తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 208

వికీసోర్స్ నుండి


రేకు: 0208-01 ముఖారి సం: 03-043 అధ్యాత్మ

పల్లవి:

పుట్టించేవాఁడవు నీవే పోరులు వెట్టేవు నీవే
యెట్టు నేరుచుకొంటివిది నీ వినోదమా

చ. 1:

కొందరు దేవతలును కొందరు రాక్షసులును
ఇందరి కంతర్యామి వెప్పుడు నీవు
అంది కోప మొకరిపై అట్టే ప్రసాద మొకరి
కిందులోనే పక్షపాతమిది నీకే తగును

చ. 2:

నరకమనుచుఁ గొంత నగి స్వర్గమని కొంత
నిరతి గురిసేసేవు నీకుక్షిలోనే
ధరఁ జీఁకటొకవంక తగ వెన్నెలొకవంక
నెరపేవు నీ మాయ నీకే తెలుసు

చ. 3:

దాసపరిపాలనము తగు దుష్టశిక్షణము
వాసిఁ గైకొంటివి నీకు వశమై రెండు
దోసము నీవల్ల లేదు తొలుతే శ్రీవేంకటేశ
సేసినవారి పుణ్యమే చిత్తానఁ బెట్టితివి


రేకు: 0208-02 దేవగాంధారి సం: 03-044 నామ సంకీర్తన

పల్లవి:

ఇతర దేవతల కిది గలదా
ప్రతి వేరీ నీ ప్రభావమునకు

చ. 1:

రతిరాజజనక రవిచంద్రనయన
అతిశయ శ్రీవత్సాంకుఁడవు
పతగేంద్రగమన పద్మావతీపతి
మతి నినుఁ దలఁచిన మనోహరము

చ. 2:

ఘనకిరీటధర కనకాంబర పా-
వనక్షీరాంబుధివాసుడవు
వనజచక్రధర వసుధావల్లభ
నినుఁ బేరుకొనిన నిర్మలము

చ. 3:

దేవపితామహ త్రివిక్రమ హరి
జీవాంతరాత్మక చిన్మయుఁడా
శ్రీవేంకటేశ్వర శ్రీకర గుణనిధి
నీవార మనుటే నిజసుఖము


రేకు: 0208-03 మాళవిగౌళ సం: 03-045 శరణాగతి

పల్లవి:

ఎట్టు వలసినాఁ జేయు మేఁటి విన్నపము లిఁక
కట్టుకో పుణ్యమైనాఁ గాక మరేమైనాను

చ. 1:

నన్ను నెంచి కాచేనంటేనా యవగుణి నేను
నిన్ను నెంచి కాచేనంటే నీవు లక్ష్మీపతివి
యిన్నిటా నాకంటే హీనుఁడిఁక మరెవ్వఁడూ లేఁడు
వున్నతి నీకంటే ఘనులొకరూ లేరు

చ. 2:

నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను
బలువుఁడ నీవైతే బ్రహ్మాండము
యెలమి నే నుపకార మెవ్వరికిఁ జేయలేను
మెలఁగి నీవే తృణము మేరువు సేయుదువు

చ. 3:

భావించ నీ వేలికవు బంటుమాత్రమింతే నేను
నీవు సర్వాంతరాత్మవు నే నొకఁడను
సావధానమున నేను సర్వభక్షకుఁడ నింతే
శ్రీవేంకటేశ నీవు జీవరక్షకుఁడవు


రేకు: 0208-04 శంకరాభరణం సం: 03-046 వైరాగ్య చింత

పల్లవి:

వేవేలు బంధములు విడువ ముడువఁబట్టె
దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా

చ. 1:

పారీ ముందటి భవపాశములు
తీరీఁ దొల్లిటితిత్తిలో పుణ్యము
వూరీఁ గోరిక లొకటొకటే
యేరీతి సుజ్ఞాన మెరిఁగేనయ్యా

చ. 2:

పట్టీ నాకొంగు పంచేంద్రియములు
తొట్టీ బాపము తోడుతనే
పెట్టీ భ్రమలఁ బెరిగి నీమాయలు
అట్టే మోక్ష మెన్నఁ డందేమయ్యా

చ. 3:

విందై యిహము వెనకకుఁ దీసీ
అందీ వై రాగ్య మరచేతికి
కందువ శ్రీవేంకటపతి యీరెండు
బొందించితి వేది భోగింతునయ్యా


రేకు: 0208-05 కన్నడగౌళ సం: 03-047 వైరాగ్య చింత

పల్లవి:

ఎట్టు గెలుతుఁ బంచేంద్రియముల నేఁ
బట్టరాని ఘనబలవంతములు

చ. 1:

కడు నిసుమంతలు కన్నుల చూపులు
ముడుఁగక మిన్నులు ముట్టెడిని
విడువక సూక్ష్మపువీనులు యివిగో
బడిబడి నాదబ్రహ్మము మోచె

చ. 2:

అదె తిలపుష్పంబంత నాసికము
కదిసి గాలి ముడెగట్టెడని
పొదిగె నల్లెఁడే పొంచుక నాలికె
మెదలుచు సర్వము మింగెడిని

చ. 3:

బచ్చెన దేహపు పైపొర సుఖమే
యిచ్చఁ బ్రపంచం బీనెడిని
చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరుఁ
దచ్చి తలఁచఁగా దరి చేరెడిని


రేకు: 0208-06 బౌళిరామక్రియ సం: 03-౦48 శరణాగతి

పల్లవి:

నేనొక్కఁడ లేకుండితే నీ కృపకుఁ బాత్రమేది
పూని నా వల్లనే కీర్తిఁ బొందేవు నీవు

చ. 1:

అతిమూఢులలోన నగ్రేసరుఁడ నేను
ప్రతిలేని ఘనగర్వపర్వతమను
తతిఁ బంచేంద్రియముల ధనవంతుఁడను నేను
వెతకి నావంటివాని విడువఁగఁ జెల్లునా

చ. 2:

మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాఁడ నేను
యిహమునఁ గర్మ వహికెక్కితి నేను
బహుయోనికూపసంపదఁ దేలేవాఁడ నేను
వహించుక నావంటివానిఁ దేనోపేవా

చ. 3:

భావించి నావంటి నీచుఁ బట్టి కాచినప్పుడుగా
యేవంక నీకీర్తి గడునెంతురు భువి
నావల్ల నీకుఁ బుణ్యము వీవల్ల నే బ్రదుకుదు
శ్రీవేంకటేశుఁడ యింత చేరెఁ జుమ్మీ మేలు