తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 380

వికీసోర్స్ నుండి


రేకు: 0380-01 బౌళి సం: 04-464 మాయ

పల్లవి:

ఎందును బోరాదీ సంసారము
కందువ నీ మాయ గడవఁగ వశమా

చ. 1:

కలిమే చిత్త వికార హేతు ఎది
అలర లేమి దైన్య హేతువు
పలు లంపటములు బంధ హేతువులు
తలఁగిన నడవదు తనుపోషణము

చ. 2:

మదవికార మిదె మహిత యౌవనము
తుద వార్ధకమే దురంతము
యిదె యర్దార్జన యాతాయాతన
అదియు మానితే నాఁకలి ఘనము

చ. 3:

యెన్ని గడియించే వెన్నిట ముంచే -
విన్నిట శ్రీ వేంకటేశ్వరుఁడ
అన్నిట నంతర్యామివి నీవే
కన్ను దనియ ననుఁ గావఁగదే


రేకు: 0౩80-02 దేవగాంధారి సం: 04-465 మేలుకొలుపులు

పల్లవి:

వారిధి శయన వో వటపత్ర పరియంక
గారవాన మేలుకొని కన్నులు దెఠవవే

చ. 1:

ఘన యోగి హృదయపు కమలాలు వికసించె
వొనర విజ్ఞాన సూర్యోదయమాయ
మును జీవ పరమాత్మముల జక్కవలు గూసె
వనజాక్ష మేలుకొని వాకిలి దెరవవే

చ. 2:

కలుషముల నేటి చీఁకట్లెల్లఁ బెడఁబాసె
నలువంక వేద కీరనాదము మ్రోసె
అలరి యితర ధర్మాల నేటి చుక్కలు మాసె
జలజాక్ష మేలుకొని సతి మోము చూడవే

చ. 3:

కపట రాక్షస నేత్ర కలు హారములు మోడ్చె
యిపుడే సుకర్మముల యెండలు గాసె
అపురూప శ్రీ వేంకటాద్రీశ మేలుకొని
నిపుణుఁడ యిందిరయు నీవు మమ్ముఁ గావనవే


రేకు: 0380-03 శుద్ధవసంతం సం: 04-466 నృసింహ

పల్లవి:

చేకొన్న భక్తుల పాలి చింతామణి
సాకారమై వున్నాఁడు సర్వేశ్వరుడు

చ. 1:

వాఁడిగోళ్లచేత వడి హిరణ్యునిఁ జంపి
వేడుక నెత్తురు లెల్ల వెదచల్లుచు
పోఁడిమి నరసింహుఁడై పొడచూపె నల్లవాఁడె
మూఁడు మూర్తులకును మూల మీతఁడు

చ. 2:

కొండమీఁదఁ గూచుండి కోప ముపసంహరించి
అండనున్నదేవతల కభయమిచ్చి
మెండుగ సులభుఁడై మెరయుచు నున్నవాఁడు
దండి జగముల కెల్ల దైవ మీతఁడు

చ. 3:

వేవేలు చేతులను వెస నాయుధాలు వట్టి
చేవ మీరి ప్రతాపాన సిరులు మించి
యీవల నహోబలాన నిరవై యున్నవాఁడు
శ్రీ వేంకటాద్రి మీఁది సిద్ధమూర్తి యీతఁడు


రేకు: 0380-04 సామంతం సం: 04-467 హనుమ

పల్లవి:

కలశాపురముకాడ కందువ సేసుకొని
అలరుచు నున్నపాఁడు హనుమంత రాయుఁడు

చ. 1:

సహజాన నొక జంగ చాఁచి సముద్రము దాఁటె
మహిమ మీరఁగ హనుమంతురాయఁడు
యిహమున రాము బంటై యిప్పుడూ నున్నవాఁడు
అహరహరమును దొడ్డ హనుమంత రాయఁడు

చ. 2:

నిండు నిధానపు లంక నిమిషాన నీరుసేసె
మండిత మూరితి హనుమంత రాయఁడు
దండితో మగిడివచ్చి తగ సీత శిరోమణి
అండ రఘపతి కిచ్చె హనుమంతరాయఁడు

చ. 3:

వదలని ప్రతాపాన వాయుదేవు సుతుఁడై
మదియించినాఁడు హనుమంత రాయఁడు
చెదరక యే పొద్దు శ్రీ వేంకటేశు వాకిట-
నదివో కాచుకున్నాఁడు హనుమంత రాయఁడు


రేకు: 0380-05 లలిత సం: 04-468 కృష్ణ

పల్లవి:

వేవేల చందాలవాఁడు విఠలేశుఁడు
భావించ నలవిగాని పరమాత్ముఁ డితఁడు

చ. 1:

సతతము రుక్మిణీ సత్యభామల నడుమ
రతికెక్కిన సింగారరాయఁ డితఁడు
చతురత సనకాది సంయమీంద్రులమతి-
నతిశయిల్లేటి పరమానంద మితఁడు

చ. 2:

దేవతల కెల్లాను దిక్కు దెసై వెలఁగొంది
తావుకొన్న యట్టి యాధార మీతఁడు
మూవంక గొల్లెతలు మున్ను సేసిన తపము
కైవశమై ఫలించిన ఘన భాగ్య మితఁడు

చ. 3:

వరముతో యశోద వసు దేవాదులకు
పరగిన కన్నులపండు గీతఁడు
పిరులు మించినయట్టి శ్రీ వేంకటాద్రిమీఁది-
నిరతి దాసుల పాలి నిధాన మితఁడు


రేకు: 0380-06 తోడి సం: 04-469 నృసింహ

పల్లవి:

సుగ్రీవ నారసిఁహ సులభుఁడ వందరికి -
నగ్రేసరుఁడ నీ వవధారు దేవా

చ. 1:

సనకాదు లొకవంక జయవెట్టుచున్నారు
యెనసి సురలు చేతులెత్తి మొక్కేరు
మును లిరుమేలానుండి మునుకొని నుతించేరు
అనుపమాలంకార అవధారు దేవా

చ. 2:

గంగాది నదు లెల్లఁ గడిగీ నీ పాదములు
పొంగుచు సప్త రుషులు పూజించేరు
సంగతి వాయుదేఁడు సరినాల వట్టమిడీ
అంగజ కోటి రూప యవధారు దేవా

చ. 3:

పరగ నారదాదులు పాడేరు నీ చరితలు
పరమ యోగీంద్రులు భావించేరు
సిరులు మించిన యట్టి శ్రీ వేంకటాద్రిమీఁద-
నరుదుగ నున్నాఁడవు అవధారు దేవా