తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 245

వికీసోర్స్ నుండి


రేకు: 0246-01 దేసాక్షి సం: 03-260 శరణాగతి

పల్లవి:

ఎటువంటి వెఱ్ఱినో యేమని విన్నివింతును
ఘటనలు నావంటా గర్వింతునయ్యా

చ. 1:

తలఁచే తలఁపు నీది తనువు నీ విచ్చినది
నిలిచిన జగమెల్లా నీ మయము
వలవంత నే నిందులో వట్టియహంకారినై
తెలియక నేనేయంటాఁ దిరిగేనయ్యా

చ. 2:

సేసేచేఁత నీయాజ్ఞ చిత్తమెల్లా నీయిచ్చ
రాసుల కర్మములు నీరపములివి
ఆసపడి నే నిందులో అన్నియు నావనుచును
పోసరించి మాయలలోఁ బొరలెదనయ్యా

చ. 3:

ఇహము నీవినోదమే యెన్నఁ బరము నీసొమ్మే
సహజము నీకు మాలో చైతన్యాలు
మహిలో శ్రీవేంకటేశ మరి నీదాఁసుడనైతి
బహుభక్తి నీమీఁదఁ బచరించేనయ్యా


రేకు: 0246-02 లలిత సం: 03-261 భక్తి

పల్లవి:

ఇందరు నెఱుఁగుదు రీయర్థయే భువి
కందువఁ దగులుట కర్మము కొలఁది

చ. 1:

ఆదికి ననాది హరిదాస్యంబిది
వేదాంతంబుల వెలసినది
సోదించి కనిరి శుకనారదాదులు
పాదుగఁ నిఁకఁ దమ భాగ్యముకొలఁది

చ. 2:

అతిరహస్యమిది అచ్యుతుపై భక్తి
ప్రతిలేని పరమపావనము
చతురులై తెలిసిరి సనకాది మునులు
తతి దొరకుట సుకృతఫలము కొలఁది

చ. 3:

పరము శ్రీవేంకటపతి సంకీర్తన
సొరిది గురుఁడొసఁగు సూక్ష్మమిది
చిరపుణ్యులు మును చేకొన్న నిజమిది
మరిగి మనుట తమ మనసుల కొలఁది


రేకు: 0246-03 హిందోళవసంతం సం: 03-262 శరణాగతి

పల్లవి:

ఎన్నికై శ్రీవేంకటేశుఁ డితడు గలుగఁగానె
అన్నిటా నందరిలోని అజ్ఞానాలుఁ బాసెను

చ. 1:

సకలశాస్త్రములందు సందేహమే కాని
వొకరు దైవమహిమ కొడఁబడరు
అకటా బాస చేసినయందుకైనా నమ్మరు
వికలచిత్తులెల్లాను విష్ణుదాస్యమునకు

చ. 2:

గక్కనఁ గర్మము చేసి కడు నలయుటే కాని
వొక్కమాటు హరిఁ బాడ నొడఁబడరు
తక్కక పెద్దలుగాఁగ తల వణఁకుటే కాని
పుక్కటికాండ్లు హరిఁ బూజించనేరరు

చ. 3:

చిత్తములో వివేకించి చింతఁ బొరలుటే కాని
వొత్తి హరిపై భార మొప్పగించరు
హత్తిన శ్రీవేంకటేశుఁ డటె దయ దలఁచఁగా
మత్తిలి ప్రపన్నులెల్లా మరేమిటాఁ దప్పరు


రేకు: 0246-04 దేసాళం సం: 03-263 అధ్యాత్మ

పల్లవి:

వానివాని సహజము వద్దననేల
యీనేటి ప్రపంచ మది యేమి సేయఁగలదు

చ. 1:

హరి పుట్టించినయట్టి ఆయాప్రకృతులను
విరసాలఁ దిప్పెమంటే వేరొకటౌనా
పరమజ్ఞాన మొక్కటే పాటించితేఁ జాలు
యెరవుల పుణ్య పాపాలేమి సేయఁగలవు

చ. 2:

బలువుగ విష్ణు మాయఁ బ్రబలే సంసారమును
చలమున దిద్దఁబోతేఁ జక్కనౌనా
తెలివితో హరిభ క్తి తెగక వుండితేఁ జాలు
యిలపైఁ బంచేంద్రియములేమి సేయఁగలవు

చ. 3:

శ్రీవేంకటేశుఁ డాత్మఁ జేకొని వుండినది
భావించకున్న నాతఁడు బడివాసీనా
సావధానాన నీతని శరణనుకొంటేఁ జాలు
యే విధులు భవములునేమి సేయఁగలవు


రేకు: 0246-05 రామక్రియ సం: 03-264 దశావతారములు

పల్లవి:

నారాయణుఁడే సర్వనాయకుఁడు
వేరే దురాశలు వెదకఁ జోటేదయ్యా

చ. 1:

ఆకస మొకపాదము అట్టె భూమొక పాదము
పైకొని యొకపాదము పాతాళము
యేకమైనాఁ డేడనున్నా యిందులో వారే జీవులు
ఆకడఁ బరులఁ గొల్చేమనఁ జోటేదయ్యా

చ. 2:

కడుపులో జగములు కాయ మిన్నిటాధారము
యెడగలచోటనెల్లా యీతని మాయే
కడుఁబోరా దీతఁడే కారణ మందరికి
తడవి మరుపాయాలఁ దగులఁ జోటేదయ్యా

చ. 3:

చేతన్య మీతనిది సృష్టి యీతనిఘటన
ఆతుమ శ్రీవేంకటేశుఁ డంతర్యామి
రాతిరిఁబగలుఁ దానే రక్షకుఁడు మనలకు
పోతరించి ఇఁక మెచ్చి పొగడఁ జోటేదయ్యా


రేకు: 0246-06 ఆహిరి సం: 03-265 వైరాగ్య చింత

పల్లవి:

ఇంక నా దైన్యము చూచి యెట్టు రక్షించేవో కాని
సంకె దీరఁ బులిసితి సర్వేశ్వరా

చ. 1:

తపము సేసి నీ మాయ దాఁటేననుచుఁ బెనఁగి
అపుడే యలసితిని అదివో నేను
కృపఁ జూచి నీ వింక గెలిపించేదెట్టోకాని
వుపమల సరివోరి వోడితి నే వానికి

చ. 2:

పంచేంద్రియములను పారఁదోలేనని చూచి
వంచఁగ సత్వలేక వసమైతిని
అంచె నాపాటు చూచి నీవడ్డమౌటెప్పుడోకాని
దించని బీరములాడి దిగితి నే వానికి

చ. 3:

మోహాంధకారముపై మొనచూపేనని పోయి
సాహసము లేక నే జడిసితిని
వూహల శ్రీవేంకటేశ వున్నతి నన్నేలితివి
బాహుబలమున తుదిపదమయితి వానికి