తెలుగువారి జానపద కళారూపాలు/ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు

వికీసోర్స్ నుండి

ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు


జానపద కళాకారులందరూ, జానపద కళారూపాలను వీథుల్లోనె ప్రదర్శించేవారు. పల్లెలో వుండే విశాల బహిరంగ స్థలమే వారి రంగస్థలం.


అయితే ఇలాంటి ప్రదర్శనాలను రాయలసీమ ప్రాంతంలో బయల్నాటకా లంటారు. యక్షగానాలనూ, వీథి నాటకాలనూ బయలు నాటకాలనే పిలుస్తారు.

గరుడాచల మహాత్మ్యం:

గరుడాచల మహాత్మ్యంలోని ఇతి వృత్తాన్ని, పాటల్ని తీసుకుని జానపదులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఇందులో నాటకం, నృత్యం రెండూ కలిసి వుంటాయి. హర్మోనియం, గజ్జలు, తాళాలు మాత్రమే ప్రదర్శనంలో ఉపయోగిస్తారు.

ఈనాటకంలో సింగి నాయకుడు __రంభ __ఊర్వసి, నరసింహస్వామి __ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఎరుకలసాని (సింగి) సింగడు, ద్వారపాలకులు వుంటారు. వారే కిరీటాల్ని __ భుజకీర్తులను తయారు చేసు కుంటారు. పురుషులే స్త్రీ పాత్రలను ధరిస్తారు.పాత్రధారు లందరూ వేషాలు ధరించిన తరువాత మిగిలినవారు వంతలుగా నిలబడతారు. ప్రతి పాత్రధారీ ప్రవేశించి గుండ్రంగా తిరుగుతూ వయ్యారంగా చేతులు వూపుతూ, కూర్చుని లేస్తూ వుంటారు.

నరసింహస్వామి పాత్రధారి ఠీవిగా చేతుల్ని త్రిప్పుతూ, రౌద్ర రూపంలో అడుగులు వేస్తూ కళ్ళప్పగించి చూడటం అభినయిస్తాడ్రు. నరసింహ స్వామి తో అదిలక్ష్మి, చెంచులక్ష్మిల సంవాదం. ఆతను ఏమీ తెలియనివాని వలె ఉండటం, చెంచు లక్ష్మి ఈ విషయాన్ని ఎరుకలసాని (సింగి) ఆదిలక్ష్మికి చెప్పటం ముఖ్యమైన కథ. ఇంకా సింగి నాయకుల బిడ్డలుగా, రంభ, ఊర్వశులు చిత్రీకరించారు. దీంట్లో సింగి, సింగడు సన్నివేశంలో పాడుకునే రెండు గేయాల్ని పరిశీలించటం జరుగుతోంది.

సింగి, సింగడి సంవాదం:

సింగని భార్య సింగి ఇంటికి వచ్చి, సింగణ్ణి ఇలా నిలదీస్తుంది. మేకల్ని, గాడిదల్ని, ముసలిదాన్ని, పిల్లల్ని వదిలి వచ్చావ్. అని అడగడంతో సింగడి సమాధానాలు చాల ఆసక్తిదాయకంగా వుంటాయి. వారి సంవాదం ఇలా వుంటుంది.

సింగి:

మేకలని యాడ యిడిచి
ఎప్పుడొస్తివిరా సింగా.
నువ్వెప్పుడొస్తివిరా సింగా.

సింగడు:

మేకలన్ని కొండకు తోలి
కత్తె కొరకను కావలి పెట్టి
ఇప్పుడు వత్తినే సింగి.
నేనిప్పుడె వత్తినే సింగి.

సింగడు:

కట్టుకున్న పట్టుచీర
ఎటులవచ్చెనే సింగి
ఎటులవచ్చానే

సింగి:

వూరిలోన అమ్మగారికి
అడిగినట్లా గద్దె సెప్పి
తెచ్చుకున్న పట్టుచీరకు
వాదులేలరా సింగా, గుద్దులాటేలా

సింగడు:

ముక్కులోన ముక్కురాయి
యట్లవచ్చానే సింగీ నీకు,
యట్లా వచ్చానే సింగీ.

సింగి:

కమస లింటికి నేనే బోతి
వప్పగానే గద్దె సెప్పి
తెచ్చుకొన్న సొమ్ములాకె
వాదులాటేరా సింగా,
గుద్దులాటేరా.

ఇలా, సింగీ, సింగని మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. ఈ సంవాదం వ్యంగ్యానికి తావిచ్చేదిగా వుంటుంది.

సందాకాడ, నరసింహులు:

ఈ నాటకాన్ని తెల్లవార్లూ ప్రదర్శిస్తారు. నరసింహుని పాత్రను ఇద్దరు వేయటం ఆచారం. వీరిని సందకాడ నరసింహుడు, తెల్లవారుజామున నరసింహుడు అని అంటారు.

ఇద్దరు నరసింహుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇలా ప్రచారంలో వుంది. __ సందకాడ నరసింహుని కథ జరుగుతుండగా, వేషం వేసుకున్న తెల్లవారి నరసింహుడు, ప్రక్కనే వున్న ఎరువు బండిపై నిద్ర పోయాడట. ఇంతలో రైతు వచ్చి బండి కట్టి పొలంలో ఎరువు వదిలాడు. ఎరువుతో క్రిందపడ్డ నరసింహుడు మేల్కొని__వచ్చే చెంచీతా చూడరే, అంటూ పాడేసరికి భయపడిన రైతు వెంటనే వచ్చి, సమాజం వారికి చెప్పగా, అప్పటికే తెల్లవారి నరసింహుని కోసం వెతికి వేసారి, సందకాడ నరసింహుని తోనే నాటకం పూర్తి చేశారని, ఈ నాటి పెద్దలు చెపుతారని డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డిగారు వారి జానపద నృత్య కళా గ్రంథంలో ఉదహరించారు.

కళాకారులు:

ఇలాంటి బయలు నాటకాలు రాయల సీమ ప్రాంతంలో ఇంకా ప్రదర్శింప బడుతూనే వున్నాయి. ఈ నాటకాల్లో ప్రసిద్ధి చెందిన నటులు సింగి నాయకుడు, మాలచంద్రప్ప__రంభ, __కుమ్మరి నారాయణ __ఊర్వసి _ చాకలి గంగన్న__ నరసింహస్వామి__ కుమ్మరి నారాయణ స్వామి__ ఆదిలక్ష్మి హరిజన నాగన్న - చెంచు లక్ష్మి, మాల నాగప్ప - సింగి, కుమ్మరి నారాయణ, సింగడు - కుమ్మరి నారాయణస్వామి మొదలైన వారు. అనంతపురం జిల్లా - ధర్మవరం తాలూకా, సుబ్బరావు పేట గ్రామంలో వున్నారు.

జంఖండీ వీథి నాటకం

మహారాష్ట్రం నుండి ఆంధ్రదేశం వచ్చిన సురభి కళాకారులు, తొలి రోజుల్లో ఈత మట్టల బొమ్మలాటల్నీ, జంఖండీ నాటక ప్రదర్శనాలను ప్రదర్శించారు.

ఖండే అనే ఆయన మహారాష్ట్ర కళాకారుడు. ఈ నాటక రూపాన్ని ప్రారంభించడం వల్ల ఈ నాటకానికి జంఖండీ నాటకమని పేరు వచ్చింది. ఏ రామాయణాన్నో, భారతాన్నో ప్రదర్శించా లనుకున్నప్పుడు, కావలసిన పాత్రధారులందర్నీ కొద్ది కొద్ది వేష ధారణ మార్పులతో రంగస్థలం మీద కూర్చో బెట్టి, రామాయణాన్ని భాగాలు భాగాలుగా ప్రదర్శించేవారు. రంగస్థలం మీద కూర్చున్న ఏ పాత్ర మాట్లాడదు.

ఖండే గారు రాముని పాత్ర దగ్గరకొచ్చి శ్రీరామ చంద్రుల వారు, ఏమంటున్నారండీ అని రాముని సంభాషణలు తానే పలికి అన్నగారైన రామచంద్రుల వారి మాటకు తమ్ముడు లక్ష్మణ స్వామి ఏమి బదులు చెపుతున్నాడంటే, అంటూ వివిధ పాత్రలకు ఆయనే సంభాషణలనూ, శ్లోకాలనూ, పాటలనూ వల్లించే వాడు. మధ్య మధ్య విసుగు లేకుండా అనేక సామెతలూ, గమ్మత్తులూ, ప్రజల అలవాట్లు, నీతులూ చెప్పి రంజింప చేసేవారు. ఖండే గారు మంచి మాటకారి, బహుముఖ ప్రజ్ఞా వంతుడు. ఎప్పుడైతే ఆంధ్ర దేశంలో బ్రతకాల్సి వచ్చిందో దాని ప్రాముఖ్యాన్ని గుర్తించి, తెలుగు నేర్చుకుని తెలుగు వారిని ముగ్దులను చేశాడు.

జంఖండీ నాటక ప్రదర్శనంలో రెండు రకాల వాయిద్యాలుండేవి. ఒకటి తోలుతో చేయబడ్డ శ్రుతి బూర, రెండవది ఒక పెద్ద పళ్ళెంమీద ఒక పుల్లను సారించడం ద్వారా ఒక శ్రావ్యమైన ద్వనిని తెప్పించేవారు. ఈ ధ్వని ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఈ నాటకానికి తెర లేదు. స్త్రీ పాత్రలు కూడా పురుషులే. ముఖాలంకరణకు అరదళం, మసిబొగ్గు, మీసాలకు గడ్డాలకు జనప నార ఉపయోగించేవారు. ఇలా ఖండేగారి వీథి నాటకాలు కొంత కాలం నడిచాయి.

తమ్మారపు వెంకటస్వామి వీథి నాటకాలు.

కూచిపూడి భాగవతుల వీథి నాటక ప్రధర్శనాలతో ఆంధ్ర దేశం అంతటా విజయ యాత్ర సాగిస్తున్న రోజుల్లో అంత వుత్తమం గానూ వీథి నాటకాలు ప్రదర్శించి సెహబాస్ అనిపించు కున్న వ్వక్తి శ్రీ తమ్మారపు వెంకటస్వామి.

ఆయన స్వగ్రామం ఒంగోలు తాలూకాలోని తమ్మవరం. ఆయన దేవదాసి కులానికి చెందిన వ్వక్తి. బాల్యంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే ఆ గ్రామం లోని కుందుర్తి వారి వద్ద సంస్కృతం నేర్చుకుని తరువాత పగటి వేషాలను అద్భుతంగా ప్రదర్శించి ఆ తరువాత కట్టు దిట్టమైన వీథి నాటక సమాజాన్ని నడిపిన దిట్ట.

జుట్టులో కట్టుబాటులు:

వెంకటస్వామి జట్టులో చేరిన వారందరూ కళావంతుల కులానికి చెందిన వ్వక్తులే. ఆయన జట్టులో పురుషులు పురుష పాత్రలు, స్త్రీ పాత్రలు స్త్రీలు ధరిస్తూ వుండేవారు. అందరిదీ అమ్మనబ్రోలు గ్రామమే. అందులో పెద్ద హనుమయ్య నాయిక పాత్రలను చెల్లయ్య, చిన్న హనుమయ్య, మాణిక్యం ఇతర పాత్రలు ధరించేవారు. అలివేలమ్మ నాయిక పాత్రలు నిర్వహిస్తూ వుండేది. మంగ తాయమ్మ మాత్రం పురుష పాత్రలు ధరించేది.

ఈ జట్టు ధేనువుకొండ వెంకయ్య రచించిన ఉత్తర గోగ్రహణ నాటకాన్ని అమ్మనబ్రోలు వాస్తవ్యులు నాగినేని వెంకటప్పయ్య వ్రాసిన హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శిస్తూ వుండేది. అవిగాక శశిరేఖా పరిణయం, ఉషాపరిణయం, నలచరిత్ర, భామా కలాపం, గొల్ల కలాపం మొదలైన ప్రదర్శనాలను కూడ కొనసాగిస్తూ వుండే వారు.

జట్టు జట్టంతకూ చక్కని విందు:

వెంకటస్వామి జట్టు ఒక వూరిలో ప్రదర్శనాలు ప్రారంభిస్తే ఇక రోజుల తరబడి ఆ గ్రామంలోనే వివిధ నాటకాలు ప్రదర్శిస్తూ వుండేవారు. ప్రతి ప్రదర్శనా నికి నాలుగు రూపాయలిచ్చేటట్లూ ఇంటికి ఒకరు చొప్పున జట్టులోని వాళ్ళకు భోజనాలు పెట్టేటట్లు ఏర్పాటు జరగగానే ప్రదర్శనం జరుగుతూ వుండేది.

ఆ జట్టులో సత్యభామ పాత్రధారిణి అలివేలు చాల అందకత్తె కావటం వల్ల ప్రతివాళ్ళు ఆమెనే భోజనానికి ఆహ్వానిస్తూ వుండేవాళ్ళట. ఆమె అందుకు అంగీకరిస్తే విందు షడ్రసోపేతంగా జరిగేదట. ఈ సంగతి గ్రహించిన వెంకటస్వామి ప్రతి ఇంటివారికీ, సత్యభామే భోజనానికి వస్తుందని చెప్పి వచ్చేవాడట. ఆ విధంగా ఆ జట్టులోని వాళ్ళందరికీ చక్కని విందు అందేదట.

ప్రదర్శనం ప్రారంభం:

నాటక ప్రదర్శనం నాడు రంగస్థలానికి ముందు వరుసలో కరణం, మునసబు ఆదిగా అన్ని వర్గాల వారూ కూర్చునేవారట. సాధారణంగా ఈ జట్టు ప్రదర్శనలు భాగవతంతో ఆరంభమయ్యేవి, అందులో ముఖ్య పాత్రలు శ్రీ కృష్ణుడు, సత్యభామ, గొల్లభామ, సుంకరి కొండడు.

ఈ పాత్రలు తెర వెడలే ముందు రంగ స్థలానికి రెండు ప్రక్కలా వెండి దివిటీల్ని పాత్రధారుల ముఖాలకు దగ్గరగా వుంచి వాటిపై గుప్పెడు గుగ్గిలం చల్లేవారు. ఆ వెలుగులో ఠీవిగా విఱ్ఱవీగుతూ పాత్రలు రంగ స్థలంలో ప్రవేశించేవి. ఆనాటి రంగస్థలానికి యవనిక, అడ్డంగా పట్టే వెడల్పయిన గుడ్డ మాత్రమే వేషధారణలో ఉపయోగించే ఆభరణాలన్నీ తేలిక కొయ్యతో కాకి బంగారం అంటింపులతో తయారయ్యేవి.

పండితులకు పాత్రధారుల సవాలు:

ఆ కాలంలో వీథి నాటకాల్లో సత్యభామ తన జడను తెర వెలుపల వేయడం, సభలో కూర్చున్న పండితులు భాగవతం విషయమై ప్రశ్నిస్తే జవాబు చెప్ప గలనని సత్యభామ పాత్రధారిణి సూచించటం ఒక సంప్రదాయంగా వుండేది. ఈ సూచనకు పండితులు ఆగ్రహించి భాగవతం పద్యాలకూ కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలకూ భావార్థాలు చెప్పమని అడిగేవారు.

అలివేలమ్మ వాటిని క్షుణ్ణంగా వల్లించేది. పండితులు అంతటితో తృప్తి చెందక ఆమెకు భరత శాస్త్రం, అలంకార శాస్త్రం గురించి ప్రశ్నలు అందించేవారు. వాటికి ఆమె తృప్తిగా జవాబు చెప్పగానె కొందరు పండితులు ఆమెను ప్రశంచించే వారు. మరి కొంతమంది తృప్తి పడకుండా ఆమెపై మంత్ర తంత్రాలు ప్రయోగించేవారు. అందుచేత ప్రతి నాటకం జట్టులోను ఒక మంత్ర శాస్త్ర వేత్త వుండి ఇటువంటి మంత్ర ప్రయోగాల్ని విఫలీకృతం చేసేవారు.

నాటక ప్రదర్శనానంతరం అందరూ ఆ వేషాలతోనే గ్రామం లోని ప్రతి గడపకూ వెళ్ళి చీరలూ, ధోవతులు దండుకునేవారు. ప్రదర్శనం చూసి ముగ్దులైన గ్రామస్థులు ఎంతో ఆదరంతో వాళ్ళకు బహుమతులు ఇచ్చేవారు. ఈ విధంగా వెంకటస్వామి వీథి నాటకాల ప్రదర్శనలతో అరవై సంవత్సరాలు కళాసేవ చేసి ఎనబైవ ఏట తమ్మవరంలో మరణించాడు.

మాల నాటకములు:

కూచిపూడి భాగవతులు వీథి నాటకాలను ఉధృతంగా ప్రదర్శిస్తున్న రోజులలో ఆయా కులాల వారు కూడా వీథి నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. అలా యానాదులు, గొల్లలు, చెంచులు నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. అలాగే మాలవారు కూడ వీథి నాటకాలను ప్రదర్శించేవారు.అలాంటి నాటకాలను నా చిన్నతనంలో చూశాను బయట వూరి నుండి వచ్చి, ఊరి వెలుపల పందిరి వేసి నాటకాలను ప్రదర్శించేవారు. ఆగ్రజాతులు తప్ప ఇతర కులాల వారందరూ ఆ నాటకాలను తిలకించేవారు.

ముఖ్యంగా వారు రామాయణానికి సంబంధించిన నాటకాలను ఆడేవారు. రాముడు, సీత లక్ష్మణుడు, హనుమంతుడు, మొదలైన పాత్రలు ధరించి నాటకాలాడేవారు.

ఆయా పాత్రలు ధరించే పాత్రలు మాత్రం అంత అందంగా వుండేవి కావు. మాసిపోయిన దుస్తులతో లక్కతో చేసిన రంగుల ఆభరణాలను ధరించే వారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని కీర్తనలు పాడుతూ పాటకు తగిన విధంగ నృత్యం చేస్తూ రంగస్థలం మీడ కలియ తిరిగే వారు. వారి నృత్యానికి అనుగుణంగా తప్పెట్లు తాళాలతో హంగు చేసేవారు. హార్మోనియం హంగుగా వుండేది. వారు పాడే పాటకు తలా తోక వుండేది కాదు. రామాయణ కథను కీర్తనలుగా పద్యాలుగా వారి వారి ఇష్ట ప్రకారం చేసి పాడేవారు. అయా ఘట్టాలలో కేకలు వేసి ప్రేక్షకులను ఉత్తేజ పర్చేవారు. ఈ నాటకాలను ప్రదర్శించే మాల వారు బ్రాహ్మణులను ఆశ్రయించే వారు కారు.

పాత్రలన్నిటినీ పురుషులే ధరించేవారు. సీతారామ లక్ష్మణుల అరణ్య వాసము, లక్ష్మణ మూర్చ, సీతమ్మ శోకము ప్రదర్శించేవారు. సీతమ్మ శోకం ప్రదర్శించేటప్పుడు ప్రేక్షకుల కళ్ళ వెంట నీరు పెట్టుకునేవారు. ఒకనాటి ప్రదర్శనానికి ప్రదర్శకులందరికీ ఇంటి కొకరి చొప్పున భోజనం పెట్టి వడ్లు, దుస్తుల్ని ఇచ్చేవారు. ఆ రోజుల్లో వారు గ్యాసు లైట్ల భరించలేక, ఆముదపు దివిటీల వెలుగుతురులో ఈ నాటకాలను ఆడేవారు. దివిటీలకు గాను ఆముదాన్ని నాటకాన్ని ఆడించే వారే ఇచ్చేవారు. ఆ రోజుల్లో పేదవారికి ఈ ప్రదర్శనాలు కన్నుల పండువుగా వుండేవి. తెల్ల వారేవరకూ ప్రదర్శించి తెల్లవారి ఇళ్ళకు వెశ్శి వ్యాచించేవారు.

యానాదుల భాగవతాలు

ఆంధ్ర దేశంలో కూచిపూడి వీథి భాగవతాలు రాష్ట్ర వ్వాపికంగా ప్రచారం పొందాయి. అయితే ఆయా ప్రాంతాలలో తూర్పు భాగవతమనీ, చిందు భాగవతమనీ, గొల్ల భాగవతమనీ, మాల భాగవతమనీ, ఇలా ప్రాంతీయంగా ప్రాచుర్యం పొందిన కళా రూపమే యానాదుల భాగవతం. కేవలం యానాదులు భాగవతాలకే పరిమితం కాక వివిధ కళారూపాలను కూడ ప్రదర్శిస్తారు.

ఈతరం వారికి తెలియక పోవచ్చును గానీ, నా చిన్నతనంలో, ఏవిటిరా ఆ యానాది కళలూ, యానాది గంతులూ, యానాది చిందులూ, అనే మాటలు వింటూ వుండే వాడిని. దీనిని బట్టి యానాదుల కళలు కొన్ని వున్నాయనీ, మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ యానాదులు ఆంధ్ర దేశ మంతటా వున్నారని మనం చెప్పలేము. యానాదులు ఎక్కువగా, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరి అసలు వృత్తి ఒకప్పుడు బందిపోటు దొంగల బారినుండి గ్రామాలను కాపాడే కాపలాకాయడం. రాత్రిళ్ళు ఊరంతా వీథుల్లో తిరగటం పొలాల వద్ద పంటలను కాపాడటం. ఒకనాడు కూచిపూడి భాగవతుల ప్రభావం, అనేక జాతులమీదా, కులాల మీదా పడినట్లే ఒక నాటక సమాజాన్ని చూసి, అనేక సమాజాలు ఉద్భవించినట్లే యానాదుల మీద కూడా ఆ ప్రభావం పడింది.

యానాది భాగవతులు:

యానాదుల్లో ఉత్సాహవంతులైన యువకులు ఒక ప్రక్క వూరి కాపలా చూసుకుంటూ భాగవతాలు నేర్చుకుని, జట్టులు జట్టులుగా, ఏబై సంవత్సరాల క్రితం సర్కారు జిల్లాలలో ప్రదర్శనాలు ఇస్తూ వుండేవారు. యానాది భాగవతుల్లో కుటుంబమంతా భాగవతాల్లో పాత్రలు ధరించేవారు. ఆనాడు ముఖ్యంగా కూచిపూడి భాగవతుల్లో పురుషులే స్త్రీ పాత్రలు ధరించేవారు.

యానాది భాగవతాల్లో ముఖ్యంగా స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించడం వల్ల ప్రేక్షకుల్ని అధికంగా ఆకర్షించేవారు. దాదాపు జట్టులోని వారందరూ పాత్రలు ధరించినా, ఏదో ఒక వాయిద్యాన్ని కూడా వాయించ గలిగేవారు. ముఖ్యంగా వీరి నాటకాల్లో ప్రతి పాటకూ నృత్యం చేసేవారు. ఆ నృత్యం సున్నితంగా కాక కొంచెం మొరటుగా వుండేది. చిందులు మాత్రం ఉదృతంగా త్రొక్కేవారు. అందుకే యానాది చిందులనే పేరు వచ్చిందేమో.

పూట భోజనం, పది రూపాయలు:

ఒక రాత్రి ప్రదర్శనానికి, రాత్రి పూట అందరికీ భోజనాలు పెట్టి పది రూపాయలిస్తే చాలు. ప్రదర్శనం తెల్లవార్లూ జరిగిపోతుంది. వీరి ప్రదర్శనాలు అంత శాస్త్రయుక్తంగా లేక పోయినా ముఖ్యంగా యవ్వనంలో వున్న స్త్రీ పాత్రల అభినయమూ, సంగీతమూ ప్రేక్షకుల్ని మాత్రం అమితంగా ఆకర్షించాయి.

వీరు ప్రదర్శిచే భాగవతాలు, ఉషాపరిణయం, కృష్ణ లీలలు, సావిత్రి, శశిరేఖా పరిణయం మొదలైనవి ప్రచారం పొందాయి. వీరి వాయిద్యాలు - మద్దెల - తాళాలు __ శ్రుతి పక్వమైన హార్మోనియం, వీర్ఫి ముఖానికి రంగులు, అర్దళం, గంగ సింధూరం, కాటుక, దుస్తులు, పూసల కోట్లు మొదలైనవి. ప్రదర్శన కాలం, ప్రారంభించింది మొదలు తెల్లవార్లూ ప్రదర్శించేవారు. ఈ మధ్య వీరి భాగవత ప్రదర్శనాల ప్రభావం చాలా తగ్గి పోయింది.

యానాదుల వేషాలు:

ముఖ్యంగా ఈ నాటికి కూడ ఆంధ్ర దేశంలో పట్టణాలలోనూ, పల్లెలలోనూ దసరా పండుగ దినాలలోనూ, చిత్ర విచిత్రమైన వేషాలను చూస్తూనే వున్నాం.

అలాగే యానాదులు కూడ పండుగకు చిత్ర విచిత్రమైన వేషాలు ధరించి చిందులు వేస్తూ వుంటారు. ఇది ఒక ప్రదర్శనంగా వుండదు. ఇంటింటికి తిరుగుతూ వ్యాచిస్తూ వుంటారు.

ముఖానికి రంగులు పూసుకుని రాగాలను తీస్తూ, చిందులు తొక్కుతారు. కొంత మంది గుర్రపు తలను ధరించిన డమ్మీ గుఱ్ఱాలలో దూరి వెనక్కూ ముందుకూ,తాళం ప్రకారం గుఱ్ఱపు నృత్యం చేస్తారు.

ముఖ్యంగా యానాది వేషాలలో చెంచులక్ష్మి, నారసింహుల పాత్రలూ, శ్రీకృష్ణుడూ, దుర్వోధనుడూ, భీముడూ, శివుడూ, రాముడూ మొదలైన పాత్రలు ధరిస్తారు.

వీరి పాత్రలకు కిరీటాలుగా అట్ట కిరీటాలను, కాగితపు పిండితో తయారు చేసిన గదల్నీ ధర్ఫించి, ఆ యా పాత్రల ప్రగల్బాలతో ఒక పాత్ర మీదకు మరొక పాత్రధారి లంఘిస్తూ వుండేవారు.

వారు ధరించే దుస్తులు పాత్రకు ఔచిత్యం ఏమీ వుండదు. ముఖం చూస్తే కృష్ణుడైనా ప్యాంట్లు తొడిగి బూట్లు వేసే కృష్ణుణ్ణి యానాది వేషాల్లోనే చూడలుగుతాము. రాముడు పాత్ర ధారి కోటు తొడుగుతాడు. ఇలాంటి అస్తవ్యస్త వేషధారణతో హాస్యాన్ని గుప్పించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. అందువల్లే యానాది వేషాలు వేయకు. యానాది చిందులు తొక్కకు అనే మాటలు పుట్టాయేమో తెలియదు. కాలం మారిన కొద్దీ ఆయా జాతుల కులాలకు సంబంధించిన సాంప్రదాయ కళా రూపాలన్నీ క్రమేపీ నశించి పోతున్నాయి. అయితే ఆ నశించి పోయే కళారూపం యొక్క వేషభాషల్నీ సంగీత నృత్య బాణీలనూ, వైనాలనూ రక్షించటం ఎంతైనా అవసరం.

వెన్నెల నాటకాలు:

పూర్వం ప్రతి వైశాఖ పౌర్ణమికీ ఆరు బయట నిండు వెన్నెలలో రెండు మూడు రోజులు ఈ వెన్నెల నాటకాలు ఆడుతూ వుండే వారు. వీటిని రాస నాటకాలనే వారు. బందరులో కానుకొల్లు నరసింహం గారు బృందావనపురం ప్రాంతంలో ఈ రాసలీలలు ప్రదర్శించటం వల్లనే ఆ ప్రదేశానికి బృందావన పురమని పేరు వచ్చింది. భజన గీతాల మాదిరి భాగవతంలోని భ్రమర గీతాలను పాడేవారు.

ఈ ప్రదర్శనాలకు వెన్నెలలో, ఇసుక గిబ్బల మీద తులసి కొమ్మలు పాతి, ఆ తులసి కొమ్మల చాటున గోపికాలీలలు ప్రదర్శించే వారు. తులసి అంటే బృంద, అందుకే వాటిని బృందావన గీతాలనేవారు. ఇందులోని నటీ నటులు, ఆ యా కుటుంబాలకు సంబంధించిన బాల బాలికలు, బాలు లందరూ కృష్ణులుగానూ, బాలికలందరూ గోపికలుగానూ, అందరూ ఒకే రకమైన బట్టలు ధరించేవారు.

జడకోలాటాల కోలాహలం:

ఆ రోజుల్లో బందరులో పెద్ద పెద్ద పందిళ్ళలో జడ కోలాటాలు వేసేవారు. ఆ కోలాటాలు వేసే వారందరూ రాజ నాటకాలకు ప్రేక్షకలుగానూ వారి పిల్లలు నటీనటులుగానూ, వుండే వారు. ప్రదర్శనలు ఒక ఎత్తు దిబ్బ మీద జరుగుతూ వుంటే చుట్టూ ఎత్తుగా గ్యాలరీ మాదిరి ఇసుక తిన్నెలను ఏర్పాటు చేసేవారు.

ఒక ప్రక్క తంబురా హర్మోనియం, మద్దెల మొదలైన వాటి శ్రుతితో భజనలకు సంబంధించిన భజన పరులు గోపికా గీతాలను పాడుతూ వుంటే బాల నటులందరూ రాధాకృష్ణులు గానూ, కృష్ణులూ

గోపికలుగానూ అభినయిస్తూ వుండేవారు. పాట వచ్చిన పిల్లలు కూడ పాడుతూ వుండేవారు. ఈ ప్రదర్శనం చూడటానికి కొంత మంది ప్రేక్షకులు ప్రక్కనున్న చెట్లెక్కి కూర్చునేవారు. ఈ ప్రదర్శనాలకు దాదాపు వెయ్యి మంది ప్రేక్షకులు హాజరయ్యే వారు. వీటిని చిలకలపూడి ప్రాంతంలో కూడా ప్రదర్శించేవారు.