి సహితాగ్రజుఁడై
చక్రాది దివిజగేహస, మక్రమ మణిధామమధుర మధురకు నంతన్.

183

సీ.

రజకునిఁ గొట్టి వస్త్రములు గట్టకయున్న దనకు లేదాయెనే కనకపటము
వెస సుదాముఁ డొసంగు విరులు దాల్పకయున్న వక్షఃస్థలిని లేదె వైజయంతి
కుబ్జచేకలపంబు గొనకున్న నిందిరాకుచకుంభఘుసృణంబు కొదవె తనకు
నంధకారాతివి ల్లపహరింపకయున్న నరయమే మును రాముఁ డనుచుఁ దన్నుఁ


తే.

గరివరదుఁ డయ్యుఁ జెల్లునే కరి వధింప, భువనపతి యయ్యుఁ జెట్లతోఁ బోరవలెనె
హరికి నిదియు వినోదంబు లయ్యెనేమొ, యనుచుఁ దోవచ్చు నక్రూరుఁ డనఁగ శౌరి.

184


క.

చనువున బలిమిం దగఁ గై, కొనఁదగుఁ గద మేనమామ కూఁతురి నిఁకఁ గం
సుని జంపి జయరమాక, న్యను వరియించెన్ ముకుందుఁ డందఱు మెచ్చన్.

185


క.

ఆశింపఁడయ్యెఁ గంస, శ్రీసర్వంబునకు నుగ్రసేనునిఁ బతిఁగాఁ
జేసెం బరమానందము, చేసేం దలిదండ్రులకును శ్రీహరి యంతన్.

186


తే.

గొల్లయిల్లాండ్ర మానంబుఁ గొల్లలాడి, నట్టికల్లరి బ్రహ్మచర్యంబుఁ బూనె
వెనుకటికెగాని యిటువంటివిద్య లేదు, వెనుక నొకనాఁడు కుబ్జఁగూడినదె గాని.

187


క.

గురుసుతునిఁ దెచ్చుకొఱకై, యరిగిన శంఖంబు దొరకె హరికిం దద్దు
ష్కరకార్యకార్యఘటనము, దొరకిన సత్కీర్తిమూర్తితోఁ దగె ననగన్.

188


వ.

అంత.

189


సీ.

నలువంకఁ దగుకాంచనముల పూమొగ్గలు ప్రజ్వలస్తంభదీపములు గాఁగఁ
పొన్న క్రొన్ననకమ్మపుప్పొడిదిన్నెయ డంబు మీఱిన దాడిమంబు గాఁగఁ
దళుకుకెందలిరుటాకులగుంపు లందందఁ జఱచుహరిద్రహస్తములు గాఁగఁ
గలకలకంఠికాకలకంఠకలనంబు లల్లొనేరెడిపాట యనువు చాటఁ


తే.

బ్రేమ మీఱంగ లతకూనపేరటాండ్రు, కొమరు క్రొవ్విరివెండిపళ్లెములఁ దేఁటి
యలఁతి జిమ్మిలివాయన మందుకొనఁగఁ, బ్రథమఋతు వయ్యె వనలక్ష్మి ప్రాభవమున.

190


తే.

అట్టివాసంతవేళ నుద్యానమునను, మక్కువఁ జరించుచు మురారి యొక్కనాఁడు
చెలిమి మీఱంగ నుద్ధవుఁ జేరఁబిలిచి, పలికెఁ గెమ్మోవి చిఱునవ్వు మొలకలెత్త.

191


ఉ.

అక్కట నన్నుఁ బాసి క్షణమైన సహింపఁగలేరు గోపిక
ల్చక్కెరబొమ్మ లేకరణి సైఁచిరొ యిన్నిదినంబు లందు లో
మిక్కిలి రాధ యీయెడను మేను భరించుట దుర్లభంబు నీ
వక్కడి కేఁగి కృష్ణుఁ డిదె వచ్చె నటంచు వచింపు ముద్ధవా.

192


ఉ.

అత్తల మామలన్ మగల నన్నలఁ దమ్ములఁ దల్లిదండ్రులం
జిత్తులదుద్దువెట్టుచును జీటికిమాటికి నన్నె చేరఁగా
వత్తురు మేలుకజ్జములు వంతుల కిత్తురు నిండుఁగౌఁగిటం
గ్రుత్తురు మారుకేళికను గూడుచు మెత్తురు మత్తచిత్తలై.

193


శా.

ఏ నక్రూరుని వెంట వచ్చునపు డట్టే నన్ను వీక్షించి నేఁ
డైన న్నిల్వు మటంచుఁ గన్నుఁగొనలం బ్రార్థించినం గూడదం

టేనెమ్మోములు వంచి యుస్సురనుచు న్నేత్రాంబువర్షంబులన్
నానంజేసిరి పైఁట లచ్చెలులు మానన్ నేర్చునే యుద్ధవా.

194


ఉ.

ఎన్నఁడు గారవింతునొకొ యే నిఁక నిచ్చటనుండి వచ్చినం
గన్నెలు గౌఁగిలించి ముఖకంజము లక్కునఁ జేర్చిమక్కువం
గన్నుల బాష్పము ల్దొరుఁగ గద్గదికోక్తుల నన్ను దూఱినం
దిన్ననిమాటలం గలఁక దేర్చుచు వేడుక నోలలాడుచున్.

195


సీ.

చొక్కమై యరగంటఁ జూడఁగా నేర్చిన నప్సరస్త్రీలనీ డనఁగవచ్చు
నడకువ తిన్నగా నడుగిడ నేర్చిన నాగకన్యలనీ డనంగవచ్చు
నెలవంటిముద్దుమోములు గల్గెనేని గంధర్వకాంతలనీ డనంగవచ్చు
మెఱుఁగుఁదీఁగెలవంటి మేనులూనినను గిన్నరకామినులనీ డనంగవచ్చు


తే.

నితరమానవకాంతలనీ డనంగ, రాదు కల్లలు గాదు నీమీఁదియాన
కంతుప్రతిసృష్టి యేమొ యీకంజముఖులు, బ్రహ్మసృష్టిని గాన మాపాటివారి.

196


క.

చుక్కలలోపల మిక్కిలి, చొక్కంబగు చంద్రరేఖ సోయగమున నా
చక్కెరబొమ్మల మించిన, చక్కఁదనంబునను రాధ సన్నుతి కెక్కెన్.

197


సీ.

సొలపు మీఱఁగ నోరచూపులు చూచెనా వలరాచజాలరి వలలు వెదకు
మొలకనవ్వులు గుల్కుమొగ మింత యెత్తెనా ఘనచకోరముల యాఁకండ్లు దీరు
ముద్దుమాటాడి కెమ్మోవి గదల్చైనా కలకలధ్వనులఁ గోయిలలు చేరు
నొయ్యారమునఁ జిల్గుపయ్యెద జార్చెనా కుంభిరాజములు ఢీకొన గడంగు


తే.

నాచపలమీనలోచన నామృగాంక, వదన నాపల్లవోష్ఠి నామదగజేంద్ర
కుంభజృంభితవక్షోజకుంభ రాధ, నభినుతింపంగ శక్యమే యజునికైన.

198


తే.

మగువ నెఱికప్పుగొప్పు నమాస యనుచుఁ, బొలఁతి నెమ్మోముఁ గన్గొని పున్న మనుచు
బ్రమసియుండుట సంతసపర్వ మయ్యెఁ, గలదె యిటువంటివింత లోకంబునందు.

199


తే.

ఇంటివార లొకించుక యెఱుఁగనీయ, రాదనుచు సంచరింతుము రాధ నేను
నాభయము సంభ్రమముఁ జేయు నవని పాన, కంబులోపలిమిరియపుకార మట్లు.

200


సీ.

ఒకగుబ్బ నాప్రక్క నొరయ మూఁపునఁ గేలి నిడు నుత్సవముల సందడులయందు
జాతరలో నున్న సన్న సేయుచు లేనిపనులఁ బెట్టుక వచ్చు భవనమునకు
సంకేత మొనరించు సంధ్యవేళను దానె వెదకుచో టిది యంచు వేడ్కమీఱ
నడురేయి నిద్రించు నను లేపికొనిపోవు వేగ యామునతీరవిపినమునకుఁ


తే.

బాటఁ బాడిన నామీఁదఁ బాట బాడు, మించు పాలిండ్లయందు నే నుంచునట్టి
పచ్ఛిగోరులు పయ్యెదవిచ్చినిచ్చి, పెరిఁగి లేచిన గను రాధ వింతవగల.

201

మ.

కలకంఠు ల్వలిగుబ్బజంట నెలవంక ల్వేఁడ నేమేనియుం
బలుకన్నేరక రాధ నీళ్లు నమలున్ బంతిన్ యశోదాంగనా
తిలకం బేమిటి మాట తాఁకినవి యింతే కేతకీకంటకం
బులు బొమ్మం చదలింప నట్లయను నప్పూఁబోణి లేనవ్వునన్.

202


క.

ఆనాఁటి వినోదము లె, న్నైనం గలవైన నెన్న నాకలుగునొకో
యానారీపరిరంభం, బేనాఁటికినైన వచ్చు నిదె హరి యనుమీ.

203


క.

అని పంప నుద్ధవుఁడు చని, వనితలతో మాటలాడి వచ్చి లతాంగు
ల్వినిపింపుమనినమాటలు, తనతోఁ దెల్పిన మురారి దరహాసమునన్.

204


ఉ.

ఏమనిరోయి యుద్ధవ మృగేక్షణ లామధురాపురంబులోఁ
బ్రేమను వన్నె వెట్టి వలపింపఁగ నాయకురాండ్రు గల్గ మా
మోములఁ జూచునే యిఁకను ముచ్చటగా నని బలాబలా
యేమిటిమాట నామనసొకింత యెఱుంగరుగా వ్రజాంగనల్.

205


ఉ.

ఎప్పుడు వచ్చునంచుఁ తమి హెచ్చగ నొక్కెడఁ గాచియున్నచోఁ
గొప్పరవీడ గబ్బిచనుగుబ్బల పయ్యెద జాఱ సంభ్రమం
బుప్పతిలంగఁ జేర ముద మొప్పఁగ వచ్చియుఁ గౌఁగిలించుచో
నప్పటిసౌఖ్యమింత గలదా వెలబోటులయందు నెయ్యెడన్.

206


మ.

అనిన న్నవ్వుచు నుద్ధవుండు కమలాక్షా ముగ్ధజారాంగనా
జనసంగం బిది యెంత మన్మథకళాశాస్త్రైకపారీణలై
వినయోక్తు ల్ఘనరక్తులు న్వెలయఁగా వేయాఱుబంధంబులం
బెనఁగంజాలిన ప్రౌఢవారసతులం బేర్కొన్నచో నావుడున్.

207


మ.

ఐనం జూతమటంచు నున్నయెడ నబ్జాక్షానుకూలంబుగా
భానుం డస్తనగంబుఁ జేరఁజనుచోఁ బ్రాగద్రికూటంబునన్
శ్రీనాథప్రియకారియై పొడమె రాజీవారి తచ్చంద్రికా
శ్రీనైపుణ్యము మించెఁ జోరజనరాజీవారియై యయ్యెడన్.

208


సీ.

తళుకుసంపఁగిమొగ్గతాయెతు ల్మెఱయంగ నరవిరివిరజాజిసరులు చుట్టి
తీరుగాఁ గస్తూరితిలకంబు దీరిచి మేలిమిబురుసారుమాల గట్టి
మురువైన హురుమంజిమురువుతోఁ గట్టాణి ఘనమైనగొప్పచౌకట్లు దాల్చి
తావికుంకుమపుగంధముపట్టె యురమున రాణించు తారహారములు వైచి


తే.

వలిపెచెంగావిదుప్పటివల్లెవాటు, నేలజీరాడ గిలుకుపావాలు మెట్టి
చికిలుసానాకరంబునఁ జెలువు గులుక, నగధరుం డొంటిగాఁ దననగరు వెడలె.

209


తే.

వెంట నరుదెంచు నడప వాల్గంటిచేతి, యుదిరియడపంబు గైకొని యుద్ధవుండు
కెలసఁ జనుదేర పరిజనంబులను బనిచి, కమలనేత్రుఁడు నగరమార్గమునఁ జనుచు.

210

సీ.

విటవిటీసల్లాపవికవికహాసము ల్గళనాదసహకారికలరవములుఁ
బురుషాయితాంగనాపరిహాసవచనము ల్చటులకచాకర్షసంభ్రమములుఁ
దతహృత్కళాదిభేదనముష్టిఘాతము ల్మోదకల్పితశుష్కరోదనములుఁ
గోపనానూపురకోలాహలంబులుఁ గఠినరతాసహాక్రందనములుఁ


తే.

బ్రథమరత్యంతకామినీప్రార్థమాన, సరసశృంగారపదపద్యసంభ్రమములు
వేణువీణావినోదము ల్వినుచు వేశ్య, వాటిలో వాసుదేవుండు వచ్చునపుడు.

211


తే.

చకితనేత్రలు దమతమసంభ్రమములు, వదలి కృష్ణునిఁ జూడఁగా వచ్చిరపుడు
ఏమియాశ్చర్య మాతని నెప్పుడెపుడు, గాంతుమని యున్నవారలు గారె వారు.

212


సీ.

విడువిడురా యని విటునిచెక్కిలి గొట్టి తనమోవి విడిపించికొని యొకర్తు
విటుఁడు పయ్యెదఁ బట్టి విడమిఁ గుచ్చెలలెల్లఁ జనఁ బోఁకముడి బట్టుకొని యొకర్తు
వసగాదు వలపు రావలెనంచుఁ గినుకతో నధిపుకౌఁగిలి విడనా డొకర్తు
రతిమధ్యమున లేచి రమణుదుప్పటి చీర యనుచు నట్టిటుఁ జుట్టుకొని యొకర్తు


తే.

కేళిసదనంబు నందుండి జాలకముల,, గాంచి రితరులు ద్వారభాగములఁ గడచి
కెలనఁ జేరియు నేఁడి శ్రీకృష్ణుఁ డనుచుఁ, జెలులు వేఁడిరి తమకంబు కొలఁది మిగుల.

213


చ.

కనుఁగొని కృష్ణుఁ గామినులు కంతునిబారికిఁ జిక్కి చొక్కుచుం
గొనకొని యేమి నోఁచిరో గోపిక లోపికమీఱ నిట్టి దే
వుని మనసార నిద్దపుగవుంగిట నుంచఁగ నిప్పు డేమిటా
రిని గరుణించి వచ్చెనొకొ ప్రేమ నటంచును జూచుచుండఁగన్.

214


చ.

కలికిమిటారికత్తె నయగారచొకారపుమేలుబంతి క
న్నెలతలమిన్న బంగరపునిగ్గు మనోభవురాజ్యలక్ష్మి నాఁ
గల యొకకాంత మాధవునిఁ గన్గొని మోహరసైకలోలయై
తొలఁకెడువేడ్కతో హరిని దోడుక రమ్మని తల్లిఁ బంపినన్.

215


సీ.

కప్పువేసిన వెండ్రుకలగొప్పసవరంబు సవరించి పెట్టినజాఱుకొప్పు
దురుసుగాఁ బైకెగఁద్రోసికట్టినవాలుఁజనుదోయి బిగిచూపుజంటఱవిక
మిసిమిపైపూఁత క్రొమ్మెఱుఁగునెమ్మోమున సొగనుగా నిడిన కస్తూరిబొట్టు
జిగిదక్కి స్రుక్కిన చెక్కిలికుబ్బుగా దాపిన కపురనెత్తావివిడెము


తే.

వడియు నెమ్మేని కొకవింతబెడఁగు నెఱపు, సరిగెచెంగావిపావడ చలువవలువ
చెలువు గులుకంగఁ జెలువు చెంగలువబంతి, హరికిఁ గానుక యొసఁగి లోలాంబుజాక్షి.

216


క.

కేలెత్తి మ్రొక్కుతఱి భుజ, మూలనఖక్షతులు చెలఁగు మురువున మోముం
గీలుకొనగంటివడువున్, మేలిమి దెలుపంగ హరికి మెలఁతుక పలికెన్.

217


తే.

దేవరకు గంధ మొసఁగిన పూవుఁబోఁడి, వక్కలాకులు గైకొని వత్తురనుచు
నింటికై తోడితెమ్మనె నిపుడటన్న, నౌనె యాకుబ్జగేహమా యనుచు శౌరి.

218

క.

అనుటయుఁ గుబ్జానామం, బునకుంబనిలేదు స్వామిపుణ్యంబునఁ జ
క్కనిదయ్యె నియ్యడను నే, ననరా దీవాడఁ గలరె యాపాటిచెలుల్.

219


తే.

అనిన నీకేల సంకోచ మంబుజాక్షి, కంతుసింగాణిమువ్వంక గాదె మెఱుపు
పలుదెఱంగుల మెఱయదే పద్మముఖికి, మునుపు కొదవేమి యనుచు నమ్ముదితఁ గనుచు.

220


సీ.

నీరజాననముద్దునెమ్మోముచెలువంబు గనుఁగొన్నఁ బద్మిని యనుచుఁ దోఁచె
కంబుకంధరకంఠకంబుసౌందర్యంబు గనుఁగొన్న శంఖిని యనుచుఁ దోఁచె
హస్తీంద్రనిభయాన యానశృంగారంబు గనుఁగొన్న హస్తిని యనుచుఁ దోఁచె
నీమనస్వినికి నాపై మది గల్గుట గనుఁగొన్నఁ జిత్తిని యనుచుఁ దోఁచె


తే.

జాతి యెయ్యది యొక్కొ యీనాతి కనిన, మాధవున కేల జాతిసంబంధ మనుచు
నుద్ధవుఁడు వల్క నవ్వుచు నుద్ధవమున, నద్ధవుఁడు సేరఁగావచ్చునవసరమున.

221


చ.

పొదిగిట నిల్చిచూచు విరిఁబోడి ముదం బెదఁ బిక్కటిల్లఁగా
నెదురుగ వచ్చి తోన చెలులిచ్చిన కమ్మనితావినీటఁ ద
త్పదజలజాతము ల్గడగి పయ్యెదచేఁ దడియొత్తి యింపుసొం
పొదవగఁ గేలొసంగి వినయోక్తులఁ దేనియ లొల్కఁ బల్కుచున్.

222


సీ.

గోపికారమణులఁ గూడుక క్రీడించు శ్రీకృష్ణు వ్రాసినచిత్తరువులు
సకినెలతలగడ ల్చప్పుడైనను దోన కివకివల్గొణుగుపారువపుజోళ్లు
కమ్మక్రొవ్విరిమేలుకట్లకుఁ దేఁటులై తిలకించు సాంబ్రాణిధూపములును
బదివన్నె దివ్వెకంబమున మాణిక్యంబు లీల నెంతయుఁ బ్రజ్వలించుదివ్వె


తే.

గలిగి విలసిల్లు కేళికాగారమునను, జాళువాకోళ్ళపట్టెమంచంబునందు
ధవుని వసియింపఁ బంచి యుద్ధవునిజెంతఁ, బసిఁడిగద్దియ నుండె నప్పద్మగంధి.

223


తే.

వక్కలాకులు విరు లొక్క వరుససొమ్ము, ఱవికెపావడ జంట చెఱంగుచీర
యుద్ధవుఁ డొసంగ వింత సేయుదురె యంచుఁ, జెలువజనని ప్రియోక్తులు పలుకుచుండ.

224


తే.

సదనమున కేఁగి పన్నీట జలకమాడి, హరువు మీఱంగఁ గైసేసి యారగించి
లలితమన్మథసామ్రాజ్యలక్ష్మి పోలి, వచ్చి నిలుచున్న చెలిచెలువంబుఁ గాంచి.

225


సీ.

శశిసహస్రకళాప్రసన్నుఁడై యుండెనా చెలిమోముతో సాటి చేయవచ్చు
జలజపత్రములు చేరల కెక్కుడుండెనా పొలఁతికన్నుల సరిఁబోల్పవచ్చుఁ
బదియేడువన్నెలబంగారు గల్గెనా కలికిమేనికిఁ బ్రతిఁ బలుకవచ్చుఁ
గనకాద్రి కింక నొక్కటి జోడు గల్గెనా వనితగుబ్బల కెన యనఁగవచ్చు

తే.

ననుచుఁ బొగడుచుఁ దలయూఁచి హరి వయస్య, మోముఁ జూఁచిన యంతట స్వామికరుణ
యట్టిదే కాదె యాశ్చర్యమా యటన్న, మంచిమాటంటివని వేశ్యమాత యపుడు.

226


తే.

కామినీమణి చిన్నది యేమి యెఱుఁగ, దెటుల మతి సెప్పి సేవ సేయించుకొనఁగ
వలెనొ మీచిత్త మనుచు నచ్చెలువచేత, విడియమిప్పింపఁ గైకొని వెన్నుఁ డపుడు.

227


క.

గందవొడి వక్కలాకులు, నందుక నుద్ధవుఁడు వారిజాక్షులు సన గో
విందుఁడు గాంభీర్యంబున, ముందుగఁ దను జెనకకున్న మోహము మీఱన్.

228


సీ.

మడుపు సాలుటయును మదిరాక్షిసకినెలు గులుకుమంచముమీదఁ గూరుచుండి
చిఱునవ్వుమోమునఁ జెలువుని పాదపల్లవములు కోమలోరువుల నుంచి
తలిరులు పెనఁగొను చెలువున నొత్తుచు గిలిగింతగొనఁగఁ గెంగేలు దొడల
సోఁకించుచును గోటి సుదలంటఁ బిసుకుచుఁ గరకంకణంబులు ఘల్లుఘల్లు


తే.

మనఁగఁ జిటపొట గ్రుద్దుచు నంగుళంబు, లోయ్య నెటికలు దివుచుచు నెయ్యమునను
గన్నుఁగవ నొత్తుచును గబ్బిచన్నుఁగవను, జేర్చుకొంచుఁ బదాబ్జసంసేవ చేసి.

229


చ.

పలుకవదేమి సామి యొకపాటివధూటిని నీవు మెత్తువే
చెలువము గుల్కు రాధవలెఁ జిత్తము రంజిల సేవ సేయఁగాఁ
గలిగినకాంతఁ జేకుఱిన గా కిపు డాపెఁ దలంచుకొంటివో
పులకలు నిండెనంచు విరిబోణి ముదంబునఁ బక్కఁ జేరుచున్.

230


సీ.

ఏదేది సామి నామీఁదిప్రేమకు గుఱు తనుచుఁ బుక్కిటివీడియంబుఁ గొనుచు
నవు మంచివగలకాఁడవె నీవు చేనందుకొన వంచు విడెము పల్కొన నొసఁగుచు
విడువరా మడుపుసందడి మోవి నేల నొక్కెదవంచుఁ గినిసి జంకించుకొనుచు
మొదటనే నునుబోఁకముడికిఁ బెనంగెదు వసగాదొ తమియంచు మసలుకొనుచు


తే.

నెంతదడ వూరకుండఁగా నేమియెఱుఁగ, వేమొ యనియుంటి నీవేల యెఱుఁగ వింత
నాఁడె వ్రేపల్లెసతులమానములు గొన్న, చతురుఁడవు గావె యన నగి శౌరి పలికె.

231


చ.

చెలి యాభీరుల నెన్న నేల యిదె యక్షీణప్రతాపంబుతో
నలరు న్నేజవజీరుపోరునను బోరాడంగ నీకే తగుం
దొలుతన్ రాధకుఁ జెల్లు నన్నఁ గినుకన్ లోలాక్షి దేవాంగనా
తిలకం బేయది యంచు మార్మొగము గా ధీరుండు లేనవ్వునన్.

232


చ.

వనితరొ కోప మేమిటికి వల్లవకాంతలలోన జాణయౌ
నని యలరాధఁ బేర్కొనుట యంతియె నీసరియైనఁ జేసినం

గినుకను నేర్పుసూపుటలు గేలిగదా యని వేఁడి నిక్కమౌ
నని మరుఁ డెచ్చరింప ఘనమౌ తమి మన్మథయుద్ధలోల యై.

233


సీ.

అంగనకనుబొమ సింగాణి యెక్కిడి పొరిఁబొరిఁజూపుఁ దూపులు నిగుడ్పఁ
బతివానిలక్షణ ప్రత్యస్త్రములఁ ద్రిప్పి నిఖిలాంగకంబుల నిగుడఁజేయ
నభిమంత్రితంబులై యవి వశీకరములై కుచకుంభమధ్యంబుఁ గ్రుచ్చునపుడు
కుంకుమఘర్మపుక్రొన్నెత్తు రందంద యలరంగఁ గళపట్టినట్టు సొగయ


తే.

నలుక బలమేడకోఁజన నటపటాగ్ర, కలితకేతువు వాల్చ లోకట్టు సెదరి
బట్టబయలయ్యె రణమహీభాగ మంతఁ, గాంతలోనయ్యెనని శౌరి కౌతుకమున.

234


క.

స్తనకుంభికుంభయుగము జ, ఘనఘనచక్రంబు నఖముఖక్షతములు గా
నొనరిచి బాహాయుద్ధం, బునఁ బెనఁగుచుఁ గ్రిందుపఱిచి పోరఁగ నంతన్.

235


చ.

పొలఁతుక క్రిందుమీఁదగుచు భూషణతూర్యనినాద మొప్పఁగా
కొలకనకోళ్లు లావుకలు కోకిలము ల్కలహంసము ల్శిఖా
వళములు బారువాలు నలువంకఁ బ్రతిధ్వను లీయలీయమై
గళరవము ల్ఘటించె రతికాంతరణాంతరశంఖభంకృతిన్.

236


సీ.

అంగంబు లపు డేకమయ్యెనో నా గట్టిగా బాహులతలచేఁ గట్టికట్టి
మొనలు ఱొమ్మున నాటి వెనుచక్కి వెడలఁగాఁ గోడెగుబ్బల ఱొమ్ము గ్రుమ్మి కుమ్మి
యలుకలు కబళించి యధరాధరము పంటఁ జిక్కించికొని గంటి చేసి చేసి
మొనగోర నిజబాహుమూలము ల్కంఠంబు చిన్నారిచెక్కులుఁ జించిచించి


తే.

యతనుసమరంబు సేయు నయ్యతివ క్రిందు, పఱిచె హరి యంత నంతలోఁ బద్మముఖియు
మరలి పైకొనె మొలనూలి చిఱుతగంట, మ్రోఁతచే డిండిమధ్వని బ్రోదిసేయ.

237


ఉ.

కుంచితపాదయై తివురుకోవులు మీఱఁగ ధూర్తకృష్ణునిన్
వంచనచేసి క్రిందు పడవైచితి నింకిట నీమదం బడం
గించకపోదునే యనుచుఁ గేరడము ల్పచరించు చెక్కు దా
టించుఁ గురు ల్గ్రహించు నెఱటెక్కున వాతెఱ గ్రోలు వ్రాలుచున్.

238


తే.

అంత నొక్కింత బడలి పద్మాయతాక్షి, స్వామిచెంగట నే పౌరుషంబు నెఱప
నెంతదాన నటంచు శయించి చిత్ర, రతులఁ దేలించెఁ జౌశీతిగతుల శౌరి.

239


వ.

అప్పుడు.

240


సీ.

ఏదేది నాసామి యిది వింత యౌనంటి వని గళధ్వని మెచ్చుకొనెడి సొలపు
ఔర నాప్రాణనాయక యేలితివి మేలు మేలని రతిశక్తి మెచ్చుమెలఁపు
నయ్యలూ నీదాసి నయ్యెదరా పాయకుర యంచుఁ దమి రేగి కొసరువలపు
బడలితివేమొ నా పంచదారలమోవి యిందరా యని తేనె లిచ్చుతలఁపు

తే.

నలసినా నింక విడవరా యనుచుసొక్కి, మోడ్పుకన్నులఁ గెంగేల మ్రొక్కు నలపు
బతిని గరఁగించెఁ బతికేళి సతిని గరఁచె, నిరువురును గేళివిశ్రాంతిఁ బొరసిరంత.

241


మ.

సరసాలాపములన్ వినోదగతులన్ సంగీతసాహిత్యవై
ఖరులన్ ద్యూతకళావిలాసముల శృంగారప్రసంగంబులన్
స్మరశాస్త్రార్థవివేచనంబులను శశ్వద్ద్వంద్వవైచిత్రులన్
హరికిన్ వేడుక సేసె నిద్రపయి నీర్ఘ్యం గాంత రేయంతటన్.

242


వ.

అంత.

243


క.

కలకలపక్షులు బలుకఁగ, జలజాక్షుఁడు విస్మయమున సఖియరొ యపుడే
తెలవాఱెనె యొకనిమిషము, వలెఁ దోఁచెన్ నీవిలాసవైఖరివలనన్.

244


క.

నెఱజాణవు నిను మెచ్చితి, వరమిచ్చితి వేఁడుమనిన వనిత దినము నీ
పరిరంభము కావలెనన, హరి మంచిది యనియె ననిన నతివ చెలఁగుచున్.

245


చ.

తలిమము డిగ్గుచో చరణతామరసంబులు పైడిగుల్కుపా
వలు ధరియించి కేలొసఁగ వల్లభుఁ డల్లన కేళిగేహమున్
వెలువడి కాంతనిల్పి కడువేడుక నుద్ధవుకేలుదండతో
నలరుకటారికానినెఱయందము గేలియొనర్చు బాగునన్.

246


ఉ.

చెంప కొకింతజాఱుసిగ చెక్కిటిగోరును కన్నుగోనలం
గెంపును గెంపుమోవి బలుకెంపును నెమ్మెయిచిట్లు గంధమున్
సొంపులు మీఱ నారజపుసోయగ మౌర యటంచుఁ గోరి లో
చంపకగంధు లాడుకొన శౌరి గృహంబున కేగె నీటునన్.

247


క.

లోకారాధ్యుఁడు గావున, శ్రీకృష్ణున కిటుల నడువఁ జెల్లెం దగునే
యాకైవడి వర్తింపఁగ, లోకమువారలకు రాజలోకవతంసా.

248


వ.

అంత.

249


క.

హరి యక్రూరుని బంచెన్, ధర పాలిప్పించు పాండుతనయుల కంచున్
కురుపతి యంధత నాస, త్పురుషుని శుష్కోపచారముల మరలించెన్.

250


తే.

సైన్యములఁ జంపి, యల జరాసంధధరణి, పతినిఁ బదియేడుమాఱులు పాఱఁద్రోలి
యవనుముచికుందు నేత్రాగ్ని నణఁగఁ జేసి, హరి యుపాయంబుననె యపాయములు దొలఁగ.

251


క.

అలభర్గనుతుఁడు జలధిన్, ఖలదుర్గమమైన ద్వారకాపురి సేరెన్
బలవర్గముతో హరికిన్, జలదుర్గము వలసె వలదె జనపాలురకున్.

252


శా.

శ్రీకాంతాస్పదమై దమైకనిధి ధాత్రీదేవతాసంతత
వ్యాకౢప్తాధ్వరమై రమైధకసముద్యద్విక్రమక్షత్త్రియా

నీకప్రోల్లసమై సమైలబిలవాణిజ్యార్యశూద్రార్జితా
స్తోకార్ధాధికమైకమై జనుల కెందున్ జెల్వమౌ ద్వారకన్.

253


తే.

అప్పురి కుశస్థలి యనంగ నొప్పు మున్ను, ద్వారవతినాఁగ రహి మీఱు ద్వాపరమున
దానిసౌభాగ్య మెన్న నెవ్వాని శక్య, మల్లవైకుంఠమే తప్పదది నరేంద్ర.

254


ఉ.

యాదవవృష్ణిభోజకుకురాంధకసాత్వతు లాదశార్హు లా
మోదదశార్హులై కొలువ ముఖ్యసుధర్మసభానివిష్టుఁడై
శ్రీదయితుండు రంజిలె నశేషసురాశ్రితపార్శ్వభాగుఁడౌ
నాదివిజాధినాయకునియందమునన్ భువనంబుఁ బ్రోచుచున్.

255


సీ.

మును రుక్మిణిని విన్న యనురాగ మంతరంగావాలతలమున నంకురించె
వెనుక విప్రుడువచ్చి విచ్చేయు మనిపిల్వఁ గొమరుమీఱఁగ ననల్కొనలు సాగెఁ
గుండిననగరంబు దండ నిల్చినవేళ మేలుగీలుకొనంగఁ బూలు బూచె
శైలకన్యానివాసంబు వెల్వడఁబోఁగఁ గనుఁగొనగా దోరకాయలయ్యె


తే.

నెత్తి రథమున నిడ ఫలియించె నన్య, రాజలోకంబు గెల్చి ద్వారకకు వచ్చి
ప్రేమఁగల్యాణ మై రతిక్రీడఁ దనియ, వనజనాభున కనుభవంబునకు వచ్చె.

256


మ.

మొదలం దొంగగు నేమి యాడఁ జను సొమ్ము ల్వానిపైఁ బెట్టి ప
ల్కుదు రెవ్వారిలలో "గతానుగతికో లోకో" యనన్ సత్యమౌ
నదిరా మున్నవనీతచోరుఁడని కాదా భక్తినిశ్రేయస
ప్రదుఁ గృష్ణు న్మణిచోరుఁ డంచనియె సత్రాజిత్తు విత్రాసియై.

257


చ.

వసుమతి నెంతవారలకు వచ్చు నొకానొకనింద వచ్చుచో
నసురవిఘాతిరీతిఁ బరిహారము సేయ నొకండు నేర్చునే
బిసబిస నేఁగి జాంబవతిఁ బెండిలియై మణిఁ దెచ్చి యిచ్చి యిం
పెసఁగఁగ సత్యభామ వరియించె వినిందకుఁ డార్తి గుందగన్.

258


మ.

అఁటఁ గాళిందిని మిత్రవిందను సుదంతాబ్దాక్షి భద్రామహీ
కటినిన్ లక్షణ బెండ్లియై నరకునిన్ ఖండించి వానింటఁ జొ
క్కటమై మించు పదాఱువేల మహిరాట్కన్యావతంసంబులన్
ఘటియించెం దనకుం గులాంగనలుగాఁ గల్యాణలీలాగతిన్.

259


సీ.

కలహాంతరిత భోజకన్యను లాలించు స్వాధీనపతిక సత్యను భజించు
వాసకసజ్జిక యౌసుదంతను గూడు విప్రలబ్ధను మిత్రవింద నరయు
ఖండితయైన లక్షణ వేఁడికొను విరహోత్కంఠితను భద్ర నూఱడించుఁ
గాళింది నభిసారికను జేరి కలయుఁ ప్రోషితభర్తృకను జాంబవతినిఁ జేరుఁ


తే.

గడమ పదియాఱువేవురుకంజముఖుల, భావహావవిలాసవిభ్రమవిహార
లలితబిబ్బోకచకితలీలాదరస్మి, తాదిశృంగారచేష్టల కలరు శౌరి.

260

క.

నీళానీలాలక రా, ధాలలనను దోడి తెచ్చి దయమీఱంగా
నేలెం గులకాంతలతో, నాళీకాక్షుండు రతుల నానాగతులన్.

261


తే.

చంద్రముఖి కోరఁగ నుపేంద్రుఁ డింద్రుఁ గినిసి, పారిజాతంబు గొనెఁ దనపాలు గాఁగ
భామినులవల్లఁ గాదె సౌభ్రాత్రమునకుఁ, గలుగు నొక్కొక్కయెడ విభాగంబు ధరను.

262


క.

కనెఁ బదుగురిఁ బదుగురిఁ బ్రతి, వనితామణియందు సుతుల వనజాక్షుఁడు ద
త్తనయులకు లెక్కలే దిల, ఘనవర్ణునిభాగ్య మెన్నఁగాఁ దరమగునే.

263


చ.

అలరుకటారిజోదు మొదలైనకుమారులు తత్తనూజులుం
జెలువము మీఱఁగాఁ గొదమసింగములంబలెఁ బార్శ్వసీమలన్
గొలువఁగ నిండుకొల్వయి ముకుందుఁడు వేడ్క జగజ్జనంబుమె
చ్చులకయి విశ్వరూపమును జూపినవైఖరి మించె నెంతయున్.

264


క.

హరుఁ గొలిచి సాంబుఁ గనియెన్, హరి యందురు గాని యెదిరి యని చేసినయా
హరుఁ గెలిచి బలికుమారుని, కరములు ఖండింపఁడే జగంబు లెఱుంగన్.

265


వ.

అంత నఘశిక్షకుండు సృగునకు మోక్షం బొసంగి యాదవవేదండంబు గావున
నారదు భ్రమియించి భీమాయుధస్ఫూర్తి రాజమండలగ్రాహక మాగధ తమ
స్ఫురణం బడంచి సుదర్శనంబునం దమఘోషనందనుని తేజంబునం గూల్చి మరి
యు భూభారకులగు సాల్వదంతవక్త్రవిదూరాది భూవరుల హరించి సకల
దిగ్విజయలక్ష్మీసమేతుండై జగత్కల్యాణకరుండై ద్వారక సామ్రాజ్య మేలు
చుండె నంత నొక్కనాఁడు.

266


తే.

తనకుచేలత్వ మట యథార్థంబు గాఁగఁ, జింపిదోవతికొంగునఁ జేరెఁడంత
ముడిచి తెచ్చిన యడుకులు పిడికెఁడంటి, మమత కృష్ణుఁడు మెసవెడిసమయమునను.

267


సీ.

చినిఁగి మాసికలు వేసినకోక బంగారుచెఱగులచెంగావిచీర యయ్యెఁ
జెవులకుఁ జాలని చిఱుతలక్కాకులు కట్టాణిముత్యాలకమ్మ లయ్యెఁ
పుస్తెమాత్రమెకాని పోఁడి మెఱుంగని గళమున హారము ల్నెలవుకొనియె
నొకటిరెండోఁగాజు లున్నకరంబుల నవరత్నమయకంకణములు వొదవె


తే.

నలకుచేలునిసతికి దుస్సలకు మఱియుఁ, జూడ చూడంగ మైఁగ్రమ్ముసొమ్ములకును
గొదవ లేదయ్యెఁ బ్రబలుసంపదలవలన, రుక్మిణీనాథుదివ్యకారుణ్యమునను.

268


వ.

ఇవ్విధంబున సుగృహీతకుచేలుం డగు కాంచనచేలుండు సుశ్రీలుఁ గావించి
ఖాండవదహనంబున నైన యాఖండలు భండనంబున గాండీవకోదండునకు విజ
యసుభద్రావాప్తి ఘటించి మనసు భుద్రావాప్తిం జేసినది హెచ్చుగాదు పర
వాసుదేవలోకనివాసు లగు భూసురకుమారులం దెచ్చి వివ్వచుం జిచ్చు సొర
కుండ మాన్చి రక్షించె నదియునుం గాక మీపెద్దలగు పాండునందనులఁ బెక్కు
చందంబులఁ బ్రోచె నది యెట్లనిన.

269

సీ.

కృష్ణమానంబు రక్షించె శాకాన్నంబు గొని పాత్ర నక్షయోదనము నించెఁ
గఱ్ఱిసారథి యయ్యెఁ గాంగేయుపైఁ జక్ర మెత్తి వివ్వచ్చున కీశుచేతఁ
బరమాస్త్ర మిప్పించె భాను గప్పెను భగదత్తాస్త్రమున కురఃస్థలము పూనె
ద్రోణు వారించెఁ కర్ణునిశక్తి మరపించె నహిబాణమునకు దే రణఁగఁద్రొక్కె


తే.

సన్న జేసి సుయోధను సమయఁ జేసెఁ, బెనిచె నుత్తరగర్భంబు భీముఁ బ్రోచె
మహికిఁ బట్టముఁ గట్టె ధర్మజుని వింటె, పంకజాక్షుని పాండవపక్ష మధిప.

270


క.

తనుఁ గొలిచిన తనుఁ బొగడినఁ, దనచారిత్రములు విన్న ధన్యులకెల్లన్
వనజాక్షుఁడు గృష్ణుఁడు గో, రినకోరికె లొఁసగుననిన నృపుఁ డలరారెన్.

271


సీ.

పెనఁచి కట్టినపట్టు పించంబు నడిపట్టు చంద్రకాంచితవిలాసములు దనరఁ
బుట్టినవంశంబుఁ బట్టినవంశంబు బహుపర్వసంగతిఁ బరిఢవిల్ల
భాసమానగళంబు పదపద్మయుగళంబు నమల ముక్తాశ్రయంబై తనర్ప
నపదానుజాతంబు నాస్యాంబుజాతంబు నానానుదృఙ్మోహనంబు గాఁగ


తే.

శ్రీల విలసిల్లు గోపాలకృష్ణమూర్తి, గంధగజహేమపర్యంకికాతురంగ
చామరభటాదిశాశ్వతైశ్వర్య మొసఁగి, సేవకశ్రేణి నెపుడు రక్షించుఁగాత.

272


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెల్పుమని యడుగుటయున్.

273


మ.

ఛలనిద్రాననచుంబనావసరదృష్టశ్రీకపోలస్ఫుర
త్పులకవ్రీళితముగ్ధకోకకుచసభ్రూభంగమధ్యాధర
స్థలదంతక్షతకేళికాపరమనోబ్జాతప్రగల్భాంగనా
కలనాదోదిత పాహిపాహి ముఖవాః కల్లోలహల్లోహలా.

274


క.

అనురాగసమాకర్షిత, కనకాంశుక నీవిబంధఘటనాక్షమతా
వనమన్మగథీగోపిక, ఘనజఘనాదానవర్షి గజిరాజఘనా.

275


ఉత్సాహము.

రాధికాదిమహితపర్వరసిరసాన్నదానధీ
రాధికానుమోదరంగదంతరంగసంగతా
రాధికాధినాథభక్తరంజనాననప్రచా
రాధికారసంగ సంగరాంగణాదిభంగదా.

276


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు అష్టమాశ్వాసము.

9. అవతారంబగు బలరామావతారము సమాప్తము.

  1. కోడెలు విడిపించుకొనె నంచు వాకిటి మఱఁది లోపలి కంచి జరగె నొకతె
    మగఁడు నిద్దురవోవ మంచ మించుకసద్దు గాకుండ దిగజాఱి కదలె నొకతె
  2. తోనఁ దన్నందనందపుత్రుండు నగుచు
  3. చనుఁ డూరక మీశరణంబులొందఁగన్