దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/సజ్జనత్వానికి ప్రతీకారం ఖూనీచట్టం

వికీసోర్స్ నుండి

అవసరం లేకపోయినా మళ్లీ క్రొత్త ఆంక్షలు ఎదుర్కోవలసిన అవసరం వస్తుందేమోనని ఊహించి పత్రాలు తీసుకొనుటకు అంగీకరించారు. క్రొత్తగా వచ్చే భారతీయులు దొంగచాటుగా ప్రవేశించకూడదని భారతజాతి కోరుతున్నదని కూడా స్పష్టపడుతుందని భావించారు. సుమారు భారతీయులు కొత్త అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఇది చిన్న విషయంకాదు. చట్టరీత్యా అనివార్యం కాకపోయినా, పూర్తి ఐకమత్యంతో భారతీయులంతా త్వరగా చేసి చూపించారు. ఇది భారతజాతియొక్క నిజాయితీకి. చాతుర్యానికి, తెలివితేటలకు, నమ్రతకు తార్కాణమని చెప్పవచ్చు. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం చేసే చట్టాల్ని ఉల్లంఘించడం భారతీయుల స్వభావలక్షణం కాదని కూడా రుజుచేశారు. ప్రభుత్వానికి యింతటి సుహృద్భావంతో సహకరిస్తున్న భారతీయుల విషయంలో ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం కూడా సుహృద్భావంతో వ్యవహరించాలని భారతీయుల ఆశ, అభిలాష ఆ ప్రభుత్వం తమను గౌరవిస్తుందని, అధికారాలు కూడా యిస్తుందని ఆశించారు. అయితే ట్రాన్స్‌వాల్‌లో నెలకొన్న బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సజ్జనత్వానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నదొ తరువాతి ప్రకరణంలో తెలుసుకుందాం

11

సజ్జనత్వానికి ప్రతీకారం

ఖూనీ చట్టం

పాతకొత్త పత్రాల మార్పు జరిగింది. 1906వ సంవత్సరంలో అడుగుపెట్టాం నేను 1903లో ట్రాన్స్‌వాల్‌నందు రెండవసారి అడుగుపెట్టాను. ఆ ఏడాది జోహాన్స్‌బర్గులో ఆఫీసు తెరిచాను ఈ విధంగా నారెండు సంవత్సరాల కాలం ఏషియాటిక్ శాఖవారి ఆక్రమణల్నిఎదుర్కోవడానికి సరిపోయింది. పత్రాల మార్పు జరిగాక ప్రభుత్వం శాంతిస్తుందని. వ్యవహారం చక్కబడుతుందని అంతా అనుకున్నారు. కాని భారతజాతి ముఖాన శాంతిరాసి లేదు. గత ప్రకరణంలో నేను శ్రీ లైనల్ కర్టిస్‌ను పరిచయం చేశాను. భారతీయులు క్రొత్త పత్రాలు తీసుకున్నంత మాత్రాన తెల్లవారి అభిలాష నెరవేరలేదని, పెద్దమనుషుల ఒడంబడికలద్వారా అది పూర్తి కాలేదని ఆయన భావించారు దానితోబాటు చట్టంకూడా వుంటే, ఒడంబడికకు బలం వస్తుందనీ, అప్పుడే షరతుల ఆంతర్యం నెరవేరుతుందనీ, భారతీయుల్ని అంకుశంలో వుంచాలనీ, అందుకోసం కఠినచట్టం అమలు చేయాలనీ, తత్ఫలితంగా దక్షిణాఫ్రికా యందంతట అది అమలులోకి వచ్చి తీరుతుందనీ ఆయన భావించాడు తాను చేసిన చర్యను మిగతా రాజ్యాలు కూడా అనుసరించాలనే నిర్ణయానికి వచ్చాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఏ ఒక్కద్వారం భారతీయులకోసం తెరిచియుండకూడదని, అలా వుంటే ట్రాన్స్‌వాల్‌కు రక్షణ లేదని కూడా భావించాడు. అసలు ట్రాన్స్‌వాల్ ప్రభత్వానికి, భారతీయులకు జరిగిన ఒడంబడికవల్ల భారతీయుల గౌరవ ప్రతిష్ఠలు పెరిగిపోయాయని, కనుక గట్టి దెబ్బతీయాలని భావించడు. అతడికి భారతీయులంటే విలువలేదు లెక్కకూడాలేదు. కఠోరచట్టం అమలు పరిచి భారతీయుల్ని గడగడవణికించి వేయాలని నిర్ణయానికి వచ్చాడు. అందుకోసం అతడు ఏషియాటిక్ ఆక్టును తయారుచేశాడు. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వాధినేతలికి ఏషియాటిక్ ఆక్టును ప్యాసుచేయాలని, భారతీయుల దొంగరాకను అరికట్టివేయాలని, అప్పుడే ట్రాన్స్‌వాల్ యందలి శ్వేతజాతీయులు నిశ్చింతగా. క్షేమంగా వుండగలరని బాగా ఎక్కబోశాడు శ్రీ కర్టిస్ చేసిన బోధ అతడు తయారు చేసిన ఏషియాటిక్ ఆక్టు ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి నచ్చాయి. ఆ ముసాయిదా ప్రకారం తయారుచేసి అసెంబ్లీలో పెట్టబోతున్న ఆక్టును ప్రభుత్వ గెజెట్‌లో ప్రభుత్వం వారు ప్రచురించారు

ఈబిల్లును గురించి వివరించేముందు మరో ఘట్టాన్ని గురించి వ్రాయడం అవసరమని భావిస్తున్నాను సత్యాగ్రహోద్యమానికి ప్రేరకుణ్ణి నేను కనుక నాజీవితాన్ని పాఠకులు తెలుసుకోవడం అవసరం భారతీయుల్ని దెబ్బతీయాలని ట్రాన్స్‌వాల్‌లో తెల్లవాళ్లు ప్రయత్నిస్తున్న అదే సమయంలో అక్కడి హబ్షీలలోను, జూలూలలోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనే తలంపు చోటుచేసుకున్నది. ఆ వ్యతిరేకతను తిరుగుబాటు అనవచ్చునా లేదా అని నాకు అప్పుడూ సందేహం కలిగింది. ఇప్పటికి ఆ సందేహం అలాగే వున్నది అయినా నేటాలులో దీన్ని తిరుగుబాటు అని అంతా అన్నారు. అ తిరుగుబాటును శాంతింపచేయాలనే బావంతో చాలామంది తెల్లవాళ్లు వాలంటీర్లుగా సైన్యంలో చేరారు

నేను కూడా నేటాల్ వాసినే కనుక సైన్యంలో చేరి యీ యుద్ధంలో శక్త్యానుసారం సాయం చేయాలని భావించాను. భారతజాతి అనుమతి పొంది యీ విషయం నేటాలు ప్రభుత్వాన్ని జాబుద్వారా యుద్ధంలో గాయపడ్డవారికి సేవచేసే దళాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరాను నా ప్రతిపాదనను ప్రభుత్వం అనుమతించింది. అందువల్ల జోహాన్స్‌బర్గు నందుగల నా యింటిని వదిలివేసి, నా కుటుంబసభ్యుల్ని ఫనిక్స్ ఆశ్రమం పంపివేశాను అక్కడి నుండి ఇండియన్ ఒపీనియన్ అనువారపత్రిక వెలువడుతున్నది. నా మిత్రులు అక్కడ వున్నారు. ఆఫీసును మాత్రు నేను మూసివేయలేదు. నేను పూనుకున్న సేవా కార్యం ఎంతో కాలం సాగదని నాకు తెలుసు

20, 25 మందితో దళం ఏర్పరిచి నేను నేటాలు సైన్యంతో సంబంధం పెట్టుకున్నాను. ఇంతటి చిన్నదళంలో కూడా అన్ని జాతుల. అన్ని మతాలు భారతీయులు చేరారు. ఒక నెల రోజులు యీ దళం గాయపడ్డవారికి సేవ చేసింది. మాకు అప్పగించబడిన పనికి నేను భగవంతునికి ధన్యవాదాలు సమర్పించాను యుద్ధంలో గాయపడిన హబ్షీలకు మేము దప్ప మరెవ్వరూ సేవ చేయలేదు. మేము లేకపోతే హబ్షీలు చాలామంది చచ్చిపొయివుండేవాళ్లు. వాళ్ల గాయాలకు మందులు రాసేటప్పుడు, పట్టీలు కట్టేటప్పుడు, చికిత్స చేసేటప్పుడు ఒక్క ఇంగ్లీషు వాడు కూడా మాకు సహకరించలేదు. ఒక సర్జనుక్రింద మేము పనిచేయాలి అతడి పేరు డా|| సావెజ్ అతడు దయాహృదయుడు గాయపడ్డవాళ్లను ఆసుపత్రికి చేర్చడం వరకే మా పని ఆ తరువాత మేము వారికి ఏమీ సేవ చేయుటకు వీలులేదు. మాకు అప్పగించిన ప్రతిపని చేయాలనే వుద్దేశ్యంతోనే మేము యీ దళం ఏర్పాటు చేశాం ఆ సర్జను వ్యవహారమంతా చూచి ఏమండీ! వీళ్లకు చికిత్స చేయాలంటే ఒక్క తెల్లవాడూ సహకరించడంలేదు. మీరు ఆ పని కూడా చేస్తే కృతజ్ఞుడుగా వుంటాను అని మమ్మల్ని కోరాడు మేము సంతోషంగా అంగీకరించాము జూలూలకు తగిలిన గాయాలకు చికిత్స లేక క్రుళ్లి దుర్వాసన వస్తున్నది. వాళ్లందరిగాయాలు కడిగి చికిత్స చేసే సదవకాశం మాకు లభించింది. పాపం ఆ హబ్షీలు మాతో ఏమీ మాట్లాడలేరు. కాని వారి సైగలు, వేళ్లద్వారా వారు వెల్లడించే కృతజ్ఞతా భావం మాకు బోధపడుతూ వుండేది. వాళ్లు మమ్మల్ని తమకోసం దేవుడు పంపిన దూతలుగా భావించారు. ఇది కష్టమైనపని ఇందుకోసం రోజుకు 40 మైళ్ల దూరం మేము నడవవలసి వచ్చేది.

ఒక నెల రోజుల్లో మా పని పూర్తి అయింది. అధికారులు మా పనిని చూచి సంతోషించారు. గవర్నరు మాకు కృతజ్ఞత తెలుపుతూ జాబు పంపారు ప్రత్యేకంగా తయారుచేసిన పతకం కూడా మా దళసభ్యులందరికీ యిచ్చి గౌరవించారు. ఈ దళపు ముగ్గురు సార్జెంట్లు గుజరాతీలు వాళ్లపేర్లు శ్రీ ఉమియాశంకర్ షేలత్, శ్రీ సురేంద్రరాయ్ మేఢ్. శ్రీహరిశంకర్ జోషి ఈ ముగ్గురూ బలిష్ఠులు గట్టివాళ్లు బాగా పనిచేశారు. ఇతర భారతీయుల పేర్లన్నీ యిప్పుడు జ్ఞాపకం లేవు. కాని వారిలో ఒక పరాను కూడా వున్నాడు మేమంతా తనతో సమంగా బరువులు మోయడం, నడవడం చూచి పరాను నివ్వెరబోయేవాడు

ఈ సేవా కార్యం చేస్తున్నప్పుడు నాలో రెండు భావాలు పరిపక్వమయ్యాయి సేవాధర్మం ఆచరించవలెనని కోరువారు జీవితంలో బ్రహ్మచర్యాన్ని పాటించితీరాలి ఇది మొదటి భావం సేవాధర్మం ఆచరింరవలెనని భావించువారు బీదతనాన్ని అంగీకరించి పాటించితీరాలి. ఇది రెండో భావం వృత్తులేమైనా చేపట్టి చేస్తూవుంటే సేవాధర్మానికి పూనుకున్నప్పుడు యిబ్బందులు కలుగుతాయి

ఈ దళంతో పనిచేస్తున్నప్పుడు ట్రాన్స్‌వాల్ రమ్మని జాబులు, తంతులు చాలా వచ్చాయి. మా సేవాకార్యం పూర్తికాగానే వెంటనే ఫినిక్స్ వచ్చి మిత్రులందరినీ కలిసి జోహాన్స్‌బర్గు చేరుకున్నాను. అక్కడ ఆఫీసులో ఏషియాటిక్ ఆక్టు ముసాయిదా పూర్తిగా చదివాను. 1906లో ప్రచురించిన గెజెటును ఆఫీసునుంచి యింటికి తీసుకువెళ్లాను నా ఇంటి దగ్గర ఒక చిన్న పర్వతం వున్నది. అక్కడ ఒక మిత్రునితోబాటు కూర్చొని ఆ ఆక్టును గుజరాతీలోకి అనువదిస్తున్నాను ఆ బిల్లు నిబంధనలను అనువదించిన కొద్దీ నా శరీరం వణికిపోసాగింది భారతీయులంటే ఆసహ్యం, ఏహ్యత తప్ప నాకు అందు మరేమీ కనబడలేదు. ఈ బిల్లు అసెంబ్లీలో ప్యాసై అమల్లోకి వస్తే దక్షివాఫ్రికాలో గల భారతీయులకు ఆధోగతి తప్పదని నిర్ణయానికి వచ్చి దీన్ని ఎదుర్కొని తీరాలని భావించాను. భారతజాతికి జీవన్మరణసమస్య అని తేల్చుకున్నాను ఆర్జీలు పెట్టినా పనికాకపోతె చేతులు ముడుచుకొని కూర్చోకూడదనే నిర్ణయానికి వచ్చాను ఈ ఖూనీ చట్టానికి లోబడేకంటే ప్రాణాలు వదిలి చావడం మంచిదని భావించాను. ఐతే ఎలా చావాలి? జయమో మృత్యువో రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయం కావాలి నా కండ్ల ఎదుట పెద్దకోటగోడలా నిలబడిపోయింది నన్ను యింతగా కదిలించివేసిన ఆ బిల్లును గురించిన వివరం పాఠకుల కోసం క్రింద వివరిస్తున్నాను

ట్రాన్స్‌వాల్‌లో నివసించుటకు అధికారం కావాలని కోరుకునే ప్రతి భారతీయుడు, స్త్రీగాని, పురుషుడుగాని, 8 సంవత్సరాలు, అంతకంటే పై యీడు గల బాలబాలికలు గాని అంతా ఏషియాటిక్‌శాఖ ఆఫీసుకు వెళ్లి పేరు వ్రాయించుకొని అనుమతి పత్రం పొందాలి యీ పత్రాలు తీసుకునేటప్పుడు తమ వద్ద గలపాత పత్రాలన్నీ అక్కడ యిచ్చివేయాలి అందుకు అర్జీ పెట్టుకోవాలి పేరు, అడ్రసు. జాతి, వయస్సు మొదలుగా గల వివరాలు అర్జీలో వ్రాయాలి ఆర్టీదారు తన పది వ్రేళ్ల ముద్రలు అందువేసి తీరాలి నిర్ణయించ బడిన గడువులోపున యిట్టి అర్జీదాఖలు చేయని భారతీయులు ట్రాన్స్‌వాలులో నివసించు హక్కు కోల్పోతారు తక్షణం వాళ్లు ట్రాన్స్‌వాల్ వదిలి వెళ్లిపోవాలి అర్జీదాఖలు చేయకపోతే చట్టరీత్యా అపరాధంగా భావించబడుతుంది. అట్టి దోషికి శిక్ష పడవచ్చు జుర్మానా విధించవచ్చు కోర్టు అతణ్ణి దేశాన్నుంచి బహిష్కరించవచ్చు. పిల్లల పక్షాన తల్లి తండ్రులే ఆర్జీ దాఖలు చేయాలి పిల్లల్ని తీసుకొని వెళ్లి ఆఫీసర్ల ఎదుట హాజరు పరచాలి తల్లితండ్రులు తమ యీ బాధ్యతను నిర్వహించకపోతే వారి 16 సంవత్సరాలు దాటిన పిల్లలు యీ బాధ్యత నిర్వహించాలి. అలా చేయకపోతే తల్లితండ్రులు ఏఏ శిక్షలకు పాత్రులు అవుతారో, ఆయా శిక్షలకు 16 సంవత్సరాల పిల్లలు కూడా పాత్రులవుతారు. పొందిన అనుమతి పత్రాన్ని ఏ పోలీసు అయినా ఎక్కడ, ఎప్పుడు చూపమన్నా చూపి తీరాలి చూపకపోతే అతడు అన్ని శిక్షలకు పాత్రుడే రోడ్డున నడిచే బాటసారిని కూడా పత్రం చూపించమని కోరవచ్చును పత్రాల్ని పరిరక్షించేందుకు పోలీసు అధికారులు భారతీయుల గృహాల్లోకి కూడా ప్రవేశించవచ్చు బయటినుంచి ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించునప్పుడు యిట్టి ప్రవేశ పత్రాల్ని వాళ్లే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లి చూపించాలి భారతీయులు ఏ పని మీద ఎక్కడికి వెళ్లినా అధికారులు అడగగానే పత్రం చూపించాల్సిందే అలా చూపించకపోయినా అధికారులు అడిగిన వివరం తెలుపకపోయినా శిక్షార్హులే అవుతారు

ఇలాంటి నిబంధనలుగల చట్టం ప్రపంచంలో ఏ దేశంలోను ఎవ్వరూ తయారు చేసి యుండరు. భారతీయ గిర్‌మిటియాలకు యిచ్చే పత్రాల నిబంధనలు కఠోరంగా వున్నాయని నాకు తెలుసు కాని వాళ్లకు స్వతంత్ర మనుష్యులుగా గుర్తింపలేదు కదా! అయినా వాళ్లకు విధించబడిన శిక్షలు యీ బిల్లులో విధంచబడిన శిక్షలకంటే తక్కువే ఈ బిల్లు ప్రకారం లక్షలాది రూపాయలు వ్యాపారం చేసుకుంటున్న భారతీయుడుకూడా దేశాన్నుంచి బహిష్కరించబడవచ్చు. ఈ బిల్లునందు పేర్కొనబడిన నిబంధనల ప్రకారం అట్టవారి డబ్బంతా ప్రభుత్వం యీ పేరిట దోచుకోవచ్చునన్నమాట. ఆ తరువాత యిలా జరిగిందికూడా అపరాధ ప్రవృత్తిగల వారికోసం విధించబడిన నిబంధనల కంటే గూడా యివి కఠోరంగా వున్నాయని చెప్పవచ్చు పదివ్రేళ్లముద్రలు వేయాలనే నిబంధన దక్షిణాఫ్రికాదేశంలో ఎక్కడా లేదు ఆ విషయం తెలుసుకుందామని ఒకపోలీసు అధికారియగు శ్రీ హెన్రీ వ్రాసిన ఫిగర్ ఇంప్రెషన్స్ (వ్రేళ్ల ముద్రలు) అను పుస్తకం తెప్పించి చదివాను అపరాధం చేసిన చట్టవ్యతిరేకుల చేతనె యిలా వేలిముద్రలు వేయిస్తారని తెలిసింది. యిది భయంకర నిబంధన అని అనిపించింది. పిల్లకు, స్త్రీలకు కూడా వర్తించే యీరకమైన బిల్లు మొట్టమొదటిసారి బయటికి వస్తున్నదని తేలిపోయింది. "రెండో రోజున భారతీయ పెద్దలందరినీ పిలిపించి యీ బిల్లు విషయం తెలియజేశాను అంతావిన్న మీదట నాపైపడిన ప్రభావమే వారిపైన కూడా పడింది. ఒకడు లేచి ఆవేశంగా నా భార్యను వేలి ముద్రలువేయమని ఎవడైనా అడిగితే తక్షణంవాణ్ణి కాల్చిపారేస్తాను తరువాత నేవేమైనా సరే అని ఆరిచాడు. అతణ్ణి శాంత పరిచాను

నేను అందరికీ స్పష్టంగా యీ బిల్లు ప్యాసైందీ అంటే యిక్కడ భారతీయులంతా పైగుడ్డలతో తిరుగుముఖం పట్టవలసిందే ట్రాన్స్‌వాల్‌లో యీ బిల్లు అమలులోకి వస్తే దక్షిణాఫ్రికా యందలి అన్ని రాష్ట్రాల్లో వచ్చి తీరుతుంది. అంటే భారతీయుల్ని వెళ్లగొట్టడానికి తెల్లవాళ్లు జరుపుతున్న కుట్రయిది. దీన్ని సమూలంగా నాశనం చేయాలి చేసితీరాలి "అని చెప్పివేశాను. యిది మనకే కాదు మన భారతదేశానికే అవమానకరమైన విషయం యిట్టి బిల్లులు మనకు వర్తించకూడదు కోపం తెచ్చుకున్నంతమాత్రాన, ఆవేశపడినంత మాత్రాన యీ బిల్లు ఆగదు. మనం ఒక్కటిగా నిలబడాలి అన్నివిధాల యీ బిల్లును వ్యతిరేకించాలి భగవంతుడు మనల్ని తప్పక రక్షిస్తాడు" అని కూడా చెప్పాను జనానికి ముంచుకువస్తున్న ప్రమాదం బోధపడింది. దీనికోసం చర్చించి నిర్ణయించడానికి యూదుల నాటకశాలను ఎన్నుకొని అక్కడ సభజరుపుటకు నిర్ణయం చేశాం

ఇప్పుడు యీబిల్లును "ఖూనీ చట్టం" అని ఎందుకు అన్నానో పాఠకులకు బోధపడిందికదూ? ఈ ప్రకరణానికి పెట్టిన ఖూనీ అను విశేషణం నాది కాదు ఈ చట్టానికి దక్షిణాఫ్రికాలో ఖూనీ శబ్దం తానంతట అదే ప్రచారంలోకి వచ్చింది.