తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 24

వికీసోర్స్ నుండి

రేకు: 0024-01 వరాళి సం: 01-143 అధ్యాత్మ


పల్లవి :

ఆపదల సంపదల నలయు టేమిట మాను
రూపింప నిన్నిటను రోసిననుఁ గాక


చ. 1:

కడలేనిదేహరోగంబు లేమిట మాను
జడనువిడిపించునౌషధసేవఁగాక
విడవ కడియాస తను వేఁచు టేమిట మాను
వొడలికలగుణమెల్ల నుడిగిననుఁగాక


చ. 2:

దురితసంగ్రహమైన దుఃఖ మేమిట మాను
సరిలేని సౌఖ్యంబు చవిగొన్నఁగాక
కరుకైన మోహంధకార మేమిట మాను
ఆరిది తేజోమార్గ మలవడినఁగాక


చ. 3:

చావులోఁ బెనగొన్నజన్మ మేమిట మాను
యీవలావలి కర్మ మెడసినఁ గాక
భావింప నరుదైనబంధ మేమిట మాను
శ్రీ వేంకటేశ్వరుని సేవచేఁ గాక

రేకు: 0024-02 సామంతం సం: 01-144 వైష్ణవ భక్తి


పల్లవి :

సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట


చ. 1:

కొదలేని తపములు కోటానఁగోటులు
నదన నాచరించి యటమీఁద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించు కొనికదా వైష్ణవుఁడౌట


చ. 2:

తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
అనఘుఁడై చేసినయట మీద
జననములన్నిట జనియించి పరమపా-
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట


చ. 3:

తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు -
నరలేక సేవించినట మీఁద
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట

రేకు: 0024-03 ఆహిరి సం: 01-145 అధ్యాత్మ


పల్లవి :

ఏల సమకొను సుకృత మెల్ల వారికి మహ -
మాలిన్యమున నాత్మ మాసినది గాన


చ. 1:

కలికాలదోషంబు కడవరానిది గాన
తలఁపుదురితముల కాధారంబు గాన
బలుపూర్వకర్మములు పట్టరానివి గాన
మలమూత్రజన్మంబు మదకరము గాన


చ. 2:

రాఁపైనగుణవికారములు బహళము గాన
ఆఁపరానివి యింద్రియంబు లటుగాన
దాఁపరంబగుమమత దయదలంపదు గాన
కాఁపురముచే నా కప్పుకొనుఁ గాన


చ. 3:

హృదయంబు చంచలం బిరవుగానదు గాన
చదువు బహుమార్గములఁ జాటు నటుగాన
యెదురనుండెడు వేంకటేశ్వరునినిజమైన-
పదముపై కోరికలు పైకొనవు గాన

రేకు: 0024-04 శ్రీరాగం సం: 01-146 వైరాగ్య చింత


పల్లవి :

వలపులధికము సేయు వైభవములు
తలఁపు లధికము సేయుఁ దలపోఁతలు


చ. 1:

కోపమధికము సేయుఁ గోరికలు
తాప మధికము సేయు దమకంబులు
కోపంబుఁ దాపంబుఁ గూడ నధికము సేయు
యేపయిన మోహముల నేమందమే


చ. 2:

మచ్చికధికము సేయు మన్ననలు
యిచ్చ లధికము సేయు నీరసములు
మచ్చికలు నిచ్చలును మగుడ నధికము సేయు-
నెచ్చరిక కూటముల నేమందమే


చ. 3:

అందమధికము సేయుఁ నైక్యములు
పొందులధికము సేయుఁ బొలయలుకలు
అందములుఁ బొందులును నలరనధికముసేయు-
నెందు నరుఁదగు వేంకటేశు కృపలు

రేకు: 0024-05 వరాళి సం: 01-147 వైరాగ్య చింత


పల్లవి :

చిత్త మతిచంచలము చేఁత బలవంతంబు
తిత్తిలో జీవుఁ డిటు దిరిగాడుఁ గాక


చ. 1:

కదిసి జీవుఁడు పుట్టఁగాఁ బుట్టినటువంటి
మొదలుఁ దుదయును లేని మోహపాశములు
వదలు టెటువలెఁ దారు వదలించు టెటువలెను
పదిలముగ వీనిచేఁ బడి పొరలుఁ గాక


చ. 2:

కడలేని జన్మసంగ్రహములై యెన్నఁడును
గడుగ వసములు గాని కర్మవంకములు
విడుచు టెటువలెఁ దారు విడిపించు టెటువలెను
విడువనివిలాపమున వేఁగుటలు గాక


చ. 3:

యిందులోపల జీవుఁ డెన్నఁడే నొకమాటు
కందు వెఱిఁగి వివేకగతులభాగ్యమున
అందముగఁ దిరువేంకటాద్రీశు సేవించి
అందరాని సుఖంబు లందుఁ గాక

రేకు: 0024-06 ధన్నాశి సం: 01-148 వేంకటగానం


పల్లవి :

ఉప్పవడము గాకున్న రిందరు
యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు


చ. 1:

కన్నుల చంద్రుఁడును కమలమిత్రుఁడును
వున్నతి నివి నీకుండఁగను
వెన్నెలయెండలు వెలయఁగ మేల్కొను౼
టెన్నఁడు నిద్దర యెన్నఁడు నీకు


చ. 2:

కందువ సతికనుఁగలువలు ముఖార-
విందము నిదివో వికసించె
ముందర నిద్దుర మొలవదు చూచిన
విందగునీతెలివికిఁ దుద యేది


చ. 3:

తమము రాజసము తగుసాత్వికమును -
నమరిన నీమాయారతులు
కమలాధిప వేంకటగిరీశ నిన్ను
ప్రమదము మఱపునుఁ బైకొనుటెట్లా