తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 354

వికీసోర్స్ నుండి


రేకు: 0354-01 రామక్రియ సం: 04-315 వైరాగ్య చింత

పల్లవి:

ఎందరు సతులో యెందరు సుతులో
యిందునందు నెట్లెరిఁగే నేను

చ. 1:

మలయుచు నాయభివనములని నే
కెలననిపుడు వెదకేనంటే
పలుయోనులలో పలమారుఁబొడమిన
చలమరి నాతొలుజన్మంబులను

చ. 2:

గరిమెలఁ బాణిగ్రహణము నేసిన
సిరులచెలులఁ గలసేనంటే
తరుణుల గురుతులు తలఁపున మరచితి
పరగిన బహుకల్పంబులయందు

చ. 3:

శ్రీ వేంకటగిరి చెలువుని యాజ్ఞల
భావించియె కరిఁ బైకొంటి
తావులఁజూడగ తగిలికోర్కుల
భావరతుల బెంబడి మనసందు


రేకు: 0354-02 గుండక్రియ సం: 04-316 మాయ

పల్లవి:

కటకట హరిమాయాకల్పనెట్టిదో
తటుకునఁ బారవేసేతలఁపెందు లేదు

చ. 1:

అనంతకోటియుగాదులనుండియు
తనివోక విషయాలఁ దగిలుండినా
దినమొక్కొక్కరుచియై తీపులై పండీఁగాని
వెనుకొన్న యాత్మకు వెగ టెందు లేదు

చ. 2:

కడలేక నాలుకకుఁ గన్నయాహారములెల్ల
వోడలిలోఁ బూఁటవూఁట వొట్టుకొనినా
సడిఁ బైపై వింతవింతచవులే వెదకుఁగాని
విడువని యాత్మకు వెగ టెందు లేదు

చ. 3:

కలకాలముననుండి కాపురపు లంపటాలె
కలిమితో మెడఁగుచ్చి కట్టుకొనినా
యెలమితో శ్రీవేంకటేశ్వరునాజ్ఞల -
నలవాటైన యాత్మకలపే లేదు


రేకు: 0354-03 లలిత సం: 04-317 మనసా

పల్లవి:

నటనల భ్రమయకు నామనసా
ఘటియించుహరియే కలవాఁడు

చ. 1:

ముంచిన జగమిది మోహినీగజము
పొంచినయాస పుట్టించే దిది
వంచనల నిజమువలెనే వుండును
మంచులు మాయలే మారునాఁడు

చ. 2:

సరిసంసారము సంతలకూటమి
సొరిదిఁ బచారము చూపే దిది
గరిమ నెప్పుడుఁ గలకలమనుచుండును
మరులగువిధమే మాపటికి

చ. 3:

కందువదేహము గాని ముదియదిది
అందినబహురూప మాడేదిది
యెందును శ్రీవేంకటేశ్వరుఁడుండును
డిందుపడఁగనిదె తెరమరఁగు


రేకు: 0354-04 గుండక్రియ సం: 04-318 అధ్యాత్మ

పల్లవి:

“నిశ్చింతం పరమం సుఖ"మనుమాటేనిజమునిజముతెలియరుగాని
ఆశ్చర్యంబిది పరమయోగులకు ననుభవులకు దృష్టాంతము సుండీ

చ. 1:

కరచరణాదులుగలచైతన్యము గక్కునఁ బానుపుపైనుండి
సరుగన సడిలిన నిద్రామందము సమకూడీ నరులకటువలెనే
పరమాత్మునిపై సకలోద్యోగ వుపాయంబులు దా దిగవిడిచి
ధరఁ దానుండిన బ్రహ్మానందము తనుఁదానే పైకొనుఁజుండీ

చ. 2:

వున్నతిఁ దానొక దేశములోపలనుండి క్రితముచూచిన నవియెల్లా
అన్ని దేశములు నటుదలపోసిన యంతకుగోచరమైనట్లు
యెన్నగఁబూర్వజ్ఞానంబున సర్వేశ్వరుఁడగు హరిఁదలఁచినను
సన్నిధియగు సుజ్ఞానానందము సత్యము సత్యంబది సుండీ

చ. 3:

ననిచిన ప్రపంచకత్పములలో నానావిధముల జంతువులు
తనుఁదాఁజూడగరానిరూపు లద్దములోపలఁ గన్నట్లు
ఘనుడగు శ్రీవేంకటపతిరూపము గక్కన నెదుటనె సేవించి
అనయము తనుఁదా సంతసించుటే యాత్మానందంబిది సుండీ


రేకు: 0354-05 సాళంగనాట సం: 04-319 శరణాగతి

పల్లవి:

ఒసఁగితివిన్నియు నొకమాఁటే
వెస నిఁకఁ జేసే విన్నపమేది

చ. 1:

నారాయణ నీనామము దలఁచిన -
నీరానివరములిచ్చితివి
చేరి నిన్ను నిటు సేవించిననిఁకఁ
గోరి పడయ నిఁకఁ గోరికలేవి

చ. 2:

హరి నీకొకమరి యటు శరణంటే
గరిమల నన్నిటు గాచితివి
నిరతముగా నిఁక నిను నుతియింపుచు
అరగొరతనివి నిను నడిగేదేదో

చ. 3:

శ్రీవేంకటేశ్వర చేయెత్తిమొక్కిన
భావమే నీవై పరగితివి
యీవరుసల నీవింతటిదాతవు
ఆవలనినుఁ గొనియాడెడిదేమి


రేకు: 0354-06 భౌళి సం: 04-320 తేరు

పల్లవి:

దేవదేవోత్తముని తిరుతేరు
దేవతలు గొలువఁగా తిరుతేరు

చ. 1:

తిరువీధులేగీని తిరుతేరు
తిరుపుగొన్నట్లాను తిరుతేరు
తెరలించె దనుజులఁ దిరుతేరు
తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు

చ. 2:

ధిక్కిరించీ మోతలఁ దిరుతేరు
దిక్కరికుంభా లదరఁ దిరుతేరు
తిక్కుముత్తేలకుచ్చుల తిరుతేరు
తెక్కులఁబ్రతాపించీఁ దిరుతేరు

చ. 3:

తీరిచెఁ గలకలెల్లఁ దిరుతేరు
ధీర గరుడవాహపుఁ దిరుతేరు
చేరి యలమేలుమంగతో శ్రీవేంకటేశ్వరుని -
తీరున నెలకొన్నట్టి తిరుతేరు