తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 273

వికీసోర్స్ నుండి

రేకు: 0273-01 బౌళి సం: 03-418 కృష్ణ


పల్లవి :

దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
యీవల నీ బంట నాకు నెదురింక నేది


చ. 1:

కామధేనువుఁ బిదుకఁగల కోరికెలివెల్ల
కామధేనువులు పెక్కుగాచే కృష్ణుఁడవట
కామించి నీ బంటనట కమ్మి నిన్నుఁ దలఁచితి-
నేమి మాకుఁ గడమయ్య యిందిరారమణా


చ. 12:

యెంచఁ గల్పవృక్షమును యిచ్చు సిరులెల్లాను
నించి కల్పవృక్షముల నీడల కృష్ణుఁడవట
అంచెల నీ బంటనట ఆత్మలో నిన్ను నమ్మితి
వంచించఁ గడమ యేది వసుధాధీశ


చ. 3:

తగ నొక్క చింతామణి తలఁచినట్లఁ జేసు
మిగులఁ గౌస్తుభమణి మించిన కృష్ణుఁడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుఁడ నీకట నేను
జగములో గొఅతేది జగదేకవిభుఁడా

రేకు: 0273-02 సాళంగం సం: 03-419 రామ


పల్లవి :

కొలిచినవారల కొంగు పైఁడితఁడు
బలిమిఁ దారకబ్రహ్మ మీతఁడు


చ. 1:

యినవంశాంబుధి నెగసిన తేజము
ఘనయజ్ఞంబులఁ గల ఫలము
మనుజరూపమున మనియెడి బ్రహ్మము
నినుపుల రఘుకులనిధాన మితఁడు


చ. 1:

పరమాన్నము లోపలి సారపుఁజవి
పరగిన దివిజుల భయహరము
మరిగిన సీతామంగళ సూత్రము
ధరలో రామావతారం బితఁడు


చ. 1:

చకిత దానవుల సంహారచక్రము
సకల వనచరుల జయకరము
వికసితమగు శ్రీవేంకటనిలయము
ప్రకటిత దశరథభాగ్యం బితఁడు

రేకు: 0273-03 బౌళిరామక్రియ సం: 03-420 నృసింహ


పల్లవి :

అభయదాయకుఁడ వదె నీవే గతి
యిభరక్షక నను నిపుడు గావవే


చ. 1:

భయహర దైతేయభంజన కేశవ
జయ జయ నృసింహ సర్వేశ్వరా
నియతము మా కిదె నీ పాదములే గతి
క్రియగా మమ్మేలి కింక లుడుపవే


చ. 2:

బంధవిమోచన పాపవినాశన
సింధురవర దాశ్రితరక్ష
కంధరవర్ణుఁడ గతి నీ నామమె
అంధకారముల నణఁచి మనుపవే


చ. 3:

దైవశిఖామణి తత చక్రాయుధ
శ్రీవేంకటగిరి శ్రీరమణా
సావధాన నీ శరణ్యమే గతి
వేవేలకు నావిన్నప మిదియే

రేకు: 0273-04 శంకరాభరణం సం: 03-421హనుమ


పల్లవి :

శరణు కపీశ్వర శరణం బనిలజ
సరవి నెంచ నీ సరి యిఁక వేరీ


చ. 1:

పుట్టినవాఁడే భువనము లెరఁగఁగ
పట్టితి సూర్యునిఁ బండనుచు
ముట్టిన చుక్కలు మోవఁగఁ బెరిగితి
విట్టిప్రతాపివి యెదురేదయ్యా


చ. 2:

అంపిన యప్పుడే యంబుధి దాఁటితి-
వింపులు సీతకు నిచ్చితివి
సంపద మెరయుచు సంజీవి దెచ్చితి
పెంపును సొంపునుఁ బేర్కొన వశమా


చ. 3:

బెదరక నేఁడే శ్రీవేంకటగిరిఁ
గదిసి రాముకృప గైకొంటి
వదలక నీ కృపవాఁడనైతినిదె
యెదుటనే కాచితివిఁకఁ గడమేమీ

రేకు: 0273-05 నారాయణి సం: 03-422 శరణాగతి


పల్లవి :

దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో
శ్రీవిభుఁడ నీవే కాదా చిత్తములోనయ్యా


చ. 1:

దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువిఁ బుణ్యపాపముల భోగము వేరేలయ్యా


చ. 2:

వినికిందరి కొకటే విషయాలు నొకరీతే
మునిఁగేటి జాతిభేదము లివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆఁకలియు నొకటే
పెనఁగేటి గుణముల పెక్కుజాడ లేలయ్యా


చ. 3:

అంతరాత్మ నీ వొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింత సేసీ నీ మాయ లిందుకే నీ శరణంటే
కాంతుఁడ న న్నిందుకే కాచితివి నేఁడయ్యా

రేకు: 0273-06 మంగళకౌశిక సం: 03-423 శరణాగతి


పల్లవి :

నేమెంత మూఢులమైనా నీలవర్ణుఁ డంతరాత్మ
మా మనసు వెలితేల మంచిదౌఁ గాక


చ. 1:

దైవము కృప గలితే తన కర్మా లడ్డమా
ఆవేళ ఘనపుణ్యుఁడౌఁ గాక
గోవిందుఁడు మన్నించితేఁ గొంచము దొడ్డున్నదా
కోవరపు సిరులంది కొన కెక్కుఁగాక


చ. 2:

పరమాత్ముఁ డేలుకొంటే బంధములు గలవా
తెరదీసినట్లనె తెగుఁ గాక
హరి విజ్ఞానమిచ్చితే నడ్డము మాయలుండునా
తొరలి జీవుఁడు మాయఁ దొలఁగుఁ గాక


చ. 3:

శ్రీవేంకటేశ్వరు రూపు చిత్తములోఁ జిక్కితేను
చావుఁబుట్టుగు లున్నవా జయమౌఁ గాక
కైవల్య మీతఁ డిచ్చితేఁ గడమలు గలవా
కేవలపు జగమెల్లా గెలుపించుఁ గాక