తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 376

వికీసోర్స్ నుండి


రేకు: 0376-01 లలిత సం: 04-442 శరణాగతి

పల్లవి:

అతఁడేయెరుఁగును మముఁబుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుఁడు
అతికీ నతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారం బిఁక నేదో

చ. 1:

కనుచున్నారముసూర్యచంద్రులకుఘనవుదయాస్తమయములు
వినుచున్నారము తొల్లిటి వారల విశ్వములోపలికథలెల్లా
మనుచున్నారము నానాఁటికి మాయలసంసారములోన
తనిసీఁదనియము తెలిసీఁదెలియము తరువాతి పనులిఁక నేవో

చ. 2:

తిరిగెద మిదివో ఆసలనాసల దిక్కుల నర్థార్జన కొరకు
పొరలెద మిదివో పుణ్యపాపములభోగములందే మత్తులమై
పెరిగెద మిదివో చచ్చెడి పుట్టెడి భీతిగలుగు దేహములోనే
విరసము లెరఁగము మరచీ మరవము వెనకటికాలము విధియేదో

చ. 3:

ఱట్టైనారము హరినుతిచే నాఱడి గురువనుమతిని
పట్టినారమిదె భక్తిమార్గమిదె బలువగు విజ్ఞానముచేత
గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటి మిదివో మోక్షము తెరువు
ముట్టిముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో


రేకు: 0376-02 మాళవిగౌళ సం: 04-443 హనుమ

పల్లవి:

ఇతఁడే యతఁడు గాఁబో లేలిక బంటును నైరి
మితిలేని రాఘవుఁడు మేఁటి హనుమంతుఁడు

చ. 1:

జలధి బంధించి దాఁటె చలపట్టి రాఘవుఁడు
అలరి వూరకే దాఁటె హనుమంతుఁడు
అలుకతో రావణుని యద టణఁచె నతఁడు
తలఁచి మైరావణుని దండించె నితఁడు

చ. 2:

కొండ వెల్లగించెఁ దొల్లి గోవర్ధనుఁ డతఁడు
కొండతో సంజీవియెత్తెఁ గోరి యితఁడు
గుండు గరఁచె నహల్యకొరకు సీతాపతి
గుండు గరఁగఁగఁ బాడె కోరి యితఁడు

చ. 3:

అంజనా చలముమీఁద నతఁడు శ్రీ వేంకటేశుఁ
డంజనీ తనయుఁ డాయ ననిలజుఁడు
కంజాప్తకులరామఘనుఁడు దానును దయా -
పుంజమాయ మంగాబుధి హనుమంతుడు


రేకు: 0376-03 సామంతం సం: 04-444 హనుమ

పల్లవి:

మంగాంబుధి హనుమంతుని శరణ
మంగవించితిమి హనుమంతా

చ. 1:

బాలార్కబింబము ఫల మని పట్టిన
ఆలరి చేఁతల హనుమంతా
తూలని బ్రహ్మాదులచే వరములు
వోలిఁజేకొనిన వో హనుమంతా

చ. 2:

జలధిదాఁట నీ సత్వము కపులకు
నలరి దెలిపతివి హనుమంతా
యిలయు నాకసము నేకముగా నటు
బలిమిఁ బెరిగితివి భళీ హనుమంతా

చ. 3:

పాతాళము లోపలి మైరావణు -
నాతలఁ జంపిన హనుమంతా
చేతులు మోడ్చుక శ్రీవేంకటపతి-
నీతలఁ గొలిచే హిత హనుమంతా


రేకు: 0376-04 శంకరాభరణం సం: 04-445 శరణాగతి

పల్లవి:

కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక
అదె యాతనికె శరణంటే నంటి నేను

చ. 1:

యెవ్వని వుదరమున నిన్నిలోకములుండు
యెవ్వని పాదము మోచె నిల యలను
యెవ్వఁడు రక్షకుఁ డాయ నీ జంతుకోట్లకు
అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు

చ. 2:

సభలో ద్రౌపదిఁ గాచె సర్వేశుఁ డెవ్వఁడు
అభయహస్త మొసంగె నాతఁ డెవ్వఁడు
ఇభవరదుఁ డెవ్వఁడు యీతనికే వొడిగట్టి
అభినవముగ శరణంటే నంటి నిప్పుడు

చ. 3:

శరణుచొచ్చిన విభీషణుఁ గాచె నెవ్వఁడు
అరిది యజునితండ్రి యాతఁ డెవ్వఁడు
యిరవై శ్రీ వేంకటాద్రి యెక్కి నాతఁ డితఁడే
ఆరసి యితనికే శరణంటే నంటి నిప్పుడు


రేకు: 0376-05 భైరవి సం: 04-446 అంత్యప్రాస

పల్లవి:

అనాది విషయ విహారము గన ఆతుమ
అనేకమై వీఁగె నందుకే యీ యాతుమ

చ. 1:

అన్నిట కర్మపుఁబంక మంటిన దీయాతుమ
మున్ను కోప దుర్గంధములఁ బాఁగె నీ యాత్మ
పన్ని భవముల తుప్పు పట్టిన దీయాతుమ
యెన్నఁడు సుజ్ఞాన మింక నెరిఁగీనో యాత్మ

చ. 2:

చెంచెలపుఁ దిప్ప పెంట జివికిన దీయాత్మ
పంచలయాసల నురిఁబడిన దీయాత్మ
కంచపు భోగపుఁగాఁక గరివడీ నీయాత్మ
యెంచి విజ్ఞానమెన్నఁ డెరిఁగీనో యాత్మ

చ. 3:

యెలమితో శ్రీ వేంకటేశు కృప నీ యాత్మ
తెలిసి యించుకించుక తేటపడె నాత్మ
అలరి యాచార్యుని అధీనమైనాత్మ
మలసి యజ్ఞానమెట్టు మరచెనో యాత్మ