తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 270

వికీసోర్స్ నుండి

రేకు: 0270-01 దేసాళం సం: 03-401 గురు వందన, నృసింహ


పల్లవి :

ఎదురు లేక చరింతురెట్టెనా శ్రీవైష్ణవులు
మదించి నేనుగులకు మట్టు మేర వున్నదా


చ. 1:

భాగీరథిలోనఁ బాపమున్నదా పుణ్య-
భోగపు వేదములలో బొంకులున్నవా
సాగరపుటమృతపు చవిలోఁ జేఁదున్నదా
ఆగతి హరిదాసుల కపరాధ మున్నదా


చ. 1:

ఆకసములోన నెరుసందునున్నదా భూమిఁ
జేకొని రవియెదుటఁ జీఁకటున్నదా
యీకడఁ గామధేనువు కియ్యరానివున్నవా
కైకొన్న ప్రపన్నులను గరిసించ నున్నదా


చ. 1:

హరినామమంత్రములో నౌఁగాము లున్నవా
గురుకృప గలిగియుఁ గొరతున్నదా
సరవి శ్రీవేంకటేశు శరణన్నవారికి
విరసంబు లందులో వెదకఁగఁ గలదా

రేకు: 0270-02 రామక్రియ సం: 03-402 కృష్ణ


పల్లవి :

వీఁడివో లక్ష్మీపతి వీఁడివో సర్వేశుఁడు
వీఁడివో కోనేటిదండ విహరించే దేవుఁడు


చ. 1:

కొండ గొడగుగ నెత్తి గోవులఁ గాచె నాఁడు
కొండవంటి దానవునిఁ గోరి చించెను
కొండ శ్రీవేంకటమెక్కి కొలువున్నాఁ డప్పటిని
కొండవంటి దేవుఁ డిదే కోనేటికఱుతను


చ. 1:

మాఁకుల మద్దులు దొబ్బి మరి కల్పభూజమనే-
మాఁకు వెరికి తెచ్చెను మహిమీఁదికి
మాఁకుమీఁద నెక్కి గొల్ల మగువల చీరలిచ్చి
మాకుల కోనేటిదండ మరిగినాఁ డిదివో


చ. 1:

శేషుని పడగెనీడఁ జేరి యశోద యింటికి
శేషజాతి కాళింగుఁ జిక్కించి కాచె
శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై
శేషమై కోనేటిదండఁ జెలఁగీని దేవుఁడు

రేకు: 0270-03 సామంతం సం: 03-403 శరణాగతి


పల్లవి :

కడుపు నిండె నిఁకఁ గడమేది మును
తడవిన యపుడే నే ధన్యుఁడనైతి


చ. 1:

హరిహరి యని నే నన్ననాఁడె నా-
పరగిన జన్మము ఫలియించె
కెరలి మీఁద మిక్కిలి నీసేవలు
వరుస జలధిలో వానలు


చ. 1:

ముందర నీకును మొక్కినయపుడే
అందితిఁ దుదిపదమగు సుఖము
పొందుగ మీఁదటి వేవేలు సేవలు
యెందును శ్రీమంతు కిచ్చిన సిరులు


చ. 1:

శ్రీవేంకటపతి శరణనినపుడే
దైవమ నాపాల దక్కితివి
చేవలఁ గమ్మర సేవించు సేవలు
వేవేలు పూజల వేడుకలు

రేకు: 0270-04 దేవగాంధారి సం: 03-404 మనసా


పల్లవి :

మాయలఁ బొరలఁగనేఁటికి మనసా కలకాలంబును
యేయెడ లక్ష్మీకాంతుఁ డీతనిఁ దలఁచవుగా


చ. 1:

మన్నునఁ బుట్టిన కాయము మన్నుననఁగేటి దింతే
మిన్నుల మీఁదికిఁ బోవదు మెరయుచు నెంతైనా
అన్నిట నీ జీవునికిని అంతర్యామీ దేవుఁడు
యెన్నఁడుఁ బాయని బంధువుఁ డీతనిఁ దలఁచవుగా


చ. 2:

ధరపైఁ బుట్టిన దేహము ధరపైఁ బుట్టి(ట్టు?)న దింతే
పరమానందము గోరదు పైపై నెంతయినా
గరిమల నీ జీవునికిని గతియగు దేవుం డీతఁడు
నిరతపు సుఖములె యొసఁగును నీవిటు దలఁచవుగా


చ. 3:

శ్రీవేంకటపతి సొమ్ములు చేరెడి దాతని నింతే
ఆవల నితరుల నంటవు ఆతుమ లన్నియును
యేవిధముల నీ జీవుని కేలికె యీదేవుండే
పావనముగ బ్రదికించెను పయికొని తలఁచవుగా

రేకు: 0270-05 మాళవిగౌళ సం: 03-405 శరణాగతి


పల్లవి :

రుచులు నే నిటు గొనని వేడవి రోఁతలయ్యెడిఁగాక నేఁడు
వచనముల హరి నీకు శరణని వసుధఁ బావనమైతిఁ గాక


చ. 1:

నేను సేయని పాపమేడది నిఖిలలోకములందును
నేను చొరని నరకమేడది నెఱయ దుర్గతుల
నేను పొడమని యోనులేడవి నిఖిలజంతువులందును
పూని హరి నిను శరణుచొరఁగాఁ బుణ్యుఁగాఁ జేసితివిఁ గాక


చ. 2:

నిరతి వాడని కల్లలేడవి నేను నాలుక తుదలయందును
పొరలి నడపని కర్మమేడది భువి ననాచారములలో
తిరిగి తిరిగి నీచులిండ్లను తిరియనర్థము లింకనేడవి
గరిమ హరి నే నిన్ను శరణనఁగాను ఘనుఁ జేసితివిఁ గాక


చ. 3:

తలఁప నజ్ఞానములు నపరాధములు నాయెడ లేనివేడవి
యెలిమి నన్నిట్లేలఁ దగునా యేలితివిఁ గాక
నిలిచి శ్రీవేంకటగిరీశ్వర నీకు శరణనుమాత్ర మింతే
కలసి నాయెడనేమి గంటివి కాచితివి భువనములలోను