తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 295

వికీసోర్స్ నుండి


రేకు: 0295-01 తెలుగు కాంభోధి సం: 03-548 గురు వందన, నృసింహ

పల్లవి:

ఇందునే తుదిపద మెక్కి రిందరును
మందరధర నీ మహిమిదివో

చ. 1:

మరిగిన పుణ్యుల మతిలో కోరిక
పరమపు హరి నీ పాదములు
గరిమ గోపికలు గావలెనన్నది
హరి నీ సంభోగ మదియెపో

చ. 2:

పొంచి వేదములు పొగడెడి యర్థము
అంచెల గుణకథ లవి నీవి
పంచి యజ్ఞముల ఫలమై యున్నవి
నించి దేవ నీ నిజపూజలెపో

చ. 3:

కైవల్యమునకుఁ గడుఁ దెరువై నది
ఆవల నీ శరణాగతియే
శ్రీవేంకటేశ్వర చెప్పె మా గురుడు
మావద్ద నిదె నీ మంత్రమెపో


రేకు: 0295-02 సామంతం సం: 03-549 అధ్యాత్మ

పల్లవి:

గోవిందుదాసులమై కొన కెక్కుదుముఁ గాక
వేవేలు విధుల నమ్మి వెతఁబడఁగలమా

చ. 1:

మనసు లోపలి మామర్మము దెలియలేము
ఘనుఁడైన హరి నెట్టు గానఁగలము
తనువుతో భోగాలు తగులు వీఁడగలేము
వెనక కర్మపాశాలు వీడించుకోఁగలమా

చ. 2:

వడిఁ బెట్టే యింద్రియాల వద్దని మానుపలేము
తొడరి సంసారము తోయఁగలమా
బడిబడి నానాటి బతుకు చెప్పుకోలేము
పొడలేటి యితరుల బోధించఁగలమా

చ. 3:

కొంకక ఆడిన మాట గురుతు వెట్టఁగలేము
లంకె వేదవాక్యము దలఁచఁగలమా
యింకా శ్రీవేంకటేశుఁ డితఁడే మా దేవుఁడని
సంకెలేకుందుముఁ గాక జాలిఁబడఁగలమా


రేకు: 0295-03 బౌళి సం: 03-550 అద్వైతము

పల్లవి:

పుట్టుగులు నొక్కటే పుణ్యపాపములే వేరు
యెట్టుసేసినాఁ జేసీ నేమి సేయవచ్చును

చ. 1:

పగలే రేయి యీబడిఁ గొన్నిజీవులకు
వొగి నా రేయి పగలౌ నొకరికిని
తగుదైవ మొకఁడే తమ మతములే వేరు
పగటుల విష్ణుమాయ భ్రమయించీ నిదివో

చ. 2:

నిలువెల్లాఁ జేఁదే నెరిఁ గొన్నివృక్షములు
కలదెల్లఁ దీపే కమ్మరఁ గొన్ని
తలఁపును నొకటే తత్త్వములే వేరువేరు
చెలరేఁగి విష్ణుమాయ చిక్కువెట్టీ నిదివో

చ. 3:

ఇహమే పరము యెరిఁగితేఁ గొందరికి
మహిఁ బరమే ఇహము మరొకరికి
వహితో శ్రీవేంకటేశు వలెనని కొలిచితే
సహజపు విష్ణుమాయ జారిపోవునపుడే


రేకు: 0295-04 కన్నడగౌళ సం: 03-551 మాయ

పల్లవి:

దైవమా నీవే యిందు దయ దలఁచుటఁ గాక
తోవనున్న జీవులెట్లు తోసేరు నీమాయ

చ. 1:

పలుచవులందునెల్ల ప్రాణమే మిక్కిలి చవి
బలిమి తీపులలోనఁ బ్రాణమే తీపు
యిలపైఁ బూజ్యులలోన నింతులే కడుఁబూజ్యులు
తలఁచి జీవులు యెట్టు దాఁటేరు నీమాయ

చ. 2:

తగు చుట్టరికాలలో ధనమే చుట్టరికము
జగతిఁ గట్టని కట్టు సంసారము
వగలైన గుణాలలో వైరమే నిజగుణము
జిగిఁ బ్రాణులెట్లు గెలిచేరు నీమాయ

చ. 3:

తమలో నెవ్వరికైనా తమ జాతి తమ నేర్పు
తమకు నెక్కుడై తోఁచు తక్కువనరు
నెమకి శ్రీవేంకటేశ నీదాసులకే కాని
భ్రమసిన జీవులెల్లాఁ బాయరు నీమాయ


రేకు: 0295-05 లలిత సం: 03-552 విష్ణు కీర్తనం

పల్లవి:

తెలిసినవారి కింతా దేవుఁడై యుండు
కలఁడన్నచోట హరి గలఁ డటుగాన

చ. 1:

అందునిందుఁ బోయి శ్రీహరిని వెదకనేల
బొందితోడి రూపులెల్లాఁ బొరి నతఁడే
కొందరిలోనుండి ఇచ్చుఁ గోరినట్టి యీవులెల్ల
కొందరిలో మాటలాడుఁ గొందరిలో నగును

చ. 2:

లోన వెలిఁ జూచి పరలోకము వెదకనేల
యేనెలవైన వైకుంఠ మెదుట నదె
పూని వొకచోట నెండ పొడచూపు నక్కడవే
నానిన వెన్నెల గాసు నానారీతులౌను

చ. 3:

చొక్కిచొక్కి యానందసుఖము వెదకనేల
మక్కువఁ దా శాంతుఁడైతే మతిలో నదె
యెక్కువతో శ్రీవేంకటేశ్వరు దాఁసుడ నైతి
వొక్కఁడే మాకిన్నిటికిఁ నొడయఁడై నిలిచె


రేకు: 0295-06 బౌళి సం: 03-553 శరణాగతి

పల్లవి:

ఇంక మా బోంట్ల కేది విధో
కింకరులమనియెడి గెలుపే కాక

చ. 1:

యెవ్వరు గడచిరి యింతక తొలుతను
నివ్వటిల్లు హరి నీమాయ
నవ్వుచు నీ శరణాగతి నమ్మిన
మువ్వంక శుకాదిమునులే కాక

చ. 2:

కన్నవారెవ్వరు ఘన వైకుంఠము
వున్నతమగు నీ వురుమహిమ
మున్ను నిపుడు నీ ముద్రలు మోఁచిన
అన్నిటా ఘనసనకాదులుఁ గాక

చ. 3:

తెలియువారెవ్వరు దివ్యజ్ఞానము
చలనముగాఁ జెప్పు శాస్త్రములు
యిలలో శ్రీవేంకటేశ నీవారై
చెలఁగిరి శేషాదిజీవులుఁ గాక