తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 286

వికీసోర్స్ నుండి

రేకు: 0286-01 సామంతం సం: 03-494 అధ్యాత్మ


పల్లవి :

నారాయణుఁడ నీ నామము మంత్రించి వేసి
పారేటి యీ జంతువుల భ్రమ విడిపించవే


చ. 1:

మదనభూతము సోఁకి మగువలుఁ బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళఁ జించుకొంటా
కొదలు కుత్తికలనుఁ గూపేరు జీవులు


చ. 2:

పంచభూతములు సోఁకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుఁ బూసుకొంటాను
అంచెల వీడెపురస మందునిందు గురియుచు
యెంచి ధనముపిశాచాలిట్లైరి జీవులు


చ. 3:

తమితోడ మాయాభూతము సోఁకి బహుజాతి -
యెముకలుఁ దోలు నరా లిరవుచేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్నుఁ జేర కెక్కడైన
తముఁ దా మెరఁగరింతటాఁ జూడు జీవులు

రేకు:286-02 వసంతం సం 03-495 వైరాగ్యచింత


పల్లవి :

నీ శరణమే గతి నే నితర మెరఁగ
పాశబంధముల పనులేలయ్యా


చ. 1:

పూఁచిన తొలుకర్మంబులు భోగించక పోవు
చాఁచుకున్నయీ శరీరగుణములు చాలునన్నఁ బోవు
రేఁచిన జననమరణములు రెంటికిఁ దీసీని
మోఁచివచ్చితే విజ్ఞాన మెరఁగఁగ మొదలికిఁ గొనకును యెడ యేదయ్యా


చ. 2:

కోరిన నా కోరికలు కొనసాగక పోవు
బారిఁ బడుచు కాలము దా బడిఁ దగులక పోదు
మేరతో పంచేంద్రియములు మెడచుట్టక పోవు
యే రీతుల సంసారము గెలువఁగ నెదురుబడిని బలిమిఁకనేదయ్యా


చ. 3:

మనసును వాకునుఁ జేఁతయు మానుమన్నఁ బోవు
తనువులోన నా యంతర్యామివి తలఁచక ఇఁకఁ బోదు
ఘనుఁడవు శ్రీవేంకటపతి నన్నుఁ గావక ఇఁకఁ బోదు
కనికానని యజ్ఞాన జంతువను కడమలెంచ నిఁకఁ గొలదేదయ్యా

రేకు:0286-03 ముఖారి సం 03-496 వైరాగ్యచింత


పల్లవి :

కడవ రాదు హరి ఘనమాయ! తెగి
విడువఁగరాదు వేసరరాదు


చ. 1:

చూపుల యెదిటికి సోద్యంబైనది
పాపపుణ్యముల ప్రపంచము
తీపులు పుట్టించు దినదిన రుచులై
పూల సంసారభోగములు


చ. 2:

మనసు లోపలికి మర్మంబైనది.
జననమరణముల శరీరము
వెనవెనకఁ దిరుగు వెడ లంపటమై
కనకపుటాసల కర్మములు


చ. 3:

తగు మోక్షమునకుఁ దాపయైన దిదె
నగి హరిఁ దలఁచిన నాలుకిది
వెగటు దీరె శ్రీవేంకటపతియై
యగపడె నిపుడు పురాకృతము

రేకు:0286-04 రామక్రియ సం  : 03-497 శరణాగతి


పల్లవి :

పంచేంద్రియములాల పంచభూతములాల
అంచెలఁ దొమ్మి సేయకురో మీరు


చ. 1:

కొందరికి మంచివాఁడ కొందరికిఁ గానివాఁడ
నిందకుఁ గీర్తికిఁ బొత్తు నే నొకఁడనే
అంది నిద్దిరించువాఁడ నటు మేలుకొనువాఁడ
బొందితో నెఱుక మఱపులకు నొక్కఁడనే


చ. 1:

దైవము నిర్మించినది ధరణిఁ బొడమినది
యీవలావలికిఁ బొత్తు యీ దేహమే
వేవేలు పుణ్యములకు వెలయుఁ బాపములకు
యీవల రెంటికి గురి ఇదివో నా మనసు


చ. 1:

తుంచి సగమటు వోవు తోడనే సగము వచ్చు
పంచి లోనికి వెలికిఁ బ్రాణమొక్కటే
కొంచక శ్రీవేంకటేశుఁ గొలిచి నే శరణంటి
మంచివాయఁ బనులెల్లా మమ్ముఁ గాచె నితఁడు

రేకు: 286-05 భైరవి సం : 03-498 శరణాగతి


పల్లవి :

అటమీఁద శరణంటి నన్నిటా మాన్యము నాకు
యెటు సేసినాఁ జెల్లె నిఁకనేల మాటలు


చ. 1:

ఏది పుణ్యమో నాకు నేది పాపమో కాని
శ్రీదేవుఁడవు నీవే సేయించేవు
సేదదీర నా మీఁదఁ జిత్రగుప్తుఁ డేల వా(వ్రా?) సీ
మేదిని స్వతంత్ర మేది మెరయ నీబంటను


చ. 1:

పుట్టినట్టి తెరువేదో పోయేటి జాడ యేదో
పుట్టించితి నీవే పురుషోత్తమ
వెట్టి సంసారబంధాలు వెంటవెంట నేలవచ్చీ
ఇట్టే యెవ్వరివాఁడ నిందులోన నేను


చ. 1:

చిత్త మెటువంటిదో జీవుఁ డెటు వంటి వాఁడో
హత్తిన శ్రీవేంకటేశ అంతరాత్మవు
యెత్తిన మదము నిన్ను నేల కాననియ్యదాయ
నిత్తెము తొల్లే నేను నీవాఁడఁగాన


రేకు: 0286-06 పాడి సం: 03-499 రామ

పల్లవి:

సౌమిత్రిసహోదర దశరథరామా
చేముంచి గుత్తిలో వెలసిన రఘురామా

చ. 1:

చెలిమి సుగ్రీవుతోడఁ జేసిన రామ తొల్లి
శిలనుఁ బడఁతిఁ గావించిన రామా
చెలరేఁగిన వానరసేనల రామా
శిలుగు మాయామృగముఁ జించిన రామా

చ. 2:

తరణివంశ తాటకాంతక రామా
నరనాథ కౌసల్యానందన రామా
సిరులఁ బెండ్లాడిన సీతారామా
గరిమతో సేతువు గట్టిన రామా

చ. 3:

రావణాది దనుజహరణ రామా
కావించి విభీషణునిఁ గాచిన రామా
దీవెన లయోధ్యలోఁ జెందిన రామా
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీరామా